వరంగల్

మానుకోటలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఏప్రిల్ 4: మానుకోటలోని గాంధీపార్కులో శ్రీరామనవమి వేడుకల నిర్వాహణకు గాను జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా అంబేద్కర్ భవన శిథిలాల తరలింపునకు అధికారులు పూనుకోవడం మంగళవారం మానుకోటలో ఉద్రిక్తతకు దారితీసింది. మానుకోట గాంధీపార్కులో ఉన్న అంబేద్కర్ భవనం, పక్కనే ఉన్న వేదికను గతంలో కొందరు కూల్చి వేసిన విషయం తెలిసిందే. సంవత్సరం క్రితం జరిగిన ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూల్చివేత జరిగిన నాటి నుండి నేటి దాకా భవన శిథిలాలు కూల్చివేసిన ప్రాంతంలోనే ఉన్నాయి. దళిత సంఘాలు, రాజకీయ పక్షాల ఆందోళనతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొన్ని నెలల క్రితం అంబేద్కర్ భవన నూతన నిర్మాణానికి గాంధీపార్కులో శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభ కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను గాంధీపార్కులో నిర్వహించాల్సి ఉండడంతో భక్తులకు అసౌకర్యంగా ఉంటుందని చెబుతూ మున్సిపల్ అధికారులు అంబేద్కర్ భవన శిథిలాలను తరలించడానికి మంగళవారం ఉదయం రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న దళిత, ప్రజా సంఘాల నాయకులు దుడ్డెల రాంమూర్తి, పిల్లి సుధాకర్, నర్రా శ్రవన్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని అంబేద్కర్ భవన నిర్మాణం జరిగేదాకా ఒక్క మట్టిబెడ్డ ఇక్కడి నుండి తరలించినా ఉరుకునేది లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యంత్రాలు, ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తొలగించేందుకు పూనుకోగా మరింత తీవ్రస్థాయిలో ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాగైన మట్టిని తొలగించాలని అధికారులు, తొలగింపును ఎట్టి పరిస్థితుల్లోను జరుగనిచ్చేది లేదని ప్రజలు ముమ్మరంగా తలపడ్డంతో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారింది. దీంతో దిగివచ్చిన అధికారులు భక్తులకు అసౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతోనే దారికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నామని తెలుపగా దానిపై స్పందించిన నాయకులు కావాలంటే దారికి అడ్డంగా ఉన్న మట్టిని యంత్రాల సహాయంతో పక్కకు జరుపండని అంతే తప్పా గాంధీపార్కులోంచి బయటకు వెళ్లనిచ్చేది లేదంటూ వాదనలు వినిపించారు. పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉండడంతో అధికారులు జెసిబి సహాయంతో దారికి అడ్డంగా ఉందని భావించిన మట్టిని పక్కకు జరిపారు. సాయంత్రం వరకు అటు అధికారులు, ఇటు ఆందోళన కారులు గాంధీపార్కులోనే మోహరించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి రావడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.