వరంగల్

మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 20: రైతు సంక్షేమమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నారని, సిఎం చూపిన దారిలో తాము నడుస్తూ..కేసముద్రం మార్కెట్‌ను మహబూబాబాద్ జిల్లాలో మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని మార్కెట్ చైర్మెన్ బీరవెళ్లి ఉమారెడ్డి పేర్కొన్నారు. గురువారం కేసముద్రం మార్కెట్లో పనిచేస్తున్న కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, సిబ్బంది హాజరు నమోదుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ సిస్టం, రైతు విశ్రాంతి భవనం, వాటర్ కూలర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మెన్ మాట్లాడుతూ ప్రత్యక్ష కొనుగోళ్ల ద్వారా కేసముద్రం మార్కెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాగే ఇక్కడికి వచ్చే రైతులు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్లేలా చూడటమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
త్వరలో కొత్తగా మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు మిర్చి కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి అశోక్, వైస్ చైర్మెన్ ఓలం చంద్రమోహన్, డైరెక్టర్లు బిజ్జాల ప్రభాకర్, వేముల కొమ్మాల్‌రెడ్డి, బండారు వెంకన్న, కార్మిక, కర్షక, వ్యాపార సంఘాల ప్రతిధులు ఓలం రాజేశ్వర్‌రావు, పెరటి వెంకట్రాంనర్సయ్య, బాబురావు, ముత్యాల శివకుమార్, చాగంటి కిషన్, శ్రీ్ధర్, వెంకన్న, బిక్షపతి, దామోదర్‌రెడ్డి, కట్టమల్లు తదితరులు పాల్గొన్నారు.
పసుపు కొనుగోళ్లపై చర్చలు వాయిదా
కాగా కేసముద్రం మార్కెట్లో కొద్ది మాసాల క్రితం వ్యవసాయ ఉత్పత్తుల అడుగులు, దానం, ధర్మం పేరుతో సరుకులను కూలీలు తీసుకోవడాన్ని పూర్తిగా తొలగించారు. కూలీలకు, కార్మికులకు అడుగులు, హెచ్‌కె,దానం, ధర్మం పేరుతో సరుకులు తీసుకోకుండా కొంత కూలీ చార్జీలు సైతం పెంచారు. అయితే తాజాగా పసుపులో తమకు గిట్టుబాటు కావడం లేదని, తిరిగి అడుగులు (దుబ్బ) తీసుకుంటామని కూలీలు పేచి పెట్టడంతో ఈ విధానంపై వివిధ వర్గాలతో పాలకమండలి చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నిర్వహించిన చర్చలు సఫలం కాకపోవడంతో శుక్రవారం మరోసారి చర్చలు నిర్వహించాలని వాయిదా వేశారు.
అయితే వ్యవసాయ ఉత్పత్తులు యధావిధిగా సాగుతాయనిమార్కెట్ కార్యదర్శి అశోక్ తెలిపారు.

హామీలను నెరవేర్చని ప్రభుత్వం

చేర్యాల, ఏప్రిల్ 20: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల పేరిట ధనాన్ని ఖర్చు చేస్తున్న ఘనత కెసి ఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. బిజెపితో లోపాయికారి ఒప్పందానికి ఇది నిదర్శనమని అన్నారు. జనాభా లెక్కలు తేల్చక ముందే రిజర్వేషన్లను పెంచుతామని ప్రజలను మోసం చేయడం అమానుషమన్నారు. 2011 జనాభా లెక్కలు తేల్చిన తర్వాత దాని ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయంలో కోర్టు తీర్పు అడ్డురాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల ఎంతోమంది యువత పక్కదారి పడుతున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదని గుర్తుచేశారు. ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల విషయంలో కమిటీ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వేసవిలో తరగతుల నిర్వాహణ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలతో పాటు కనీస వసతులను కల్పించాలని అన్నారు. కెజి టు పిజి విద్య ఉచితంగా అందిస్తామని చెప్పి అంగన్‌వాడీ సెంటర్లలో కలుపుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చేర్యాలలోని తపాస్‌పల్లి, బొమ్మకూరు కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, వీటి కోసం బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని అన్నారు. ఎండలు తీవ్రతరమయ్యాయని, ఈ విషయంలో తాగునీరు సరిగా అందే విధంగా చూస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు యు. రవి, నక్కల యాదవరెడ్డి, జిల్లెల సిద్దారెడ్డి, రమణారెడ్డి, నాగరాజు, సనాది భాస్కర్‌లు పాల్గొన్నారు.