వరంగల్

తొర్రూరుకు సిఎం రాక లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొర్రూరు పర్యటన దాదాపుగా రద్దైంది. నిర్ణిత షెడ్యుల్ ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 19న తొర్రూరు డివిజన్ కేంద్రంలో పర్యటించి టిఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వాహణ కోసం గులాభి కూలీ పనుల కార్యక్రమంలో పాల్గొని నిధులు సేకరించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 19నుండి 22కు వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా శనివారం తొర్రూరు రావల్సిన ముఖ్యమంత్రి తన తొర్రూరు పర్యటనను పూర్తిగా రద్దుచేసుకున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ప్లినరీ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల తర్వాత ఢిల్లీ నుండి సిఎం తిరిగివచ్చినప్పటి అప్పటికి వరంగల్ సభ నాటికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని ఈ ఒక్క రోజులో ముఖ్యమంత్రి తొర్రూరు పర్యటనకు వచ్చి కూలీ పనుల్లో పాల్గొనడం అసాధ్యం అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి తొర్రూరు పర్యటన పూర్తిగా రద్దు అయినట్లు భావిస్తున్నామని పలువురు టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

ఇక ఆన్‌లైన్‌లో రెవెన్యూ వివరాలు
అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి

వరంగల్, ఏప్రిల్ 21: గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూశాఖకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా వెంటవెంటనే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి అందించేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడతాయని అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. శుక్రవారం అర్బన్ కలెక్టరేట్ మీటింగ్‌హాలులో జరిగిన కార్యక్రమంలో అర్బన్ జిల్లాకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులకు ట్యాబ్‌లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రెవెన్యూశాఖకు సంబంధించి గతంలో మాదిరిగా పేపర్ల ద్వారా సమాచారం పంపించకుండా ఆన్‌లైన్ ద్వారా పంపించాలని తెలిపారు. ట్యాబ్‌లను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం చేసే పనిపై అంతమేరకు నియంత్రణ, పట్టు లభిస్తుందని చెప్పారు. ట్యాబ్‌లను ఉపయోగిస్తే ఇక డాటా ఎంట్రీ ఆపరేటర్లపైన కూడా ఆధారపడవలసిన అవసరం లేదని అన్నారు. ఇంటర్నెట్ లేని చోటు అంటూ లేదని చెబుతు మొదటిసారిగా ట్యాబ్‌ల వినియోగం కొంత కష్టంగా ఉన్నా రానురాను అది సులభంగా మారుతుందని చెప్పారు. అధికారిక విధులలో వారంపాటు ప్రయోగాత్మకంగా ట్యాబ్‌లను ఉపయోగించాలని, ఈ సందర్భంగా ఏర్పడే అనుమానాలతోపాటు సాఫ్ట్‌వేర్‌లో మార్పుల గురించి తెలుసుకుని నివేదిక అందచేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శోభ, ఎన్‌ఐసి అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో పోలీసులు సన్నిహితంగా మెలగాలి
* అశ్వికదళం ఏర్పాటుతో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు * అదనపు డిజిపి అంజనీకుమార్

వరంగల్, ఏప్రిల్ 21: పోలీసులు ప్రజలకు సన్నిహితంగా మెలిగినపుడే శాఖాపరంగా శాంతిభద్రతల పరిరక్షణలో అనుకున్న ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అదనపు డిజిపి అంజనీకుమార్ అన్నారు. పోలీసుశాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోలీసుశాఖలో రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్ పోలీసు కమీషనరేట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. వరంగల్ పోలీసు కమీషనరేట్‌కు మంజూరైన ఆశ్వకదళం కేంద్రానికి అదనపు డిజిపి అంజనీకుమార్ ఖిల్లా వరంగల్ ప్రాంతంలో మంజూరైన స్థలంలో శంకుస్థాపన జరిపి భూమిపూజ చేసారు.
వరంగల్ పోలీసు కమీషనరేట్ ఏర్పడిన తరువాత పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు ఇక్కడ ఆశ్వకదళ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం అమోదం తెలిపింది. అశ్వకదళం ఏర్పాటుకోసం పోలీసుశాఖ ఇప్పటికే 10మేలుజాతి గుర్రాలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం వరంగల్‌లో వీటికి అవసరమైన వసతి లేని కారణంగా హైద్రాబాద్‌లోని గోషామహల్‌లో ఉన్న హైదరాబాద్ పోలీసు కమీషనరేట్‌కు చెందిన అశ్వకదళం కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవలే వరంగల్ నగర పరిధిలోని ఖిల్లా వరంగల్ ప్రాంతంలో అశ్వకదళం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కూడా రెవెన్యూశాఖ పోలీసుశాఖకు బదలాయించింది.
వరంగల్ పర్యటనకు వచ్చిన అదనపు డిజిపి శుక్రవారం డిజిపి అశ్వకదళం కేంద్రానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వరంగల్ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ ఏఎస్‌పిగా తన కేరిర్ ప్రారంభమయినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే వరంగల్ నగరం చాలా అభివృద్ధి చెందిందని, పోలీసుశాఖ పరంగా కూడా వరంగల్ పోలీసు కమీషనరేట్‌కు ప్రాధాన్యత ఏరపడిందని చెప్పారు. సమస్యలను అధిగమించటంలో వరంగల్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. వౌన్‌టెడ్ పోలీసు విభాగం ఏర్పాటు ద్వారా వరంగల్ నగర పోలీసు వ్యవస్థ మరింత బలపడుతుందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతు అశ్వకదళం ఏర్పాటులో జిల్లాయంత్రాంగం పోలీసు యంత్రాంగానికి పూర్తిసహకారం అందిస్తుందని చెప్పారు. నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతు పోలీసు కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు అశ్వకదళం ఎంతో సహాయకారిగా ఉంటుందని, దీనివల్ల పోలీసు కమీషనరేట్ వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిసిపిలు వేణుగోపాల్‌రావు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసిపిలు జనార్ధన్, మురళీధర్, చైతన్యకుమార్, శోభన్‌కుమార్, పూజ, పద్మనాభరెడ్డి, సంజీవరావు, సుధీంద్ర, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మైక్రో ఫైనాన్స్ పేరుతో కుచ్చుటోపీ
*మహిళల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని అందినంత దండుకొని చెక్కేసిన మాయగాళ్లు..
* వెయ్యిరూపాయల విలువచేయని వస్తువులు 4వేలకు అమ్మకం
గోవిందరావుపేట, ఏప్రిల్ 21: మహిళల ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకొని కొంత మంది మాయగాళ్లు మైక్రో ఫైనాన్స్ పేరుతో అందినంత దండుకొని ఉడాయించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెలితే విజయవాడ ప్రాంతానికి చెందిన కొంత మంది మైక్రో ఫైనాన్స్ పేరుతో పలు గ్రామాలలోని మహిళ వద్ద చేరుకొని తమని తాము పరిచయం చేసుకున్నారు. తమకు నమ్మకం ఉన్న మహిళలకు తక్కువ వడ్డికే వేలాది రూపాయల డబ్బులను ఇస్తామని, తమకు వాయిదాల పద్దతిన చెల్లించేస్తే సరిపోతుందని వివరించారు. మహిళలనే లక్ష్యంగా చేసుకొని తమ వ్యాపారాన్ని వివరించారు. ఇందుకోసం ముందస్తుగా మహిళలు 4వేల రూపాయలు చెల్లిస్తే వారికి చిన్నపాటి కూలర్, రైస్‌కుక్కర్‌లు ఇస్తామని నాలుగు విడుతలుగా ఈ రూపాయలు చెల్లించిన వారిని నమ్మకస్తులుగా గుర్తించి 40 నుండి 50వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు.
దీంతో పలువురు మహిళలు ఎక్కువ వడ్డిలకు, మహిళా గ్రూపులలో డబ్బులు చెల్లించి వెయ్యిరూపాయల విలువకూడా లేని వస్తువులను 4వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసారు. వారం రోజులలో డబ్బులు ఇస్తామని చెప్పిన సదరు మోసగాళ్లు 10 రోజులు అయినా జాడ లేకపోవడం, ఫోన్ చేస్తే పనిచేయక పోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించినట్టు చల్వాయి గ్రామానికి చెందిన ఎండి హసినా, పులిచేరు సారమ్మలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఎక్కువ ధర అని తెలిసినా ఓకేసారి డబ్బులు ఎక్కువగా ఇస్తే చిన్నచిన్న అప్పులు తీర్చుకోవచ్చనే ఆశతో మల్లీ వడ్డిలకు తెచ్చి కొనుగోలు చేసామని వారు వివరించారు. ఏదో అవసరాలకు డబ్బులు ఉపయోగపడతాయని ఎక్కువ డబ్బులు పోసి నాసిరకం వస్తువులను కొనుగోలు చేసామని ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వకుండా తమని మోసం చేసారని సదరు బాదితుల వాపోతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో విజయవాడ వాస్తవ్యులుగా పేర్కోంటున్న వీరు వందలాది మంది మహిళలకు డబ్బులు ఇస్తామని మోసం చేసి ఊడాయించినట్టు తెలుస్తుంది. కాగా తమకు జరిగిన అన్యాయం మరోకరికి జరగకుండా ఉండాలని భాదిత మహిళలు వేడుకొంటున్నారు. పోలీసులు స్పందించి కూపీ లాగితే ఎంతో మందికి మేలు జరుగుతుంది. కాగా డబ్బులు ఇస్తామని ఆశ చెప్పి మాయమాటలు చెప్పే మోసగాళ్లను నమ్మితే చేతిలో ఉన్నడబ్బులు చేజార్చుకోవడమేనని మరోమారు మాయగాల్లు రుజువు చేసారు.