వరంగల్

అశాంతిని ప్రేరేపించేందుకు కాంగ్రెస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 29: రైతులను రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతలకు ఇబ్బందులు సృష్టించేందుకు, రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారాంనాయక్, వరంగల్ నగర మేయర్ నరేందర్ ఆరోపించారు. మూడేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను ప్రజలు నమ్మరని చెప్పారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసింది ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అన్ని రంగాలలో ప్రగతికి బాటలు వేసిందని చెప్పారు. రెండురోజుల కిందట జరిగిన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు విశేష జనం హాజరుకావటం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుందని అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని, అధికారంలో ఉన్నపుడు రైతులకు కాంగ్రెస్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతుధర నిర్ణయించేది కేంద్రప్రభుత్వమేనని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నపుడు కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తమ ప్రభుత్వం భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపడితే వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, కోర్టులలో కేసులు వేయిస్తోందని ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, పార్టీ నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, అనిశెట్టి మురళి, లలితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అక్షయ తృతీయ శోభ
పరకాల, ఏప్రిల్ 29: అక్షయ తృతీయ బులియన్ విపణికి శోభ తెచ్చింది. గత కొంత కాలంగా వివాహాది శుభ కార్యాలకే అమ్మకాలు పరిమితం అయ్యేవి. ధరల హెచ్చ తగ్గుదలతో కొనుగోళ్లను వాయిదా వేయడంతో మార్కట్ స్తబ్దుగా ఉంది. అయితే ఏటా అక్షయ తృతీయ రోజు అమ్మకాల్లో చలనం వస్తోంది. గతంలో మాదిరిగానే శనివారం పసిడి దుకాణాల్లో సందడి నెలకొంది. పుత్తడి కొనేందుకు వినియోగదారులు రావడంతో దుకాణాలకు కళ వచ్చింది. అక్షయ తృతీయను పురస్కరించుకొని కొందరు మహిళలు ముందు రోజు కూడా బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే బంగారం ఈనెల అరంభంలో రూ. 30వేలు దాటిన అక్షయ తృతీయ రోజున సుమారు రూ. 29750 కావడంతో వినియోగదారుల్లో ఆశలు రేకెత్తాయనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పోల్చితే ప్రస్తుత అమ్మకాలు తక్కువ అనిపించినా అమ్మకాలు చెప్పుకోదగినని అనిపిస్తోందని కొందరు వ్యాపారుస్తులు పేర్కొన్నారు.

కేసిఆర్.. గౌరవెళ్లి, గండిపల్లి
రిజర్వాయర్ ఏమైంది?

భీమదేవరపల్లి, ఏప్రిల్ 29: గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి లక్షాయాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే గండిపల్లి, గౌరవెళ్లి రిజర్వాయర్‌లను తాను ఇక్కడే కూర్చొని పనులు పూర్తి చేయస్తానని రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం ప్రశ్నించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్విజయ్‌సింగ్ రానున్న సందర్భంగా సభా ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్, మృత్యుంజయం, శ్రీరాంచక్రవర్తి, పిసిసి ఉపాధ్యక్షులు నర్సింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడారు. గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్ పనులు దగ్గరుండి చేయిస్తామని పేర్కొన్న కెసిఆర్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటి వరకు పిడికెడు మట్టిని ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో ఉన్న ప్రాజెక్ట్ పనులు ఆపివేసారన్నారు. ముఖ్యమంత్రి తమ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఏమయ్యాయని, ఇచ్చిన హామీలు తీర్చడంలో పూర్తిగ అబద్దాల కోరుగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్‌ముఖర్జీ, చొల్లేటి ప్రకాశం, జిమ్మల భీంరెడ్డి, పత్తిపాక కొంరెళ్లి, కొలుగూరి రాజు, మంగ రాచంద్రం, కొడకండ్ల సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మిర్చి రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు

వడ్డేపల్లి, నల్లబెల్లి, ఏప్రిల్ 29: ఎనుమాముల మార్కెట్ యార్డులలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌కు వివిధ కారణాలతో సెలవులు వచ్చినందున మే 2వ తేదీనుండి మిర్చి మార్కెట్‌కు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని మార్కెట్‌లో విడతల వారీగా విధులను కేటాయించాలని, ఏరోజు వచ్చిన పంట అదే రోజు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మిర్చి పంటల ధరల సూచికను మార్కెట్‌లో డిస్‌ప్లే అయ్యే విధంగా చూసుకోవాలని, సరుకులను నిలువ ఉంచేందుకు సరైన గోదాములను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ పంట సరుకులతో పాటు విధిగా భూమి పాసు పుస్తం, పహాణినకలు పత్రాలను తమ వెంట తీసుకురావాలని రైతులను కోరారు. రైతులు కాని వారు, మార్కెట్‌కు సంబంధం లేని వారు మార్కెట్‌లోనికి ప్రవేశించకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలుదారులు, అడ్తిదారులు, మార్కెట్ కమిటీ వారు సంయమనం పాటించి రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పాలకవర్గాన్ని కోరారు. కార్యక్రమంలో అర్బన్, రూరల్ కలెక్టర్లు దయానంద్, హారిత, మార్కెట్ చైర్మన్ ధర్మరాజు, ఉద్యానవనశాఖ డిడి సునీత, ఇంతేజార్‌గంజ్ ఎసిపి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
హరిత హారంలో అందరూ
భాగస్వాములు కావాలి
హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. నల్లబెల్లి మండలం గోవిందాపురం గ్రామ సమీపంలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందాపురం టేకు ప్లాంటేషన్‌లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలన్నారు. నర్సరీలలో అన్ని రకాల మొక్కలను పెంచాలని ఆయన అన్నారు. అదే విధంగా మొక్కల పెంపకానికి అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో రవీందర్, నల్లబెల్లి తహశీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపిడివో మూర్తిరెడ్డి, రాజిరెడ్డితో పాటు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

స్కూటీని ఢీ కొట్టిన ఇసుక లారీ:
ఒకరు మృతి, మరొకరికి గాయాలు
మహాదేవపూర్, ఏప్రిల్ 29: మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి సమీపంలో స్కూటీపై వెళ్తున్న వారిని ఇసుక లారి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతి వేగంగా ఇసుక లారీ స్కూటీపెకి దూసుకు రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్లుతున్న జిల్లెల సమ్మిరెడ్డి(42) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక ఉన్న పోతు సంతోష్ తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సమ్మిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మహాదేవపూర్ కేంద్రంలోని కమాన్ వద్ద మృతుని బంధువులు మృతదేహంతో రోడ్డుపై నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మృతి చెందిన సమ్మిరెడ్డి కాళేశ్వరంలో చిన్న దుకాణం నడిపిస్తూ భార్య, పిల్లలను పోషించుకునే వాడని చెప్పారు. సమ్మిరెడ్డి మరణంతో ఆయన కుటుంబం రోడ్డు పాలు అయిందని, ప్రభుత్వ పరంగా మృతుని కుటుంబానికి రూ. 25 లక్షలతో పాటు ఉద్యోగం ఇవ్వాలని పేర్కొంటు ధర్నా నిర్వహించారు. స్వయంగా కలెక్టర్ వచ్చే వరకు మృతదేహన్ని తరలించేది లేదంటూ ధర్నా కొనసాగించారు. గాయాలైన సంతోష్ రుద్రారం గ్రామానికి చెందిన వాడుగా వారు పేర్కొన్నారు.
వరి చేను దగ్ధం
మొగుళ్ళపల్లి, ఏప్రిల్ 29: మొగుళ్ళపల్లి మండలం మెదరమెట్ల శివారులో ఇస్సిపేట రైతు యార మల్లారెడ్డికి సంబంధించిన ఎకరం వరి చేను షార్టు సర్క్యూట్ కారణంగా దగ్థం అయింది. రూ. 40వేల వరకు నష్టం జరిగినట్టు బాధిత రైతు పేర్కొన్నారు. సర్పంచ్ సుధీర్ బాధిత రైతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
వడదెబ్బతో వృద్ధుడి మృతి
కమలాపూర్, ఏప్రిల్ 29: మండల కేంద్రమైన కమలాపూర్‌కు చెందిన కినె్నర వెంకటయ్య(60) అనే వృద్ధుడు శనివారం ఉదయం వడదెబ్బతో మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం కూలి పనులకు వెళ్లి ఎండ వేడితో అస్వస్థతకు గురై శనివారం ఉదయం మృతి చెందినట్లు వారు తెలిపారు.
తాడి చెట్టు నుంచి కిందపడి
గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
పరకాల, ఏప్రిల్ 29: పరకాల మండలం సితరాంపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడికి శనివారం తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన భైరి చిన్నయ్య శనివారం తాడిచెట్టు ఎక్కతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి పోయి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన చుట్టుపక్కల వారు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుల వృత్తినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న చిన్నయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
వరిగడ్డి, ధాన్యం దగ్ధం
రాయపర్తి, ఏప్రిల్ 29: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పొలంలో ఉన్న వరి గడ్డితో పాటు, కళ్లెంలో ఉన్న ధాన్యం కూడ దగ్థమైన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు మల్లయ్య, స్థానికుల వివరాల ప్రకారం తన వ్యవసాయ భూమిలో ఇటీవలే వరికోత యంత్రంతో కోసి ధాన్యాన్ని కళ్లెంలో ఆరపోసాడు, వరిగడ్డి పొలంలో ఉండడంతో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వరిగడ్డికి నిప్పంటుకుని చుట్టుపక్కల సుమారు 20 ఎకరాలలో ఉన్న వరిగడ్డి నిప్పు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి, వరి ధాన్యానికి కూడా నిప్పంటుకోవడంతో ధాన్యం కూడా మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. సుమారు లక్ష వరకు నష్టం వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాయపర్తి, ఏప్రిల్ 29: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సూర్యతండా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు, స్థానిక పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యాకూబ్(45) అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై కూరగాయాలు అమ్మడానికి వెళ్లినప్పుడు తేజావత్ రమేశ్ అనే వ్యక్తి టాటా ఏస్ వాహానం ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన యాకూబ్‌ను చికిత్స నిమిత్తం హైద్రబాద్‌లో గాంధీ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.రైతుల సమస్యలు తెల్సుకునేందుకు..
రైతులు ఆధునిక పద్ధతులు వినియోగించుకోవాలి

మహబూబాబాద్, ఏప్రిల్ 29: రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా సూచించారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సాగులో నూతన ఒరవడిని సృష్టించాలని రైతుల పంటల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడంలో అధికారులు కృషి చేయాలన్నారు. సాగుకు యోగ్యం కాని భూములను సారవంతంగా తీర్చిదిద్దాలని ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల అభివృద్ధికి వ్యవసాయ అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం రైతుల సమగ్రసర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. ఏప్రిల్ 30వ తేదీ నుండి జూన్ 5వరకు రైతుల ఇంటింటి సర్వేను నిర్వహించి సంబంధిత అధికారులకు అందజేయాలని ఆదేశించారు. సర్వేలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, జాబితాలలో ఎక్కడా అనర్హులకు చోటు ఉండకూడదన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి రైతు భూముల వివరాలు, పంటల వివరాలు వీటి ఆధారాలు, ఆధార్ నెంబర్‌లను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. మనతెలంగాణ, మన వ్యవసాయం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి రైతుకు వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యక్రమాలను తెలియజేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తప్పనిసరిగా ఉదయం 7గంటలకే గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యపరచాలని కోరారు. రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటలు సాగుచేసుకోవడంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను చైతన్యపరచాలని సూచించారు.
జెసి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. అత్యాధునిక పద్ధతులను వినియోగించి వ్యవసాయంలో అత్యధిక దిగుబడులను సాగించే దిశగా వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యపరచాల్సిందిగా కోరారు.
కాలానుగుణంగా పంటల దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వానాకాలం సాగుకు రైతులందరూ సన్నద్ధం కావాలని కోరారు. రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుండి వచ్చిన ప్రోగ్రాం సూపర్‌వైజర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. మన తెలంగాణ మన వ్యవసాయం మార్గదర్శకాలను వివరించి అధికారులంతా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్ మాట్లాడుతూ.. భూసార పరీక్షలు, పంట మార్పిడి పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ పథకం గురించి వివరించాలన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం, రైతు సంఘాల ఏర్పాట్లు మొదలైన వ్యవసాయ శాఖ కార్యక్రమాలను నిర్వహించారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది ప్రజల పక్షం
గూడూరు, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది ప్రజలపక్షమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ అన్నారు. గూడూరు మండలంలోని గాజులగట్టులో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. రైతాంగానికి చేయూతనిచ్చేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎకరాకు నాలుగువేల రూపాయలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.

నేడు ముల్కనూర్‌కు దిగ్విజయ్‌సింగ్ రాక

భీమదేవరపల్లి, ఏప్రిల్ 29: తెలంగాణలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, వాటి పరిష్కార మార్గం కోసం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదివారం రానున్నట్టు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకుకు నాలుగు గంటలకు వచ్చి బ్యాంకులో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని ఎలా అభివృద్ధి చేయాలో.. అధ్యయనం చేయడానికి రానున్నట్టు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ముల్కనూర్ విద్యాభారతి పాఠశాలలో హుస్నాబాద్ నియోజక వర్గ స్ధాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు.
దిగ్విజయ్ సింగ్ వెంట ఏఐసిసి జాతీయ కార్యదర్శి కుంతియా. ఏఐసిసి ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజులతో పాటు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులుహాజరవుతారని తెలిపారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిమ్మల భీంరెడ్డి, మాజీ అధ్యక్షులు పత్తిపాక కొంరెళ్లి, మంగ రాంచంద్రం, కొడకండ్ల సుదర్శన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఘనంగా భద్రకాళి-్భద్రేశ్వరుల ఎదుర్కోలు ఉత్సవం

వరంగల్(కల్చరల్), ఏప్రిల్ 29: వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయ క్షేత్రంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉత్సవాలలో భాగంగా భద్రకాళి భద్రేశ్వరుల ఎదుర్కోలు ఉత్సవాన్ని కడు రమణీయంగా చేశారు. పదకొండు రోజుల ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు అమ్మవారికి నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన జరిపారు. ఉదయం 11గంటలకు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సర్వశుభంకరిగా అలంకరించి మకర వాహన సేవ చేశారు. సాయంత్రం చంద్రాపరమేశ్వరిగా పూజలు చేసి చంద్రప్రభా వాహనంపై ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా ద్వారకా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి అంతేవాసి శ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేసి భద్రకాళి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ముందుగా ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించుకొని ప్రధాన ఆలయంలోని భద్రకాళి మాతను సేవించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రధాన అర్చకులు ఆయనకు జ్యేష్ఠమాసంలో జరిగే శతచండీ యాగం గురించి వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిర్వహిస్తున్న భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవంలో భాగంగా శనివారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవం జరుగుతున్న సమయంలో ప్రముఖ సాహితీ వేత్త గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు శివకళ్యాణ రాయభారం ఘట్టాన్ని భక్తులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ పూజా కార్యక్రమానికి ఉభయ దాతలుగా ప్రముఖ వ్యాపార వేత్త కరాని కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించిన గోవిందానంద సరస్వతి
కాకతీయుల కళావైభవమైన వేయిస్తంభాల రుద్రేశ్వరాలయాన్ని గోవిందానంద సరస్వతి స్వామి సందర్శించారు. శనివారం ఆయన వరంగల్ నగర పర్యటనలో భాగంగా రుద్రేశ్వరాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కాకతీయుల నాటి దేవాలయమైన వేయిస్తంభాల ఆలయం హరిహర క్షేత్రం అని, దీనిని పునరుద్ధరించి సూర్యనారాయనుల విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తే ఆలయం లోక కళ్యాణ కారకం అవుతుందని తెలిపారు. గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ఆలయంలోని సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠపన చేసేందుకు పురావస్తు శాఖ, కేంద్ర ప్రభుత్వాల దృష్ఠికి తీసుకువెళ్ళి అతి శీఘ్రంగా దేవాలయంలోని దేవేరుల ప్రతిష్ఠాపన జరిగేలా చూడాలని ఆయన స్వామీజీని కోరారు.