వరంగల్

లంచం ఇస్తే ఉద్యోగం రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూన్ 15: లంచం ఇస్తే ఉద్యోగం రాదని, తెలంగాణ ప్రభుత్వం ఓపెన్‌గా ఉద్యోగాలు కల్పిస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలో మయూరి గార్డెన్స్‌లో మేగా జాబ్ మేళాను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లంచం ఇచ్చి మోస పోవద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా వెళుతుందని చెప్పారు. పరకాల నియోజకవర్గానికి టెక్స్‌టైల్ పార్క్‌ను మంజూరు చేసుకున్నామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్క్‌లో నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, టెక్స్‌టైల్ పార్క్ కోసం తమ భూములు ఇచ్చిన సుమారు 46 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. అయితే వచ్చిన ఉద్యోగం ఎక్కడైనా వెళ్లి బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. అయితే మెగాజాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలని తపన ఉంటుందన్నారు. ఉద్యోగం లేకుండా చాల మంది ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో నేడు డిగ్రీ, పిజిలు చేసి ఉద్యోగాలు లేకున్న వారు నానా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. దీంతో తాను ప్రత్యేక దృష్టి సారించి పరకాలలో 150 కంపెనీలు పాల్గొనేలా చేసి జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ఎంత జీతం అని చూడకుండా వచ్చిన ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలని కోరారు. మొదట కంపెనీలో చేరి బాధ్యతగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. దీంతో మనకు పరిచయాలు పెరిగి మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించడం పట్ల ఆయన అభినందించారు. 91 శాతం ప్రైవేట్ సెక్టార్‌లో అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఉద్యోగం చేస్తే అనుభవం వస్తుందని ఆ అనుభవంతో మీరు స్వశక్తిగా ఎదగవచ్చునన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి శేఖర్‌రెడ్డి ఏపిడి పరేమేశ్, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, ఎంపిపి నేతాని సులోచన, జడ్పీటిసి పాడి కల్పనాదేవి, పరకాల నగర పంచాయతీ చైర్మన్ రాజభద్రయ్య, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నర్సంపేట, జూన్ 15: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే 16 రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలను అమలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి ఎల్.రూపిసింగ్ వెల్లడించారు. నర్సంపేటలోని ఐఎంఏ హాల్‌లో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నాయిని నర్సయ్య అధ్యక్షతన టిఆర్‌ఎస్‌వికె రూరల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రూప్‌సింగ్ మాట్లాడుతూ మరో ఎనిమిది రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సైతం కనీస వేతనాలు అమలయ్యేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా 2019లోపు అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. సమగ్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, వినూత్న పథకాలకు 48వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు.
ఇతర సంఘాలలో పనిచేస్తున్న కార్మికులు సైతం ఆలోచించి ప్రభుత్వానికి బాసటగా నిలవాలి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, మధ్యాహ్నా భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్, జిల్లా నాయకులు గోనె యువరాజు, పాలడుగుల రమేష్, కొల్లూరి లక్ష్మీనారాయణ, నాయిని నర్సయ్య, గుండెబోయిన కొమురయ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.

ఓరుగల్లు ఉత్సవాలను విజయవంతం చేయాలి
వరంగల్ (కల్చరల్), జూన్ 15: నేటి నుండి ప్రారంభంకానున్న ఓరుగల్లు కళావైభవ ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో సంగీత, నృత్య, నాటక పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు నృత్య విభాగంలో 18మంది, సంగీత విభాగంలో 14 మంది నాటక, స్కిట్స్ విభాగంలో నలుగురు పాల్గొంటారని అన్నారు. ఈ పోటీలకు విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ ఇన్‌చార్జ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. అదేవిధంగా నిట్ ఆడిటోరియంలో 17,18 తేదీలలో లఘు చిత్రాల పోటీలు ఉంటాయన్నారు.

ఇందుకోసం ఇప్పటికే 41 షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శనలకు సంబంధిత నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాతలు కృష్ణారెడ్డి, తరుణ్ భాస్కర్, సాగర్, అచ్చి రెడ్డి, నటులు వేణుమాధవ్, రచ్చ రవి పాల్గొంటాలని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలోని కాకతీయ హరితా హోటల్ వేదికగా 16,18వ తేదీలలో సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయని, ఇందులో భాగంగా 16వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం వరకు ఓరుగల్లు సాహిత్యంపై సదస్సును నిర్వహిస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమాలను డాక్టర్ అంపశయ్య నవీన్ ప్రారంభిస్తారని, ఆచార్య బన్న ఐలయ్య, ఆచార్య రామచంద్రవౌళి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. చివరి రోజు మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు ప్రముఖ సాహితీవేత్త వి ఆర్ విద్యార్థి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజా మనోహర్, పొట్లపల్లి శ్రీనివాస్ రావులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమాలలో సాహితీ అభిమానులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం

వడ్డేపల్లి, జూన్ 15: వరంగల్ అర్బన్ జిల్లా పరిథిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని హరే కృష్ణ అక్షయపాత్ర వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా, అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, హరేకృష్ణ ప్రతినిధులతో సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో అక్షయపాత్ర అన్నపూర్ణ భోజనంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో 70 లక్షలతో నిర్మించిన వంటశాల ద్వారా జూన్ 2నుండి నగరంలో ఎనిమిది కేంద్రాలలో రోజుకు 4500 మందికి ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి, పోచమ్మమైదానం ఈ నెల 20 నుండి ఐదు రూపాయల భోజనాన్ని అందిస్తామని, మొత్తం 10 కేంద్రాల ద్వారా కార్పొరేషన్ సహకారంతో రోజుకు 5500 మందికి భోజనం అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు. జూలై ఒకటి నుండి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలతో కలిపి సుమారు 20 వేల మందికి ఉచిత పౌష్టికాహారం అక్షయపాత్ర ద్వారా అందజేయడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో గల 516 పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 52 వేల మంది విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న బోజనం అందజేస్తామని వివరించారు. దాతల ద్వారా సేకరించిన సుమారు తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో మెగా వంటశాలను వరంగల్ పరిసరాలలో ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పూర్తి చేసినట్టు తెలిపారు. జిల్లాలో అక్షయపాత్ర సహకారంతో చేపట్టిన కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసాచారి, మహిళాసంక్షేమఅధికారి శైలజ, కార్పోరేటర్ మాధవి, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.

ధర్మసాగర్ కేసు కొట్టివేత
నక్కలగుట్ట, జూన్ 15:2009 సంవత్సరంలో ధర్మసాగర్ నీటి విడుదల విషయంలోజరిగిన ఘర్షణలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఉండగా కడియం, రేవూరిలు కోర్టుకు హాజరయ్యారు. 2009లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ధర్మసాగర్ గేట్ల ఎత్తినీటిని విడుదల చేసేందుకు సంబంధిత ఏఇ ద్వారా ఏర్పాట్లు చేశారు. కాని గ్రామస్థులు సమూహంగా వెళ్లి అధికారులు రాక ముందే గేట్లను ఎత్తి నీరును విడుదల చేశారు. దీంతో అధికారులు కడియం, రేవూరిల ప్రోత్సాహంతోనే వారి అనుచరులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు అయ్యింది. అప్పటి నుండి పలు దఫాలుగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి గురువారం సదరు కేసును కొట్టివేశారు. ఈ కేసు విషయంలో కడియం, రేవూరి తరపున సాంబశివరాజు, గుడిమెళ్ల రవికుమార్, ఈగ మల్లేశం పాల్గొన్నారు.
యాచకుని దారుణ హత్య
కురవి, జూన్ 15: మతిస్థిమితం లేకుండా...ఓ పదిరూపాయలు ఇయ్యండి సారు అని దేవస్థాన పరిసరాలలో అడుక్కొని పొట్టపోసుకునే ఓ యాచకున్ని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో అతికర్కశంగా మోది దారుణంగా హత్య చేసిన సంఘటన కురవి మండల కేంద్రంలోని పశువుల సంత యార్డులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై తీగల అశోక్, సీఐ ముత్తిలింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఎస్‌కె హస్సేన్(45) వడ్రంగి పనిచేసేవాడు. అతనికి కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన సైదాబితో వివాహం జరిగింది. ఓ కూతురు మీరా జన్మించిన తరువాత కొద్ది సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయాడు. కురవి, బుధరావుపేట పరిసరాలలో యాచకుడిగా తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి యదావిధిగా సంత మార్కెట్ యార్డులో నిద్రించాడు. తెల్లవారేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కర్కశంగా మోదడంతో చెవి భాగంతోపాటు, తలమీద నుజ్జునుజ్జుగా మారింది. సంఘటనా స్థలంలో రక్తం అంటిన రాళ్లు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో చేరుకుని పోలీసులు శోధించారు. డాగ్ స్క్వాడ్ సమీపంలోని బ్రాందిషాప్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. మృతుడికి భార్య సైదాబి, కూతురు మీరా ఉన్నారు. మృతుడి అన్న కుమారుడు షేక్ జాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు సిఐ ముత్తిలింగం తెలిపారు. మద్యం మత్తులో ఎవరైన హత్య చేసారా..లేక మరే ఇతర కారణమైన ఉందా అని అన్నివిధాలుగా పోలీసులు కేసును శోధిస్తున్నారు. యాచకుడి దారుణహత్య సంచలనంగా మారడంతో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు
క్రిమిసంహారక మందు తాగి బాలిక మృతి
నల్లబెల్లి, జూన్ 15: నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన కొత్తగట్టు రవళి(16) అనే మైనర్ బాలిక క్షణికావేశంతో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందిన సంఘటన గురువారం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి గ్రామానికి చెందిన కొత్తగట్టు చంద్రు కుమార్తె రవళి అనే బాలిక అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలి వివాహనికి వెళ్లడం కోసం రెండు వందల రూపాయలను అడిగింది. ఈ క్రమంలో బాలికకు కడుపునొప్పి రావడంతో పెళ్లికి వద్దని తల్లిదండ్రులు చెప్పడంతో క్షణికావేశంతో ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగింది. మందు తాగిన విషయం గమనించిన తల్లిదండ్రులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజవౌళి తెలిపారు.
గాలికి ఇంటిపై కూలిన చెట్టు
సంగెం, జూన్ 15: గాలి, వర్షం ఒకేసారి రావడంతో ఇల్లుపై చెట్టు కూలిన సంఘటన గురువారం సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుంటపల్లికి చెందిన లచ్చమ్మ రేకుల ఇంటిపై పెద్ద చింతచెట్టు గాలికి కూలింది. దీంతో రేకులు, ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి ధ్వంసమయ్యాయి. రేకుల ఇంటిని నిర్మించుకుని రెండు నెలలు గడిచిందని లచ్చమ్మ తెలిపారు. తనకు ఇద్దరూ కుమార్తెలే ఉన్నారని, మగ దిక్కులేదని ఇటీవలే నిర్మించుకున్న ఇల్లు ధ్వంసమైందని తెలిపారు. సంఘటనా స్థలానికి గ్రామ రెవెన్యూ అధికారులు స్వామి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపిటిసి నర్సయ్య, సర్పంచ్ లక్ష్మయ్య ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి
మహబూబాబాద్, జూన్ 15: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలిగేలా ఉపాధ్యాయులు బోధించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. గురువారం జిల్లాలోని మరిపెడ మండలం సీతారామపురం జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల, గుడిపూడి జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల బడిబాట కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. బడిఈడు పిల్లలు బడికి వెళ్లేటట్టు చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అధికంగా విద్యార్థులకు తండాలకు చెందిన వారైనందున విద్యతోపాటు విద్యార్థులకు జీవన విధానం, ఆహార వ్యవహారాలు నేర్పాలని అన్నారు. సొంత పిల్లల వలే విద్యార్థులపై శ్రద్ధ తీసుకొని విద్యను బోధించాలని సూచించారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కలెక్టర్ హెచ్చరించారు. ఆధునిక సమాజంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ విద్యార్థులకు నూతన ఆధునిక సాంకేతికత బోధించాలని తెలిపారు. విద్యార్థుల సైకాలజీని బట్టి ప్రణాళిక ప్రకారం బోధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, ఎంఈవో బూర వెంకన్న, తహశీల్దార్ అమరేందర్, ఎంపిడివో ముత్తి, హెడ్‌మాస్టర్, ఎస్‌ఎంసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు.