వరంగల్

దోపిడీని అరికట్టడం కమ్యూనిస్టులతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, సెప్టెంబర్ 23: దేశంలోని దోపిడీని అరికట్టాలంటే కమ్యూనిస్టు ప్రభుత్వాల వల్లే సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు జిల్లెల సిద్దారెడ్డి, మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డిలు అన్నారు. శనివారం పడమటికేశ్వాపూర్‌లో సిపిఎం గ్రామ మహసభ నిర్వహించారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం గంగర బోయిన మల్లయ్య అధ్యక్షతన జరిగిన మహాసభకు వారు హాజరై మాట్లాడారు. రోజురోజుకు ప్రపంచంలో ఎర్రజెండా ప్రాబల్యం పెరుగుతోందన్నారు. జీర్ణించుకోలేని సామ్రాజ్యవాద దేశాలు ఆయా దేశాలపై యుద్ధాల కోసం కవ్వింపుచర్యలకు దిగుతున్నాయని అన్నారు. దేశంలోని మతోన్మాదం, దోపిడీ పాలనకు వ్యతిరేకరంగా కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిష్టు పాలన సాగిస్తున్నారని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతోన్మాద దాడులకు తెగబడుతూ భయానక వాతవరణాన్ని సృష్టిసుస్తన్నాయని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో సైతం కుల దురహంకార హత్యలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. పెచ్చు మీరిపోతున్న అవినీతిని అడ్డుకోడానికి సిపిఎం ఎప్పుడూ పోరాడుతునే ఉంటుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు సిపిఎం నాయకులు బెల్లకొండ వెంకటేశ్, రంగు బాలకృష్ణ, బావండ్ల సత్తయ్య, గడీల లచ్చిరెడ్డి, సత్తిరెడ్డి, నర్సయ, ఉప్పలయ్య, అయిలయ్య, శివులు పాల్గొన్నారు.

గిరిజనుల నిధులను గిరిజనులకే ఖర్చు చేయాలి
జనగామ టౌన్, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు కేటాయించే నిధులను గిరిజనులకే ఖర్చు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మీట్యానాయక్ అన్నారు. శనివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో భూక్య మోతిలాల్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. గిరిజనులు పోరాటాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సాధించుకున్నామని అన్నారు. కానీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకు కేటాయించకుండా ఇతర సంక్షేమ పథకాలకు బదలాయిస్తున్నారని అన్నారు. సబ్‌ప్లాన్ నిధులు గిరిజనులకు అందక గిరిజన తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, నిరుద్యోగ యువత వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ ఆర్ ఇజి ఎస్ నుండి సీసీ రోడ్లకు నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు తండాలలో రోడ్డుపూర్తి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవులు, నర్సింహ, సురేష్, రమేష్‌లు పాల్గొన్నారు.
చలో ఢిల్లీని విజయవంతం చేయాలి
చేర్యాల, సెప్టెంబర్ 23: ఎస్సీ వర్గీకరణను చేపట్టక పోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 6న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంగయ్య కోరారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను చేపటడుతామని చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. మంద కృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 6న గజ్వెల్ నుండి ఢిల్లీ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడిపె బాల్‌నర్సయ్య, యాదగిరి, రాజెందర్ తదితరులు పాల్గొన్నారు.

వర్గీకరణను అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలు

బచ్చన్నపేట, సెప్టెంబర్ 23: దళితులకు ప్రయోజనాలు చేకూర్చే వర్గీకరణను రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని మాదిగ స్టూడెంట్ ఫోరం జిల్లా ఇన్‌చార్జి రాగళ్ల ఉపేందర్‌మాదిగ అన్నారు. ఎంఎస్‌ఎఫ్ చైతన్య సైకిల్ యాత్ర శనివారం సాయంత్రం బచ్చన్నపేటకు చేరుకుంది. ఎమ్మార్పీఎస్ మండళశాఖ అధ్యక్షులు గిద్దెల రమేష్, జిల్లా నాయకులు అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో యాత్రకు డప్పు వాయిద్యాలతో ఘనస్వాతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండల కేంద్రం నుంచి వెల్దెండ, కేశిరెడ్డిపల్లి, కొడువటూరు గ్రామాల మీదుగా బచ్చన్నపేటకు చేరుకున్న తమ సైకిల్ యాత్ర ఎనమిదవ రోజుకు చేరుకుందన్నారు. చివరగా నవంబర్ 7న ఢిల్లీకి చేరుకొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వర్గీకరణకు దూరమవుతున్నామని ఆరోపించారు. కేంద్రం నాన్చివేత ధోరణితో మాదిగల విశ్వాన్ని రెచ్చగొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామన్న బిజెపి ఇప్పుడు కిమ్మనక పోవడం విడ్దూరంగా ఉందన్నారు. కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఢిల్లీ కోటలో నవంబర్ 7న యుద్ద్భేరీ మోగించబోతున్నామని హెచ్చరించారు. వర్గీకరణకోసం చేపట్టిన ఈ పోరాటంలో మాదిగలు లక్షలాదిగా తరలిరావాలని పిలపునిచ్చారు. ఈ సైకిల్ యాత్రలో ఎంఎస్‌ఎఫ్ నాయకులు మహేష్, విజయ్, దయాకర్, అనిల్, మహేందర్, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పొలిట్‌బ్యూరోలో సీతక్కకు స్థానం
ములుగు టౌన్, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. 2004లో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీతక్క అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున బరిలోకి దిగారు. ఓటమి పాలైన సీతక్క పోరాట పటిమను గుర్తించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని అప్పగించింది. నియోజకవర్గంపై సీతక్క చేస్తున్న కృషిని గుర్తించిన చంద్రబాబు పొలిట్ బ్యూరో పదవిని అప్పజెప్పారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తనను గుర్తించడం గర్వంగా ఉందని తెలిపారు.
రాబోయే రోజుల్లో పార్టీ పఠిష్టతకోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

మేధావుల గొంతు నొక్కే ప్రభుత్వాలు నిలబడవు
వడ్డేపల్లి సెప్టెంబర్ 23: సమాజంలో మేదావులుయ విద్యావంతులు ప్రజా ఉద్యమకారులు గొంతు నొక్కే ప్రయత్నలు జరుగుతున్నాయని అలాంటి ప్రయాత్నాలతో ఏ ప్రభుత్వం నిలబడదని టిమాస్ రాష్ట్ర సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం భూపాల్‌పల్లిలో జరిగే టిమాస్ సమావేశానికి వెళ్తూ ములుగు రోడ్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసారు. ఆయన మాట్లాడుతూ ఉరోళ్ల బతుకమ్మ ముద్దు, దొరోళ్ల బతుకమ్మ వద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కవులు, కళాకారుల , ప్రజా నాయుకుల స్వేచ్ఛను హరించే విధంగా పాలనను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చ లేక, ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వాలు ప్రతి పక్షాలపై విమర్శలు చేస్తున్నాయన్నారు.

కాలనీలు మునిగిపోకుండా చర్యలు
వడ్డేపల్లి, సెప్టెంబర్ 23: వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాలలో పటిష్ట చర్యలు చేపట్టిందుకు అధికారులు కృషి చేయాలని నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఆదేశించారు . శనివారం నగరంలోని వర్షాకాలంలో ముంపునకు గురిఅవుతున్న ప్రాంతాలను అధికారులతో కలసి సందర్శించారు. శివనగర్, పోర్టరోడ్, మైసయ్య నగర్, ఆర్‌ఎస్ నగర్, చింతల్ ప్రాంతాలలో పర్యటించి వరద నీటితో కాలనీలు ముంపునకు గురికాకుండా నీటిని మళ్ళించడానికి నిర్మించాల్సిన కాలువల పై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో వర్షాకాలంలో ఎలాంటి ముంపునకు గురికాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ మరింత పరిశుభ్రంగా నిర్వహించాలని , రోడ్లపై చెత్తను వేయకుండా పలుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద గల నాలాను పరిశీలించి చెత్త నిర్వహణ, శుభ్రతపై మేయర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని , కాలనీలు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌లకు సూచించారు. అదే విధంగా చారిత్రక కాకతీయ కాలంనాటి మెట్ల బావి అభివృద్ధి పనులను పరిశీలించి, మెట్ల బావి చుట్టూ పది ఫీట్ల రోడ్ నిర్మాణం చేపట్టాలని, బావి చుట్టూ ఎపుడూ వెలుతురు ఉండేలా మంచి లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ చరిత్ర కల్గిన నగరం అని పురాతన కాలపు మెట్లబావికి రానున్న రోజుల్లో సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం వుంటుంది కాబట్టి సెక్యూరిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, సుందరీకరణ కోసం తగిన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యులు నన్ను చంపాలని చూశారు
పరకాల, సెప్టెంబర్ 23: ఆర్య వైశ్యులు తనను చంపే ప్రయత్నం చేశారని, తాను పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. తనను చంపే ప్రయత్నం వైశ్యులు చేశారంటూ ఆయన శనివారం సాయంత్రం పరకాల పోలీస్ స్టేషన్ సిఐ జానీ నర్సింహులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైశ్యులు తనపై కేసులు పెట్టుకోవచ్చు... కానీ ఇలా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. దేశంలో పెద్ద గుడి తిరుపతి అని తిరుపతి గుడి పూజారిగా అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన టి మాస్ సభలో పాల్గొన్ని వస్తుండగా పరకాల క్రాస్ సెంటర్ వద్ద వైశ్యులు రాళ్లతో, చెప్పులతో తనను చంపాలని ప్రయత్నం చేశారని చెప్పారు. దీంతో తాను పరకాల పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రొఫెసర్‌కు సంఘీభావం ప్రకటించిన నేతలు...
ప్రొఫెసర్ కంచ ఐలయ్య పరకాల పోలీస్ స్టేషన్‌లో ఉన్నారనే సమాచారం మేరకు అంబేద్కర్ యువజన సంఘం, టి మాస్, వివిధ దళిత వర్గాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కంచ ఐలయ్యకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రోఫెసర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రొఫెసర్ ఐలయ్యకు వైశ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుల రమేష్, క్రిష్ణారావు, సురేష్, దుప్పటి సాంబయ్య, బొచ్చు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఫిర్యాదు మేరకు 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు పరకాల ఎస్సై సుధాకర్ తెలిపారు.

వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతో అవసరం

నక్కలగుట్ట,సెప్టెంబర్ 23 : ఆత్మవిశ్వాసం పెంచడానికి, ఆత్మ రక్షణకు జూడో క్రీడలు ఎంతో అవసరమని తెలంగాణ జూడో అసోసియేషన్ గౌరవ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి అన్నారు. శనివారం అర్బన్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుండి ఐదు రోజుల పాటు వరంగల్‌లో జాతీయస్థాయి సబ్ జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. జూడో క్రీడల వలన వ్యక్తిత్వ వికాసానికి, మానసిక సామర్థ్యం, ఆత్మ విశ్వాసం పెంచడానికే గాక ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జూడో క్రీడను చిన్నతనంలో నుండే ఆడపిల్లలు నేర్చుకునే విదంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. జూడో క్రీడ ప్రాధాన్యతను గమనించిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1929 లోనే శాంతినికేతన్‌లోని పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ వివిధ క్రీడాసంఘూలను సమన్వయం చేసుకుంటూ, అందరి సహకారంతో ఈ పోటీలను విజయవంతం చేస్తామని తెలిపారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన వరంగల్‌ను క్రీడల హబ్‌గా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపల్ కమీషనర్ శృతి ఓజా మాట్లాడుతూ ఈ పోటీలకు వరంగల్ ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని జూడో క్రీడల వలన క్రమశిక్షణ పెరుగుతుందని ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీబి.కైలాసం యాదవ్, జాయింట్ కలెక్టర్ దయానంద్, జిల్లా క్రీడల అధికారి ధనలక్ష్మీ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉషా పాల్గొన్నారు

బతుకమ్మ సంబరాలలో కలెక్టర్

నెల్లికుదురు, సెప్టెంబర్ 23: చిన్నా పెద్దా భేదం లేకుండా ఊరు ఊరంతా ఆడపడుచులు బతుకమ్మలతో జాగృతి ఆధ్వర్యంలో మండలంలోని మునిగలవీడు గ్రామంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలతో, నృత్యాలతో హోరెత్తించారు. మనసంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పట్టుచీరలు ధరించి నగలతో మహిళలు మెరిసిపోయారు. బతుకమ్మ సంబరాలలో కలెక్టర్ ప్రీతిమీనాతోపాటు అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు, తెరాస ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆర్డివో కృష్ణవేణిలు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమీనా ఆడపడుచులతో కలసి బతుకమ్మ ఆడారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. తొలిసారిగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలను చూశానని, ఈ పండుగ తనకెంతో సంతోషాన్ని కల్గించిందని అన్నారు. ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్‌లకు కొత్త దుస్తులు పంపిణీ చేసే విధంగానే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు అందజేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంటరి మహిళలకు పెన్షన్‌లు ప్రవేశపెట్టిందని అన్నారు. అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తజిల్లాలను, మండలాలను ఏర్పాటు చేయడం మూలంగానే కలెక్టర్ ఇటువంటి ఉత్సవాలలో మారుమూల ప్రాంతాలలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్గిందన్నారు. బతుకమ్మ చీరలను మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం మహిళలకు అందిస్తుంటే దాన్ని రాద్ధ్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండడంతో అన్ని రంగాలలో జిల్లా పురోభివృద్ధి సాదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు వేణుగోపాల్, జాగృతి జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, మహిళా అధ్యక్షురాలు మాధవి, మండల అధ్యక్షులు గట్టు ప్రభాకర్, ఎంపిటిసి లక్ష్మి, జాగృతి నాయకులు మధుకర్, రవీందర్, చంద్రవౌళి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ నవీన్‌రావు, వివిధ కళాబృందాలు తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి
నెల్లికుదురు, సెప్టెంబర్ 23: చెరువలో స్నానానికి వెళ్లి జారిపడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని చిన్నముప్పారం శివారు పెద్దతండా సమీపంలోని మొగిలికుంట చెరువులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గూడురు మండలం గుండెంగ శివారు చర్లతండాకు చెందిన బొడ భద్రు(35) చిన్నముప్పారం మాజీ సర్పంచ్ సమ్మునాయక్ తల్లి మృతిచెందడంతో శనివారం దహనసంస్కారాల్లో పాల్గొనాడు. అనంతరం చెరువుకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తుజారీ పడి మృతిచెందినట్లు తెలిపారు.
రేషన్ దుకాణంలో
అక్రమ బియ్యం నిల్వల పట్టివేత
వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 23: మండల పరిధిలోని సూరివీడు గ్రామంలోని రేషన్ దుకాణంలో రేషన్ కార్డుదారులకు విక్రయించకుండా విక్రయించినట్టు రికార్డులను నమోదు చేసిన బియ్యం నిల్వలను తహశీల్దారు పాలకుర్తి భిక్షం తనిఖీ చేసి, స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ కోటా కింద ప్రభుత్వ సబ్సిడీ బియ్యం కార్డులకు విక్రయించినట్టు రికార్డులలో నమోదు చేశారు. ఈ మేరకు 11 క్వింటాళ్ళ 90 కిలోల బియ్యంను స్టాకు గోదాంలో పట్టుబడ్డాయి. రికార్డులలో మాత్రం 66 కిలోల బియ్యం నిల్వ ఉన్నట్లు నమోదు చేసి, సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకునేందుకు డీలర్ ప్రయత్నించినట్టు తహశీల్దారు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేయగా బియ్యం అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. బియ్యం దుకాణాన్ని సీజ్ చేసి, నిత్యావసర వస్తువుల చట్టం 6 ఏ కింద కేసు నమోదు చేసి, డీలరుకు నోటీసు జారీ చేసినట్లు, ములుగు సబ్ కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తహశీల్దారు భిక్షం విలేఖరులకు తెలిపారు.
పత్తి, వరి పంటలపై రైతులకు అవగాహన
నెల్లికుదురు, సెప్టెంబర్ 23: పత్తి, పసుపు, వరి పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి సింగెంటా ఆగ్రోకంపెనీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని చిన్ననాగారం, రాజులకొత్తపల్లి, జామతండా రైతులకు తారాసింగ్ బావి దుర్గమ్మదేవా ఆలయ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి సుధీర్ మాట్లాడుతూ.. సింగెంటా కంపెనీకి చెందిన ఫెస్టిసైడ్స్‌తో అధిక దిగుబడులు సాదిస్తారన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పత్తిపంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌అసిస్టెంట్ యాకన్న, రైతులు జన్నయ్య, యాకుబ్‌రెడ్డి, ఇస్మాయిల్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులను ఆదుకుంటాం
కమలాపూర్ ,సెప్టెంబర్ 23: చేనేత కార్మికులు బతికి చెడ్డవారని, వారిని అన్ని విధాల అదుకుంటామని రాష్ట్ర అర్థిక,పౌర సరఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో చేనేత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవం, సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ చేసి విధంగా ,చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధిలో పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. నాడు మహాసభలకు వేలాది మంది వచ్చేవారని, నేడు వందల మంది వసారన్నారు. యువత ఇతర సంఘాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. కార్మికులకు అధిక నిధులు కేటాయించి , భవానాలు నిర్మాణం చేపట్టామన్నార. ఈ కార్యమ్రంలో యంపిపి లక్ష్మణ్‌రావు, జడ్పీటిసి నవీన్‌తోపాటు,నాయకులు, చేనేత కార్మికులు పాల్గోన్నారు.

రెడ్డి పోరు పాదయాత్రను జయప్రదం చేయండి
నర్సంపేట, సెప్టెంబర్ 23: అక్టోబర్ 2న వేములవాడ నుండి ప్రారంభమయ్యే రెడ్డి పోరు పాదయాత్రకు గ్రామాగ్రామాన రెడ్డి కులస్థులు సంఘీభావం తెలిపి యాత్రను విజయవంతం చేయాల్సిందిగా రెడ్డి ఐక్యవేదిక ఉత్తర తెలంగాణ జిల్లాల కన్వీనర్ భూంపెల్లి రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని రెడ్డి కల్యాణ మండపంలో శనివారం రెడ్డి పోరు పాదయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా భూంపెల్లి రాఘవరెడ్డి మాట్లాడుతూ వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించి చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. యాబై సంవత్సరాల వయస్సు పైబడ్డ రైతులకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్ చెల్లించాలని, విద్యా, ఉద్యోగాల్లో వయోపరిమితి సడలించి, పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పదకొండు రోజుల పాటు 153 కిలోమీటర్లు సాగే రెడ్డి పోరుపాదయాత్రలో జిల్లా నలుమూలల నుండి రెడ్డి కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కాకతీయ రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి, ఎర్ర జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే రెడ్డి విద్యార్థులకు పది లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను అందించాలని అన్నారు.
అదే విధంగా విద్యుదాఘాతంతో మృతిచెందిన బాధిత రైతు కుటుంభాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త కంది తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు దామెర మహేందర్ రెడ్డి, కామిడి సతీష్‌రెడ్డి, కంది గోపాల్‌రెడ్డి, పల్లె శ్రీనివాస్‌రెడ్డి, గోగుల ప్రతాప్‌రెడ్డి, కట్కూరి జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మహిళలంటే అంత చులకనా?

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ భార్య, వారి కుటుంబసభ్యులు ఈ చీరలు కట్టుకొని బతుకమ్మ పండుగకు రావాలని భీమదేవరపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు కోడూరి సరోజన, భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు చిదురాల స్వరూప డిమాండ్ చేశారు. ముల్కనూర్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని మహిళలంతా అడుక్కొని తినడం లేదని, గౌరవంగా తలఎత్తి బతుకుతున్నారని, కేవలం ముఖ్యమంత్రి కుటుంబం తెలంగాణలోని మహిళలకు 50నుండి 60రూపాయల విలువగల చీరలు ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసారని విమర్శించారు. నాసిరకం చీరలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపడం సమంజసమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ మహిళలు వారికున్న అర్హత కేవలం 50, 60 రూపాయల వరకే అని సిఎం కుటుంబం మహిళలను మానసికక్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ మహిళలు రెండురోజుల పాటు ప్రభుత్వం ఇచ్చే చీరల కోసం కూలి పనులకు పోకుండా రేషన్ దుకాణాల వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఉన్నారని, కాని తెలంగాణ మహిళలు రెండురోజులు కూలికి వెళితే ఐదు వందల రూపాయల వచ్చేవని వీటితో విలువగల చీరెలు కట్టుకొని బతుకమ్మ పండుగను హాయిగా చేసుకునే వారని అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అప్పని పద్మ,మాడ్గుల కరుణ, మంద శైలజ, భూక్యా పద్మ, అజ్మీర ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మహిళా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలి

నర్సంపేట, సెప్టెంబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న మహిళా వ్యతిరేక విధానాలపై మహిళా లోకం ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగింటి రత్నమాల పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ జూనియర్ కళాశాలలో మద్యం వ్యతిరేక సదస్సు గుజ్జుల ఉమ, చొప్పరి పద్మ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈసందర్భంగా రత్నమాల మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. బిజెపి మనుధర్మ సిద్దాంతాన్ని అమలు చేస్తూ మహిళలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎంతమంది కనాలో ఆదేశిస్తుందని, మతోన్మాదాన్ని ప్రశ్నించిన ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేశ్వరిని హత్య చేసిందని అన్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారిత అంటే ప్రకటనలకే పరిమితం అయిందని, మహిళలు ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగల్లో తమ పాత్రను పోషించినప్పుడే సాధికారిత సాధ్యమని చెప్పారు. సిఎం కెసిఆర్ పాలన కుటుంబ పాలన మాత్రమేనని, మంత్రి వర్గంలో కనీసం ఒక మహిళకు కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమని వాపోయారు. గ్రామాల్లో ఉపాధి లేక అనేకమంది యువత, మహిళలు వలసలు పోతున్నారని, దళిత, గిరిజనులకు మూడు ఎకరాల సాగు భూమి అమలుకు నోచుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం మాట అటుంచి కనీసం పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను పంచితే సరిపోతుందని అన్నారు. జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ మాట్లాడుతూ నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఈసందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా కన్వీనర్‌గా వంగాల రాగసుధ, సభ్యులుగా సోల్తి శోభ, గుజ్జుల ఉమ, శోభ, పద్మ, మాలమ్మ, ప్రశాంతి, దివ్య, మాధవి, నిర్మల, అరుణ, కవితలను ఎన్నుకున్నారు.

పల్లెల్లో పుట్ట పూల బతుకమ్మ సంబురాలు

మహాదేవపూర్, కాటారం, సెప్టెంబర్ 23: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల సంబరాలు, రంగు రంగుల సీతాకోక చిలుకల సంబరాలు, పల్లెటూరు పాలపిట్ట పుట్ట శైలజ రాకతో అంబరాన్ని అంటిన పల్లె బతుకమ్మ ఉత్సవాలు. పారిజాతపు పువ్వుగా ఒదిగి ఎదిగిన మన బతుకమ్మ సంబరాలు. ఇవీ మంథని డివిజన్‌లో మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్, ఆయన సతీమణి, మంథని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పుట్ట శైలజ హాజరైన తీరుతో పరవశించిపోతున్న బతుకమ్మ సంబురాలు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరిట ఏర్పాటుచేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న బతుకమ్మ సంబరాలు. కాటారం, మహాదేవపూర్ మండలాలల్లోని పల్లె జనాలతో కలిసి శైలజ ఆడి పాడుతున్న బతుకమ్మ పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. శ్రమ జీవుల హృదయంలో కాస్తంత ఉపశమనం ఇవ్వడానికా అన్నట్టుగా శైలజ తనదైన శైలిలో ఆడపడుచులు, చిన్నారులతో ఆడి పాడుతున్న తీరు అందరినీ అలరిస్తోంది.
చిన్నా పెద్దా అనే తేడా లేదనడానికి తనతో పాటు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులైన కాటారంలో ఎంపిపి స్వప్న, వైస్ ఎంపిపి తోట రాధమ్మ, మహిళా విభాగం అధ్యక్షురాలు అయిత శకుంతల, మహాదేవపూర్ జడ్పిటిసి హసీనాబానో, ఎంపిపి వసంతలతో పాటు అందరితోనూ బతుకమ్మ ఆటలు ఆడటమే కాకుండా తనదైన శైలిలో పాటలు పాడి అందరినీ అశ్చర్యానికి గురిచేస్తున్నారు. మహాదేవపూర్ మండలంలో కుదురుపల్లి, కాటారం మండలంలో జాదరావుపేట, గూడూరులలో శైలజ బతుకమ్మ ఆటలను ఆడారు. ఈ కార్యక్రమాలలో కాటారం టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి కుమ్మరి అశోక్, పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టె శ్రీహరి, ప్రధాన కార్యదర్శి భూపెల్లి రాజు, వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు తుల్సెగారి శంకరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాయిత విఠల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కుడుదులు రాజబాపు, జిల్లా కమిటీ సభ్యురాలు కుంభం స్వప్న, సీనియర్ నాయకులు గంగిరెడ్డి లచ్చిరెడ్డి, చల్ల జక్కిరెడ్డి తదితరులు పాల్గొనగా, మహాదేవపూర్ మండలంలో టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు శ్రీపతి బాబు, యూత్ అధ్యక్షుడు చల్ల సమ్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అలీం ఖాన్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు లింగంపెల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, ట్రస్ట్ డివిజన్ కోఆర్డినేటర్ కుంభం రమేష్ రెడ్డి, కేదారి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.