వరంగల్

‘స్టాండప్ ఇండియా’ పేదల కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకం బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే అని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత, మైనార్టీ వర్గాలను భాజపాకు దూరం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని తెలిపారు. దళిత, మైనార్టీ, పేద ప్రజల అభ్యున్నతి కోసం నరేంద్రమోదీ స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. జిల్లాలో 40 మండలాలలో పూర్తిగా కరువు నెలకొని ఉండగా ప్రభుత్వం 11మండలాలనే ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కరువు పరిస్థితుల నివారణ కోసం 790కోట్ల రూపాయలను ప్రకటించగా, అందులో నుండి ఒక్కరూపాయి కూడ ఖర్చు చేయలేదని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జిల్లాలో ఈనెల 14నుండి 24వరకు అంబేద్కర్ వారోత్సవాలను భాజపా ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ప్రభుత్వ పథకాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పంచాయితీ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరూ ఆవిష్కరించలేదని, ఆ ఘనత భాజపాకే దక్కిందని కొనియాడారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా బలహీన వర్గానికి చెందిన కె. లక్ష్మణ్‌ను నియమించినందుకు అభినందనలు తెలియజేశారు. నేడు జిల్లాలోని పార్టీ నాయకులంతా రాష్ట్ర భాజపా అధ్యక్షుని కలిసి అభినందనలు తెలియజేయనున్నట్లు పేర్కోన్నారు. ఈనెల 11న జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని నాయకులు సకాలంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దిలీప్‌నాయక్, కొత్త ధశరథం, రమణారెడ్డి, సునీల్, త్రిలోకేశ్వర్, కీర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ పరిజ్ఞానంతో
సైబర్ నేరగాళ్లకు చెక్
రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఏప్రిల్ 9: సైబర్ నేరాలకు పాల్పడే నిందితులను గుర్తించే విధంగా పోలీసులు కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించాలని వరంగల్‌రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ సిబ్బందికి సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నేరాలకు పాల్పడే నిందితులను గుర్తించే విధానంపై వరంగల్ కమిషనరేట్, రూరల్ పోలీస్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ తరగతిని శనివారం స్థానిక వాగ్దేవి కళాశాలలో నిర్వహించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఒక రోజు శిక్షణ తరగతిని వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో సైబర్ నేరాలను అరికట్టడంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని కొద్దిమంది సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడడం జరుగుతోందని, ఇలాంటి నేరాలను గుర్తించడంతో నేరాలకు పాల్పడే నిందితులను ప్రస్తుత ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గుర్తించే విధాన పద్ధతులపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలు జరిగిన విధానంతో పాటు నేరాన్ని గుర్తించడంలో అవలంబించాల్సిన విధి విధానాలతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానం, నేర పరిశోధన తీరుతెన్నులతో పాటు ప్రస్తుత పరిస్థితులలో నేరాలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న కాల్ డిటేల్ రిపోర్టును మరింత వేగవంతంగా విష్లేషించాలన్నారు. నేరస్థులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం కోసం అనుసరించాల్సిన నూతన పద్ధతులపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏసిపి శోభన్‌కుమార్, రూరల్ డిసి ఆర్‌బి ఇన్‌స్పెక్టర్ బాలాజీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రంజిత్‌కుమార్, రమేష్‌తో పాటు వరంగల్ పోలీసు కమిషనరేట్, రూరల్ ఐటి కోర్ టీం సభ్యులు పాల్గొన్నారు.

కమీషన్ల కోసమే ‘మిషన్’లు
మిషన్ కాకతీయ, భగీరథలపై వరంగల్ తెలంగాణ ప్రజాఫ్రంట్ రెండవ మహాసభలో నేతల ఆరోపణ
మేధావులంతా ముఖ్యమంత్రి కెసిఆర్ మెప్పు కోసమే పాకులాట * ఓపెన్‌కాస్టులను వెంటనే రద్దు చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఏప్రిల్ 9: కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు దండుకునేందుకే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్ జిల్లా రెండో మహాసభ శనివారం హన్మకొండలో ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు బి.రమాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాసులకు కక్కుర్తిపడి అనేక పథకాల రూపకల్పనలో సాగుతున్నాడన్నారు. మేధావులంతా కెసిఆర్ మెప్పుకోసం పాకులాడుతున్నారని, ప్రజల కోసం పని చేసే ప్రజాఫ్రంట్ లాంటి సంఘం ఈ సమాజంలోని అన్ని వర్గాల ప్రజాసంఘాలు, ప్రజలను ఐక్యం చేసి ప్రత్యామ్నాయ వేదికగా నిలిచి ఆకాంక్షలను, వనరులను కాపాడుకోవాలని ఆయన కోరారు. టిపిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ నేడు ప్రాజెక్టులు రీడిజైనింగ్, కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే సొమ్ము చేసుకోవడానికేనని అన్నారు. వరంగల్‌లో బిల్ట్ కర్మాగారం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటివి ఓపెన్ చేయకుండా హామీలు ఇవ్వడం, విస్మరించడం ఆనవాయితీగా మారిందన్నారు. టెక్స్‌టైల్ పార్కులో అజంజాహి మిల్లు కార్మికులకు పని దొరుకుతుందని ఆశించినా కార్మికుల ఆశలు నీరుగార్చే విధంగా పాలసీలు తెస్తున్నాయన్నారు. టిపిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం గత పాలకుల విధానాలనే కొనసాగిస్తూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులపై స్థానికులకే అధికారం ఉండాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో సెక్షన్ 30 ప్రకారం పౌరహక్కుల అణచివేతే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పడితే ఎన్‌కౌంటర్లే ఉండవన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి ఎన్‌కౌంటర్లకు తెర లేపాడన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేద, దళిత వ్యతిరేకిగా మారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ సభలో పలు తీర్మాణాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఓపెన్‌కాస్టును వెంటనే రద్దు చేయాలని, కంతనపల్లి ప్రాజెక్టు నిలిపివేత అధికారికంగా ప్రకటించాలని ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని అక్రమ ఇసుక తరలింపును నిలిపివేయాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, భూమిక, ప్రియాంకల హత్య మీద న్యాయవిచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ తీర్మాణాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్, అమరుల బంధుమిత్రుల సంఘం పద్మకుమారి, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, పౌర హక్కుల ప్రధాన కార్యదర్శి నారాయణరావు, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షుడు కత్తెరపల్లి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

పథకాలు అద్భుతం
నియోజకవర్గానికి 2,600 డబుల్ బెడ్‌రూమ్‌లు * ఎమ్మెల్యే రాజయ్య
లింగాలఘణపురం, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అద్భుతమైనవని 29 రాష్ట్రాలు గొప్పగా చెబుతున్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని నేలపోగుల గ్రామంలో చారబుడ్డి కమలారెడ్డి చెరువును చారబుడ్డి శేఖర్‌రెడ్డి దత్తత తీసుకొని రూ.47.40లక్షల వ్యయంతో మిషన్ కాకతీయ పనులను చేపట్టగా శనివారం ఎమ్మెల్యే డా. రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో గ్రామాలకు పూర్వవైభవం రానుందని, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ పవిత్రమైన గోదావరి నీరు అందించడం జరుగుతుందన్నారు. అలాగే నియోజకవర్గంలో 2600ల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అందిస్తామని ఆయన తెలిపారు. చెరువును దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన చారబుడ్డి శేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పయనంలో సాగుతాయని అన్నారు. నేలపోగుల గ్రామంలో ఎస్సీ, బిసి కాలనీల్లో సిసి రోడ్ల నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

వడదెబ్బకు ముగ్గురు మృతి
పరకాల/గణపురం/ కురవి, ఏప్రిల్ 9: ఎండలు ఠారెత్తిస్తున్నాయ. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 41 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయ. జిల్లాలో శనివారం మరో ముగ్గురు వడదెబ్బకు అస్వస్థతకు గురై మరణించారు. పరకాల మండలంలోలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. పట్టణంలో ఒకరు మృతి చెందగా గణపురం మండలంలో మరోకరు మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల పట్టణం మాదారం కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ పసుల సమ్మయ్య (65) వడదెబ్బకు గురై మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సమ్మయ్యకు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన సమ్మయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పోశమ్మ, 4గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గణపురం మండలం కర్కకపల్లిలో వడదెబ్బ తగిలి శనివారం వ్యవసాయ కూలీ మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ కూలీ రాజలింగు (65) వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన రాజలింగును వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతునికి భార్య పోచమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వడదెబ్బ తగిలి తేనె వెంకన్న(44) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన కురవి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. కురవికి చెందిన వెంకన్న పండుగ సందర్భంగా బేతోల్‌లోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఎండదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం కురవికి తీసుకువస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మిషన్ కాకతీయతోనే...
చెరువులకు మహర్దశ
* పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఏప్రిల్ 9: మిషన్ కాకతీయతోనే చెరువులకు మహర్దశ వస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాల మండలం కంఠాత్మకూర్ గ్రామంలో మిషన్ కాకతీయ పథకంలో ఈదుల చెరువు రూ. 54 లక్షలతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెరువు పూడికతీత పనులను ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తు ప్రజలు భాగస్వామ్యంతో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. ఈ పథకాలు అర్హులందరికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

నత్తనడకన ‘మిషన్ కాకతీయ’
అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే మిషన్‌కాకతీయ పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మిషన్ కాకతీయ రెండోదశ పనులను గత నెల 24వ తేదీన వరంగల్‌లో ప్రారంభించారు. జిల్లాలో 313 కోట్లతో మిషన్ కాకతీయ రెండోదశ కింద 524 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదన అనుమతులు మంజూరైనప్పటికి ఇప్పటి వరకు 150 చెరువుల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. మిగతా చెరువులు అగ్రిమెంట్ బేస్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం జూన్ 2వ వారంలోగా మిషన్ కాకతీయ రెండోదశ పనులు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికి 524 చెరువుల్లో 150 చెరువులు మాత్రమే పనులు జరుగుతున్నాయి. గత ఏడు 418కోట్లతో మిషన్ కాకతీయ మొదటి దశ కింద 1075 చెరువుల పనులు చేపట్టవలసి వుండగా మొదటి దశలోనే 355 చెరువులు అనుకున్న సమయానికి పూర్తికాలేకపోయాయి. రెండో దశలోకూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ విషయంపై అధికారులను అప్రమత్తం చేసినప్పటికి పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జూన్ రెండోవారానికి టార్గెట్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడు ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా పండుతాయని పండితులు చెపుతున్నారు. అనుకున్న సమయానికి మిషన్ కాకతీయ పనులు పూర్తయితేనే చెరువులకు జలకళ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.