వరంగల్

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన విజయవంతం కావటంతో అటు జిల్లా అధికార యంత్రాంగం, ఇటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగ సభకు భారీగా జనాలు తరలిరావటంతో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హమ్మయ్య అనుకున్నారు. ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణపై అధికారులకు, ప్రజాప్రతినిధులు, నాయకులకు కితాబు ఇవ్వటంతో సంబురపడిపోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికార యంత్రాంగం 15రోజులుగా ఏర్పాట్లు ప్రారంభించింది. వారం రోజుల నుంచి అయితే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రతిరోజు మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం జరిగే ప్రాంతాన్ని సందర్శించి శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తు వచ్చారు. గతంలో వరంగల్ నగరంలో జరిగిన పార్టీ మహాసభకు ఆశించిన మేరకు జనం రాకపోవటంతో పార్టీముఖ్యులకు కెసిఆర్ చీవాట్లు పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బహిరంగ సభ ఏర్పాట్లు, జనాల తరలింపుపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యుల ప్రత్యేకదృష్టి పెట్టారు. జనాల తరలింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు. ఫలితంగా భారీగా జనాలు తరలిరావటంతో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన చేయవలసిన శాయంపేటకు చేరుకోవలసి ఉండగా సుమారు 50నిముషాల ఆలస్యంగా వచ్చారు. హెలీప్యాడ్ వద్ద సిఎంకు ఉపముఖ్యమంత్రి కడియం, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి కెటి రామారావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం వివిధ నిర్మాణాలకు చెందిన శంకుస్థాపనలు వెంటవెంటనే పూర్తిచేసి బహిరం సభ వేదికపైకి సిఎం చేరుకున్నారు. సమయాభావం కారణంగా ఉపముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రి కెటిఆర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఆ తరువాత ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో సాయంత్రం 5.15 ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని టైం ఎంతయిందని అడిగి తెలుసుకుని.. ఆ వెంటనే తన ప్రసంగాన్ని ముగించి హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగ సభకు హాజరైన ప్రజానీకానికి మార్గమధ్యంలోనే ఆహారం ప్యాకెట్లు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందచేసారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా జనాలను సమీకరించటంతో వరంగల్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి బహిరంగ సభ జరిగే శాయంపేట వరకు మార్గమద్యంలో పలుమార్లు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రధాన మార్గం నుంచి శాయంపేటకు వెళ్లే రోడ్డు సింగిల్ రోడ్డు కావటం, వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. తిరుగుప్రయాణంలో 12కిలోమీటర్ల దూరాన్ని తిరిగి చేరుకునేందుకు ట్రాఫిక్ జాం కారణంగా గంటన్నర సమయం పట్టింది.
సిఎం సభకు తరలిన ఆర్టీసి బస్సులు
వరంగల్ రూరల్ జిల్లాలో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు జనాలను తరలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులను మళ్లించటంతో సామాన్య ప్రయాణికులు నానాఅవస్థలు పడ్డారు. శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపనతోపాటు మరికొన్ని పథకాల శంకుస్థాపనలు జరిపి, అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు భారీగా జనాలను తరలించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రయత్నాలు చేపట్టారు. జిల్లాలోని అన్ని డిపోలకు చెందిన 750బస్సులను అద్దెకు తీసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులను కూడా అద్దె ప్రాతిపదికన ఇక్కడికి తెప్పించారు. వీటితోపాటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు, టాటా-ఎసి వాహనాలు, ఇతర ప్రైవేటు బస్సులను కూడా జనాల తరలింపునకు వినియోగించుకున్నారు. ప్రతి గ్రామానికి కనీసంగా రెండు బస్సులు ఏర్పాటు చేసి జనాలను బహిరంగ సభ ప్రాంతానికి తరలించారు. బస్సులన్నీ సిఎం బహిరంగసభకు వెళ్లిపోవటంతో ఆదివారం ఇంచుమించుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసి సర్వీసులన్నీ రద్దయ్యాయి. హైదరాబాద్‌కు బస్సులను మామూలుగానే నడిపినా, ఇతర ప్రధాన రూట్లలో కూడా అవసరాల మేరకు బస్సులు అందుబాటులో లేక ప్రయాణికుల అవస్థలకు గురయ్యారు. సిఎం పర్యటన కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బస్సుల రాకపోకలు నిలచిపోవటంతో ఇతర జిల్లాల నుంచి ఆర్టీసి బస్సులను వివిధ రూట్లలో నడిపించి కొద్దిలో కొద్దిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసారు. గ్రామీణ సర్వీసులు రద్దు కావటంతో ఆర్టీసి అధికారులు కొన్ని రూట్లలో నడిచిన ఎక్స్‌ప్రెస్ బస్సులలో నిర్ధారిత స్టేజీల వరకు టికెట్ తీసుకుని ముందు స్టేజీలలో దిగేందుకు అవకాశం కల్పించారు.
బొకేలను తిరస్కరించిన సిఎం
ముఖ్యమంత్రి మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రజాప్రతినిధులు ఇచ్చిన బొకేలను తీసుకునేందుకు తిరస్కరించారు. హెలీప్యాడ్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతు బొకేలు అందచేయబోగా సిఎం ఇలా ముట్టుకోగానే.. సెక్యూరిటీ సిబ్బంది వాటిని తీసేసుకుని వెనక్కి పారేసారు. బహిరంగ సభ వేదికపైకి ముఖ్యమంత్రి వచ్చీరావటంతోనే పలువురు ప్రజాప్రతినిధులు బొకేలు అందించేందుకు పోటీపడగా సిఎం వాటిని సున్నితంగా తిరస్కరించటంతో వెనక్కి తిరిగారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బహిరంగ సభ వేదికకు పక్కనే కళాకారుల ప్రదర్శన కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసారు. ముఖ్యమంత్రి రావటంతోనే కళాకారులు తమ వేదికను ఖాళీచేసి వెళ్లిపోగా, జనాలు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి నిలుచుకున్నారు. కానీ జనాలు ఎక్కువ సంఖ్యలో వేదికపైకి ఎక్కటంతో వేదిక కూలిపోయే ప్రమాదాన్ని గమనించి ఉపముఖ్యమంత్రి సూచనల మేరకు పోలీసులు వేదికపైనుంచి జనాలను కిందకు దింపే ప్రయత్నం చేసారు. జనాలు కిందకు దిగినట్టే దిగి మళ్లీ పైకి చేరటం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటంతో ఏమి చేయలేకపోయారు. ఇది గమనించి పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అదనపు పోలీసు సిబ్బందిని పంపించి వేదికను ఖాళీ చేయించారు. బహిరంగ సభ వేదిక ముందున్న ఒక భారీ కటౌట్‌పైకి ఒక వ్యక్తి ఎక్కడాన్ని గమనించిన అధికార పార్టీ నాయకులు ఆయనను కిందకు దిగాలని, లేకుంటే కటౌట్ పడిపోయే ప్రమాదం ఉందని చెప్పినా, ఆయన కిందకు దిగకపోవటంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని కిందకు దింపారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంలో వేదిక ముందు ఏర్పాటుచేసిన వీడియో కెమెరా జనాల వైపు తిరిగిన ప్రతి సందర్భంలో జనాలు ఉత్సాహంతో కేకలు వేయటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ చిరాకుపడి వీడియో జనాలవైపు తిప్పటం ఆపివేయాలని ఆదేశించారు. వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని, పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని, పరకాల నియోజకవర్గానికి 50కోట్లు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించగా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.