వరంగల్

బంగారు తెలంగాణ ప్రయత్నం వరంగల్‌తోనే షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం వరంగల్ జిల్లాతోనే మొదలవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి రూపుదిద్దింది స్వర్గీయ ఆచార్య జయశంకర్ అయితే.. ఉద్యమానికి ఊపిరి పోసింది పోరుగడ్డ వరంగల్ అని అన్నారు. హైదరాబాద్ తరువాత వరంగల్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గీసుకొండ మండలం శాయంపేట వద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం శంకుస్థాపన చేసారు. అదే విధంగా వరంగల్ నగర శివారులో నిర్మించే ఔటర్ రింగురోడ్డుకు, కాజీపేట వద్ద నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, మడికొండ వద్ద ఏర్పాటుచేసే రెండవ దశ ఐటి పార్కు ఇంక్యుబేషన్ సెంటర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడిన ఆజంజాహి మిల్లును తలదనే్నలా మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంతో జిల్లాలోని చేనేత కార్మికుల దశ, దిశ మారిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎక్కువయిపోయాయని, ఇక రాష్ట్రానికి వచ్చే విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటులో వరంగల్‌కు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వరంగల్‌ను వివిధ రంగాలలో అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా మూతపడిన మామునూరు ఎయిర్‌పోర్టును రెగ్యులర్ అవసరాలకు అవకాశం లేకున్నా పారిశ్రామిక అవసరాల కోసం అవసరమైతే రాష్ట్రప్రభుత్వ నిధులతో తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆదేశాలు త్వరలో ఇస్తామని చెప్పారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా 50కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ఏకరువుపెడుతూ కెసిఆర్ అనే వ్యక్తి బతికున్నంత కాలం పేదలకు ఎటువంటి లోటు రానివ్వడని, రైతులు గౌరవంగా బతికేలా చూస్తానని అన్నారు. భగవంతుని దయ, ప్రజల మద్దతుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని చెప్పారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని, ఆ మేరకు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. స్థానికంగా ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వెళ్లిన చేనేత కార్మికులు మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దశాబ్దాల కిందటే వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఆజంజాహి మిల్లు పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడిందని, వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేసినా ఆజంజాహి మిల్లును తిరిగి తెరిపించలేకపోయారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లాలో ఏర్పాటవుతున్న మెగా టెక్స్‌టైల్ పార్కుతో చేనేత రంగానికి మంచిరోజులు వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి మంజూరయ్యే ఐఐఎంను వరంగల్‌లో ఏర్పాటుచేయాలని కడియం కోరారు. వరంగల్ ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులను అభినందించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును కాలుష్యరహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్కులో భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పార్కు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని అన్నారు.
పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, చేనేత, జౌళిశాఖ కమీషనర్ శైలజారామయ్యర్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.