వరంగల్

పాత హామీలు మరవటం.. కేసిఆర్‌కు మామూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 23: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటన సందర్భంగా కొత్త హామీలు ఇవ్వటం ద్వారా పాత హామీలను పక్కన పెట్టడం ఆనవాయితీగా మారిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు, హామీలతో ప్రజలకు కడుపు నిండినట్టు అనిపిస్తున్నా, హామీలు అమలుకు నోచుకోకపోవటంతో కడుపు మండుతోందని అన్నారు. సోమవారం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి మాట్లాడుతు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా జిల్లాప్రజలకు ఎన్నో వరాలు కురిపిస్తారని ఆశించారని, కానీ వరాల సంగతి అటుంచి ముఖ్యమంత్రి ప్రసంగమే పేలవంగా సాగిందని అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూంల కట్టిస్తామని ఇచ్చిన హామీపై స్పష్టమైన వివరణ ఇస్తారని ఆశించామని, కానీ ముఖ్యమంత్రి దీనిపై నోరు మెదకపపోవటాన్ని గమనిస్తే డబుల్ బెడ్‌రూం పథకంపై ప్రభుత్వం చేతులెత్తివేస్తోందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. 2015లో వరంగల్‌లో మూడురోజుల మకాం వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ నగరానికి ఎన్నో వరాలు ప్రకటించారని, కానీ వాటి అతీగతి లేదని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో 500జనాభా ఉన్న ప్రతి గిరిజన, లంబాడీ తండాను గ్రామపంచాయతీగా మారుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మూడున్నర సంవత్సరాలుగా ఈ విషయాన్ని పట్టించుకోకుండా, వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ పంచాయతీల పాట పాడుతున్నారని ఎద్దేవా చేసారు. రూరల్ జిల్లా పరిధిలో మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అసలు వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటుచేస్తారనేది ప్రకటించకపోవటం శోచనీయమని అన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను బహిరంగంగా మోసం చేయటం కెసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. ఇప్పటి వరకు పలు సందర్భాలలో పలు పథకాలకు ముఖ్యమంత్రి భారీగా నిధులు ప్రకటిస్తు వచ్చారని, కానీ ప్రకటించిన నిధులు విడుదల చేయటంలో మొండిచేయి చూపుతున్నారని ఆరోపించారు.
సాగునీటి పథకాలు, ఉద్యోగాల నియామకాలలో ప్రభుత్వం సమస్యలు సృష్టించి నష్టపోతున్న బాధితులు కోర్టులకు వెడితే ప్రతిపక్షాల కుట్రగా ఆరోపించటం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని చెప్పారు.
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా జోనళ్లు ఏర్పాటుచేస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ నియామకాలు మాత్రం పాతపద్ధతిలోనే జరపాలని డిమాండ్ చేసారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి అశోక్, రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి, వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ పార్టీ ఇన్‌చార్జ్‌లు కుమారస్వామి, జైపాల్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.