వరంగల్

సబ్సీడీ గొర్రెల యూనిట్ల ’గోల్ మాల్‌‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను బలోపేతం చేసేందుకు వీలుగా గొల్ల, కురుమలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల యూనిట్ల పథకం ఆదిలోని పక్కదారి పడుతోంది. ఇప్పటికే తమకు నాసిరకం గొర్రెలను అందిస్తున్నారని ఓ వైపు రైతులు గగ్గోలు పెడుతుండగా మరో వైపు దళారులు రంగ ప్రవేశం చేసి గ్రౌండింగ్ అయిన గొర్రెలను కారుచౌకగా కొనుగోలు చేస్తూ మళ్లీ గ్రౌండింగ్ కోసం విక్రయిస్తున్నారు. ఈక్రమంలో లక్షల రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గ్రౌండింగ్ అయిన సబ్సిడీ గొర్రెలను ఎవరైనా కొనుగోలు చేసి మళ్లీ విక్రయిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. దళారులు మాత్రం ప్రభుత్వ మాటలు బేఖాతరు చేస్తూ యధేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా చేసుకుంటూ లక్షల రూపాయలను వెనుకేసుకుంటున్నారు. నర్సంపేట డివిజన్‌లో సబ్సిడీ గొర్రెల దందా చెన్నారావుపేట మండల కేంద్రంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. గ్రామాల్లో సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం గొల్ల, కుర్మలు సొసైటీలను ఏర్పాటు చేసుకున్నారు. రెండు విడతల వారీగా గొల్ల, కుర్మలకు గొర్ల యూనిట్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక పొటేలుతో సహా 20 గొర్రెలు గల యూనిట్‌కు ప్రభుత్వం లక్షా 20వేల రూపాయలుగా ప్రకటించింది. లబ్ధిదారుడు తన వాటాగా 31250 రూపాయల డీడీని చెల్లిస్తే ప్రభుత్వం యూనిట్ మంజూరు చేస్తోంది. నర్సంపేట డివిజన్‌లోని కొన్ని గ్రామాలకు మొదటి విడతలో దాదాపు 60 శాతం గొర్రెల యూనిట్లు మంజూరు అయ్యాయి. ఈ గొర్రెలను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కొనుగోలు చేసి తెప్పించి రైతులకు అప్పగించాలని ప్రభుత్వం తగిన ఆదేశాలను జారీ చేసింది. కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన లబ్ధిదారులకు అనంతపురం నుండి గొర్రెలను అధికారులు తెప్పిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బియ్యం రీసైక్లింగ్ ఎలా జరుగుతోందో అదే తరహాలో గొర్రెలను సైతం రీసైక్లింగ్ చేస్తున్నారు. లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేసిన గొర్రెలను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే తిరిగి మరో లబ్ధిదారుడికి గ్రౌండింగ్ చేస్తూ లక్షల రూపాయలను కాజేస్తున్నారు. వీరికి కొంత మంది వైట్ కాలర్ల బాబులతో పాటు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. చెన్నారావుపేట మండల కేంద్రంగా ఇద్దరు వ్యక్తులు ఈ దందాలో రాటుతేలినట్టు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం పాపయ్యపేటలో లబ్ధిదారులకు గ్రౌండింగ్ అయిన 90 సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేసిన ఇద్దరు దళారులు చెన్నారావుపేటలోని తమ ఇంట్లో పెట్టుకున్నారు. దీనిపై విలేఖరులతో పాటు పోలీసులకు సమాచారం తెలియడంతో బెంబేలెత్తిపోయిన ఇద్దరు దళారులు తిరిగి ఆ గొర్రెలను పాపయ్యపేటకు పంపించి తాము ఇచ్చిన డబ్బులను తీసుకున్నట్టు సమాచారం. పోలీసులు సైతం దళారులను తీవ్ర స్థాయిలో మందలించినట్టు తెలియవచ్చింది. ఇక మీద ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. పదిహేను రోజుల క్రితం గురిజాల సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న గొర్రెలను కొందరు పట్టుకోగా దళారులు వారికి కొంత ముట్టజెప్పి కాళ్లా వేళ్లా పడి గొర్రెలతో సహా ఉడాయించిన విషయం పట్టణంలో ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది. సబ్సిడీ గొర్రెల గోల్ మాల్‌పై అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. సబ్సిడీ గొర్రెల యూనిట్లు లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయా అనే విషయంపై ప్రభుత్వం విజిలెన్సు విచారణ చేపడితే గొర్రెల యూనిట్లులో జరిగిన కుంభకోణంపై భారీ ఎత్తున వెలుగు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో గొర్రెల దందాలో ఉన్న దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థులకు జేసీ పరామర్శ
ఆత్మకూరు, నవంబర్ 20: మండలంలోని పెద్దాపురం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రభుత్వ గురుకుల పాఠశాలను జాయింట్ కలెక్టర్ హరిత సోమవారం సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్ధులను పరామర్శించారు. ఆదివారం ఫుడ్‌పాయిజన్‌తో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో స్పందించిన జేసీ, డిప్యూటటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ, ఫుడ్ ఇన్స్‌పెక్టర్లతో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను పరిశీలించిన జేసి పాఠశాల ప్రిన్సిపల్ వరలక్ష్మీ నుండి వివరాలను సేకరించారు. విద్యార్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికపుడు సమాచారం ఉన్నతాధికారులకు తెలపాలని అదేశించారు. ఆహారాన్ని పరిశీలించిన తరువాతే విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ డిఎస్ వెంకన్న, సర్పంచ్ స్వరూప, విఆర్‌వో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల నిరసన దీక్ష
గూడూరు, నవంబర్ 20: శ్రీ సమ్మక్క, సారలమ్మ ఆదివాసీ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో క్వారీ అనుమతికి తహశీల్దారు కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ గూడూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బొల్లి సారయ్య, తాటి సునిల్‌లు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు ఇక్కడ మాట్లాడుతూ.. గ్రానైట్‌లీజు కొరకు 2013లో దరఖాస్త్తు చేసుకోగా అప్పటి ఏడి మూడు నెలల క్రితం మండల తహశీల్దారుకు లేఖ పంపించారన్నారు. అయినా ఇప్పటి వరకు అనుమత ఇవ్వడంలేదని వారు వాపోయారు. క్వారీ ఓపెన్ అయితే 30కుటుంబాలకు దానిలో ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు జీవానాధారమైన క్వారీ అనుమతికి చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షకు స్పందించిన తహశీల్దారు ఎన్‌ఒసి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీంతో దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దీక్షకు తుడుందెబ్బ సంక్షేమ పరిషత్ పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. ఈ వారంలోగా పనులు ప్రారంభ కాకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడిగె భద్రయ్య, సారయ్య, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.