వరంగల్

కలుషిత ఆహారంతో విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, డిసెంబర్ 14:వరంగల్ నగరంలోని శంభునిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. మైనార్టీ పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థినులు గురువారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. అల్పాహారంలో విద్యార్థులకు వడ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అల్పాహారం తీసుకున్న విద్యార్థినులు అందరూ కడుపునొప్పితో బాధపడుతుండగా వారిని వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. 44 మంది విద్యార్థినులు అస్వస్థకు గురికాగా, అందులో 37 మంది విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు అందించి పంపించారు. మిగిలిన ఏడుగురు విద్యార్థులకు ఎంజిఎంలో చికిత్స అందిస్తున్నారు. ఎంజిఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పరామర్శించి, విద్యార్థినులను ఏమి జరిగిందని ఆరా తీశారు. కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులకు ఆమె స్వయంగా ఫోన్ చేసి విషయం తెలిపారు. అనంతరం వారిపై పరిస్థితి డాక్టర్లను అడిగి తెసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె విద్యార్థులకు ఇచ్చే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, ఆహారం కలుషితం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థినులకు కావలసిన అన్ని రకాల వైద్య సేవలు తక్షణమే అందించాలని ఆమె డాక్టర్ల బృందాన్ని కోరారు.

తెలుగు భాష ఖ్యాతిని చాటుదాం

పరకాల, డిసెంబర్ 14: తెలుగు భాష ఖ్యాతిని చాటాలని పరకాల ఏసీపీ సుధీంద్ర, వరంగల్ రూరల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్ అన్నారు. గురువారం పరకాల శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరకాల ఏసీపీ సుధీంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృభాష వికాసం కోసం కృషిచేద్దామని పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లో తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడం భాషా పరిరక్షణలో భాగమేనని గుర్తు చేశారు. అమ్మ భాషను ఆదరిద్దామంటూ వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నినదించారు. ఈ కార్యక్రమంలో పరకాల జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, వారోత్సవాల కన్వీనర్ కాటూరి శ్రీ్ధరాచార్య, లైబ్రేరియన్ రాజేంద్రప్రసాద్, మడికొండ సంపత్‌కుమార్, మార్త రాజభద్రయ్య, యెడ్ల సుధాకర్, సూర రాజేందర్, అడప రాజు తదితరులు పాల్గొన్నారు.
మహాసభలను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ఈనెల 15 నుండి 19 వరకు నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు కామిడి సతీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పరకాలలో రూరల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాసుల రవికుమార్, పాకాల శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ తెలుగుభాషకి, తెలంగాణ మాండలీకానికి పూర్వవైభవం దక్కుతుందన్నారు. మన మాతృభాష తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఎంతగానో ఉందన్నారు. తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర జిల్లాల కమిటీల నుండి సుమారు 200 మంది వరకు కవులు, రచయితలు ప్రపంచ తెలుగు మహాసభకు తరలి వెళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు పాల్గొన్నారు.
తెలుగుభాష గొప్పదనాన్ని చాటిన విద్యార్థులు
ఆత్మకూరు: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుభాష వైభవం, గొప్పదనాన్ని దామెర మండలం వెంకటాపుర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకాశవాణి కేంద్రంలో ప్రత్యేక కదంబ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు ఔన్నత్యాన్ని తెలిపే పాటలు కవితలు, తెలంగాణ కవుల గురించి అభ్యుదయ కవుల కవితలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత రూపొందించిన ఈ కార్యక్రమం ఆదివారం ఎఫ్‌ఎం రేడియోలో ప్రసారం అవుతుందని తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు
ప్రజలు చైతన్యవంతులు కావాలి
* రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఫణికుమార్
కెయు క్యాంపస్, డిసెంబర్ 14: కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు దివంగత ఫ్రొఫెసర్ పి.ఎ జెమ్స్ 13వ స్మారకోపాన్యాసం గురువారం సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అధ్యక్షత వహించగా, ముఖ్యవక్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఫణికుమార్ పాల్గొని, ప్రజాస్వామ్యాన్ని పీడిస్తున్న సమస్యలు అనే అంశంపై ప్రసంగించారు. తొలుత పిఎ జెమ్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యవక్త కీలకోపన్యాసం చేస్తూ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే ప్రతి పౌరుడు చైతన్యవంతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రధాన అంగాలయిన శాసనసభలు, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థ రాజ్యంగ పరిధిలో పనిచేయాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్యం ముందుకు సాగదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒడంబడిక కొనసాగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అత్యల్ప ఓట్లతో గెలిచిన ప్రజాపతినిధులు పరిపాలన చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే, పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజల మద్దతు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నరని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో పౌరులకు అనేక హక్కులు పొందుపరచినా, వాటిని ప్రజలు పొందలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ రాజకీయ సాధికారత కాకుండా ప్రజాస్వామ్యయుతంగా సామాజిక, ఆర్ధిక, కుటుంబ స్థితిగతులు మొదలగు ఆంశాలపైన ప్రజాప్రతినిధులు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.పాణి, ప్రొఫెసర్ టివి సుజాత కుమారి, డాక్టర్ పి శ్రీనివాస్‌రావు, విశ్రాంతాచార్యులు లక్ష్మణమూర్తి, రాంరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
పిహెచ్‌డి ప్రవేశాలకు ఇంటర్వ్యూలు
కెయు క్యాంపస్, డిసెంబర్ 14: కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పిహెచ్‌డి ప్రవేశాలకు ఈ నెల 27 నుండి 31వరకు, ఇంగ్లీష్ విభాగంలో పిహెచ్‌డి ప్రవేశాలకు జనవరి మూడవ తేదీనుంచి ఐదవ తేదీవరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని డీన్ ప్రొఫెసర్ పురుషోత్తం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు.

బిల్టులో అర్ధరాత్రి హైడ్రామా

మంగపేట, డిసెంబర్ 14: జయశంకర్ జిల్లా మంగపేట మండలంలోని బిల్టు కర్మాగారంలో గురువారం రాత్రి హైడ్రామా నడిచింది. కర్మాగారంలోని యంత్రాలను బయటకు తరలించేందుకు యాజమాన్యం రెండు లారీలను, ఒక క్రేన్‌ను లోపలికి పంపించింది.
సమాచారం తెలుసుకున్న కార్మికులు, కార్మిక కుటుంబాలు, కార్మిక నాయకులు కర్మాగారం వద్దకు చేరుకుని యాజమాన్య ప్రయత్నాలను అడ్డుకున్నారు. యంత్రాల తరలింపు యాజమాన్యం కుట్ర అంటూ కార్మికులు ఆగ్రహాంతో లారీల టైర్ల గాలి తీసేశారు. అనంతరం బిల్టు పరిపాలన భవనానికి చేరుకుని డిజిఎం కేశవరెడ్డిని నిలదీశారు. డిజిఎంపై తీవ్ర ఆరోపణలు చేసి నానా దుర్భాషలాడారు. డిజిఎంతోపాటు కార్మిక నాయకులపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మాగారంలోని యంత్రాలను రాత్రివేళలో దొంగతనంగా ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. వారం రోజులుగా కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను భగ్నం చేయడానికి యజమాన్యం కుట్ర పన్నిందని కార్మికులు మండిపడ్డారు. ఒక దశలో డీజీఎంపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించగా మహిళలు వారిని అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరం అయ్యేవరకు కర్మాగారంలోని గుండుసూదిని కూడా బయటకు పంపించమని కార్మికులు డీజీఎంకు స్పష్టం చేసారు. యజమాన్యం మరోమారు ఇటువంటి కుట్రలు చేయదని డిజిఎం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మికులు, నాయకులు డిమాండ్ చేయగా డిజిఎం కేశవరెడ్డి ఇటువంటి తప్పిదాలు జరగవని లేఖ రాసి ఇచ్చారు.
బిల్ట్ మనుగడ కోసం హోమం
బిల్ట్ కర్మాగారం తిరిగి తెరవాలని కోరుతూ బిల్ట్ కర్మాగారంలో గురువారం హోమం నిర్వహించారు. గ్రామంలోని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలాపురం, మంగపేట, ఏటూరునాగారం, వెంకటాపురం (నూగూరు) ప్రాంతాలకు చెందిన అర్చకుల ఆధ్వర్యంలో కమలాపురంలోని బొడ్రాయికి మొదట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిల్ట్ పరిపాలనా భవనం వద్ద వేద మంత్రాల నడుమ అర్చకులు హోమం నిర్వహించారు. బిల్ట్ కర్మాగారం తిరిగి నడవాలని, కార్మికుల పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలని, యాజమాన్యం, ప్రభుత్వం బిల్ట్ కర్మాగారంలో పునరుత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు చదువుకుంటూ బిల్ట్ పరిపాలనా భవనంకు చేరుకుని హోమ గుండం ఏర్పాటు చేసి హోమం నిర్వహించారు. గతంలో నక్సల్స్ అప్పటి డిజియం రామకృష్ణను కాల్చి చంపిన ప్రదేశంలో శాంతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నాగేశ్వర శర్మ, ఈశ్వరానంద్ శర్మ, ఇతర అర్చక బృందం, బిల్ట్ కార్మికులు, కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
కాగా, బిల్ట్ టైం ఆఫీస్ సమీపంలో బిల్ట్ కార్మికులు, కార్మిక కుటుంబాల సభ్యులు గత ఆరు రోజుల నుండి నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు గురువారం కూడా కొనసాగాయి. ఆరవ రోజు దీక్షల సందర్భంగా కర్మాగారంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి భోజనాలు చేశారు.