వరంగల్

సస్యశ్యామలంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 17: తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్‌రావు అన్నారు. మండలంలోని కోమటిగూడెం శివారు బోయినగూడెం నాగుల చెరువుకు గోదావరి జలాలను అందించే ప్రక్రియలో భాగంగా రూ. 4.45 కోట్ల లక్ష్యంతో నిర్మించే ఫీడర్ ఛానల్ పనులకు మంత్రి హారీష్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. అందులో భాగంగానే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నియోజకవర్గంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుండి ఇప్పగూడెం నాగుల చెరువుకు ఫీడర్‌ఛానల్ నిర్మిస్తున్నామన్నారు. ఫీడర్‌ఛానల్ ద్వారా నాగులచెరువును నింపడంతో దాదాపు 27కుంటలు, చెరువులకు జలకళ సంతరించకుంటుందన్నారు. తద్వారా 2300ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారానే కాకుండా కాళేశ్వం బ్యారేజీ నిర్మాణంతో లక్ష్యలాది ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు 365రోజులు సాగునీరు అందివ్వడానికి కాళేశ్వరం వద్ద కాఫర్ ప్లేటింగ్‌తో పాటు, గోదావరి జలాలు వృథాకాకుండా ఎగువప్రాంతాలకు మళ్ళించడానికి పూర్తి స్ధాయిలో సన్నాహాలు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా కాళేశ్వరం నుండి మిడ్‌మానేరు మీదుగా గౌరవెళ్ళి నుండి స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల రైతాంగానికి అదనంగా 25వేల ఎకరాలకు సాగునీరు అందివ్వడం జరుగుతుందన్నారు. జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల రిజార్వయర్లు ఎండిపోకుండా 365రోజులు దేవాదుల మోటార్లను నడిపించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. పుష్కలంగా సాగునీరు అందించడమే కాకుండా జనవరి 1నుండి 24గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్‌ను వృథా చేయకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందుకు రైతులు వాడుతున్న ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి, భూగర్భజలాలను కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాంటపుడే ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నకలలు(తెలంగాణ కోటి ఎకరాల మగాణి) సాకారం అవుతుందన్నారు. నాగుల చెరువు ఫీడర్‌ఛానల్ పనులను నాలుగునెలల కాలంలో పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకుంటానని, ఆయా కాలువద్వారా వచ్చే నీటి వద్దనే కొబ్బరికాయ కొట్టి ఈప్రాంత రైతులకు సాగునీరు అందివ్వడానికి తిరిగి వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డా. రాజయ్య అధ్యక్షత వహించగా జనగామ, పాలకుర్తి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి ధయాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, పౌర సరాఫరాల రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, డీసీపీ మల్లారెడ్డి, ఐదు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

కుర్చీల కోసమే గొడవలు.. ప్రజా సమస్యలపై కాదు

లింగాలఘణపురం, డిసెంబర్ 17: కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం అంతా కుర్చీలకోసమే తప్పా ప్రజా సమస్యలపై కాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మంత్రిహరీష్‌రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటశ్వర్లు, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్డ మల్లేశంలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కుర్మలకు సూర్యగ్రహణం పట్టిందని, నేడు కేసీఆర్ పాలనతో గ్రహాలు వీడాయని అన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి కుర్మ సభ్యునికి రూ. లక్షతో గొర్రెలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండే మాంసాన్ని ఎగుమతి చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు హయాంలో ప్రజా సమస్యలు పక్కకుపెట్టి కంప్యూటర్లకే ప్రాధాన్యం ఇచ్చాడని, అలాగే రాజశేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేటర్లకే మొగ్గు చూపాడని ఆయన అన్నారు. కేసీఆర్ మాత్రం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడన్నారు. వలసలు, ఆకలి లేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు కట్ట వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కుర్మ కులస్థులు తెలివైన వ్యక్తులని, కొమ్మురవెళ్ళి దేవస్థాన చైర్మన్ పదవిని కుర్మలకే కేటాయిస్తామని సభాముఖంగా తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, జనగామ మార్కెట్ చైర్మన్ బండ పద్మయాదగిరిరెడ్డి, జడ్పీటీసీలు బాల్దె విజయ, రంజిత్‌రెడ్డి, కుర్మ సంఘం మండల అధ్యక్షుడు విజయభాస్కర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.