వరంగల్

బిల్ట్ కార్మికుని మృతదేహంతో రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, డిసెంబర్ 17: బిల్ట్ కంపెనీ యాజమాన్యం మొండి వైఖరి, జేఏసీ నాయకుల తీరు, వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బిల్ట్ పర్మినెంట్ కార్మికుడు మండవ శంకర్‌రావు మృతదేహంతో బిల్ట్ కార్మికులు ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా హైద్రాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందిన మండవ శంకర్‌రావు మృతదేహాన్ని ఆదివారం ఉదయం కమలాపురం తీసుకువచ్చారు. బిల్ట్ కంపెనీ మెయిన్‌గేట్ వద్ద శంకర్‌రావు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ బిల్ట్ మెయిన్‌గేట్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. శంకర్‌రావు మృతదేహానికి నివాళులర్పించి కుటంబ సభ్యులను పరామర్శించారు. కార్మికులు చేపట్టిన ధర్నా, రాస్తారాకో కార్యక్రమానికి సీఐటియూ, బిఎంఎస్, కాంగ్రెస్, బీజేపీ జిల్లా, మండల నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీతక్క, సీఐటియూ నాయకులు బందు సాయిలు, బియంఎస్ జోనల్ నాయకులు రవీందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య తదితరులు మాట్లాడుతూ శంకర్ రావుది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ యాజమాన్యం, రాష్ట్రప్రభుత్వాల హత్యేనని ఆరోపించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు విదేశీ కంపెనీలకు హైద్రాబాద్‌లో కోట్లాది రూపాయల విలువచేసే భూములను ధారాదత్తం చేస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు గత 31నెలలుగా వేతనాలు లేక బిల్ట్ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండడం, సుమారు నాలుగేళ్లుగా కంపెనీలో ఉత్పత్తి నిలిపివేయడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం శంకర్‌రావు కుటుంబానికి 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, శంకర్‌రావు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 31 నెలల వేతనాలు యాజమాన్యం వెంటనే చెల్లించాలని, పదవీ విరమణ పొందిన కార్మికుల పియఫ్, ఇతర అలవెన్స్‌లను చెల్లించాలని డిమాండ్ చేశారు.
మంత్రి చందులాల్, జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ ధర్నా చేస్తున్న తమ వద్దకు రావాలని, శంకర్‌రావు ఆత్మహత్యకు కారణమైన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కార్మికులు,కార్మిక కుటుంబాలు డిమాండ్ చేశాయి. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సీతారాం నాయక్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేసారు. ఉదయం ఐదు గంటల నుండి 10గంటల వరకు శంకర్‌రావు మృతదేహంతో బిల్ట్ మెయిన్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన కార్మిక కుటుంబాలు పదిగంటల నుండి మధ్యాహ్నం మూడుగంటల వరకు బిల్ట్ మెయిన్‌గేట్ సమీపంలోని ఎర్రవాగు వంతెన వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు మంగపేట తహశీల్దార్ చేరుకుని కార్మికులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా కలెక్టర్ తమ వద్దకు రావాలని కార్మికులు మొండికేశారు. దీంతో ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్‌రావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్‌రావు కుటుంబానికి రెండులక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇస్తామని కార్మికులకు తెలపగా అందుకు కార్మికులు అంగీకరించలేదు. ఇదే సమయంలో పెండింగ్ వేతనాలు, కర్మాగారం మనుగడపై యాజమాన్యం ఈ నెల 19న చర్చలు జరపనుందని యాజమాన్యం ప్రతినిధి లెటర్ తెచ్చారు. అనంతరం రెండులక్షల నష్ట పరిహారంతోపాటు మూడు నెలలలో శంకర్‌రావు కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని, యాజమాన్యం నుండి శంకర్‌రావు కుటుంబానికి చట్టపరంగా నష్టపరిహారం వస్తుందని సబ్ కలెక్టర్ గౌతమ్ హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. అనంతరం శంకర్‌రావు అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు, కార్మికుల అశ్రునయనాల మధ్య జరిగాయి. కార్మికులు చేపట్టిన ఆందోళన సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏటూరునాగారం సీఐ రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ మహేందర్ ఆధ్వర్యంలో సివిల్, సిఆర్‌పిఎఫ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.