వరంగల్

30 ఏళ్లలో చేయని అభివృద్ధి మూడేళ్లలో చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హర్, జనవరి 18: కాంగ్రెస్ పార్టీ ముప్పయి ఏళ్ళలో చేయలేని అభివృద్దిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మూడన్నరేళ్ళలో చేశామని మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. గురువారం మండలంలోని అన్‌సాన్‌పల్లి, నాచారం, రుద్రారం గ్రామాలలో రెండవ విడత మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో రోడ్లు, రైతుల పంటల సాగుకై 24 గంటల విద్యుత్తు సరఫరా, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులతో పాటు అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ప్రతి ఒక్కరికి వృద్దాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళల పెన్షన్‌లు, ఆర్థికంగా చేదోడుగా ఉండేందుకు ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేయూతను అందిస్తున్నామని అన్నారు. తన తల్లి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. నిరుపేద 200 జంటలకు మార్చిలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు పెండ్లి చేసిన తర్వాత పెండ్లి కానుకలు ఏ విధంగానైతే ఇస్తారో అలాంటి విధంగా బహుమానాలు అందిస్తామని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. శాత్రాజుపల్లి నుంచి తాడ్వాయి రోడ్డు సదుపాయం, తాగు నీరు సౌకర్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, బొగ్గుల వాగుపై చెక్ డ్యాం నిర్మాణం, తదితర సమస్యల పరిష్కారం చేస్తామని అన్నారు. అన్‌సాన్‌పల్లిలో యాదవులకు 51 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. రూ. 8లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రుద్రారంలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన 3311 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అన్‌సాన్‌పల్లిలో 75 లక్షల రూ.లతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

ఆదివాసీల మేడారం దిగ్బంధం
* భక్తులకు తీవ్ర ఇబ్బందులు * పది కిలోమీటర్ల మేర నిలిచిన రాకపోకలు
గోవిందరావుపేట, జనవరి 18: ఏజెన్సీలోని విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గిరిజన ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మేడారం రహదారులను ఆదివాసీ గిరిజనులు దిగ్భందిచారు. ఆదివాసీ విద్యార్ధి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు పస్రా నుంచి మేడారం వెళ్లే మార్గంలో చింతల్‌క్రాస్ వద్ద రోడ్డుపై బైటాయించి ధర్నా చేసారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అటు మేడారం వరకూ, ఇటు నార్లాపూర్ వరకూ పదికిలోమటర్ల మేర ట్రాఫిక్ నిలచిపోవడంతో ములుగు డిఎస్పీ రాఘవేందర్‌రెడ్డి, సిఐ సత్యనారాయణలు హుటాహుటిన సంఘటన స్ధలానికి చేరుకొని ఆదివాసీలతో చర్చించారు. ధర్నా విరమించాలని, భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని వారిని కోరారు. చివరికి విద్యార్ధి సంఘాల నేతలు, ధర్నాలో పాల్గొన్న ఆదివాసీలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి డీసీఎంలలో తరలించి కొద్దిసేపటి తరువాత వదిలిపెట్టారు.

రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు: గండ్ర
* ముందస్తు ఎన్నికలు సరైనవి కాదు * మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి
రేగొండ, జనవరి 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం రేగొండ మండలంలోని గొరుకొత్తపల్లి గ్రామంలో మన ఊరు-మన రమణన్న కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఇంగ మహేందర్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గండ్ర వెంకటరమణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తెరాస, తెదెపాకు చెందిన సుమారు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి అహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో రైతులకు ఒకేసారి రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చ ఇప్పటి వరకు కుడా పూర్తిగా రుణమాఫీ చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను నేరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయ చూపుతుండడంతో రైతులు అప్పులపాలు అవుతున్నారని గండ్ర వెంకటరమణా రెడ్డి అవేదన వ్యక్తం చేశారు.
పాత నేరస్థులకు ఆధార్ కార్డులు
*సకల నేరస్థుల సర్వే తనిఖీలో పోలీసులకు ఎస్పీ కోటిరెడ్డి ఆదేశం

కేసముద్రం, జనవరి 18: సకల నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో పలు దొంగతనాల్లో నిందితుడైన కూతాటి రమణ వివరాలు సేకరిస్తున్న సమయంలో తనిఖీకి వచ్చిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి పాతనేరస్థుడైన రమణకు ఆధార్‌కార్డు లేదన్న విషయం తెలియడంతో పాత నేరస్థులకు తప్పనిసరిగా ఆధార్‌కార్డు ఇప్పించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు.
దీంతో ఎస్‌ఐ వెంటనే అతన్ని మీసేవ కేంద్రానికి తీసుకెళ్లి ఆధార్‌కార్డు కోసం దరఖాస్తు చేయించారు. పాత నేరస్థుల పనితీరును తెలుసుకోవడానికి జిల్లాలో గురువారం పోలీసులు సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో రెండుకు మించి నేరాల్లో నిందితులైన 28 మంది వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురికి గుర్తింపుకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాల్లేకపోవడంతో నేరాల అదుపులో గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. పాత నేరస్థుల వేలి ముద్రలు సేకరించారు. ఎస్పీ వెంట మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ నాయక్, రూరల్ సీఐ ముత్తిలింగయ్య ఉన్నారు.

మేడారంలో భక్తజన హోరు

*ఇప్పటి నుండే పోలీసుల ఆంక్షలు * తల్లుల దర్శనంతో తరిస్తున్న భక్తులు

గోవిందరావుపేట, జనవరి 18: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారం సైతం లక్షల సంఖ్యలో భక్తులు తల్లుల దర్శనం చేసుకున్నారు. మేకపోతులను తల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేయించి, బంగారం (బెల్లం) తల్లుల గద్దెలపై ఉంచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, తల్లుల ప్రసాదం కోసం భక్తులు ఇబ్బందులు పడటం కనిపించింది. గద్దెల వద్ద ఉన్న ప్రైవేటు సిబ్బంది భక్తులు ఇస్తున్న బంగారం (బెల్లం)ను గద్దెలపైకి తీసుకోవటం తప్ప తిరిగి భక్తులకు కొద్దిపాటి ప్రాసాదాన్ని ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో భక్తులు బంగారు ప్రసాదం కోసం ప్రైవేటు వ్యక్తులను బతిమాలుకోవలసిన దుస్ధితి గద్దెల ప్రాంగణం వద్ద కనిపించింది. దేవాదాయశాఖ అధికారులు భక్తులకు విధిగా ప్రాసాదాన్ని అందించాలని భక్తులు కోరుతున్నారు. కోడిపిల్లల ఎదుర్కోళ్లతో బైటికి వస్తున్న భక్తులు తల్లుల ఫోటోలు, గాజులు కొనుగోలు చేస్తూ బిజిబిజిగా కనిపించారు.
* ఆకాశాన్ని అంటేలా ధరలు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో వ్యాపారం చేసుకునేందుకు సుదుర ప్రాంతాల నుండి ఇప్పటికే పెద్దఎత్తున వ్యాపారులు తరలివచ్చారు. గద్దెల ప్రాంగణం చుట్టూతోపాటు జంపన్నవాగు నుండి మేడారం గద్దెల వరకూ రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున హోటళ్లు, గాజుల దుకాణాలు, బొమ్మలు, స్వీటు దుకాణాలు ఏర్పాటుచేసారు. కీకారణ్యంగా ఉన్న మేడారం నేడు జనారణ్యంగా కనిపిస్తోంది. అయితే ఈసారి జాతరలో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయని, తాము ఎంతో దూరంనుండి వచ్చి జాతర పేరుతో కాస్తోకూస్తో సంపాదించుకునే వాళ్లమని, ఈ జాతరలో ఆ అవకాశం కనిపించడం లేదని నాగార్జునసాగర్ నుండి వచ్చి బొమ్మలు, గాజుల వ్యాపారి పసుపులేటి రమ అన్నారు. గత జాతరలో ఇరవైవేలకు స్ధలం అద్దెకు తీసుకుంటే ఇప్పుడు 35 వేలు వెచ్చించాల్సి వచ్చిందని, జీఎస్టీ పేరుతో ధరలు అమాంతం పెరిగిపోయాయని, కానీ భక్తులు పెద్దమొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో వ్యాపారాలు సజావుగా సాగేలా కనిపించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.