వరంగల్

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 19: మిషన్ భగీరథ పనుల చేపడుతున్న ఇంజనీర్లు సాంకేతికంగా మరింత పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు వర్క్‌షాప్ నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంబంధిత విభాగం చీఫ్ ఇంజనీర్‌కు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పాఖాలలో 11వ శతాబ్దంలో నిర్మించిన చెరువును ఇంజనీరింగ్ అధికారులు సందర్శించి అక్కడి నిర్మాణంపై అవగాహన కల్పించుకోవాలని అన్నారు. మిగులు జలాలను కూడా తిరిగి వినియోగించుకనే పరిజ్ఞానం పాఖాల చెరువు నిర్మాణంలో రూపొందించారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను నిర్ణీత కాలంలో పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ను రూపొందించుకుని, దాని ప్రకారం పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కింద చేపట్టిన పనులలో పరిష్కారానికి వీలులేని సమస్యలు ఉంటే ఆ పనులను వెంటనే రద్దు చేయాలని అధికారులకు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులలో నింపుకోగలిగితే వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంల లక్ష ఎకరాల చొప్పున పంటభూములకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడుతుందని, భూగర్భజలాల మట్టం కూడా భారీగా పెరుగుతాయని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమలవుతున్న మిషన్ కాకతీయ పథకం అమలు తీరుపై వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో ఉపముఖ్యమంత్రి కడియం శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాలులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ మొదటి, రెండవ, మూడవ దశలలో జిల్లాలవారీగా చేపట్టిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా దశలలోని అసంపూర్తిగా మిగిలిన పనులను జూన్ 30వ తేదీలోగా పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అదే విధంగా నాలుగవ విడతలో చేపడుతున్న చెరువుల మరమ్మతు పనులు ఫిబ్రవరి మూడవ తేదీనుంచి ప్రారంభించి జూన్ 30వ తేదీనాటికి పూర్తిచేయాలని స్పష్టం చేసారు. నాలుగవ విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 708 చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు వెంటనే అంచనాలు, పరిపాలనా అనుమతులు, టెండర్లు, అగ్రిమెట్ల ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. మొత్తం నాలుగు విడతలలో జరిగే ఈ పనులను పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని, జరుగుతున్న పనులపై ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని జాయింట్ కలెక్టర్లు మిషన్ కాకతీయ పథకానికి సంబంధించిన ఇంజనీర్లతో, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో ప్రతి 15రోజులకు ఒకసారి పనుల ప్రగతిపై సమీక్షలు జరపాలని తెలిపారు. అవసరమైతే జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నిర్వహణలో ఏర్పడే సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా కలెక్టర్లు కూడా వారానికి ఒకసారి మిషన్ భగీరథ అధికారులతో పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. మిషన్ భగీరథ పనులలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని, పనుల అనుమతులు, పెండింగ్ బిల్లుల విషయాన్ని తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించి పరిష్కారం జరిగేలా చూస్తానని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతు రామప్ప చెరువు సుందరీకరణ పనులు సత్వరం పూర్తిచేయాలని తెలిపారు. జంపన్నవాగులో చెక్‌డ్యాం నిర్మాణం పనులు నత్తనడకన జరగటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే పనులు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతు నియోజకవర్గంలోని తరిగొప్పుల చెరువులో పూడిక మరింత లోతుగా తీయిస్తే ఐదుగ్రామాలకు నీరిందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పరకాల మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పనులు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతునే ఉన్నాయని, ఈ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, జాయింట్ కలెక్టర్లు హరిత, దయానంద్, అమయ్‌కుమార్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, సూపరింటెడింగ్ ఇంజనీర్ ఆంజనేయప్రసాద్, వివిధ జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.