వరంగల్

మిషన్ భగీరథ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, నాగార్జున కన్స్‌స్ట్రక్షన్ కంపెనీ అధికారులు, రెవెన్యూ అధికారులతో మెట్రో సెగ్మెంట్ కింద చేపట్టిన మొదటి దశ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. మెట్రో సెగ్మెంట్ కింద జనగామ నియోజకవర్గానికి పూర్తిగా, పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గాల్లో పాక్షికంగా 704 ఆవాస ప్రాంతాలకు ముఖ్యమంత్రి నిర్దేశించిన ఏఫ్రిల్ 30వ తేదీలోగా నల్లాల ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ మెట్రో సెగ్మెంట్ కింద 25 ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర నిర్మాణాలు చేపట్టగా అందులో 9 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, మరో 6 నిర్మాణాలు భూసమస్య కారణంగా, నాలుగు నిర్మాణాలు రహదారి నిర్మించాల్సిన కారణంగా ఆలస్యమవుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మందగతిన పనులు కొనసాగించడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వేసవికి తాగునీరు అందించనున్న మిషన్ భగీరథ మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు పనుల పురోగతిపై పరిశీలించి నివేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వాటర్‌గ్రిడ్ ఎస్‌ఇ యేసురత్నం, ఆర్డీవోలు వెంకటమాధవరావు, వెంకట్‌రెడ్డి, ఇఇలు, ఎఇలు పాల్గొన్నారు.

మేడారంలో ఎడారి ఓడలు!

మేడారంలో ఎడారి ఓడలు!
గోవిందరావుపేట, ఫిబ్రవరి 6: ఏడారి ఓడులుగా పేరుగాంచిన ఓంటెలు మేడారంలో దర్శమిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి వ్యాపారం కోసం మేడారం తీసుకువచ్చారు. వీటిపై కూర్చోవాలంటే పెద్దలకు 50రూపాయలు, చిన్న పిల్లలలకు 30రూపాయల చోప్పున ధరను నిర్ణయించారు. కాగా ఓంటలను దగ్గర చూడటమే కాకుండా వాటిపై కూర్చునే అవకాశం వస్తుండటంతో పలువురు భక్తులు ఓంటలపై కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా మేడారం జాతరలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే ఇక్కడికి వచ్చామని తల్లుల దయవల్ల వ్యాపారా బాగానే సాగుతుందని ఓంటెల యజమానులు తెలిపారు.

మేడారానికి ‘ముందస్తు’ తాకిడి!
గోవిందరావుపేట, ఫిబ్రవరి 6: ఆసియా ఖండంలోనే అతి పెద్దజాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం సైతం సుమారు లక్షమంది వరకు భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించేందకు భక్తులు మొగ్గుచూపుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విదంగా గత నెలరోజులుగా భక్తుల రద్దీ మేడారం వైపు సాగుతుంది. అమ్మలకు ప్రీతిపాత్రమైన బంగారం, పుట్టువెంట్రుకలు ఇవ్వడంతోపాటు మేకలు, కోళ్లను భక్తులు సమర్పించుకుంటున్నారు. వేలాది దుకాణ సముదాయాలతో మేడారం ఇప్పటికే జాతర శోభను సంతరించుకోగా జాతరకు మరో పదిరోజులు మాత్రమే సమ యం ఉండటంతో అన్ని శాఖల అధికారులు అభివృద్ధ్ది పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధం అయ్యారు. లక్షలాదిగా ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులకు అదుపుచేయడం, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం అధికారులకు సవాలుగా మారుతుంది. ఏది ఏమైనా భక్తుల రాకతో మేడారం పులకించిపోతుంది.

రామప్ప, పాకాల ఔషధ మొక్కలకు ప్రసిద్ధి
నక్కలగుట్ట, ఫిబ్రవరి 6: వరంగల్‌లోని రామప్ప, పాకాల చెరువుల ప్రాంతం గతంలో ఔషధ మొక్కలకు ప్రసిద్దిగా ఉండేదని, కాని నేడు ఆ ప్రాంతంలో మొక్కలే కనిపించని పరిస్థితి ఏర్పడిందని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి భాగ్యనారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం అధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు సమావేశం శనివారం జరిగింది. విభాగ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగ్యనారాయణ మాట్లాడుతూ జీవరాశుల 70 శాతం అవసరాలను జీవవైవిధ్యాలతోనే తీరుతాయని తెలిపారు. జనాభా పెరుగుదల, నగరీకరణ కారణాలతో ప్రకృతిని నాశనం చేయడం అలవాటు చేసుకున్నామని వివరించారు.
రోజు రోజుకు కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ జీవులు అంతరించిపోతున్నాయని అన్నారు. మొక్కలు, జంతువులు, పక్షులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వరి వంగడాలు తీసుకుని రావలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ప్రొఫెసర్ గిరీశం మాట్లాడుతూ సదస్సు లక్ష్యం నెరవేరిందని అన్నారు. 19 పరిశోధనా పత్రాలు వచ్చాయని తెలిపారు. హైదరాబాదు యూనిర్సిటీకి చెందిన హరికృష్ణ, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సుజాత, కెయు చెందిన పి.శ్రీనివాస్‌లు సమర్పించిన పత్రాలకు ఉత్తమ పరిశోధన పత్రాలుగా గుర్తించి, వారికి ప్రసంసాపత్రాలను ఇచ్చారు.

ముగిసిన బిల్ట్ కార్మికుల నిరాహార దీక్షలు
మంగపేట, ఫిబ్రవరి 6: బిల్ట్ మెయిన్ గేట్ వద్ద గత 363 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు శనివారం తమ నిరాహార దీక్షలను విరమించారు. బిల్ట్ మనుగడను కాపాడాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 2015 ఫిబ్రవరి 9 నుండి బిల్ట్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం దీక్షలలో రాచకొండ వీరన్న, పి.విజయకుమార్, ఇ.రామిరెడ్డి, బి.కర్ణాకర్‌రెడ్డిలు కూర్చున్నారు. అయితే బిల్ట్ మనుగడ కోసం తాము కొన్ని త్యాగాలు చేస్తామంటూ కార్మికుల తరపున ఐకాస నాయకులు యాజమాన్యంకు రాత పూర్వకంగా శుక్రవారం తెలియ చేశారు. దీంతో కర్మాగారం తిరిగి ప్రారంభించడానికి కొంతమార్గం సులువయింది. దీంతో శనివారం ఐకాస నాయకులు ఈ విషయంపై కార్మికులతో చర్చించి కార్మికుల ఆమోదంతో నిరాహార దీక్షలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి
బిల్ట్ మనుగడ కోసం మేము సైతం అంటూ కొన్ని త్యాగాలు చేయడానికి కార్మికలు కూడా సిద్ధ్దంగా ఉన్నారని, యాజమాన్యం వెంటనే కర్మాగారంలో పునరుత్పత్తి చర్యలు ప్రారంభించాలని బిల్ట్ ఐకాస నాయకులు వడ్డెబోయిన శ్రీనివాసులు, చాతరాజు చొక్కారావు, పుసులూరి గణపతి, వడ్లూరి రాంచందర్, పాకనాటి వెంకటరెడ్డి, ఎస్కే. ఖుర్బాన్ ఆలీ డిమాండ్ చేశారు. శనివారం ఐఎన్‌టియుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిల్ట్ ఐకాస నాయకులు మాట్లాడుతూ కార్మిక సంక్షేమం దృష్ట్యా కర్మాగారం మూతపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చిందని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బిల్ట్‌కు సహకరించడానికి సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ దశలో బిల్ట్ కార్మికులు కూడా కర్మాగారం తిరిగి నడవడానికి తమ వంతుగా కొన్ని సదుపాయాలు తాత్కాలికంగా త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.
సమావేశంలో దంతులూరి వరప్రసాదరాజు, వింజమూరి రవి మూర్తి, వి.శర్మ, మేడా లక్ష్మీనారాయణ, పప్పు వెంకటరెడ్డి, వంగేటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య రహితంగా
మేడారం జాతర
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 6: ఈ నెల 17 నుంచి 20వరకు జరుగనున్న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను కాలుష్య రహిత ప్లాస్టిక్ లేని జాతరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పోలీసు, అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతరలో కోటిమంది భక్తులు వస్తారనే అంచనాతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా పర్యావరణాన్ని సంరక్షించి కాలుష్య రహిత జాతరగా నిర్వహించేందుకు ప్లాస్టిక్ వాడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ కాలుష్యానికి కారకమైన ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా భక్తులకు పేపర్ బ్యాగ్‌లు, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, జనపనార బ్యాగులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్క- సారలమ్మ చిత్రాలతో ముద్రించిన జనపనార బ్యాగులను తయారుచేసి భక్తుల ప్రసాదం, ఇతర వస్తువులు తీసుకెళ్లేందుకు నిర్దేశించిన రేటుకు విక్రయానికి అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా షాపుల్లో ప్లాస్టిక్ బ్యాగుల బదులుగా పేపర్, జనపనార బ్యాగులుంచేలా చూడాలన్నారు. మొక్కల పెంపకం పట్ల భక్తుల్లో చైతన్యం కల్గించేందుకుగాను మేడారం జాతర సందర్భంగా పరిసర ప్రాంతాల్లో 8చోట్ల వివిధ మొక్కల విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. మేడారంలో ఇప్పటికే మొక్కల విక్రయకేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌లు ప్రారంభించారని, మిగతా 7 ప్రాంతాల్లో ప్రారంభించాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొక్కల విక్రయ కేంద్రాల్లో మారేడు, వెదురు, నేరుడు, ఉసిరి, సిల్వర్, డెకోమో, కొండ మామిడి, గనే్నరు, నందివర్థనం, ఎర్రచందనం మొక్కలను ఒక్కొక్క మొక్కను రూ.5కు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అటవి అధికారులను ఆదేశించారు. అదే విధంగా అడవుల్లో భక్తులు చెత్తాచెదారం వేయకుండా, చెట్లను నరకకుండా సంరక్షించేందుకు 150మంది అటవి సిబ్బందితో 10 బృందాలను నియమించనున్నట్లు అటవి శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ సందీప్‌కుమార్, దక్షిణ, ఉత్తర సామాజిక వ్యవసాయ డిఎఫ్‌వోలు కృష్ణాగౌడ్, భీమ, వెంకటేశ్వర్‌రావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దీవెనలు అందరికీ అందేలా చర్యలు

*ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ
ములుగు,్ఫబ్రవరి 6: ఈనెల 17నుండి 20 వరకు జరిగే మేడారం మహాజాతరలో భక్తులందరికి అమ్మవారి దీవెనలు అందేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జి తెలిపారు. శనివారం మేడారం జాతరనుద్దేశించి ఆయన ఆంధ్రభూమితో మాట్లాడారు. కోటి మొక్కుల తల్లుల దర్శనం కోసం పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రైవేటు వాహనాలను నార్లాపూర్ వయా బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి వరకు వన్‌వే ఏర్పాటు చేశామని, భక్తులు సహకరించాలని విజప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం జాతరకు 132కోట్ల నిధులు కేటాయించగా భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు పనులు, స్నానఘట్టాల నిర్మాణం, క్యూలైన్ల ఏర్పాటు, ఎడ్లబండి దారులు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టి ఈనెల 10వ తేదీలోగా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తాను పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. జాతర పరిసరాలను 38 సెక్టార్లుగా విభజించామని, ఒక్కో సెక్టారులో మూడు షిప్టులలో సెక్టోరియల్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని వీరేగాక అదనంగా నాలుగు సెక్టోరియల్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, మరో ఐదుగురు అదనపు జెసిలు విధులు నిర్వరిస్తున్నట్లు తెలిపారు. జాతరలో 200నుండి 300మంది కార్మికులు పారిశుద్ద్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టనున్నట్లు తెలిపారు.
జాతర వేళల్లో 40మంది తహశీల్దార్‌లు, 65మంది డిటిలు, 230మంది సిబ్బంది సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈసారి భక్తులు క్యూలైన్ల ద్వారా నిమిషానికి 200మంది అమ్మవార్లను దర్శించే విధంగా ఏర్పాట్లు చేశామని ఆర్డీఒ తెలిపారు. అంతేకాకుండా మేడారం జాతరకోసం లక్నవరం నుండి జంపన్నవాగులోకి తరలించే నీటిని చౌర్యంచేసి పంటపొలాలకు మళ్ళించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంక్షేమంతో సమానంగా సాంస్కృతిక రంగం
* కలెక్టర్ వాకాటి కరుణ
నక్కలగుట్ట, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో, అంతే ప్రాధాన్యం సాంస్కృతిక రంగానికి కూడా ఇస్తుందని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం వేయిస్తంభాల ఆలయంలో గుడి సంబురాలు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వరంగల్‌ను చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా కీర్తిస్తారని గుర్తుచేశారు. పరంపర సంస్థ వారు తెలంగాణ వ్యాప్తంగా గుడి సంబురాలను నిర్వహించాలని తలంచి, మొట్ట మొదట వరంగల్‌ను ఎన్నుకోవడం సంతోషకరమని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సంస్కృతి సాంప్రదాయాలను, చరిత్రను కళలద్వారా ప్రజలకు తెలుపడం అభినందనీయమని అన్నారు. పవిత్ర దేవాలయాలను వేదికగా చేసుకుని కళలను ప్రదర్శించడంతోపాటు, వివిధ దేవతా చరిత్రలను ప్రజలకు తెలిసేలా నృత్యాలను చేయడం విశేషమని అన్నారు. హృదయ్ పథకం ద్వారా వేయిస్తంభాల దేవాలయానికి రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. విలాసిన నాట్యం, కూచిపూడి నృత్యాల కలయికతో అనుపమ కైలాష్, శివచంద్రకుమార్ ప్రదర్శించిన విశ్వం నారాయణ నృత్య ప్రదర్శన ఆహుతులను అబ్బురపరిచింది.
ఈ కార్యక్రమంలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జిల్లా పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేందర్, అర్చకులు ఉపేంద్రశర్మ, డాక్టర్ కల్పనాదేవి తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చాలి
వడ్డేపల్లి, ఫిబ్రవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంద ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని సిపి ఐ జిల్లా కార్యాలయంలో భీమనాదం శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రంలో నరేంద్రమోడి, రాష్ట్రంలో కెసి ఆర్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అధిక ధరలను నియంత్రిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నేడు అందుకు విరుద్దంగా ధరలను పెంచడం సామాన్యులకు భారం అని విమర్శించారు. మతోన్మాదమే ఎజెండాగా మోడి ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిపై ప్రశ్నించిన వారిని అణచి వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో కాలం వెల్లబుచ్చుతున్నదే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫమైందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం వలననే పట్టం కట్టారని తెలిపారు. జిల్లాలో ప్రజలు మంచినీటి సమస్యతో అల్లాడుతున్నారని, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపి ఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు మేకల రవి, మోతె లింగారెడ్డి, కరణాకర్ తదితరులు పాల్గొన్నారు.