వరంగల్

ఐజి స్థాయి హోదాతో పోలీసు కమిషనరేట్ అప్‌గ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 10: వరంగల్ జిల్లాను విభజించి ఐదు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత వరంగల్ పోలీసు కమీషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేసి ఐజి స్థాయి పోలీసు అధికారి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కమీషనరేట్ పరిధిలో, కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో పోలీసు సర్కిళ్లు, పోలీసు స్టేషన్లు కూడా ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుత వరంగల్ జిల్లాను విభజించి కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలు మండలాలను కలుపుకోవటం, ప్రస్తుత జిల్లాలోనే కొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ వరంగల్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరంగల్ నగరంలో కమీషనరేట్ వ్యవస్థ అమలులో ఉండగా వరంగల్ రూరల్, జనగామ జిల్లాలను కూడా కమీషనరేట్ పరిధిలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో కమీషనరేట్ పరిధి విస్తరించిన కారణంగా ఇప్పటి వరకు పోలీసు కమీషనర్‌గా డిఐజి స్థాయి అధికారి పనిచేస్తుండగా తాజాగా ఐజి స్థాయి అధికారిని కమీషనర్‌గా నియమించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.
దీనికితోడు కమీషనరేట్‌లో మూడు జోన్లుగా విభజించి ఎస్పీ స్థాయి అధికారిని డిసిపిలుగా నియమించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిసిపిల కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఇప్పు డు ఉన్న ఆరు సబ్ డివిజన్లకు అదనంగా కొత్తగా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ కేంద్రాలుగా పోలీసు సబ్ డివిజన్లు ప్రారంభమవుతున్నాయి. అదే విధంగా వరంగల్ కమీషనరేట్ పరిధిలో నర్మెట్ట, ఎల్కతుర్తి, దుగ్గొండి కేంద్రాలుగా కొత్త పోలీసు సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటవుతున్న తరిగొప్పుల మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ ఏర్పాటవుతోంది. ఇకపోతే భూపాలపల్లి జిల్లాలో మూడు పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటు అవుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మండలాలతో ఈ జిల్లా ఏర్పడుతుండటం, కొత్త జిల్లా పరిధిలో ఒక్క పోలీసు సబ్ డివిజన్ కూడా లేకపోవటంతో ప్రస్తుతం మూడు కొత్త పోలీసు సబ్ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అమోదం ఇచ్చింది.
భూపాలపల్లి, కాటారం, ఏటూరునాగారం కేంద్రాలుగా పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా కొత్త జిల్లా మహబూబాబాద్ పరిధిలోని తొర్రూరు కేంద్రంగా మరో పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు భూపాలపల్లి మండలంలో మహదేవ్‌పూర్, పస్రా పోలీసు స్టేషన్లను సర్కిళ్లుగా మారుస్తున్నారు. ఈ జిల్లాలోని టేకుమట్ల, పలిమెలలో కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న పెదవంగర, గంగారం, దంతాలపల్లి, చినగూడూరు మండల కేంద్రాల్లో కొత్త పోలీసు స్టేషన్లు ప్రారంభమవుతున్నాయి. జిల్లాస్థాయిలో ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది కెటాయింపులకు సంబంధించిన ప్రక్రియ వరంగల్ రేంజ్ డిఐజి, నగర పోలీసు కమీషనర్, రూరల్ ఎస్పీల పర్యవేక్షణలో ఒక కొలిక్కి వచ్చింది. పోలీసు కమీషనరేట్ పరిధిలోఅధికారులు, సిబ్బందికి బదిలీల బెడద లేకపోగా, ప్రస్తుత రూరల్ జిల్లా పరిధిలో ఏర్పడుతున్న జిల్లాల అధికారులు, సిబ్బంది కూడా ఎక్కడివారు అక్కడే పనిచేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం సిబ్బందిని మాత్రం విభజించాలని నిర్ణయించారు. కొత్త సబ్ డివిజన్లకు, సర్కిళ్లకు, పోలీసు స్టేషన్లకు కొత్త అధికారులను నియమించి, జిల్లాలో ఉన్న సిబ్బందిని ఆయా కార్యాలయాలకు సర్ధుబాటు చేస్తారు.

ముహూర్తం ఖరారు
పరకాల, అక్టోబర్ 10: భూపాలపల్లి జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 11(నేడు) దసరా రోజున ఉదయం 10.30కు జిల్లాను ప్రారంభించేందుకు ప్రభుత్వం అధికారులను అదేశించింది. భూపాలపల్లి జిల్లాతో పాటు ముసాయిదాలో ప్రకటించిన మండలాలకు సంబందించి కార్యాలయాల బోర్డులు, అధికార రబ్బర్ స్టాంపుల తయారు చేయించుకోవడానికి అనుమతి నిచ్చారు. తొలి రోజు ముహూర్త సమయానికి కలెక్టరేట్ ఆవరణలో పతకావిష్కరణ, జాతీయ గీతం అలాపన నిర్వహించి సిబ్బంది ఉమ్మడిగా కలిసి ఫోటో తీసుకోవాలని సూచించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని, కొత్త చోట ఉద్యోగుల నియామకాలకు సంబందించి ప్రభుత్వమే అయా శాఖల కార్యదర్శుల నుండి అర్డర్ టూ సర్వ్ ఉత్తర్వులు ఇస్తున్నట్లు సిఎస్ రాజీవ్‌శర్మ స్పష్టం చేసినట్లు సమాచారం.
తొలి రోజు ఇలా...
భూపాలపల్లి జిల్లా కార్యాలయాలను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దసరా రోజున ప్రారంభిస్తారు. తొలి రోజున కొత్త జిల్లా వెబ్‌సైడ్, ఫెస్‌బుక్ పేజిలను ప్రారంభిస్తారు. నవంబర్ నెలకు సంబందించిన పిడిఎస్ బియ్యాన్ని కేటాయిస్తారు. అదే రోజున అధికారులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. కళ్యాణ లక్ష్మి, డిసెంబర్ నెలకు సంబందించిన పింఛన్లు జిల్లా పాలనాధికారి కేటాయిస్తారు. ఉపాధి హామి పనుల మంజూరు కూడా అదే రోజున ఉంటుంది. మండల స్థాయిలో తొలి రోజున కుల, పుట్టిన, నివాస ధృవ పత్రాలు, రుణ అర్హత పత్రాలు, అర్‌ఓఆర్, పట్టా పాసు పుస్తకాలు, చౌక ధరల దుకాణాలకు బియ్యం కేటాయిస్తారు. కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తారు. సిబ్బందికి విధులు కేటాయింపు అదే రోజున జరుగుతుంది.

*జిల్లా స్థాయి అధికారుల హోదాల మార్పు...

ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో పలు సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వివిధ శాఖలను మమేకం చేస్తూ వారి హోదాలు పేర్లను మార్చాలని సిఎస్ విసిలో అదేశించినట్లు సమాచారం. ఇందుకు సంబందించి ప్రభుత్వం నుండి ఉత్తర్వులిస్తామని స్పష్టం చేశారు. ఇది వరకున్న ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖ అధికారులను ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఇక జిల్లా అభివృద్ధి అధికారులుగా పిలవ నున్నారు. భూగర్భ జల శాఖ, చిన్న మద్య తరహా ఎత్తిపోతలు, ఐడిసి కార్పొరేషన్‌లన్నింటిని నీటి పారుదల శాఖలో కలిపేసి నీటి పారుదల అధికారులుగా పిలుస్తారు. భూగర్భ జలశాఖ, చిన్న మద్య తరహా ఎత్తిపోతలు, ఐడిసి కార్పొరేషన్‌లన్నింటిని నీటి పారుదల శాఖలో కలిపేసి నీటి పారుదల అధికారులుగా పరిగణిస్తారు. అర్ అండ్ బిలో పని చేసే పర్యవేక్షక ఇంజనీర్లను జిల్లా అర్ అండ్ బి అధికారులుగా మార్చారు. జిల్లా పౌర సంబంధాల శాఖను విస్తృత పరిచారు. ఈ శాఖ అధికారులే సాంస్కృతిక, పర్యాటక, పుర వాస్తుశాఖ విభాగాలను కూడా చూస్తారు. జిల్లా పౌర సరఫరాల అధికారులుగా ఉన్న డిఎంను తూనికలు కొలతల శాఖలో డిఎల్‌ఎంఓగా అనుసంధానం చేస్తారు. పట్టణ కేంద్రాల్లో మున్సిఫల్ కమిషనర్లు మెప్మా అధికారుల హోదాల్లో మార్పు లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

*కార్యాలయాలకు బోర్డుల ఏర్పాటు...

మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇందూ అతిథి గృహం, ప్రభుత్వ ఐటిఐ భవనాన్ని కలెక్టర్ , ఇతర శాఖలకు కేటాయించారు. ఏ గదిలో ఏ శాఖ కార్యాలయం కొనసాగుతుందో సూచిక, వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సింగరేణి ఇందూ అతిథి గృహం కింద అంతస్తులో కలెక్టర్ చాంబర్ గది 101, జాయింట్ కలెక్టర్ చాంబర్ గది 102, వెయింటిగ్ హాల్ 103, మీటింగ్ హాల్ 104, వీడియో కాన్ఫరెన్స్ హాల్ 105, 107 డిఆర్‌ఓ చాంబర్, 109 కలెక్టర్ ఆఫీస్ ఏ నుండి సి సెక్షన్స్, 110, 111, 112 కలెక్టర్ ఆఫీస్‌లోని పలు సెక్షన్లు, 113 ఏడిఎస్ అండ్ ఎల్‌ఆర్ చాంబర్, 114 ఏడిఎస్ అండ్ ఎల్‌ఆర్ సిబ్బందికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా పై అంతస్తులో 201, 202 గదిలో డిఎంసిఎస్ ఆఫీస్, 203, 204 డిఎస్‌ఓ, 205 రికార్డ్ రూం, 207, 208 డిపిఓ కార్యాలయం, 211, 212 ఐ అండ్ పిఆర్ , 213 భూగర్భ జలశాఖ, 216 నుండి 221 వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర సంక్షేమ శాఖలు, 214, 215 గదులు సిపిఓ ఆఫీస్‌కు కేటాయించారు. ఐటిఐ భవనంలో 1వ గదిలో టూరిజం, 2 జిఎం ఇండిస్ట్రిస్, 3 నెంబర్ గది స్పోర్ట్స్ అథారిటి, 5,6 ట్రేజరి, 7 నెంబర్ గది మీటింగ్ హాల్, 8వ నెంబర్ గది పిడి డ్వామా, పిడి డిఆర్‌డిఏ, శిశు సంక్షేమ శాఖ, 9నెంబర్ గది ఆర్ అండ్ బి, 10 రిజిస్టార్, 11,12,13 వ్యవసాయ శాఖ, 14,15 మార్కెటింగ్, 16,17 మైనింగ్, 18,19 డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ కార్యాలయాలకు కేటాయించారు. ఐటిడిఏ కళాశాల బాలికల హాస్టల్ భవనంలో కింది అంతస్తులో 1,2 గదులు ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ కార్యాలయం, 3 ఎంప్లాయిమెంట్ 4 లీగల్ మెట్రోలజీ, పై అంతస్తులో 5,6 గదుల్లో ఏగ్జిక్యూటివ్, ఇంజనీర్ అర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, 7 గెజిటెడ్ పుడ్ ఇన్స్‌పెక్టర్‌ల కోసం కేటాయించారు. ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరి పాఠశాలలో హౌసింగ్, 2వ గదిలో కార్మిక శాఖ, ఉర్థూ మీడియం పాఠశాలలో మైనార్టి శాఖ, జంగేడు వెటర్నిరి ఆసుపత్రిలో 2వ నెంబర్ గదిలో మత్స్యశాఖ, సింగరేణి డిస్పెన్సరి భవనంలో 1,2,3 గదుల్లో ఎక్సైజ్ శాఖ, 4,5 పిఆర్ ఈఈలకు కేటాయించారు.

*స్పీకర్ ఆధ్వర్యంలో సర్వం సిద్దం....

భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో స్పీకర్ అన్ని తానై ఉండి సర్వం సిద్దం చేస్తున్నారు. జిల్లా ఆవిర్భావ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంబరాల నిర్వహణ, అదికారులను ఘనంగా స్వాగతించేందుకు టిఆర్‌ఎస్ శ్రేణులతో దగ్గర ఉండి ఏర్పాట్లు చేయిస్తూ పర్యవేక్షిస్తున్నారు. చెల్పూర్ నుండి భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయం వరకు పట్టణ ప్రధాన రహదారి పొడవునా సుమారు 6 కిలోమీటర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ మద్యలో సిరిస్ బల్బులలు పెట్టడంతో భూపాలపల్లి పట్టణం జిగిళ్లు మంటుంది.

జనగామ జిల్లా కలెక్టర్‌గా దేవసేన
జనగామ టౌన్, అక్టోబర్ 10: తెలంగాణ ప్రభుత్వం జనగామ జిల్లా కలెక్టర్‌గా దేవసేనను నియమించింది. దేవసేన గత కొన్ని మాసాల కిందటనే కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదవి బాధ్యతలను స్వీకరించి విధులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన నూతన జిల్లాలకు ఐఎఎస్ అధికారులను కేటాయించడం, అం దులో ఈమెకు జనగామ జిల్లా కలెక్టర్ గా అవకాశం వచ్చింది. అలాగే ఇప్పటి వరకు డిఇవోగా రేణుక, జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్‌గా రాంచంద్రం, జిల్లా పరిపాలన అధికారిగా విశ్వప్రసాద్, ఐసిడిఎస్ పిడిగా చేర్యాల సిడిపివోగా పని చేస్తున్న పద్మజారమణలను నియమించినట్లు తెలిసింది. ప్రభుత్వ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను కేటాయించాల్సి ఉంది.

భావితరం కోసం కృషిచేయాలి
పాలకుర్తి, అక్టోబర్ 10: ఈ రోజు పుట్టే పిల్లల కోసమే కాకుండా భావితరం భవిష్యత్తు కోసం రాఘవపురం గ్రామం చేపడుతున్న చర్యలు అభినందనీయమని యునిసెఫ్ భారతదేశ ప్రతినిధి జేమ్స్ అన్నారు. సోమవారం మండలంలోని ఆదర్శగ్రామమైన రాఘవపురంను యునిసెఫ్ భారతదేశ ప్రతినిధి జేమ్స్, తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రూత్‌లియా, బాల వికాస డైరెక్టర్ సింగారెడ్డి శౌరెడ్డిలు సందర్శించగా వారిని గ్రామ సర్పంచ్ నల్లా నాగిరెడ్డి, గ్రామస్థులు పుష్పగుచ్చాలతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామం లో డప్పువాయిద్యాలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నల్లా నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యునిసెఫ్ దేశ ప్రతినిధి జేమ్స్ మాట్లాడారు. పిల్లల ఆరోగ్యం కోసం యునిసెఫ్ చేపడుతున్న లక్ష్యాన్ని రాఘవపురం గ్రామస్థులు ఐక్యంగా ఉండి తోడ్పాటునందించడం గర్వించదగ్గ విషయమన్నారు. గ్రామస్థులందరూ ఐకమత్యాన్ని ఇలాగే కొనసాగించి అభివృద్ధిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య వంటి అంశాలపై ప్రాముఖ్యతనిస్తూ 160 దేశాల్లో తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిశుభ్రమైన తాగునీరు, బహిరంగ మలవిసర్జన నిషేధం, వందశాతం మద్యపాన నిషేధంతో ఆరోగ్యవంతమైన జీవితం గడపడం అభినందనీయమన్నారు. రాఘవపురం గ్రామ స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో రాఘవపురం గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. 8 కమిటీలతో గ్రామ సర్పంచ్ నల్లా నాగిరెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ్భారత్ స్ఫూర్తి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామజ్యోతి, హరితహారం వంటి కార్యక్రమాలు ముందుండి చైతన్యవంతంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వందశాతం అక్షరాస్యతను సాధించి జిల్లా కలెక్టర్ వాకాటి కరుణచే సర్పంచ్ ప్రశంసలు పొందడమే కాకుండా రూ.2.50లక్షలు స్టడీ మెటిరియల్స్ పొందడంలో గ్రామస్థుల కృషి ఎంతో ఉందన్నారు. మహిళా సంఘం సభ్యులతో రూత్‌లియా కోలాట నృత్యాలు చేస్తూ తెలంగాణ ఆటపాటలతో గ్రామస్థులను ఉత్సాహపరిచారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకున్నందుకు గ్రామస్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రూత్‌లియా, బాలవికాస డైరెక్టర్ సింగిరెడ్డి శౌరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డిఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎఈ ప్రశాంతి, ఇవోపి ఆర్‌డి గుండా నర్సింహ్మమూర్తి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రాగం కొమురెల్లి, ముస్కు కొంరెల్లి, మధుసూదన్‌రావులు పాల్గొన్నారు.

నేటి నుంచి కొలువుదీరనున్న కొత్త జిల్లాలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, అక్టోబర్ 10: కొత్త జిల్లాల ఆవిర్భావానికి రంగం సిద్ధమయింది. వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలను దసరా పండుగ మంగళవారం రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు ఇంచుమించుగా పూర్తయ్యాయి. కొత్త జిల్లాల కలెక్టర్ల నియామకం పూర్తవగా, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారుల నియామకం కసరత్తు కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రికి ఈ కసరత్తు పూర్తిచేసి ఉత్తర్వులు జారీ చేస్తారని అధికారవర్గాల సమాచారం. ఐదు రెవెన్యూ డివిజన్లు, 51మండలాలతో ఉన్న ప్రస్తుత వరంగల్ జిల్లాను ప్రభుత్వం మార్పులు, చేర్పులతో ఐదు జిల్లాలుగా ప్రకటించింది. జిల్లా నుంచి చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపిన ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి 12మండలాలను, జిల్లాలో కొత్తగా మరో 12మండలాలను ఏర్పాటుచేసి మొత్తం 74మండలాలను ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ కేంద్రాలుగా మంగళవారం నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి.
వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌తోపాటు 12మండలాలు పనిచేస్తాయి. వరంగల్ రూరల్ జిల్లాలో పాత నర్సంపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు కొత్తగా వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతోంది. ఈ జిల్లాలో 14మండలాలు ఉంటున్నాయి. ఆచార్య జయశంకర్ జిల్లాలో ఇప్పుడు ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌తోపాటు కొత్తగా భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతోంది. ఈ జిల్లాలో 19మండలాలను కలిపారు. ఈ జిల్లా పరిధిలో 16మండలాలు ఉంటున్నా యి. చివరి నిమిషంలో ప్రభుత్వ ఆమోదం పొందిన జనగామ జిల్లాలో జనగామతోపాటు కొత్తగా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీచేసేందుకు సిద్ధమయిన ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం పూర్తిచేసింది. వరంగల్ అర్బన్ జిల్లాకు ఆమ్రపాలి, రూరల్ జిల్లాకు ప్రస్తుత జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మహబూబాబాద్ జిల్లాకు ప్రీతి మీనా, జనగామ జిల్లాకు దేవసేన, భూపాలపల్లి జిల్లాకు మురళిని కలెక్టర్లుగా నియమించారు. అదే విధంగా భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎస్పీల నియామకం కూడా జరిగింది. అదే విధంగా ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాస్థాయిలో అన్ని జిల్లాల కలెక్టరేట్లకు డిఆర్వోలు, ఆర్డీఓలు, ఏఓలు, కొత్త మండలాలకు తహశీల్ధార్ల నియామకం ఇప్పటికే పూర్తిచేసారు. వైద్య, విద్య, నీటిపారుదల, అటవీ, ఎక్సైజ్ శాఖలతోపాటు అన్ని కీలకశాఖల జిల్లా అధికారుల నియామకం కూడా ఇంచుమించుగా పూర్తయింది.

కొత్త జిల్లాల ఏర్పాటుతో 111 ఏళ్ల సుభాకు తెర
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, అక్టోబర్ 10: నిజాం కాలంలో ‘సుభా’ పేరుతో వరంగల్ నగరం కేంద్రంగా ఏర్పడిన వరంగల్ జిల్లా తాజాగా జరుగుతున్న జిల్లాల పునర్విభజనలో ఐదు ముక్కలుగా విడిపోతోంది. 111 సంవత్సరాల చరిత్ర ఉన్న వరంగల్ జిల్లా మంగళవారం నుంచి ఐదు జిల్లాలుగా మారిపోతోంది. 1905 అక్టోబర్‌లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో ఏర్పడిన నాటి సుభాగా ఏర్పడిన కాకతాళీయంగా అదే అక్టోబర్‌లో ఐదు జిల్లాలుగా విభజనకు గురవుతోంది. నాటి నిజాం ప్రభువు హైదరాబాద్ రాష్ట్రంలోని సుభాలను పునర్విభజన చేసిన సందర్భంలో వరంగల్ కేంద్రంగా సుబేదార్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని కొంతకాలం నిజాం ప్రభువు స్వతంత్ర దేశంగా పాలించినా ఆ తరువాత తప్పనిసరి పరిస్థితిలో దేశంలో విలీనం చేయకతప్పలేదు. ఆ తరువాత కూడా కొంతకాలం సుభా వ్యవస్థ కొనసాగింది.
1952లో కలెక్టర్ పేరుతో కొత్త జిల్లాల వ్యవస్థ అమలులోకి వచ్చింది. అప్పటి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉండగా, 1985లో పరకాల నుంచి రెవెన్యూ డివిజన్‌ను ములుగు కేంద్రానికి మార్చారు. పాలనా సౌలభ్యం కోసం ఆ తరువాత రాష్టవ్య్రాప్తంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సందర్భంలో జిల్లాలో నర్సంపేట, జనగామ డివిజన్లు ఏర్పాటు జరిగాయి. ప్రారంభంలో జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, పరకాల, ములుగు, జనగామ, నర్సంపేట తాలూకాలు మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పనిచేసిన హయాంలో మరో తొమ్మిది తాలుకాలు ఏర్పాటు చేసారు. టిడిపి కొత్తగా అధికారంలోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాల స్థానంలో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సందర్భంలో జిల్లాను 50 మండలాలుగా విభజించారు. పదేళ్ల కిందట వరంగల్ నగరంలోని వరంగల్ ప్రాంతానికి కొత్త మండలం ఏర్పాటు చేయటంతో మండలాల సంఖ్య 51కి పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్టస్రమితి అధినేత చంద్రశేఖర్‌రావు తమ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన జరిపి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు రెండు సంవత్సరాలుగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు కొనసాగింది. రెండునెలల కిందట కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగా వివధ వర్గాలతో సంప్రదింపులు, ప్రజాభిప్రాయ సేకరణ, మంత్రివర్గ సమావేశాలు, పార్టీ ప్రముఖులతో, ఉన్నతాధికారులతో చర్చల అనంతరం మంగళవారం కొత్త జిల్లాలు ఆవిర్భవిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుత వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా విడిపోతోంది. ప్రస్తుత వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలాలు కొత్తగా ఏర్పడుతున్న సిద్దిపేట జిల్లలో కలుస్తుండగా ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 12 మండలాలు కలవడంతోపాటు కొత్తగా మరికొన్ని మండలాల ఏర్పాటుతో వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా మారుతోంది.