వరంగల్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, నవంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ, మార్కెటింగ్‌రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం ఆయనతోపాటు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, గిరిజన సంక్షేమశాఖ అధికారి అజ్మీరా చందూలాల్‌లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూ.1024కోట్లతో 17లక్షల మెట్రిక టన్నుల అదనపు సామర్థ్యంతో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేవిధంగా 330గోడౌన్‌ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు రైతులు పండించిన ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ మార్కెట్‌లకు పూర్వవైభవం వచ్చిందని అన్నారు. మార్కెట్ కమిటి పాలకమండలి పూర్తిస్థాయిలో పనిచేసి వ్యాపారులకు, రైతులకు అన్ని సదుపాయా కల్పించాలన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ములుగు ప్రాంతానికి వ్యవసాయ అభివృద్ధిలో అరుదైన చరిత్ర ఉందని, కాకతీయులు, రెడ్డిరాజుల పాలనలో లక్నవరం, రామప్ప, గణపురం చెరువుల నిర్మాణాలు జరిగాయని, ఒక ములుగు నియోజకవర్గంలోనే సుమారు 2వేలకుపైగా చెరువులు ఉన్నాయని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌యార్డుల నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తుందని అన్నారు.వ్యవసాయరంగంలో రూ.17వేల కోట్లను రైతు రుణమాఫీ కింద మాఫీ చేసిందని, మూడో విడత నగదును విడుదల చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా సాగు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ములుగు వ్యవసాయ మార్కెట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే పెద్దదని, రైతులు తమ ధాన్యాన్ని నేరుగా మార్కెట్‌యార్డుకు తరలించాలని కోరారు. అనంతరం మార్కెట్ చైర్మన్‌గా అజ్మీరా ప్రహ్లాద్, పాలకమండలి సభ్యులచే మంత్రులు ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు వారు మండలంలోని బండారుపల్లి మోడల్‌స్కూల్‌లో రూ.కోటి28లక్షలతో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఆతర్వాత బండారుపల్లి గ్రామశివారులో రూ.కోటి 20 లక్షలతో చేపట్టనున్న బంజారా భవన్‌కు స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు.ములుగు మండలకేంద్రంలో రూ.కోటితో నిర్మించనున్న ఎంఎల్‌ఎ క్వార్టర్స్ భవన నిర్మాణానికి ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మేకలు, గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, తదితరులు పాల్గొన్నారు.

రబీ పంటకు రైతులను సిద్ధం చేయాలి
జనగామ టౌన్, నవంబర్ 2: రబీ పంటకు రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించాలని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. బుధవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, నీటి పారుదల, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను నింపేందుకు మంచి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 40వేల ఎకరాల్లో పంటలు పండించేందుకు కావాల్సిన నీటిని అందించేందుకు అవకాశముందన్నారు. రబీ పంటకు సంబంధించిన ప్రణాళికలను ఈ నెల 9 లోగా తమకు అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, పురుగుల మందులతో పాటు సరిపోను విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, డిఈలు యశ్వన్, కె.రవీందర్‌రెడ్డి, ఎడిఎలు సుగుణాకర్, లాల్‌చంద్, సంధ్యారాణి, డిఎవోలు వీరునాయక్, డిహెచ్‌వో లత, తహశీల్దార్లు చెన్నయ్య, విజయ్‌భాస్కర్‌లు పాల్గొన్నారు.

పోలీసుల దమనకాండను నిలిపివేయాలి
వడ్డేపల్లి, నవంబర్ 2: ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలోని జంత్రి అడవులలో కొనసాగిస్తున్న పోలీసుల దమనకాండను నిలిపివేయాలని విరసం నేత వరవరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఓబిలో గత నెల 24వ తేదీనుండి 29వ తేదీ వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం దారుణమని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణకు చెందిన 32 మంది మావోయిస్టులను అతి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఆచూకీ లేని అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి, పోలీసులకు మాత్రమే తెలుసునని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బాక్సైట్ గనులను బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడి దారులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనులను దోచిపెట్టే క్రమంలో బాక్సైట్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ నాయకత్వాన్ని అత్యంత పాశవికంగా అణచివేస్తూ, ఫాసిస్టు హిట్టర్‌లాగా ప్రజలను, నాయకులను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.