వరంగల్

రూ. 174.26 కోట్లతో కెయు బడ్జెట్ ఆమోదం * 9.28 కోట్ల లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, మార్చి 29: కాకతీయ విశ్వవిద్యాలయం సేనేట్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి 9.28 కోట్ల లోటుతో వార్షిక బడ్జెట్ ఆమోదించింది. మంగళవారం కెయు సెనేట్‌హాల్‌లో 31వ సేనేట్ సమావేశం జరిగింది. ఇంచార్జి విసి చిరంజీవులు లేని కారణంగా కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డీన్ సీనియర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ సేనేట్ సమావేశానికి అధ్యక్షత వహించి, బడ్జెట్ ప్రవేశపెట్టారు. కెయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్త్ఫా హుస్సేన్ పాల్గొన్న సమావేశంలో సుబ్రమణ్యశర్మ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 174.26 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సేనేట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బడ్జెట్ మొత్తాన్ని ఎనమిది భాగాలుగా రూపొందించి, ప్రతి భాగం కింద ఆదాయ, వ్యయాలను పేర్కొన్నారు. డెవలప్‌మెంట్ ఫండ్ బడ్జెట్ 14.23కోట్లు, స్పెషల్ ఫండ్స్‌కు 2.63కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల బడ్జెట్ 4.27కోట్లు, సెల్ప్ సపోర్టింగ్ ప్రొగ్రామ్స్‌కు 9.67కోట్లు, దూరవిద్య కేంద్రానికి 16.67కోట్లు, వనరుల సమీకరణ బడ్జెట్ 29.43కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి జీత భత్యాల నిమిత్తం 67.03 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రానున్నదని, మిగతా ఆదాయాన్ని అంతర్గత వనరుల ద్వారా సమీకరించునున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో 35 శాతం వేతనాలు, 26శాతం పెన్షన్లు, అభివృద్ది పనులకు 7 శాతం కేటాయించి ప్రతిపాదనలు చేశారు. ఇంచార్జి రిజిస్ట్రార్ అల్త్ఫా హుస్సేన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ది గురించి సభ్యులకు వివరించారు. అనంతరం సేనేట్ సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాజీ విసి విద్యావతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యలో, పరిశోధనా పద్దతులలో ప్రమాణాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అద్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలిపారు. మాజీ విసి లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గిస్తుందని, వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అన్నారు. సిబిసిఎస్ విధానం డిగ్రీ కళాశాలలకు భారంతో కూడుకున్నదని వివరించారు. సమావేశంలో దూరవిద్యా సంచాలకులు ప్రొ.దినేష్‌కుమార్, డీన్లు ప్రొ.రంగారావు, ప్రొ.కృష్ణకాంత్, ప్రొ.మహేందర్‌రెడ్డి, ప్రొ.రవికుమార్, సిడిసి డీన్ ప్రొ.దామోదర్, అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొ.రమేష్, పరీక్షల నియంత్రణాధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

అరుదైన ఆపరేషన్లు
ఆయనకే సొంతం!
రెండోసారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన డా. సుగుణాకర్‌రాజు
జనగామ టౌన్, మార్చి 29: అరుదైన ఆపరేషన్లు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కాపాడడం ఆయనకే సాధ్యం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిండు గర్భిణీలను సెకన్లలో శస్త్ర చికిత్సలు చేసి తల్లి గర్భం నుంచి పాపలను బయటకు తీసి తల్లీపిల్లలను కాపాడటంలో ఆయనను మించిన వారు లేరు. జనగామ పట్టణానికి చెందిన డా. పగిడిపాటి సుగుణాకర్‌రాజు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ రెండవ సారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించి వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో తమ పేరును నమోదు చేసుకొని కీర్తి ప్రతిష్టలను నలుదిశలా చాటుతున్నాడు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నర్మెట మండలం సోలిపురం గ్రామానికి చెందిన బి. శ్రీనివాస్ భార్య రమాదేవి నిండు గర్భిణీతో ఉండగా ఆమెకు మెదడుకు పక్షవాతం వచ్చి కోమాలోకి వెళ్లిపోయిందని తెలిపారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెకు శస్తచ్రికిత్స చేసి బాబుకు జన్మనిచ్చేలా చేశానన్నారు. 2007లో ఒకసారి, తిరిగి ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు.

రెడ్‌సిగ్నల్ దాటిన పుష్‌పుల్ రైలు
రెండు గంటలు ఆలస్యం * కాజీపేట వరకే కుదింపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 29: హైదరాబాద్ నుండి వరంగల్‌కు వచ్చే పుష్‌పుల్ రైలు మంగళవారం ఘట్‌కేసర్ వద్ద రెడ్‌సిగ్నల్ క్రాస్ అయింది. దాదాపు 70 మీటర్ల మేర రెడ్‌సిగ్నల్ క్రాస్‌కావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. రైలు డ్రైవర్ తిరుపతిని వెంటనే విధుల నుండి తప్పించి తాత్కాలికంగా మరో డ్రైవర్‌తో రైలును పంపించారు. ఈ సంఘటనతో రైలు రెండు గంటలు ఆలస్యం కావడంతో వరంగల్ వరకు వెళ్లాల్సిన పుష్‌పుల్ రైలును కాజీపేట వరకే కుదించారు. రెడ్‌సిగ్నల్ దాటిన డ్రైవర్ తిరుపతిపై తక్షణమే రైల్వే ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో డ్రైవర్ తిరుపతిపై వేటు పడనుంది. కాగా రెడ్‌సిగ్నల్ పడిందంటే ముందు మరో రైలు కానీ, మరేదైనా ఇతర కారణాలు ఉంటే తప్ప రైల్వే అధికారులు రెడ్ సిగ్నల్ వేయరు. రెడ్‌సిగ్నల్ వేసినప్పటికీ రైలు క్రాస్ కావడమంటే పెద్ద ప్రమాదమే తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మల్లన్న హుండీ ఆదాయం
రూ. 26.58 లక్షలు
చేర్యాల, మార్చి 29: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపులు జరుగగా రూ. 26 లక్షల 58 వేల 996ల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన ఇవో రామకిషన్‌రావు తెలిపారు. నగదుతో పాటు 67 గ్రాముల బంగారం, 3కిలోల 6గ్రాముల వెండి, తొమ్మిది క్వింటాళ్లన్నర బియ్యం సమకూరినట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు హుండీ లెక్కింపులు జరిగాయని అన్నారు. దేవస్థాన చైర్మన్ బద్దిపడిగ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వామివారి జాతరకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఎంపిడిఓ నిరసన!?
శాయంపేట, మార్చి 29: తాను పనిచేసే కార్యాలయం ఎదుటే మంగళవారం శాయంపేట ఎంపిడిఓ నల్లబ్యాడ్జీ ధరించి నిరసన దీక్ష చేయడం చర్చనీయంశమైంది. మండలంలోని 18 గ్రామాల ప్రజలకు వారధిగా వ్యవహరిస్తు ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలు, సంక్షేమం చూడాల్సిన బాధ్యత గల మండలాధికారి ఎంపిడిఓ ఆ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిడిఓనే నల్లబ్యాడ్జితో ఆందోళనకు దిగడం ఏమిటని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎంపిడిఓ భధ్రునాయక్ శాయంపేటకు చేరుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలువడం, తరువాత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మీడియాకు సమాచారం అందించి కార్యాలయంకు చేరుకొని కార్యాలయం ప్రధాన ద్వారం ముందు ఎంపిడిఓ భద్రు నల్లబ్యాడ్జితో కూర్చొని నిరసన తెలిపారు. పాత్రికేయులు, మీడియా వచ్చేంత వరకు మాత్రమే కేవలం 20 నిమిషాలలోపు నిరనస ముగించుకొని హన్మకొండకు బయలుదేరి వెళ్లారు.

బడుగుల అభివృద్ధి ఎన్టీఆర్ చలువే
* వరంగల్‌లో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు
బాలసముద్రం, మార్చి 29: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఎన్టీఆర్ చలువేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ నగరంలో ఘనంగా జరిగాయి. ముందుగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన టిడిపి ఆవిర్భావ వేడుకల్లో రేవూరి ప్రకాష్‌రెడ్డి పాల్గొని కేక్‌కట్ చేసి అనంతరం మాట్లాడారు. సామాన్యులకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ ఆరేనన్నారు. రాష్ట్రంలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టింది దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావేనని అన్నారు. పేదలకు గృహ నిర్మాణాలు కట్టించింది కూడా ఎన్టీఆరేనన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావంతోనే అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేదల పక్షపాతి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కుందూరు అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నీటి ఎద్దడితో జాగ్రత్త..!
సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి * రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 29: వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాగునీటి ఎద్దడి, ఎండ తీవ్రత, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలు, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ఆవాస గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణపై గ్రామాల వారీగా సమీక్షించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తాగునీటి సమస్య నివారణకు విడుదలైన కార్యచరణను సక్రమంగా వినియోగించాలన్నారు. బోర్లను వేయవద్దని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. వేసవిలో వడగాల్పుల బారీన పడకుండా ప్రజలలో విస్తృతంగా అవగాహన కలిగించాలని, బస్టాండ్‌లలో, ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సిహెచ్ సిలలో, బస్టాండ్‌లలో మెడికల్ సిబ్బంది ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఫిబ్రవరి చివరి వారంలో ఆవాస ప్రాంతాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు, 11 కరువు మండలాలతో పాటు, జిల్లా వ్యాప్తంగా మండల స్పెషల్ అధికారులు, ఇతర మండల అధికారులతో కూడిన మండల స్థాయి కమిటీ ద్వారా తాగునీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తలెపారు. జిల్లాకు నాన్ సిఆర్‌ఎఫ్ కింద, సిఆర్‌ఎఫ్ కింద వచ్చిన నిధులను తాగునీటి సమస్య నివారణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమగ్ర రక్షిత నీటి పథకాలకు నిర్వహణకు సంబంధించి 2 కోట్ల 15 లక్షలు మంజూరు చేయాలని, 215 గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ జిల్లాల నుండి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు విడుదల చేయగలరని, ఈ విధంగా కేవలం నిర్వహణ మరమ్మత్తులకే వినియోగించుకోవాలని, విద్యుత్, జీతాలకు ఖర్చు చేయవద్దని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 8 కోట్ల 94 లక్షల నిధులు విడుదలకు కోరగా 3కోట్ల 10 లక్షల నిధులు విడుదల చేశారని, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధిగమించేందుకు నిధులు విడుదల చేయాలని కలెక్టర్ కోరారు. దేవాదుల నుండి గోదావరి జలాలను పంపింగ్ చేయుటకు టెండర్ ఖరారుకు పంపిన ప్రతిపాదనలను చీఫ్ ఇంజనీర్ ఆమోదం కావాల్సివుందని, కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవచ్చారు.

వడదెబ్బకు మహిళ మృతి
మొగుళ్ళపల్లి, మార్చి 29: మొగుళ్ళపల్లి మండలం మేదరమెట్ల గ్రామంలో మంగళవారం ఉపాధి పనులకు వెళ్లిన నాంపెల్లి అరుణ (48) వడదెబ్బ తగిలి మృతి చెందింది. గతంలో భర్త స్వామి, కుమారుడు రమేష్ సైతం పలు కారణాలతో చనిపోయారు. అల్లుడు వద్ద ఉంటుంది. అరుణ కూలీ పనికి వెళ్లి వడదెబ్బతో చనిపోవడం ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామ సర్పంచ్ సుధీర్ కోరారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
* 110 మంది సత్ప్రవర్తన ఖైదీల విడుదల
* ఒక్కొక్కరిది ఒక్కో గాథ
* మర్డర్ కేసులో ఇరుక్కున్న వారే ఎక్కువ
* క్షణికావేశానికి గురయ్యాం
* పశ్చాత్తాప పడుతున్నాం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 29: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి వారికి జైలు నుండి విముక్తి కల్పించింది. దీంతో వరంగల్ రేంజ్ పరిధిలో ఉన్న 110 మంది జీవిత, దీర్ఘకాలిక శిక్షలు పడిన ఖైదీలకు విముక్తి లభించింది. మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలు నుండి 59 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఒక్కో ఖైదీది ఒక్కో గాథ. క్షణికావేశానికి లోనై కొందరు, చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నది మరికొందరు వారి బాధలను వెళ్లబుచ్చుకున్నారు. విడుదలైన ఖైదీలలో ఎక్కువ మంది మర్డర్ కేసులో ఇరుక్కున్నవారే అందులో కొందరు భార్యను చంపిన కేసులో శిక్ష పడగా మరికొందరు భూతగాదాల్లో ప్రత్యర్ధులను చంపి శిక్ష పడినవారు ఉన్నారు. ఖమ్మం జిల్లా చింతగాని మండలం నాగులవంచకు చెందిన సుధీర్‌కుమార్, నాగమణి దంపతులు భూ వివాదంలో మర్డర్ కేసులో ఇరుక్కొనగా పది సంవత్సరాలు శిక్ష పడింది. ఆరు సంవత్సరాలు శిక్ష అనుభవించి సత్ప్రవర్తన కలిగిన జాబితాలో చోటు దక్కగా ఇద్దరు భార్యభర్తలు విడుదల అయ్యారు. వీరు జైలు పాలు కావడంతో వీరి కూతురు అనాధ హాస్టల్‌లో చదువుకుంటుంది. తెలుసో తెలియకో తప్పుచేశాం, గతం గతహః, ఇక నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా బ్రతుకుతామని తెలిపారు. జైల్లో తమను అధికారులు ఒక ఖైదీలుగా కాకుండా సొంతవారిలా చూసుకున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం సారంగపూర్‌కు చెందిన హిమామ్, సకినా అనే మరో దంపతులు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. కోడలినే కొడవలితో చంపిన కేసులో అతని కొడుకుతో పాటు హిమామ్, సకినలకు 2008లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆరున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన వీరు సత్ప్రవర్తన ఖైదీలుగా గుర్తించి విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన పల్లపు బాలస్వామి ఈయన భార్యను చంపిన కేసులో జీవిత ఖైదు శిక్షపడింది. సత్ప్రవర్తన కింద పది సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చారు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన కుంచం శంకర్ తన భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదీ శిక్ష పడగా 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. నర్సంపేటకు చెందిన డొల్లు రాములు భార్యను చంపిన కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. ఇలా విడుదలైన ప్రతి ఒక్కరి బాధ ఒక రకంగా ఉంది. శిక్ష పడి సత్ప్రవర్తన కింద బయటకు వచ్చిన ఖైదీలందరు జైలు జీవితం అనుభవిస్తూనే పనులు చేసుకుంటూ సంపాధించుకున్నారు. జైలు నుండి విడుదలయ్యే ముందు వారు జమ చేసుకున్న డబ్బులు కూడా జైలు అధికారులు వారికే ఇచ్చి పంపించారు.

ఇన్‌స్పెక్టర్లకు కమిషనర్ క్లాస్
పోలీస్‌స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి * చోరీలపై స్పందించిన సిపి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 29: పోలీస్‌స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలపై నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనరేట్ ఏసిపి ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్న ఈ నేర సమీక్షా సమావేశంలో పోలీస్‌స్టేషన్ల వారిగా పెండింగ్ కేసుల వివరాలతో పాటు, కేసులలోని నిందితులను అరెస్టు చేయడంలో జరిగిన ఆలస్యంతో, పెండింగ్ కేసుల దర్యాప్తు తీరు, పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్టేషన్ అధికారులు చేపడుతున్న చర్యలతో పాటు, స్టేషన్ సిబ్బంది పనితీరుపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల కమిషనరేట్ పరిధిలో జరిగిన చోరీలపై కమిషనర్ ప్రత్యేకంగా స్పందిస్తూ చోరీలకు పాల్పడి నిందితుల గుర్తింపు కోసం సంబంధిత పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టారని కమిషనర్ సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లను వివరణ అడిగారు. కమిషనర్ అధికారులకు కొన్ని సూచనలు చేస్తూ ప్రతి డివిజనల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో రోజువారి దిన చర్యను రూపొందించుకోవాలని, ముఖ్యంగా నేరాలు పరిష్కరించుకోవడం కోసం ప్రతి కేసు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను తయారు చేసుకొని వీటి ఆధారంగా కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శాంతి భద్రతలకు సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని క్లబ్‌లలో పేకాట ఆడేందుకు ఎలాంటి అనుమతులు లేవని, కావున క్లబ్‌లతో పాటు మరే ఇతర ప్రాంతాలలో పేకాట ఆడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మహిళల మిస్సింగ్ కేసుల విషయంలో అధికారులు తక్షణమే స్పందించి తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అదే విధంగా అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కేసులను నమోదు చేయాలని అన్నారు. కమిషనర్ నగర ట్రాఫిక్‌పై మాట్లాడుతూ నగర ప్రజలకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ అశోక సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ల పరిసరాలను ఆహ్లాదకరంగా ఉండే విధంగా స్టేషన్ పరిసరాలను పచ్చదనం కోసం మొక్కలను ఏర్పాటు చేయాలని, ఇటీవల ప్రజల భద్రత కోసం కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన హక్ ఐ అండ్రాయిడ్ సెల్ ఫోన్ అప్లికేషన్‌పై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, నేరాల నియంత్రణ కోసం కమిషనరేట్ పరిధిలో మరిన్ని సిసి కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులను ప్రోత్సహించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు డిసిపి యాదయ్య, వరంగల్, హన్మకొండ, కాజీపేట్, క్రైం, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసిపిలు సురేందర్‌నాధ్, శోభన్‌కుమార్, జనార్దన్, ఈశ్వర్‌రావు, రవిందర్‌రావు, రమేష్‌లతో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐ, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పరిపాలన విభాగం పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.