వరంగల్

నేటి బాలలే రేపటి దేశ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 14: నేటి బాలబాలికలే రేపటి రోజుల్లో దేశ సంపద అని, అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జనగామలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక ఓంసాయి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభకు కలెక్టర్ శ్రీదేవసేన అధ్యక్షత వహించగా డిప్యూటీ సి ఎం కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బాల బాలికలపై దృష్టిసారించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం 2016-17లో ఏర్పాటు చేయనున్న 450 గురుకుల పాఠశాలల్లో 225 పాఠశాలలు ప్రత్యేకంగా బాలికలకే కేటాయించనుందని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధానంగా బాలికలను అన్ని రంగాల్లో ప్రధానంగా విద్యలో ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాడని అన్నారు. ఏ పోటీ పరీక్ష చూసినా ఆడపిల్లలే ముందంజలో నిలవడం శుభపరిణామమన్నారు. వారికి మరింత తోడ్పాటును అందిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల కిందట బేటీ బచావో.. బేటీ పడావో... అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. గత కొన్ని రోజుల కిందట విద్యాశాఖ మంత్రుల జాతీయ స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అయినప్పటికీ స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కొరత విధించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటునందిస్తున్నారని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక విద్యలో విలీనం చేసేందుకు సి ఎం కెసి ఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. తద్వారా అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రతతో పాటు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు మరింత సరైన న్యాయం చేకూరే అవకాశం ఉంటుందన్నారు. చిన్న పిల్లలందర్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించుకోవాలని అన్నారు. బాలికలపై లింగ వివక్షత ఏమాత్రం చూపవద్దని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని గుర్తుచేశారు. బాలికలను రక్షించుకుందాం.. చదివించుకుందాం... ప్రోత్సహించుకుందాం... అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం కౌన్సిల్ చీప్‌విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా. తాటికొండ రాజయ్యలు మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.
ఆకట్టుకున్న వేషధారణలు...
బాలల దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో కొద్దిసేపు ప్రజలనుద్దేశించి మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి నెహ్రూపార్క్, రైల్వే బ్రిడ్జి, ఆసుపత్రి, గెస్ట్‌హౌస్ రోడ్డు మీదుగా సభాస్థలి వరకు మహాప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో డిప్యూటీ సి ఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా. రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేనలు ముందుభాగంలో వెళ్తూ అందరినీ పలకరిస్తూ నడిచారు. చిన్నారులు నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీభాయి, తెలంగాణ తల్లి తదితర వేషధారణలో పాల్గొని అలరించారు. అలాగే కలెక్టర్ శ్రీదేవసేన బతుకమ్మను నెత్తిన పెట్టుకొని మహిళల్ని ఉత్సాహపరిచారు. భజన మండలి మహిళలు బోనాలు ఎత్తుకొని చేసిన కోలాట నృత్యాలు ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక సారధి బృందం ప్రతినిధులతో పాటు చిందు యక్షగాన కళాకారులు నిర్వహించిన ఆటపాటలు ప్రజల్ని ఉత్తేజభరితుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, మున్సిపల్ వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, డిడబ్ల్యూవో, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజారమణ, డిఆర్‌డివో పిడి శ్రీనివాస్‌కుమార్, వివిధ మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.