వరంగల్

జిల్లా కమిటీల నియామకం ఎప్పుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 4: పరిపాలనా సౌలభ్యం పేరిట వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించి సుమారు రెండు నెలలు కావస్తున్నా అధికార పార్టీ టిఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయటంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన కొత్త జిల్లాల కమిటీల ఎంపిక పూర్తయినట్లు ప్రచారం జరిగి చాలారోజులు కావస్తున్నా కమిటీలు ప్రకటించటంలో పార్టీల అగ్రనాయకత్వం జాప్యం చేస్తు వస్తున్నాయి. పూర్వ వరంగల్ జిల్లాను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయటం, దసరా రోజున ఈ జిల్లాలు ప్రారంభం కావటం అందరికీ తెలిసిందే. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు జరుగగా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయా జిల్లాల కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు బిజెపి, సిపిఐ, సిపిఎం, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం కొత్త జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయగా, కొత్త జిల్లాల్లో ఏర్పడిన కొత్త కమిటీలు ఆయా జిల్లాల్లో కార్యకలాపాలను ప్రారంభించాయి. కానీ అధికార టిఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కొత్త కమిటీల విషయంలో ఉలుకుపలుకు లేకుండా పోయింది. మిగతా పార్టీలతో పోలిస్తే టిఆర్‌ఎస్ అగ్రనాయకత్వంలో జిల్లా కమిటీల ఏర్పాటు విషయంలో ఆలస్యంగా కదలిక ఏర్పడినా నెలరోజుల కిందట కొత్త కమిటీలపై కసరత్తు పూర్తిచేసింది. పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో చర్చించి ఉద్యమ సమయంలో ప్రధాన పాత్ర పోషించిన నాయకులను జిల్లా కమిటీల అధ్యక్షులుగా ఎంపిక చేసింది. కానీ కొత్త కమిటీల ప్రకటన ఇప్పుడు, అప్పుడు అంటూ వాయిదాపడుతు వస్తోంది. మొదట గతనెల మొదటి వారంలో, ఆ తరువాత రెండవ వారంలో కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని పార్టీశ్రేణులు ఆశించగా పెద్దనోట్ల రద్ధు కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కమిటీల ప్రకటన మళ్లీ వాయిదాపడింది. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవటంలో తలలు బాదుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ జిల్లాల కమిటీలను ప్రకటించే విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అన్ని సరిగా ఉంటే ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీల ఏర్పాటు ప్రకటన వెలువడవచ్చని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభంలోనే కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా భరత్‌చందర్‌రెడ్డిని నియమించి కొత్త కమిటీల విషయంలో పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందని రాష్ట్ర నాయకత్వం పార్టీశ్రేణులను భ్రమింప చేసింది. కొత్త జిల్లాలు ప్రారంభమైన అక్టోబర్ నెలలోనే మహబూబాబాద్ జిల్లా కమిటీ నియామకం పూర్తయినందున మిగిలిన నాలుగు జిల్లాల కమిటీల నియామకానికి పెద్దగా సమయం పట్టదనే ప్రచారం పార్టీలో జరిగింది. కానీ ఇప్పటి వరకు కొత్త జిల్లాల కొత్త కమిటీల నియామకంపై పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉలుకు, పలుకు లేదని జిల్లా నాయకులు చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తే కొత్త నాయకత్వాలు ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని, కానీ కాలయాపన చేయటం వల్ల నాయకత్వం ఆశిస్తున్న నాయకుల్లో ఉత్సాహం నీరుకారపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్‌గా
బాధ్యతలు చేపట్టిన శృతి ఓఝా

వరంగల్, డిసెంబర్ 4: వరంగల్ మహానగర పాలక సంస్థ కమీషనర్‌గా ఐఎఎస్ అధికారి శృతి ఓఝా ఆదివారం పదవీబాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న శృతి ఓఝాను నగరపాలక సంస్థ కమీషనర్‌గా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం గతనెల చివరివారంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు శృతి ఓఝా ఆదివారం కొత్త విధులలో చేరారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సందర్భంలో వరంగల్ నగరపాలక సంస్థ కమీషనర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్‌గా నియమించింది. దాంతో నగర పాలకసంస్థ కమీషనర్ పోస్టు ఖాళీ అయింది. అప్పట్లోనే కొత్త కమీషనర్ నియామకం వెంటనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్రంలో రాజధాని హైద్రాబాద్ తరువాత పెద్దనగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉండటం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండటం, వీటితో సమానంగా సమస్యలు కూడా ఏళ్ల తరబడిగా తిష్ట వేయటంతో నగరపాలక సంస్థ కమీషనర్‌గా యువ ఐఎఎస్ అధికారిని నియమిస్తే అభివృద్ధి కార్యక్రమాలు, పాలనావ్యవహారాలు సజావుగా కొనసాగుతాయని కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. మరికొందరు నాయకులు ఐఎఎస్ అధికారులు అయితే పనుల విషయంలో కొరకరాని కొయ్యలుగా వ్యవహరిస్తారని, స్టేట్ సర్వీస్ అధికారులయితేనే బాగుంటుందంటూ వచ్చారు.
పెద్దనోట్ల రద్దుతో వెలవెలపోతున్న ఎటిఎంలు
* ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు

వరంగల్, డిసెంబర్ 4: పెద్దనోట్ల రద్దు అనంతరం పూర్వ వరంగల్ జిల్లాలో వివిధ బ్యాంకుల ఏటిఎం సేవలు పూర్తిగా స్తంభించాయి. అతి తక్కువ సంఖ్యలో ఏటిఎంలు పనిచేస్తుండటంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు సరైన సేవలు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదువందలు, వేయిరూపాయల నోట్లను రద్దు చేస్తు గతనెల ఎనిమిదిన కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటినుంచి వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఏటిఎం సర్వీసులు నిలచిపోయయి. ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు చెందిన ఒకటి, రెండు ఏటిఎంలు మాత్రమే సేవలు అందిస్తుండగా మిగతా ఏటిఎంలు పనిచేయకుండా పోయాయి. మిగతా బ్యాంకుల ఏటిఎంల సర్వీసులు పూర్తిగా నిలచిపోయాయి. కొన్ని బ్యాంకులు కొత్త రెండువేల రూపాయల నోట్లు విడుదలైన ప్రారంభంలో ఒకటి, రెండు రోజులు ఎంపిక చేసిన కొన్ని ఏటిఎంల ద్వారా డబ్బు అందచేసేందుకు ఏర్పాట్లు చేసినా, అలా డబ్బులు పెట్టిన కొద్ది నిముషాలకే ఇలా ఖాళీ కావటంతో వినియోగదారుల రద్దీ తట్టుకోలేక చేతులు ఎత్తివేసాయి. ఎక్కడ ఏటిఎం పనిచేసినా అన్ని బ్యాంకుల ఖాతాదారులు పొలోమంటూ లైన్లు కట్టడంతో వారి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కొన్ని ఏటిఎంలు పాతవి కావటం, ఏటిఎంల ద్వారా డబ్బు తీసుకునేవారి సంఖ్య పెరగటంతో పనిచేయకుండా మొరాయించాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి వస్తున్న డబ్బు తక్కువగా ఉండటం, అవి ఖాతాదారుల అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ఇంచుమించుగా అన్ని బ్యాంకులు ఏటిఎంల ద్వారా డబ్బు అందచేయడాన్ని నిలిపివేసి బ్యాంకుల ద్వారానే నగదు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో కొన్ని ఏటిఎంల తలుపులు మూతపడగా, మరికొన్ని దుమ్ముదూళి పేరకుపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకు శాఖలలో జరిగే లావాదేవీలతో పోలిస్తే ఏటిఎంల ద్వారా జరిగే నగదు చెల్లింపులు భారీగా కొనసాగగా పెద్దనోట్ల రద్దు పుణ్యాన ఏటిఎం కేంద్రాలను మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడిందని బ్యాంకర్లు వాపోతున్నారు.
ఇకపోతే రెండురోజుల సెలవు అనంతరం సోమవారం ఖాతాదారుల రద్దీని ఎలా తట్టుకోవాలని వివిధ బ్యాంకుల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నెల మొదటివారం కావటంతో, మొదటి మూడురోజుల్లో ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితిలో సోమవారం ఖాతాదారుల తాకిడి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ అధికారులు బావిస్తున్నారు. కొత్తనోట్ల కొరత కారణంగా ఉద్యోగులకు నిర్ణయించిన మొత్తాన్ని, పెన్షన్‌ను చెల్లించలేక మొదటి మూడురోజులు బ్యాంకు అధికారులు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. సెలవు రోజు ఆదివారాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని బ్యాంకులు ఆయా పట్టణాల్లో కొన్ని ఏటిఎంలలో కొంతమేరకు నగదు పెట్టినా, అవికాస్తా శనివారం రాత్రికే నిండుకున్నాయి. సెలవు అనంతరం సోమవారం బ్యాంకులు తిరిగి తెరచుకోనుండగా ఖాతాదారుల నుంచి ఇబ్బందులు తప్పవని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ళ స్థలాల పంపిణీ

* లాటరీ పద్దతి ద్వారా ప్లాట్లు కేటాయింపు
* అర్హులకు ఇళ్ళు రాలేదని స్థానికుల ఆవేదన
మంగపేట, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా మండలంలోని మల్లూరు గ్రామం సుందరయ్య కాలనీకి చెందిన 64మంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారులకు కలెక్టర్ ఆకునూరి మురళి ఆదివారం ఇళ్లస్థలాలను పంపిణీ చేశారు. సుందరయ్య కాలనీలో జరిగిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు లాటరీ పద్దతిలో స్థలాలను కేటాయించి పంపిణీ చేశారు. గ్రామానికి చెందని కొంతమంది అనర్హులకు ఇళ్లు వచ్చాయని కొంతమంది స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో లభ్దిదారుల పేర్లను చదవమని అధికారులకు ఆదేశించారు. అధికారులు మొత్తం 65మంది పేర్లను చదవి వినిపించగా ఒకరి పేరుకు అభ్యంతరం రావడంతో 64మందికి ఇళ్లస్థలాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మురళి మాట్లాడుతూ లబ్దిదారులు, అధికారులు, ఇళ్ల నిర్మాణ కమిటీ సభ్యులు సమన్వయంతో ఇళ్లను నాణ్యతతతో నిర్మించుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులు అధికారులకు సహకరించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం మరోమారు డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్లను మంజూరు చేయనుందని, ఇప్పుడు ఇళ్లు రాని అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంగపేట తహశీల్దార్ భిక్షం, ఎంపిడిఓ సురేష్‌బాబు, ఆర్‌ఐ రహమాన్, విఆర్‌ఓ జనార్ధన్, ఐటిడిఏ డిఈ మల్లయ్య, ఏఈ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల స్థలాల పంపిణీ సందర్బంగా గొడవలు జరగకుండా మంగపేట ఎస్‌ఐ మహేందర్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
* అర్హులకు అన్యాయం
డబుల్ బెడ్‌రూం పథకంలో భాగంగా మల్లూరు గ్రామంలో కేటాయించిన 65 ఇళ్లలో కొంతమంది అనర్హులకు ఇళ్లు దక్కాయని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లు దక్కలేదని స్థానికులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పక్కా ఇళ్లు ఉన్నవారికి, ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారికి కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారని ఈ సందర్బంగా పలువురు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు వారి కోడళ్లు, కూతుర్ల పేరుతో కొత్త ఇళ్లు దక్కించుకున్నారని, భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన ఒకరికి కూడా మల్లూరు సుందరయ్య కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారని ఇదెక్కడి న్యాయమని కొంతమంది వాపోయారు.
మైనర్ దివ్యాంగురాలిపై అత్యాచారం
* నిందితుడిని చితకబాదిన గ్రామస్తులు

వరంగల్, డిసెంబర్ 4: వరంగల్ నగర శివారులోని హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టివేసి చితకబాదిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ విషయం తెలిసి పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం పెగడపల్లి గ్రామానికి చెందిన 15సంవత్సరాల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన రవీందర్ అనే వ్యక్తి కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూ వచ్చాడు. ఆదివారం కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టగా ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలపటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు రవీందర్‌ను పట్టుకుని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. ఈ విషయం తెలిసి హసన్‌పర్తి పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను చికిత్స కోసం ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రైళ్లలో నల్లబెల్లం రవాణా
* సిగ్నల్ వ్యవస్థకు ఆటంకం.. ?
* కాజీపేట- విజయవాడ సెక్షన్‌లో నిలిచిపోయిన రైళ్లు
* ఘటనపై ఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల విచారణ
* పట్టాల వెంట పొదల్లో 10 క్వింటాళ్ల బెల్లం లభ్యం
కేసముద్రం, డిసెంబర్ 4: నాటుసారా తయారికి వినియోగించే నల్లబెల్లాన్ని కొందరు అక్రమంగా రైళ్లలో రవాణా సాగిస్తున్నారు. శనివారం రాత్రి రైల్లోంచి బెల్లం దింపేందుకు ఏకంగా సిగ్నల్ వ్యవస్థకు ఆటంకం కలిగించారని సమాచారం. శనివారం అర్ధరాత్రి వరంగల్ నుంచి నల్లబెల్లంను రైలులో తరలిస్తున్న దుండగులు ఇంటికనె్న స్టేషన్‌కు రైలు చేరకుండానే సిగ్నల్ పనిచేయకుండా ‘పట్టా’పై చిన్న ఇనుపముక్క అమర్చి గ్రీన్ సిగ్నల్ రాకుండా చేసి రైలు నిలిచిపోగానే రైల్లోంచి బెల్లం దించుతుండగా, రైలుకు లైన్ క్లీయర్ ఇచ్చినా.. ఔటర్‌లోనే ఎందుకు ఆగిపోవడం.. అప్‌లైన్‌లో చార్మినార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రావాల్సి ఉండటం.. కాకతీయ స్టేషన్‌కు రాకపోవడంతో చార్మినార్‌ను నిలిపివేసిన సిబ్బందికి చాలా సమయం వరకు కాకతీయ రాకపోవడంతో రైలు ఎందుకు అక్కడే నిలిచిపోయిందనే విషయాన్ని తెలుసుకోవడానికి స్టేషన్ సిబ్బంది ఇంజన్ వద్దకు పరుగులు పెట్టగా, సిబ్బందిని చూసి పోలీసులుగా భావించిన దుండగులు బెల్లం బస్తాలను ట్రాక్‌పక్కన పొదల్లో పడేసి ఉడాయించినట్లు సమాచారం. రైలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా రెడ్ సిగ్నల్ ఉండటాన్ని గమనించిన సిబ్బంది పట్టాలపై తనిఖీ చేయగా రెండు పట్టాల మద్య ఖాలీ ప్రదేశాన్ని కలిపేందుకు చిన్న ఇనుప ముక్కను పెట్టినట్లు గుర్తించి దాన్ని తొలగించడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీనితో ఈ విషయాన్ని స్టేషన్ సిబ్బంది పోలీసులకు, ఆర్పీఎఫ్‌కు చేరవేయడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగా పొదల్లో బెల్లం బస్తాలు లభ్యమయ్యాయి. దీనితో కేసముద్రం ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి బెల్లం బస్తాలను స్వాదీనం చేసుకొని ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కాగా అక్రమంగా నల్లబెల్లం రవాణా చేయడమే కాకుండా ఏకంగా సిగ్నల్ వ్యవస్థకు ఆటంకం కలిగించిన ఘటనను రైల్వే అధికారులు సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. ఆ మేరకు ఈ ఘటనపై ఆర్పీఎఫ్, జిఆర్‌పి, సివిల్ పోలీసుల చేత సంయుక్త విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఘటనకు కారకులైన వారిని గుర్తించి, వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
గ్రామాల్లో మినీ ఎటిఎం సేవలు షురూ..
* ఖాతాదారులకు కాస్త ఊరట
కేసముద్రం, డిసెంబర్ 4: గ్రామాల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా మినీ ఎటిఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేసముద్రం మండల కేంద్రంతో పాటు ఇనుగుర్తిలో వివిధ వాణిజ్య బ్యాంకులతో పాటు ఎటిఎంల్లో నగదు తీసుకోవడానికి ఖాతాదారులు, ప్రజలు గత కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు తోడుగా రోజుకు 2వేలే తీసుకోవాడనికి అనుమతించడం.. అందులో 2వేల నోటు మాత్రమే వస్తుండటంతో ఖాతాదారులు, ప్రజలు చిల్లర తీసుకోవడం పెద్ద కష్టంగా మారింది. ఈ నేపధ్యంలో శుక్రవారం నుంచి స్థానిక హెచ్‌పి పెట్రోల్ పంపులో స్వైపింగ్ మిషన్ ద్వారా మినీ ఎటిఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో బ్యాంక్ ఖాతాదారులెవరైనా సరే తమ ఎటిఎం కార్డుతో రోజుకు 2వేల వరకు నగదు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. వందకు తగ్గకుండా వంద నుంచి 2వేల వరకు తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీనితో చిన్న మొత్తం అవసరం ఉన్నవారికి కాస్త ఊరటనిస్తోంది. దీనితో తక్కువ మొత్తం కావాల్సినవారంతా పెట్రోల్ పంపుకు పరుగులు పెడుతున్నారు.

పరీక్షలంటే భయం వద్దు
*బ్రోచర్, లోగోను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రీతీమీనా

మహబూబాబాద్, డిసెంబర్ 4: పదవ తరగతి విద్యార్ధులు పరీక్షలకు సిద్దం కావాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతీ మీనా అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యమిత్ర స్వచందసంస్ధ అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్ధులు పరీక్షల్లో విజయం సాధించాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలపై తయారు చేసిన బ్రోచర్, లోగోను ఆమె విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు పరిక్షలంటే భయపడవద్దని కోరారు. ప్రతి విద్యార్ధి ఒక ప్రణాళిక బద్దంగా చదువుకుంటే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈసంవత్సరం పదోతరగతి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా అగ్ర గామీలో ఉండే విదంగా విద్యార్ధులు పరీక్షలకు సన్నద్దం కావాలని కోరారు. ఏవిద్యార్ధి ఆయినా ప్రణాళిక బద్దంగా చదివినట్లైతే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కె. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పదోతరగతి పరిక్షలకు విద్యార్ధులను సన్నద్దం చేసే భాద్యతలు తీసుకున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఆరోగ్యమిత్ర స్వచ్చందసంస్ధ ప్రతినిధి, జాతీయ అవార్డు గ్రహిత పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలోని ఉన్నత పాఠశాలలో తమ బృందం వెళ్లి విద్యార్ధులకు ఒక గంట క్లాసు తీసుకొని విద్యార్ధులను పరిక్షలకు సిద్దం చేసే పద్దతులు, జ్ఞాపకశక్తి, భయాందోళనలపై అవగాహణ కల్పిస్తామని వివరించారు. ఈకార్యక్రమంలో స్వచ్చంద సంస్ధ ప్రతినిధులు శుభ, సోమవారపువీరస్వామి, రఘువీర్ రాథోడ్, సుధాకర్ పాల్గొన్నారు.

జన్‌ధన్ లావాదేవిలపై ఐటి శాఖ నజర్
* ఖాతాలు మారితే కష్టమే
* పూర్తిస్థాయిలో పని చేయని ఏటిఎంలు
* రూ. 500 నోట్లతో కొంత ఉపశయం
పరకాల, డిసెంబర్ 4: జనధన్ ఖాతాల లావాదేవిలపై ఆదాయపు పన్ను శాఖ ఆరా తీస్తోంది. గతంలో శూన్య ఖాతాలుగా వీటిని ప్రారంభించిన ఖాతాదారులు ఇప్పుడు అధిక మొత్తాల్లో వేసిన నగదు జమలను జాగ్రత్తగా గమనిస్తోంది. రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చుకునేందుకు కొందరు జన్‌ధన్ ఖాతాదారులను ఆశ్రయించినట్లు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావడమే దీనికి కారణం. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ మొత్తం రూ. 2.50 లక్షలు దాటకపోయినా వారి ఖాతాల్లోకి వచ్చిన డబ్బులు ఎక్కడ నుండి వచ్చిందన్న విషయంపై నోటీసులు అవసరమైతే ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
* ఖాతాలు మారితే కష్టమే...
20 రోజుల కిందట వరకు పైసా నిల్వ లేని జనధన్ యోజన ఖాతాలు ఇప్పుడు వేలల్లో కళకళలాడుతున్నాయి. మరి ఖాతాదారుల ఆదాయం ఒక్కసారిగా పెరిగిందనుకంటే పొరపాటేనని ఆదాయ పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఖాతాల్లో భారీ మొత్తంలో వేసినట్లయితే పరిమితికి మించి ఖాతాలో డబ్బులు జమ అయితే జనధన్ ఖాతాలు సాధారణ ఖాతాలుగా మారిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. పైగా ఆ డబ్బు ఎలా వచ్చిందనే దానికి సమాదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఖాతాలపై ఆదాయపన్ను దృష్టి సారించింది. జనధన్ యోజన ఖాతాల్లో రూ. 50వేలకు మించి లావాదేవిలు నిర్వహించకూడదు. రూ. 50వేలకు పై బడిన ఏ ఖాతాలోనైనా నిధులు జమ చేస్తే పాన్‌కార్డు నమోదు తప్పని సరి అవుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఆయా కుటుంబాల్లోని సభ్యులు, ఖాతాదారులు తమ వద్ద ఉన్న మొత్తాలను తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు.