వరంగల్

గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కిన రైతన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, డిసెంబర్ 13: ఆరుగాలం శ్రమించిన రైతన్నకు కన్నీళ్లు...కష్టాలు..అప్పులే మిగిలాయి తప్ప ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ బాధలు మాత్రం తీరడం లేదని ఆక్రోశం చెందుతున్నారు. సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కపోవడంతోపాటు నెలరోజులుగా ప్రత్యేక కొనుగొలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి అన్నదాతలు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయరహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఎడ్లబండ్లను మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అడ్డంగా పెట్టి మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. తహశీల్దార్, పస్రా సిఐ బాలాజీ వారికి సర్దిచెప్పాలని ఎంత ప్రయత్నించినా రైతులు మాత్రం ఒప్పుకోకపోవడంతో మూడు గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా రైతులతోపాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ కష్టాలు తీరతాయని టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఇప్పటివరకు 27వందల మంది ఆత్మహత్యలు చేసుకోవడం రైతుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పంటలకోసం చేసిన అప్పులు తీరక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అధికారులకు మాత్రం వేతనాలను అధికంగా పెంచిన తెలంగాణ పాలకులు అన్నదాతలకు మాత్రం గిట్టుబాటు ధర చెల్లించకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. వేతనాలు పెంపువల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంతో, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వల్ల ప్రభుత్వం ఎంతభారం పడుతుందో ప్రభుత్వమే తేల్చుకోవాలని వారు కోరారు. ఎటువంటి షరతులు లేకుండానే సన్నరకం ధాన్యాన్ని 1800 రూపాయలకు కొనుగోలు చేయాలని లేనిపక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు, అఖిలపక్షపార్టీ నేతలు తేల్చిచెప్పారు. అయితే ఆందోళన విషయం అధికారులు జిల్లా కలెక్టర్‌తోపాటు ములుగు సబ్ కలెక్టర్‌కు వివరించడంతో సంఘటన స్ధలానికి చేరుకున్న సబ్‌కలెక్టర్ విసి గౌతమ్ అన్నదాతలతో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తానని, ముఖ్యమంత్రి సమవేశంలో ఇదే ప్రధాన సమస్యగా సిఎం దృష్టికి తీసుకువెల్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నేతలు పులుగుజ్జు వెంకన్న, మద్దినేని తేజరాజు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు తాటి రమణ, పాలడుగు వెంకటకృష్ణ, నెమలి నర్సయ్య, సూరపనేని సురేష్, సురవరపు వెంకట్రామయ్య, సర్పంచ్‌లు జిమ్మ వరలక్ష్మి, తాటి సాంబశివరావుతోపాటు వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులు
*పిసిసి సమన్వయ కర్త పొదెం వీరయ్య ధ్వజం
* బ్యాంక్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మంగపేట, డిసెంబర్ 13:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి సమన్వయకర్త, ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పొదెం వీరయ్య అన్నారు. ప్రత్యామ్నాయాలు చూడకుండానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం, బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులోని తమ నగదును తీసుకోవడానికి ఆంక్షలు విధించి ప్రజలను, రైతులను ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మంగపేట ఆంధ్రాబ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతా పరమాత్మ, పూజరి సురేందర్ తదితరులు మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన రైతులు, వ్యాపారస్తులు, కూలీలు, పేద మధ్య తరగతికి చెందిన ప్రజలు ప్రతి రోజు బ్యాంకుల వద్ద కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులలో సైతం కేవలం 2000 రూపాయల నోట్లు ఇస్తుండడంతో చిల్లర దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బ్యాంకులలో చిల్లర నోట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోని నగదును తీసుకోవడానికి పరిమితులు పెట్టవద్దని డిమాండ్ చేశారు. సామాన్యులు, రైతులు ఇబ్బందులు పడేలా చర్యలు తీసుకుంటున్న బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజులలోప్రజలే తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగపేట ఆంధ్రాబ్యాంక్ ఎదుట ధర్నా చేస్తున్నారన్న సమాచారం తెలసుకున్న మంగపేట ఎఎస్‌ఐ పిట్టా శ్యాంసుందర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా పరమాత్మ, పూజరి సురేందర్, గుమ్మడి సోమయ్య, మైల జయరాంరెడ్డి, కొమరగిరి సురేష్, ఎంపిటిసి చింతా సురేష్ (సుబ్బు), గోనె తిరుపతి, అల్లె జనార్ధన్, బట్టారుశెట్టి గౌతమ్, ధూళిపాల విజయ్, వీరగాని వెంకటేశ్వర్లు గౌడ్, పూజరి సమ్మయ్య, దామెర సారయ్య, మహిళా నాయకురాళ్ళు ఆళ్ల రాధారాణి పాల్గొన్నారు.

చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్ల గరం గరం చైర్‌పర్సన్
అశ్రద్ధ వల్ల నగర పంచాయతీకి సుమారు రూ. 7లక్షల నష్టం
ప్రతి శనివారం చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని కౌన్సిల్ ఆ్ఘమోదం
పరకాల, డిసెంబర్ 13: పరకాల నగర పంచాయతీ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్యపై అధికార పార్టీ కౌన్సిలర్లు గరం గరం అయ్యారు. మంగళవారం నగర పంచాయతీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభించిన అనంతరం కూరగాయల మార్కెట్ సమీప షాపు నెంబర్ 1 నుండి 5 వరకు గల గదుల కాంట్రాక్టుదారుల అప్పగించే ఉత్తర్వులు జారీ, లీజు అగ్రిమెంట్, నోటీసుల జారీపై కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండేళ్ల నుండి గదులను కాంట్రాక్టుదారులకు అప్పగించలేదని వారికి తాళం చెవులు ఇవ్వలేక పోవడంతో వారి నుండి డబ్బులు వసూలు చేయలేక పోయినట్లు చెప్పడంపై కౌన్సిలర్ వేణుగోపాలమూర్తి, చిదిరాల దేవేందర్, పాలకుర్తి గోపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుండి లీజు అగ్రిమెంట్ తీసుకున్నట్లు కౌన్సిల్ సమావేశంలో చెప్పారని తీరా వారికి గదులు ఇవ్వకపోవడంతో వారి నుండి డబ్బులు వసూలు చేయలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ కౌన్సిలర్ అల్లె దశరథం, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ గదులు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో టెండరుదారులకు గదుల తాళం ఇవ్వలేదని వారు చాలాసార్లు వచ్చారని చెప్పారు. వారికి గదుల తాళం ఇవ్వరని, లీజు అగ్రిమెంట్ అంటూ ఎలా వారికి నోటీసులు పంపుతారని ప్రశ్నించారు.
అయితే కౌన్సిలర్ దిలీప్ మాట్లాడుతూ అందులో బొచ్చు శ్రీనివాస్ అనే టెండర్ దారుడు చనిపోయాడని ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వారు చాలా పేద వారని ఆయన కట్టిన డిపాజిట్ డబ్బులు వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని కోరారు. అందుకు సభ్యులు సమ్మతించారు. అనంతరం కౌన్సిలర్ వేణుగోపాలమూర్తి మాట్లాడుతూ చైర్‌పర్సన్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు గదుల మీద ఆదాయం సుమారు రూ. 7లక్షల 25 వేలు నగర పంచాయతీ నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆదాయంతో కూరగాయాల మార్కెట్ అభివృద్ధి ఎంతో చేసుకోవచ్చునని చెప్పారు. కేవలం చైర్‌పర్సన్, కమిషనర్ల నిర్లక్ష్యం, బాధ్యత రహితం వల్ల లక్షల ఆదాయం నగర పంచాయతీ నష్టపోయిందని చెప్పారు. అదేవిధంగా అధికార పార్టీ కౌన్సిలర్ చిదిరాల దేవేందర్ మాట్లాడుతూ ఎజెండాలో అంశం పెట్టినప్పుడు దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని ఏజెండాలో పొందుపరచాలని చెప్పారు.
అనంతరం పరకాల నగర పంచాయతీ పరిధిలో ప్రతి శనివారం చికెన్, మటన్ షాపులు మూసివేయాలని కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదించారు. ఒకవేళ ఉల్లంఘిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని సభ్యులు పేర్కొన్నారు. అనంతరం వేసవి కాలంలో తాత్కాలిక పైప్‌లైన్ ఏర్పాట్లు, కూడళ్లలో తాత్కాలిక నల్లా కనెక్షన్ల ఏర్పాటు అంశంపై వాదోపవాదాలు జరుగగా ఆ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలు ఆమోదించినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఇ బాలకిషన్, నగర పంచాయతీ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.