ఆటాపోటీ

డోపింగ్ కేసుల్లో.. తప్పెవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరియా షరపోవా.. ప్రతిభకు అందాన్ని జోడించి.. టెన్నిస్‌కు గ్లామర్ సొబగులు అద్దిన క్రీడాకారిణి. ఆరేళ్ల వయసులోనే టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంది. పదకొండు ఏళ్లకే అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టింది. 17 ఏళ్ల యవసులోనే అత్యంత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేవలం ఆటను చూడడానికేకాదు... అందం కూడా తోడైతే ఆ మ్యాచ్‌లను చూసేందుకు
ప్రేక్షకులు విరగబడతారన్న వాస్తవాన్ని రుజువు చేసింది. మార్టినా నవ్రతిలోవా, స్ట్ఫె గ్రాఫ్, వీనస్ విలియమ్స్ వంటి క్రీడాకారిణులతో పోలిస్తే టైటిళ్ల విషయంలో షరపోవా చాలా వెనుకబడి ఉంది. కానీ, సంపాదనలో ఆమెదే అగ్రస్థానం.
--------------
గత ఏడాది వరుస విజయాలు, టైటిళ్లతో మహిళా టెన్నిస్‌ను ఏలిన సెరెనా విలియమ్స్ ప్రైజ్‌మనీ, అండార్స్‌మెంట్స్ రూపంలో 24.6 మిలియన్ డాలర్లను ఆర్జిస్తే, వైఫల్యాల బాటలో నడిచిన షరపోవా సంపాదన 29.7 మిలియన్ డాలర్లు. వరుసగా 11వ సంవత్సరం కూడా ఆమె సంపాదనలో నంబర్ వన్ మహిళా అథ్లెట్‌గా నిలిచింది. క్రీడా ప్రపంచంలో ఆమెకు ఉన్న క్రేజీ ఎలాంటిదో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఆరు అడుగుల, రెండు అంగుళాల ఎత్తు.. 59 కిలోల బరువు.. సినిమా హీరోయిన్లను మించి అందం.. ఆటలో ప్రావీణ్యం.. ఈ లక్షణాలే షరపోవాకు ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించి పెట్టాయి. 2004లో వింబుల్డన్, 2006లో ఆస్ట్రేలియా ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఆమె వశమయ్యాయి. టైటిళ్లు తక్కువైనా కెరీర్ ప్రైజ్‌మనీ 3,67,66,149 డాలర్లు. టెన్నిస్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా ఉత్ప్రేరకాలను వాడిందని, ఈఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో పట్టుబడిందని తెలిసి క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆ వార్త నిజంకాదని వాదించేవారేమోగానీ షరపోవా స్వయంగా ప్రకటించడంతో, పొరపాటు ఎక్కడ జరిగిందనే అనే్వషణలో పడ్డారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. టెన్నిస్ ప్రపంచం ఒక గొప్ప క్రీడాకారిణి సేవలు కోల్పోయే ప్రమాదంలో పడింది.
ఎన్నో కారణాలు..
క్రీడాకారులు, ఉత్ప్రేరకాలు చెట్టపట్టాలేసుకొని నడవడానికి ఎన్నో కారణాలున్నాయి. మొత్తం క్రీడా ప్రపంచం డ్రగ్స్ సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నది. 1988 సియోల్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించిన కెనడా స్ప్రింటర్ బెన్ జాన్సన్ డోపింగ్ కేసులో పట్టుబడినప్పుడు యావత్ క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. క్రీడల్లో ఇలాంటి వికృతాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయింది. అంతకు ముందు ఒకటిరెండు సందర్భాల్లో డోపింగ్ కేసులు బయటపడినా, జాన్సన్ ఉదంతంతో డ్రగ్స్ వికృత రూపం అందరికీ స్పష్టంగా తెలిసింది. క్రీడా రంగం క్రమంగా డ్రగ్స్ మత్తులోకి వెళ్లిపోతున్నదన్న ఆందోళన వ్యక్తమైంది. ప్రమాదకరమని తెలిసినా ఉత్ప్రేరకాలను ఎందుకు వాడుతున్నారు? క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తాత్కాలికంగా జవసత్వాలను కలిగించే ఉత్ప్రేరకాలను వాడుతున్నారని స్పోర్ట్స్ సైకాలజిస్టుల అభిప్రాయం. అయితే, డోపింగ్‌లో పట్టుబడిన చాలా మంది తాము బలవర్ధకమైన ఫుడ్ సప్లిమెంట్‌ను వాడినట్టు చెప్తున్నారు. సాధారణ రుగ్మతలకు వాడే మందులు కూడా అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిషేధించిన మందుల జాబితాలో ఉన్నాయని మరికొందరి వాదన.
షరపోవా కేసు
తాను సుమారు పది సంవత్సరాల నుంచి మెల్డోనియం మందును వాడుతున్నట్టు షరపోవా ప్రకటించింది. ఈఏడాది జనవరి ఒకటి నుంచి మెల్డోనియంను వాడా నిషిద్ధ మాదక ద్రవ్యాల జాబితాలో చేర్చింది. మిల్‌డ్రోనేట్‌గా కూడా పిలిచే మెల్డోనియంను పలు రుగ్మతలకు ఔషధంగా వాడతారు. అయితే, ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఇది ఉత్ప్రేరకంగా పని చేస్తుందని శాస్తవ్రేత్తలు నిర్ధారించారు. తన కుటుంబంలో మధుమేహ వ్యాధి వంశపారంపర్యంగా వస్తున్నదని, ముందు జాగ్రత్తగా తాను మెల్డోనియంను వాడుతున్నానని షరపోవా ప్రకటించింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఇది నిషిద్ధ ద్రవ్యాల జాబితాలో చేరిందనే విషయాన్ని తాను గుర్తించలేదని, అందుకే అనర్థం జరిగిపోయిందని వాపోయింది. తెలియక చేసిన తప్పు తప్పేనని, టెన్నిస్ క్రీడను, అభిమానులను సిగ్గుతో తలదించుకునేలా చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పింది. రక్త ప్రసరణ సక్రమంగా లేని సందర్భాల్లో మెల్డోనియంను వాడతారు. ఈ మందు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఉత్ప్రేరకాల్లో ఉండే లక్షణం కూడా ఇదే కాబట్టి, మెల్డోనియం నిషిద్ధ ఔషధాల జాబితాలో చేరింది.
లండన్ ఒలింపిక్స్‌లో మహిళల 1,500 మీటర్ల పరుగులో ఐదో స్థానంలో నిలిచిన అబెబే అరెగవీ మెల్డోనియం వాడి డోపింగ్ పరీక్షలో విఫలమైందన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజుల్లోనే షరపోవా ఉదంతం బయటపడింది. జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు వాడే ముందుల్లోనూ ఏదో ఒక నిషిద్ధ మాదక ద్రవ్యం ఉండడమే అథ్లెట్ల పాలిట శాపమవుతున్నది. ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడేవారు కొందరు. కానీ, తాము చేస్తున్నది పొరపాటని తెలియకుండానే డోపింగ్‌లో చిక్కుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ట్రైనర్లకు ఔషధాలపై సరైన అవగాహన లేకపోవడం, వారు అందించే ఫుడ్ సప్లిమెంట్స్‌ను, ఇతర మందులను అథ్లెట్లు గుడ్డివా వాడడం వంటి అంశాలు డోపింగ్ కేసులను పెంచుతున్నాయి.
నిపుణుల కొరత
క్రీడా రంగాన్ని ఔషధ నిపుణల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సాధారణ ఆరోగ్య సమస్యలకు వాడే మందుల్లోనే నిషిద్ధ మాదక ద్రవ్యాలు ఉంటాయన్నది వాస్తవం. నిపుణులు అందుబాటులో ఉంటే డోపింగ్ కేసులు చాలా వరకు తగ్గిపోతాయి. వాడా నిషేధించిన ఔషధాల వివరాలను తెలుసుకొని, అవి లేని మందులను వారు క్రీడాకారులకు సిఫార్సు చేయగలుగుతారు. కోచ్, ఫిజియోథెరపిస్టు, మానసిక నిపుణుడు, పౌష్టికాహార నిపుడితోపాటు స్పోర్ట్స్ డాక్టర్‌ను కూడా నియమించుకోవడం అథ్లెట్లకు సాధ్యమా అన్నది అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఆలోచించుకోవాలి. క్రీడల్లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడడం, డోపింగ్‌లో పట్టుబడడం కొత్త సమస్య ఏమీ కాదు. దశాబ్దాలుగా ఈ విష సంస్కృతి విస్తరిస్తున్నది. అయితే, ఎవరు ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడుతున్నారు? ఎవరు అనాలోచితంగా ఆ ఊబిలోకి దిగబడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. అథ్లెటిక్స్, సాకర్ వంటి కొన్ని క్రీడల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే డోపింగ్ సమస్య ఇప్పుడు టెన్నిస్‌లోనూ వ్యాపిస్తున్నదని షరపోవా ఉదంతం స్పష్టం చేసింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. నిపుణుల కొరత వల్లే ఔషధాలపై అథ్లెట్లకు స్పష్టత రావడం లేదని, అందుకే ఇష్టానుసారంగా మందులు వాడుతూ చివరికి డోపింగ్ పరీక్షలో పట్టుబడుతున్నారని చాలాకాలంగా ఉన్న వాదనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు పూనుకొని, నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోతే ఈ సమస్య నుంచి క్రీడాలోకం బయటపడదు. షరపోవా వంటి క్రీడాకారిణుల ఉదంతం నేర్పిన పాఠాలతోనైనా క్రీడా రంగం మేల్కోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. (చిత్రం) మరియా షరపోవా

- ఎస్‌ఎంఎస్