కర్నూల్

వైకాపాలోనే కొనసాగుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, ఫిబ్రవరి 26: ఎందరు పార్టీ మారినా తాను పార్టీని వీడేది లేదని వైకాపాలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమానాగిరెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని, తాను పార్టీ మారనని తెలిపారు. బుడ్డాశేషిరెడ్డి, మండల వైకాపా అధ్యక్షులు రఘురామిరెడ్డి, కందుల రఘురామిరెడ్డి, గోపవరం పుల్లయ్య, ఆయా మండల నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆదోని డివిజన్‌లోకి జోరుగా
కర్నాటక మద్యం దిగుమతి!
* పట్టించుకోని ఎక్సైజ్ పోలీసులు
ఆదోని, ఫిబ్రవరి 26: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో కర్నాటకలోని శిరుగుప్ప, బళ్ళారి, రాయచూరు ప్రాంతాల నుంచి కర్నాటక మద్యం జోరుగా రవాణా అవుతోంది. ఎక్సైజ్ పోలీసులు సభలు, సమావేశాలకే పరిమితం కావడంతో ఆదోని పట్టణంలో శుక్రవారం పేట, వాల్మీకి నగర్, బోయగేరి ప్రాంతాల్లో కర్నాటక అక్రమ మద్యం పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. కర్నాటకలో తక్కువ ధరకు మద్యం లభిస్తుంది. అందువల్ల ఇక్కడకు రవాణా చేసుకుని ఒక బాటీల్ మీద రూ. 15లు చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. పెద్దతుంబళంలో కూడా నకిలీ సరుకు పెద్ద ఎత్తున అమ్ముతున్నట్లు సమాచారం. లేబుల్ అంటించి నకిలీ సరుకును విక్రయిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కర్నాటక నుండి మద్యం గ్రామానికి చేరుతోందని విశ్వసనీయ సమాచారం. ఆదోని డివిజన్ ప్రాంతం కర్నాటక సరిహద్దు కావడంతో కర్నాటక నుంచి మద్యంను పెద్ద ఎత్తున రాత్రి పూట తీసుకుని ఇటు బ్రాందీ షాపులకు ఇటు ప్రజలకు అమ్మతున్నారు. ఒక చోటా నాయకుడు ఆధ్వర్యంలో కర్నాటక మద్యం బాటిళ్ళ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. మంత్రాలయం, రాంపురం, తుంగభద్ర, చెట్నేపల్లి, సూగూరు, కాచాపురం, మాధవరం, నదికైరవాడి మొదలగు నదీతీరా ప్రాంతాలకు రాయచూరు నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. అలాగే ఆదోని, పెద్దతుంబళం, పెద్దహరివాణం మొదలగు గ్రామాల్లో శిరుగుప్ప నుంచి కర్నాటక మద్యం రవాణా అవుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా పెద్దహరివాణంలో పెద్ద ఎత్తున కర్నాటక మద్యం డంప్ చేస్తున్నట్లు తెలిసింది. ఆలూరు నియోజకవర్గానికి కర్నాటకలోని బళ్ళారి నుంచి రైళ్ళు ద్వారా, వాహనాల ద్వారా మద్యం వివిధ గ్రామాలకు డంఫ్ చేస్తున్నారు. కర్నాటకలో మద్యం తక్కువ ధరకు లభించడం వల్ల అక్కడ నుండి ఇంక చౌకగా కొనుగోలు చేసి ఆదోని డివిజన్‌కు తరలిస్తున్నారు. కొన్ని మద్యం దుకాణాల వ్యాపారులు కూడా ఈదందాను పెద్ద ఎత్తున సాగిస్తున్నట్లు సమాచారం. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు వేలిశాయి. ఈ బెల్టుషాపులో ఎక్కువ శాతం కర్నాటక మద్యం అమ్ముతున్నట్లు స్పష్టమైన సమాచారం. బెల్టుషాపులను నియంత్రించలేని పరిస్థితి ఉంది. అందువల్ల కర్నాటక మధ్యం ఏరులై పారుతోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టులను ఇంక బలోపేతం చేసి కర్నాటక నుండి దిగుమతి అవుతున్న సరుకును నివారించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడడం ఖాయం.
రూ. 440 కోట్లతో ఉపాధి పనులు
* డ్వామా పిడి పుల్లారెడ్డి
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 26: ఈ ఏడాది 2015-16 ఏడాది నాటికి రూ. 440 కోట్లతో 1.49 లక్షల పనిదినాలు ఉపాధి కూలీలకు కల్పిస్తున్నట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా పిడి డాక్టర్ సిహెచ్ పుల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం నంద్యాలలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఎపిఓలు, టెక్నికల్ అసిస్టెంట్, ఎపిడిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటికే 1.14 లక్షలు పని దినాలు ఉపాధి పథకం ద్వారా పూర్తి చేశామన్నారు. మిగిలిన రోజులను 30 రోజుల్లోపు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకానికి రూ.210 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు జిల్లాలో 1.7 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారన్నారు. జలసిరి పథకం కింద 10224 మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అయితే జన్మభూమిలో 16 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి పథకం కింద ఇప్పటి వరకు 1100 మందిని గుర్తించామన్నారు. ఇద్దరు రైతులతో కలసి విస్తీర్నం జత పరచి ఈ పథకం ద్వారా బోర్లను వేస్తామన్నారు. పంట సంజీవిని పథకం కింద 2015 నుండి ఇప్పటి వరకు 11 వేల పంట సంజీవిని గుంతలు వివిధ దశల్లో ఉన్నాయని, 5 వేలు పూర్తి స్థాయిలో ఉన్నాయన్నారు. జిల్లాకు 1.52 లక్షల గడ్డపారలు మంజూరైనట్లు తెలిపారు. 2014-15 ఏడాదికి చేసిన ఉపాధి పనుల కూలీల పెండింగ్ వేతనాలు 3.30 కోట్లు కూలీల బ్యాంకు ఖాతాల్లో జిల్లా వ్యాప్తంగా జమ చేస్తారన్నారు. వాటర్‌షెడ్ పథకానికికూడా అర్హులైన వారు మార్చి నెలాఖరులోపు దరఖాస్తు చేసుకుంటే వాటికి కూడా ప్రభుత్వం రూ.6 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పంట సంజీవిని పథకం కింద పెద్దపోతూరు గ్రామంలో 800 ఇంకుడు గుంతలు ఒకే గ్రామంలో తవ్వినట్లు వివరించారు. ఈసమావేశంలో ఎపిడి విజయశేఖర్, ఎపిఓ నాగజ్యోతి, రామేశ్వరమ్మ, టెక్నికల్ అసిస్టెంట్లు నారాయణ, శ్రీనివాసరెడ్డి, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు మున్సిపల్
టిపిఆర్‌ఓపై వేటు
* కమిషనర్ సంపత్‌కుమార్
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 26: ఎమ్మిగనూరు మున్సిపల్ టిపిఆర్‌ఓ సతీష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే టిపిఆర్‌ఓ సతీష్ నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తుండగా అక్కడ మైనార్టీ రుణాల్లో అనేక అవకతవకలు జరిగాయి. అప్పట్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సతీష్‌ను నంద్యాల నుండి ఇటివలే ఎమ్మిగనూరుకు బదిలీ చేసింది. ఈ అవకతవకలపై పూర్తీ స్థాయిలో విచారణ చేపట్టడంతో టిపిఆర్‌ఓ సతీష్‌ను ప్రధాన నిందితుడుగా ప్రకటించి ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎమ్మిగనూరుకు బదిలీ కాకముందు సతీష్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా తరలించినట్లు సమాచారం. అలాగే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో జరిగిన రూ.7 కోట్ల కుంభకోణం నేటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ విషయంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి, ఎంపి బుట్టా రేణుక తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు కోరుతున్నారు.
భక్తుల కోసం శ్రీశైలంలో
ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలం, ఫిబ్రవరి 26: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు క్యూలైన్ల వద్ద గుడి వెనుక భాగంలో, చంద్రావతి కల్యాణ మండపం చుట్టూ, భక్తులు అధిక సంఖ్యలో తిరిగే ప్రదేశాల్లో ప్రత్యేక చలువ పందిర్లను (పెండల్స్) ఏర్పాటు చేసినట్లు డిఇ నరసింహారెడ్డి తెలిపారు. వీటితోపాటు వేడిని తట్టుకొనేందుకు పార్కుల యందు, పార్కింగ్ స్థలాల్లో భక్తులు సేద తీరేందుకు ప్రత్యేక షామియానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గుడి చుట్టు పక్కల ప్రాంతమంతా కూడా పెండల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసు కంట్రోల్ రూమ్ కోసం ఉత్తర భాగంలో పార్కు నందు ప్రత్యేకంగా షెడ్ వేసి కంట్రోల్ రూమ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే అధికంగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 30 పడకల తాత్కాలిక ఆసుపత్రికి దేవస్థానం వైద్య శాల పక్కన ప్రత్యేక షెడ్ వేసినట్లు తెలిపారు. ఇవేకాక హెలిప్యాడ్ గ్రౌండ్, వలయ మార్గంలో మొరసుతో చదును చేసినట్లు తెలిపారు.
ఉపాధి కూలీలకు
బ్యాంకు ద్వారా చెల్లింపులు
* డ్వామా పిడి పుల్లారెడ్డి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 26: జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు బ్యాం కు ద్వారా వేతనం చెల్లించనున్నట్లు డ్వామా పిడి పుల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఉపాధి కూలీలందరూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతా ఏర్పా టు చేసుకోవాలని, వాటి ద్వారా వేతనాల చెల్లింపులు చేపడుతామని వివరించారు. అలాగే జిల్లాలో ప్యాపిలి మండలంలోని గార్లదినె్న, హుసేనాపురం, జలదుర్గం గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా అమలు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి మొదటి విడతగా జిల్లాలోని 158 బ్యాంకులకు చెందిన ఆయా బ్యాంకు ల శాఖల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల ద్వారా ఉపాధి కూలీలకు నేరుగా వేతనం అందజేస్తామన్నారు. కావున ఉపాధి కూలీలందరూ సమీప బ్యాంకుల్లో ఇప్పటికే ఉన్న ఖాతాను ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాగా మార్చుకోవాలన్నారు. అకౌంట్ లేని వారు జీరో బ్యా లెన్స్ కింద అకౌంట్ ఖాతాను ఓపెన్ చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రూ. లక్ష యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు. ఖాతాదారులకు రూ. 5 వేల వరకూ ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం ఉం టుందని, ప్రభుత్వం నుంచి పొందే గ్యాస్ సబ్సిడీ లాంటివి ఈ ఖాతాకు వర్తిస్తాయన్నారు. గతంలో ఏదైనా ఇతర బ్యాంకులో ఖాతా వున్న వారికి సం బంధిత ఖాతాదారుడి కోరిక మేరకు రూపే డెబిట్ కార్డు జారీ చేసి వున్న ఖాతాలను ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాగా మార్పు చేసుకోవచ్చని వివరించారు.

కొలిచేవారి కొంగుబంగారం
ఎల్లమాంబ
కోసిగి, ఫిబ్రవరి 26: కొలిచే భక్తుల కోరికలు తీరుస్తూ భక్తజనం కొంగుబంగారంగా ఈప్రాంతంలో ప్రశస్తిపొందిన కోసిగి ఎల్లమాంబ రథోత్సవం ఈనెల 27న శనివారం ఘనంగా జరగనుంది. కోసిగిలో వెలసిన ఎల్లమాంబ మూల విరాట్‌ను స్థానిక దేవాలయం ఆవరణలో వేలాదిమంది భక్తజన సందోహం మధ్యన కోలాహలంగా జరిగే రథోత్సవం సాయంత్రం రాష్ట్ర సరిహద్దులు దాటి పలు రాష్ట్రాలకు చెందిన భక్తుల నీరాజనాలందుకుంటున్న ఎల్లమాంబ ఆలయం వెలసిన తీరుపై స్థానికులు చెప్పుకునే మూలకథ ఆసక్తికరం.
అమ్మవారి చరిత్ర...
పూర్వం కోసిగి ప్రాంతంలో కరవు కాటకాలు సంభవించి భుక్తికి సైతం గడవని కాలంలో స్థానిక ఒక రైతు కుటుంబం కర్నాటకలో నీరు సమృద్ధిగా ఉండి పంటపొలాలతో విరాజిల్లే ప్రాంతమైన నీరు మాన్వి అనే గ్రామానికి వలస వెళ్లడం జరిగింది. ఈనేపధ్యంలో అక్కడ పనిచేసే పొలాల్లోని సమీపంలోనే గుడిసెలు వేసుకొని జీవనం గడిపేవారు. అక్కడి కూలీల పనులు ముగిసిన అనంతరం ధాన్యపు గింజలు, ఆ రైతుకు చెందిన సరుకు సరంజామాను పెట్టుకొని వచ్చే పెద్ద గంపతో ఆ కుటుంబం కోసిగికి తిరిగి చేరుకొంది. వలస వెళ్లి వచ్చిన అనంతరం ఆ రైతు ఇంట్లో గంప సామాన్లు తీస్తున్నప్పుడు ఒక చెక్కతో చేసి ఉన్న మూలవిరాట్ చేతికి అందింది. దీంతో ఎక్కడో పొరపాటున సామాన్లతో కలిసి వచ్చిన ఆ చెక్క విగ్రహాన్ని అంతగా పట్టించుకోని ఆ కుటుంబ సభ్యులు ఒక మూలకు విసిరేశారు. అయితే మహిమగల ఆ విగ్రహం అర్ధరాత్రి వేళ లయబద్ధంగా గజ్జల సవ్వడి చేస్తూ గంటానాదం వినపడేది. ఈశబ్దం విని భయాందోళనతో దిక్కుతోచని ఆ కుటుంభీకులు స్థానికంగా ఉండే ఒక పెద్దమనిషిని సంప్రదించి తమ ఇంట్ల జరిగే వింత కార్యక్రమం గురించి వివరించారు. దీంతో ఒక మంగళవారం రాత్రి ఆ పెద్దమనిషి ఆ రైతు సవ్వడితో కూడుకున్న గంటానాదం లయబద్ధంగా వినపడింది. ఆ పెద్దమనిషి వెంటనే లేచి, భయపడకుండా, నీవు ఎవరవు, ఎందుకు ఇలా ఇంట్లో వాళ్లని భయపెట్టి కలవర పరుస్తున్నావు? నీకు ఎం కావాలి? అంటూ భిగ్గర స్వరంతో నిలదీశాడు. ఆదృశ్య రూపంలో ఉన్న ఆదేవతా మూర్తి మూలవిరాట్ బదులిస్తూ, నేను దేవతను, నాకు పూజలు చేస్తే మీరు మీగ్రామం సుభీక్షంగా వర్థిల్లుతుంది. కరవు మాయమవుతుందని, సుఖశాంతులిస్తానని అన్నది. దీంతో ఆ పెద్దమనిషి ఆధ్వర్యంలో ఒక రైతు ఇంట్లో మూలకు పడిఉన్న మూలవిరాట్ విగ్రహానికి పూజలు చేయడం ఆరంభించారు. దీంతో వారికి ఉన్న కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడి ఆ కుటుంబం వర్థిల్లింది. అనంతరం ఆ కుటుంబ యజమాని ఎల్లమాంబ దేవత ఆశీర్వాదం, కరుణా కటాక్షాలు గ్రామస్థులందరికీ అందాలన్న తాపత్రయంతో మంచి ఉద్దేశ్యంతో గ్రామపెద్దలను సంప్రదించి తనపొలంలోనే ఒక చిన్న ఆలయం నిర్మించి అందులో మూలవిరాట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుండి కోసిగి గ్రామస్థులు చేత పూజలందుకున్న ఎల్లమాంబ దేవత ఆశీర్వాదం పొంది, ప్రాశస్త్యం పొందిన దేవత నేడు రాష్టవ్య్రాప్తంగానే కాకుండా కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన ఎంతోమంది భక్తులు తమ మొక్కలు తీర్చుకుంటుండడం విశేషం. అప్పటినుంచి భక్తులు ఒక పంచలోహా విగ్రహంతో ఉన్న ఎల్లమాంబ విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా నేటికీ గంపలో ఉంచుకొని ఉత్సవ సమయంలో గుడికి తీసుకొస్తారు. ముఖ్యంగా పండుగ పర్వదినం పౌర్ణమినాడు గుడికి రహస్యంగా తీసుకువస్తారు. అనాధిగా భక్తుల కోరికలను తీరుస్తున్న కోసిగి ఎల్లమాంబ జాతర సందర్భంగా జిల్లాలోని పలుగ్రామాలకు చెందిన భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలనుండికూడ వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే మొదట్లో ఒక నెలరోజులపాటు జరిగే ఎల్లమాంబ జాతర ఉత్సవాలు ఎప్పటికప్పుడు ఆదరణ తగ్గి రవాణ సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో కేవలం వారంరోజులకే పరిమితమైంది. అప్పట్లో జాతర సందర్భంగా వారంరోజుల ముందునుండే ప్రతిఎటా జరిగే రాష్టస్థ్రాయి వివిధ క్రీడాంశాల ఊసే ఈసారి లేకపోవడం క్రీడాకారులను, పట్టణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తుందనే చెప్పాలవి. ముఖ్యంగా గ్రామీణ క్రీడలలో ఎంతో పేరొందిన కబడ్డీ, వాలీబాల్, తదితర పోటీలు వ్యక్తిగత ప్రతిభను కనబరచే పోటీలు నిర్వహించడానికి అటు నిర్వాహకులుగాని లేదా రాజకీయ నేతలుగాని ముందుకురాలేదు. ప్రతి ఎడాదిలాగానే పంచమి చిత్తనక్షత్రం రోజు రథోత్సవం జరుగుతుంది. ఈ ఎడాది చిత్తనక్షత్రం శనివారం ఎల్లమాంబ రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈరథోత్సవంకు సాంప్రదాయ బద్ధంగా దొర కుటుంభీకులు ఎమ్మెల్యే ముఖ్యఅతిధులుగా రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇదిలా ఉండగా జాతర పర్వదినంతో మొదలుకొని జాతర రద్దీ ఉండే వారం రోజులపాటు తాగునీటి సౌకర్యంకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలో అన్ని ట్యాంకులకు నీటి సరఫరా చేస్తామన్నారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా జాతరలో, పట్టణంలోను నీటిని సరఫరా చేస్తామని మురళీరెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపుపోలీసు బలగాలను ఏర్పటుచేస్తున్నట్లు సిఐ రాముడు, ఎస్‌ఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు.
ముగిసిన శ్రీరమాసమేత సత్యనారాయణ స్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 26: పట్టణంలో అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి మొదలు కాగా శుక్రవారం విగ్రహాల ప్రతిష్ఠతో అంగరంగ వైభవంగా ముగిశాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామి సేవా సమాజం వారు రూ.కోటి 20 లక్షలతో నిర్మించారు. ఆల య ఇఓ స్వర్ణముఖి, సేవా సమాజం నిర్వహణలో బ్రహ్మశ్రీ తెలకపల్లి పెసరవాయి సిద్ధాంతి ఆధ్వర్యంలో మాడుగుల నాగేంద్ర శర్మ ఆచార్యత్వంలో జరుగుతున్న పూజాదికాల్లో భాగంగా మాఘశుక్ల పౌర్ణమి రోజున వరుణాసేయం, గోపూజ, శ్రీమహాగణపతిపూజాదికాలతో ప్రారంభం కాగా శుక్రవారం ఉదయం హస్తా నక్షత్రయుక్త మీనలగ్నంలో శ్రీరమాసమేత సత్యనారాయణ స్వామి, శ్రీఅన్నపూర్ణ కాశీవిశే్వశ్వర స్వామి, కాలభైరవ, నందీశ్వర, సింహవాహన సనత్నీక నవగ్రహాదులను ప్రతిష్ఠించారు. ఉదయం అభిషేకాలు, యంత్రరాజ ప్రతిష్ఠాపనలు, ధ్వజ, శిఖర ప్రతిష్ఠాపనల అనంతరం ప్రథమ పూజా, మహాదర్శనం, బలిదానం, పూర్ణాహుతిహోమం నిర్వహించారు. మధ్యా హ్నం 12గంటలకు శ్రీరమాసమేత సత్యనారాయణ స్వామి శాంతి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేద మంత్రాలు పఠిస్తుండగా స్వామివార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తులు వీక్షించి తరించారు. ఆలయంలో సుబ్రమణ్యేశ్వరస్వామి, నవగ్రహాలను భక్తులు పూజలు చేశారు. ఈపూజాదికాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డిలు పాల్గొన్నారు. వీరిని ఆలయ ఇఓ స్వర్ణముఖి, సేవా సమాజ్ అధ్యక్షులు నెరవాటి గోపాలకృష్ణమూర్తి, తిరివీధి వెంకటసుబ్బయ్యలు ఆలయ మెమోంటో, శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈకార్యక్రమాల్లో ఆలయ గౌరవాధ్యక్షులు కందుకూరి శ్రీరామమూర్తి, సిటీకేబుల్ ఎండి జయచంద్రారెడ్డి, భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, క్రిష్ణప్రసాద్, రంగప్రసాద్, వంకదార రామ్మోహన్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు.
రూ.82 కోట్లతో మున్సిపల్ బడ్జెట్ ప్రతిపాదన
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 26: ఆదోని మున్సిపల్ బడ్జెట్ 2016-17 ఏడాదిగాను వివిధ అభివృద్ధి పనులు ఇతర వాటి కోసం రూ.82 కోట్లతో బడ్జెట్‌ను అధికారులు ప్రతిపాదించగా మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. శుక్రవారం చైర్‌పర్సన్ సరోజమ్మ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అమృత పథకం కింద మున్సిపాలిటీకి రూ.19.64 కోట్లు నిధులు మంజూరు కావడంతో మున్సిపాలిటీ బడ్జెట్ రూ.82 కోట్లకు చేరినట్లు కమిషనర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. 2015-16 ఏడాదిగాను రూ.46కోట్లతో అంచన బడ్జెట్ ప్రతిపాదించగా రూ.57.19 కోట్లు సవరించి ఖర్చు చేయడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 2016-17 అంచన బడ్జెట్‌ను రూ.82 కోట్లకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.57 కోట్లు ఖర్చు చేశామని, ముగింపు నిలువ విలువ రూ.5 కోట్లగా సూచించినట్లు వివరించారు. మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం రూ.32 కోట్లని, ఇప్పటి వరకు రూ.21 కోట్లు ఖర్చు చేయగా ఇంక రూ.10 కోట్లు ఈ మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేస్తామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకించి అమృత్ నిధులు మంజూరు కావడంతో బడ్జెట్ అంచన భారీగా పెరిగిందన్నారు. వైకాపా కౌన్సిలర్ నరసింహులు మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం కింద మంజూరైన రూ.6 కోట్లు నిధులు ఇంతవరకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. డిఇ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టెండర్లు పిలిచామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఆదోని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, అందరు సహకరించాలని చైర్‌పర్సన్ సరోజమ్మ, వైస్ చైర్మన్ అల్తాప్ అహ్మద్‌లో కోరారు. ఈసమావేశంలో ఎంఇ శ్రీరామచంద్రమూర్తి, కౌన్సిలర్లు వై.జి బాలాజీ, బి. బాలాజీ, గోవిందరాజులు, ఇబ్రహీం, కో ఆప్షన్ సభ్యులు చంద్రకాంత్‌రెడ్డి, గిరిరాజులు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి
ఆలయ ప్రతిష్ఠ
చాగలమర్రి, ఫిబ్రవరి 26: మండలంలోని శెట్టివీడులో శుక్రవారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రాల మధ్య నిర్వహించారు. విశేష పూజలు, దీక్ష, అభిష్ట హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈపూజల్లో సర్పంచ్ నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పురపాలక సంఘాలు, పంచాయతీల
బలోపేతానికి ఆర్థిక సంఘం సిఫార్సు
నంద్యాల, ఫిబ్రవరి 26: పురపాలక సంఘం పరిధిలోని పట్టణాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాల్లో వౌళిక సదుపాయాల కల్పన, సామాజిక అవసరాల గుర్తింపు, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుందని సంఘం సభ్యులు మునిరత్నం నాయుడు, మెంబర్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ తాకుద్దీన్‌లు తెలిపారు. శుక్రవారం నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సత్యనారాయణరావు, ఇతర శాఖల అధికారులతో 4వ ఆర్థిక సంఘం సభ్యులు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమయ్యే నిధులు, వౌళిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై ఇంతవరకు జరిగిన పురోగతి, రానున్న కాలంలో చేపట్టాల్సిన ప్రత్యేక ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా నంద్యాల పట్టణానికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాల పట్టణంలోని ఎస్‌ఎస్ ట్యాంకు వరకు పైపులైన్ నిర్మాణానికి రూ.187 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులకు తెలిపారు. అలాగే పట్టణంలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్యంతో పాటు వౌళిక సదుపాయాల కల్పనలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, రానున్న కాలంలో ఇంకా ఎన్ని నిధులు అవసరమవుతాయో సభ్యుల దృష్టికి తెచ్చారు. సమావేశంలో మున్సిపల్ డిఇ జయభారత్‌రెడ్డి, ఎఇ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో చేపట్టిన సంస్కరణల వల్ల సాధించిన ప్రగతిపై కూడా చర్చించారు.
వాహనం ఢీకొని జింక మృతి
శ్రీశైలం, ఫిబ్రవరి 26: శ్రీశైలంలోని శిఖరం అవతల మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందినట్లు అక్కడ తేనె అమ్ముకుంటున్న కొందరు మహిళలు తెలిపారు. జింక రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో జింక మృతి చెందినట్లు మహిళలు తెలిపారు. వివరాలు తెలుసుకున్న శ్రీశైలం రేంజ్ అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడుగగా ఈ ఫారెస్టు జోన్ ప్రకాశం జిల్లాకు సంబంధించినది కావునా పూర్తి వివరాలు వెల్లడించలేకపోతున్నామని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. కాని నల్లమల అడవిలో వణ్యప్రాణులను వేసవి సమయంలో దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ సిబ్బంది గతంలో కొన్ని నీటి కుంటలను ఏర్పాటు చేశారు. వేసవి ప్రారంభం కావడంతో అభయారణ్యం ఎండలకు వాడిపోయినా ఫారెస్టు అధికారులు నీటి ఎద్దడికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వణ్యప్రాణులు తాగునీటికై వచ్చి మృతి చెందుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. సాసర్ ప్లాంటుకు దగ్గరగా మృతి చెందడంతో అటవీ శాఖ సిబ్బంది అడవి మృగాలకు సరైన పోషణ లేక నీటి కోసమే సాసర్ పాండ్స్ వద్దకు వచ్చే క్రమంలో జంతువులు మృతి చెందుతున్నట్లు స్థానికులు, యాత్రికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి జంతువులకు ఏర్పాటు చేసిన సాసర్ ప్లాంట్లలో నీరు జంతువులకు అందేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
బస్సుకింద పడి విద్యార్థి దుర్మరణం
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 26: మండలంలోగల కడివెళ్ళ మోడల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉసేన్‌బాషా (12) శుక్రవారం సాయంత్రం బస్సు కిందపడి మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ కథనం ప్రకారం కడిమెట్ల గ్రామానికి చెందిన వుసేన్‌బాషా, ఖాజబీల కుమారుడు కడివెళ్ళ మోడల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడని, స్కూలు వదిలన అనంతరం కదులుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా పొరపాటున కాలు జారీ బస్సు టైర్లకింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 26: మండలంలోని ఇస్వీ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ నాగరాజు, బోయ ఈరన్నలకు తీవ్రగాయాలైనట్లు ఏరియా ఆసుత్రి ఔట్ పోస్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి బోయ నాగరాజు తలకు తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు తరలించారని వైద్యులు సూచించారు. కౌన్సిలర్ తిమ్మప్ప ఆసుపత్రికెళ్లి వైద్యులతో చర్చించి కర్నూలుకు తరలించారు.
సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
* మూడు దుకాణాలు దగ్ధం
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 26: మండలంలోని పాండవగల్లు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆదోని- మాధవరం రోడ్డులో ఉన్న దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి మూడు దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సీతారాములు, బంగారమ్మకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు.
గొర్రెల దొంగ అరెస్టు
నందికొట్కూరు, ఫిబ్రవరి 26: బైక్ మోజుతో ఓ యువకుడు జైలుపాలు అయిన సంఘటన బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ సుప్రజ ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన సురేష్ బనగానపల్లెలో విద్యనభ్యసిస్తూ బైక్ కొనుగోలు చేసేందుకు నందికొట్కూరు మండలం కోళ్లబావాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, రామాంజినేయులుతో కలిసి గొర్రెల చోరీకి పాల్పడ్డాడు. వీరు మూడు నెలల వ్యవధిలో జూపాడుబంగ్లా మండలం మండ్లెంతండా, 10.బొల్లవరం గ్రామం, పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో రూ. 2,05,000 విలువ చేసే గొర్రెలను ఎత్తుకెళ్లారన్నారు. దీంతో సురేష్‌ను బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ రాజ్‌కుమార్ అరెస్టు చేశారని, మిగిలిన ఇద్దరు నిందితులు మరో కేసులో నందికొట్కూరు సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారన్నారు. సమావేశంలో సిఐ శ్రీనాథరెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, రాజ్‌కుమా ర్, శివాంజల్, చంద్రశేఖరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.