నిజామాబాద్

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టర్ యోగితా రాణా
ఇందూర్, నవంబర్ 27: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని, అందువల్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. ఇంటితో పాటు రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద సమగ్ర అభివృద్ధికి ఎంపిక చేసిన రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ముందుగా కందకుర్తి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించిన కలెక్టర్, ఉపాధ్యాయుల బోధన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 9వ తరగతి విద్యార్థులకు కూడా చదువు పట్ల సరైన అవగాహన లేదని, మైనార్టీ విద్యా సంస్థల పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్యను ఆదేశించారు. అక్కడి నుండి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, గ్రామ ప్రజలకు 3రూపాయలకు 20లీటర్ల రక్షిత నీటిని అందిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను కలెక్టర్ పరిశీలించారు. అదే విధంగా గ్రామంలోని ఆయా కాలనీల్లో పర్యటించి రోడ్లు, డ్రైనేజీలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని, ప్రజల సహకారంతోనే ఆదర్శ గ్రామాలు ఏర్పడ్తాయని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని, వినియోగించి బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు తమ ఇళ్లలో శుభ్రం చేసిన చెత్తను రోడ్లపై వేయరాదని, అందుకోసం ప్రత్యేక చెత్తబుట్టాలను ఏర్పాటు చేసుకుని వాటిలోనే వేయాలని సూచించారు. ఇండ్లలో ఊడ్చిన చెత్తను రోడ్లపై మురుగునీటి కాల్వల్లో పారవేస్తే మురుగునీరు పేరుకుపోయి రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లడంతో పాటు రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. మహిళలు చెంబులో నీటిని పట్టుకుని బహిరంగ ప్రదేశాలకు మల విసర్జనకు వెళ్లడం ఆ కుటుంబాలకు గౌరవంగా ఉంటుందా అని కలెక్టర్ గ్రామస్థులను ప్రశ్నించారు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం 12వేల రూపాయలతో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తోందని, ఇందులో లబ్ధిదారుల వాటాగా కేవలం 900రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. వ్యక్తిగత అవసరాలకు, కుటుంబ ఖర్చులకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్న కుటుంబాలు, మహిళల గౌరవాన్ని కాపాడే మరుగుదొడ్డి నిర్మాణానికి ఈ కొద్ది మొత్తం ఇచ్చేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం గ్రామంలో 257కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమని తేలిందని, ఇందులో 155కుటుంబాలు తమ వాటాను చెల్లించడం జరిగిందని, మిగతా వారు కూడా వ్యక్తిగత వాటాను చెల్లించినప్పుడే అందరికీ మరుగుదొడ్లు మంజూరీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మ్యాజిక్ ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 4వేల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. కలెక్టర్ వెంట డ్వామా పిడి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పిడి వెంకటేశం, బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, సిపిఓ కేశవరావు, డిఇఓ లింగయ్య, ఐసిడిఎస్ పిడి రాములు, గ్రామ సర్పంచ్ ఎండి,ఖలీమ్‌బేగ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాబ్ కార్డున్న ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలి
ఇందూర్, నవంబర్ 27: నిజామాబాద్ జిల్లాలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కూలీకి పని కల్పించాలని కలెక్టర్ యోగితారాణా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, తాగునీరు, చేంజ్ ఏజెంట్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తీవ్ర కరవు ఏర్పడినందున జాబ్‌కార్డులు కలిగిన కూలీలందరికీ 100శాతం పనులు కల్పించి, 150రూపాయలకు తక్కువ కాకుండా కూలీ వచ్చే పనులను గుర్తించాలన్నారు. జాబ్‌కార్డు లేని కూలీలకు వెంటనే జాబ్‌కార్డులు అందించాలన్నారు. ప్రతి బుధ, శనివారం మస్టర్ రోల్స్ తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మూడు రోజుల్లో కూలీ డబ్బులు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర సహాయకులు గ్రామాల్లోనే ఉంటూ కూలీలకు ఎప్పటికప్పుడు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 52గ్రామాల్లో ఒక్క మ్యాన్‌డే కూడా లేదని, మరో 22గ్రామాల్లో 10మంది కంటే తక్కువ మంది కూలీలు పని చేస్తున్నారని, అందువల్ల వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించి, కూలీలకు ఉపాధి చూపించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చక్కగా పని చేస్తున్న మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి, తద్వారా వారితో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మార్పు పథకంలో భాగంగా ప్రతి మండలానికి ఒక పర్యవేక్షులను నియమించాలని, తద్వారా గర్భం దాల్చిన ప్రతి గర్భవతి ఆసుపత్రిలోనే పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ముందుకు వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వాటా 900రూపాయలు జమ చేయించి, మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జెసి రాజారాం, ఇన్‌చార్జ్ డిఆర్‌ఒ మోహన్‌లాల్, ఐకెపి పిడి వెంకటేశం, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ సెల్ చైర్మన్‌గా సుమీర్ అహ్మద్
ఇందూర్, నవంబర్ 27: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్‌గా సుమీర్ అహ్మద్‌ను వరుసగా రెండవ సారి ఎన్నుకున్నట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్‌ఖాజా ఫక్రుద్దీన్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందజేయడం జరిగిందని సుమీర్ అహ్మద్ తెలిపారు. తనపై పూర్తి విశ్వాసంతో తిరిగి రెండవసారి జిల్లా మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా నియమించినందుకు టి.పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన శక్తిమేర కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా మైనార్టీలను ఐక్యం చేసి, వారి హక్కుల సాధన కోసం పోరాడుతానని అన్నారు.

వేతన బకాయిలు చెల్లించండి
బోధన్, నవంబర్ 27:తమకు రావాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిజాండెక్కన్ సుగర్స్ కార్మికులు కర్మాగారంలో ఆందోళనకు దిగారు. తమకు మూడు నెలల వేతనాలు రావాల్సి ఉన్నాయని కానీ యాజమాన్యం వాటిని చెల్లించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఉదయం పది గంటలకు ఫ్యాక్టరీ కార్మికులు కర్మాగారంలోని కేన్ డిజిఎం పట్ట్భా, పర్సనల్ ఆఫీసర్ రజ్వి, శివరాం ప్రసాద్, నరేందర్‌లను గదిలో దిగ్మంధించి ఆందోళన చేశారు. తమకు వేతనాలు ఇవ్వాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కర్మాగారానికి వచ్చి కార్మికులను సముదాయించారు. తాము శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నామని తమ వేతనాలు రాకపోవడంతో తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు పోలీసు అధికారులకు వివరించారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం ఈ నెల 30వ తారీఖు వరకు కార్మికులకు చెల్లించాల్సిన మూడు నెలల వేతనాలు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు నాయకులు సత్యనారాయణ, రాజారామ్, నాయకత్వం వహించారు.