యువ

సామరస్యం కోసం సాహస యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత విద్వేషం, పరస్పరం అపనమ్మకం, సమగ్రతా లోపం వంటి అడ్డంకులను అధిగమిస్తేనే దేశంలో శాంతి సౌభాగ్యాలు సాధ్యమన్న సందేశాన్ని చాటిచెప్పేందుకు ఓ యువకుడు సాహసయాత్ర చేపట్టాడు. మత సామరస్యం తక్షణ అవసరం అంటూ సమైక్యతా గీతాన్ని ఆలపిస్తున్నాడు. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగాన్ని సైతం వదులుకుని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ దేశ సమగ్రత కోసం చేయి చేయి కలపాలని అర్థిస్తున్నాడు.
కేరళకు చెందిన ఫిరోజ్ పూతిరి మూడు నెలల పాటు సాగే బైక్‌యాత్రను ప్రారంభించి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. నేపాల్ వరకూ 14 రాష్ట్రాల మీదుగా పర్యటించి తన స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బైక్‌పై సాగే సాహస యాత్రకు అవసరమైన ఏర్పాట్లన్నీ తానే చేసుకున్నాడు. నిధుల కోసం, ప్రచారం కోసం ఏ కార్పొరేట్ సంస్థలను ఫిరోజ్ ఆశ్రయించలేదు. కేరళలో తన యాత్రకు శ్రీకారం చుట్టి, కాశ్మీర్‌తోపాటు పలు రాష్ట్రాల మీదుగా నేపాల్‌లో పర్యటించాడు. హైదరాబాద్ మీదుగా కన్యాకుమారికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఫిరోజ్ యాత్రలో తన అనుభవాలను, అనుభూతులను మీడియా ముందు ఆవిష్కరించాడు.మతకల్లోలాల వల్ల సమాజంలో పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో చిన్ననాటి తన అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నాడు. కేరళలోని తన స్వస్థలంలో ఒకసారి మతవిద్వేషాలు పెచ్చరిల్లినపుడు కొంతమంది ఇళ్లను వీడి పారిపోయారని, ఇతర మతస్థులు ఏ క్షణంలోనైనా దాడి చేసి తమను హతమారుస్తారన్న భయంతో వారు ఎక్కడెక్కడో బిక్కుబిక్కుమంటూ గడిపారని, ఆ సంఘటన చిన్నతనంలో తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫిరోజ్ తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. మత సామరస్యం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న సంకల్పానికి ఆ సంఘటన కారణమని తెలిపాడు. ఇంజనీర్‌గా, లెక్చరర్‌గా పనిచేసినా అందులో ఏదో వెలితి అతనికి కనిపించింది. తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన అధికం కావడంతో వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకోవాలని బయలుదేరాడు. యాత్ర సందర్భంగా హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాలను సందర్శించినపుడు మతపెద్దలు తన సంకల్పాన్ని తెలుసుకుని అభినందించారని ఫిరోజ్ చెబుతున్నాడు. రోజుకు 300 కిలోమీటర్ల మేర బైక్‌పై వెళుతున్న ఆయన విధిగా ప్రార్ధనా మందిరాలను సందర్శించి స్థానికులకు తన సందేశం వివరిస్తున్నాడు. నిజానికి చైనా మీదుగా రష్యా వరకూ యాత్ర చేయాలని ఆయన తొలుత భావించినా అందుకు తగ్గ అనుమతులు లభించనందున కేరళ- నేపాల్ యాత్రను ప్రారంభించాడు. రెండేళ్ల క్రితం కేరళ నుంచి గుజరాత్ వరకూ ఓసారి పర్యటించాడు. వినూత్న బైక్‌లపై తిరగడం,విభిన్న ప్రాంతాలను సందర్శించడం అంటే తనకెంతో ఇష్టమని, ఇతరులకు ఏదైనా సందేశాన్ని చాటిచెబితేనే యాత్రకు సార్థకత ఉంటుందని ఆయన చెబుతున్నాడు.
చేదు అనుభవాలు..
యాత్ర సందర్భంగా మధురాభూతులతోపాటు కొన్ని సవాళ్లను కూడా తాను ఎదుర్కొన్నట్టు ఫిరోజ్ గుర్తుచేస్తున్నాడు. కొండచరియలు విరిగి పడడంతో నేపాల్-చైనా సరిహద్దులో తాను యాత్రను ఆరురోజుల పాటు నిలిపివేయాల్సి వచ్చిందన్నాడు. కర్ఫ్యూ కారణంగా శ్రీనగర్‌లో యాత్రకు అంతరాయం కలిగిందన్నాడు. శ్రీనగర్‌లో రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, ఉద్రిక్తతలను పెంచేలా నినాదాలు చేయడం తనకు ఆవేదన కలిగించిందని వివరించాడు. బైక్‌పై జాతీయ పతాకాన్ని పెట్టుకుని నేపాల్‌లో పర్యటించినపుడు ఎవరూ తనను ప్రశ్నించలేదని, జమ్ము-కాశ్మీర్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైందన్నాడు. కాశ్మీర్‌లో వెళుతుండగా చాలామంది తన బైక్‌ను ఆపి, భారత జెండాను ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించడం విస్మయాన్ని కలిగించిందన్నాడు. మత సామరస్యంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్న తపన ఈ సంఘటనతో తనలో మరింతగా పెరిగిందన్నాడు. జాతీయ పతాకంతో తిరగడం ఒక నేరంగా కాశ్మీర్‌లో కొందరు పరిగణిస్తున్నారంటే అక్కడ ద్వేషభావాలు ఎంతగా పెరిగిపోతున్నాయో తనకు అవగతమైందని ఫిరోజ్ తెలిపాడు. నేపాల్‌లో మాత్రం అక్కడివారు తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకుని ఆప్యాయత చాటుకున్నారని వివరించాడు.