యువ

జాగృతం.. దిశానిర్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాగృతి యాత్ర!
కొత్త విషయాలు నేర్చుకునేందుకు...
మనసులు కలబోసుకునేందుకు...
పరిచయాలు పెంచుకునేందుకు...
స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని
కలుసుకునేందుకు...
ఉపయోగపడే యాత్ర!
విద్యార్థుల జాతర!
కాలేజీ అవర్స్ మధ్య కాస్తంత ఖాళీ దొరికితే సినిమాకు చెక్కేసే యువత!
స్టడీ అవర్స్‌లో వార్డెన్ కళ్లు కప్పి నెట్‌లో అవీ ఇవీ చూసే యువత!
పరీక్షలు ముంచుకొస్తేగానీ పుస్తకం చేత పట్టని యువత!
సామాజిక బాధ్యత లేని యువత!
- ఇవీ చాలామందిలో యూత్ పట్ల ఉన్న అభిప్రాయాలు.
వాటిని పటాపంచలు చేస్తూ జాగృతి యాత్ర కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. విద్యార్థుల్లో చైతన్యం రగిలిస్తోంది. భావ సారూప్యత కలిగిన 42మంది విద్యార్థులు సాగించిన యాత్ర ఇది. దేశదేశాలనుంచీ వచ్చిన విద్యార్థులకు ఈ యాత్ర వేదికైంది. 15 రోజుల రైలు యాత్ర...ఎనిమిది వేల కిలోమీటర్ల ప్రయాణం. ఎందరో వ్యక్తులతో, సంస్థలతో పరిచయం. ఇదీ లక్ష్యం. ముంబయినుంచి మొదలైన ఈ ప్రయాణంలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువతీ యువకులు కూడా పాల్గొన్నారు. వారే భావనా రావళ్ల, శ్రీనివాస్ చైతన్య, కరోన్ రాజాలా, సావన్ కబళవాయి. జాగృతి యాత్ర చేపట్టిన బృందంలో వేర్వేరు దేశాలకు చెందిన వారూ ఉండటం విశేషం. అంతా ముంబయిలో సమావేశమయ్యారు. ఎవరెవరిని కలవాలో, ఏమేం చేయాలో, ఏయే సంస్థల్ని సందర్శించాలో నిర్దేశించుకున్నారు. ప్రయాణం మొదలైంది!
చదువులకు నెలవు...
కళలకు కొలువు
విద్యార్థుల బృందం ముందుగా రెలెక్కి కర్నాటకలోని ధార్వాడ చేరుకుంది. అక్కడ కాల్కేరీ సంగీత విద్యాలయాన్ని సందర్శించింది. ‘చదువుతోపాటు కళలు, సంస్కృతినీ నేర్పించే అరుదైన కళశాల కావడంతో దీనిని ఎంచుకున్నాం. అంతేకాదు, అదే ఊళ్లో ఉన్న సెల్కో అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికీ వెళ్లాం. రెండు లక్షల ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపిన సంస్థ అది. ఆ తర్వాత బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్‌కు వెళ్లి శ్రీశ్రీ రవిశంకర్‌తో భేటీ అయ్యాం’ అంటూ చెప్పుకొచ్చింది భావన. చైతన్య అందుకుంటూ ‘మేం వెళ్లిన ప్రతిచోటా మాకు స్ఫూర్తినందించే వ్యక్తుల్నే కలుసుకున్నాం. వారి విజయగాథల్ని వారి నోటివెంటే వినడం మరచిపోలేని అనుభూతి’ అని వివరించాడు.
కేవలం వ్యక్తుల్నీ కలుసుకోవడం, సంస్థల్ని సందర్శించడం మాత్రమే కాదు...కొన్ని చోట్ల ప్యానెల్ డిస్కషన్స్‌లోనూ ఈ బృందం పాల్గొంది. ‘ఉదాహరణకు బెంగళూరులో హౌసింగ్ డాట్ కామ్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ యాదవ్‌తో చర్చలో పాల్గొన్నాం. డిజిటల్ ఇండియా గురించి ఆయన ఎన్నో విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు’ అని సావన్ చెప్పాడు.
ధార్వాడ, బెంగళూరు అయ్యాక ఈ బృందం మదురై వెళ్లి, అక్కడ అరవింద్ నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించింది. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం చేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆస్పత్రి అది. అటు తర్వాత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌తోనూ ఈ బృందం భేటీ అయింది.
అన్నార్తులకు అక్షయపాత్ర
తర్వాత జాగృతి యాత్ర విశాఖ చేరుకుంది. అక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్‌ను సందర్శించి వారి కార్యకలాపాలను పరిశీలించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని తిరుగులేని విధంగా చేపట్టి, వేలాది పిల్లలు బడిముఖం పట్టేలా చేయడంలో ఈ సంస్థ చేసిన కృషి అసామాన్యం. జాగృతి బృందం నావల్ డాక్‌యార్డుకూ వెళ్లింది. డాక్‌యార్డు గురించి చైతన్య మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు డాక్‌యార్డ్‌కు ఏ విధంగా సేవలు అందించగలరా అన్నది తమను ఆలోచనలో పడవేసిందన్నాడు. ‘ఉదాహరణకు మెరైన్ పెయింట్స్ విభాగంలో డాక్‌యార్డ్‌కు సేవలు అందించే అవకాశం ఉంది. ఈ పని ప్రస్తుతం ఇండియాలో జరగడం లేదు. ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అంటాడు చైతన్య.
గ్రామ వికాసం
విశాఖనుంచి జాగృతి బృందం నేరుగా ఒడిశాలోని బరంపురం చేరుకుంది. అక్కడ గ్రామ్ వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను గమనించారు. గ్రామీణులకు రక్షిత మంచినీరు, మరుగు దొడ్ల సౌకర్యం కల్పించడంలో గ్రామ్ వికాస్ విశేష కృషి చేస్తోంది. ప్రజల్నే భాగస్వాములను చేసి ఈ ప్రభుత్వేతర సంస్థ చేపడుతున్న కార్యకలాపాలు తమకెంతో స్ఫూర్తినిచ్చాయంటాడు చైతన్య.
సౌర విద్యుత్ కాంతులు
బరంపురంనుంచి జాగృతి యాత్ర నేరుగా బీహార్‌లోని రాజ్‌గిర్‌లోని నలందా యూనివర్శిటీని చేరుకుంది. అత్యుత్తమ వర్శిటీగా ఎదగడానికి దోహదం చేసిన అంశాలను అక్కడి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నామన్నాడు చైతన్య. ఆ తర్వాత జాగృతి బృందం ఢిల్లీ చేరుకుని గూంజ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యకలాపాల గురించి తెలుసుకుంది. అక్కడినుంచి రాజస్థాన్‌లోని టిలోనియాకు వెళ్లి బంకర్ రాయ్‌తో భేటీ అయింది. ‘బేర్‌ఫుట్ కాలేజీని స్థాపించి, గ్రామీణ మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడంలో రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించి, ఆ దిశగా మహిళల్ని ప్రోత్సహించడంలోనూ ఆయన అవిరళ కృషి చేస్తున్నారు. కేవలం చుట్టుపక్కల ప్రాంతాలవారే కాదు..లాటిన్ అమెరికా, జింబాబ్వే వంటి దేశాలనుంచి కూడా వచ్చి రాయ్ చెప్పే పాఠాలు వినడం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది’ అంటాడు చైతన్య.
జాగృతి యాత్ర చివరి మజిలీ అహ్మదాబాద్. అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు.
మొత్తానికి ఈ యాత్ర తననెంతో ప్రభావితం చేసిందంటాడు 27 ఏళ్ల చైతన్య. ‘పనిలో ఎంతో ఒత్తిడికి గురయ్యేవాణ్ని. ఈ యాత్ర అనంతరం నాలో టెన్షన్ తగ్గిపోయింది. పని చేయాలి, ఎదగాలి అనే పట్టుదల పెరిగింద’ని చెబుతున్నప్పుడు అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.
యువత అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తున్న 24 ఏళ్ల సావన్‌లో కూడా ఈ యాత్ర చైతన్యాన్ని నింపింది. ‘మన దేశంలో అనేక సమస్యలకు నిరక్షరాస్యతే కారణమని ఈ యాత్ర ద్వారా నాకు తెలిసివచ్చింది. వీలైనంతమందికి చదువు చెప్పాలని నాకు నేను లక్ష్య నిర్దేశం చేసుకున్నాను’ అన్నాడు. ఇక 25 ఏళ్ల కరోల్ మాట్లాడుతూ ‘దేనికైనా క్రమశిక్షణ ముఖ్యమని తెలుసుకున్నాను. జాగృతి యాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది’ అని చెప్పింది.