యువ

ఆలనగా పాలనగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్ఫయ్యారేళ్ల పూర్ణొతా దత్తా బెహల్ ఓ బిజినెస్ మాగ్నట్.
ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే పూర్ణొత ఓ రోజు స్నేహితురాలికి కేన్సర్ వచ్చిందని తెలిసి, పరామర్శించేందుకు టాటా మెమోరియల్ ఆస్పత్రి (ముంబాయి)కి వెళ్లింది. అక్కడ స్నేహితురాల్ని పరామర్శించి, ఓదార్చి వెనుదిరిగింది. అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఏడేళ్ల బాలికను చూసింది. బక్కచిక్కి, కళ్లు లోపలికి పోయి, నిర్జీవంగా ఉన్న ఆ బాలికను చూసి పూర్ణొతా స్థాణువై పోయింది. ఎందుకనో, ఆమెకు తన కూతురు గుర్తొచ్చింది. ఆమె వయసూ ఏడేళ్లే. ఆ పాపకు ఏమైందని అక్కడ నర్సుల్ని అడిగితే కేన్సర్‌తో బాధపడుతోందని, అయితే పౌష్టికాహార లోపంతోనూ బాధపడుతోందని చెప్పారు. అప్పటికి ఆస్పత్రినుంచి బయటకొచ్చినా, పౌష్టికాహార లోపం గురించి ఆమె అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. కేన్సర్ రోగుల్లో చాలామందిని మృత్యుముఖం వైపు నెడుతున్నది కేన్సర్ కాదనీ, పౌష్టికాహార లోపమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. దాంతో తన వంతుగా ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు ఏదైనా చేయాలనుకుంది. అనుకున్నదే తడవు... చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, 2012లో ‘కడిల్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది.
కట్ చేస్తే...ఇప్పుడు కడిల్స్ దేశవ్యాప్తంగా 17 ఆస్పత్రుల్లో 18వేలకు పైగా కేన్సర్ రోగులకు పౌష్టికాహారం అందిస్తోంది. లాభాపేక్ష రహితంగా పనిచేస్తున్న కడిల్స్ ఫౌండేషన్‌కు వ్యవస్థాపకురాలు, సిఇఓ కూడా పూర్ణొతాయే. కేన్సర్‌తో బాధపడుతున్న చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కడిల్స్ ఫౌండేషన్ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పూర్ణొతా మొదట్లో చాలా శ్రమించారు. పిల్లలు-కేన్సర్-పౌష్టికాహార లోపం వంటి అంశాల గురించి తాను మాట్లాడితే, చాలామంది తాను నిధులకోసమే ప్రచారం చేస్తున్నానని భావించేవారని పూర్ణొతా చెప్పారు.
కేన్సర్‌కు చికిత్స అందించే 17 ప్రసిద్ధ ఆస్పత్రులను ఎంచుకుని, అక్కడ పౌష్టికాహార నిపుణుల్ని నియమించింది. వారికి కేన్సర్ అంకాలజీలో శిక్షణ ఇప్పించింది కూడా. ఈ నిపుణులు ఆస్పత్రికి వచ్చే కేన్సర్ రోగులకు (చిన్నారులకు) కౌనె్సలింగ్ ఇవ్వడమే కాదు, వారికి పిడియా స్యూర్, త్రెప్టిన్ బిస్కట్లు, లస్సీ, పండ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఆర్థిక స్థోమత లేని పిల్లలకు ఫీడింగ్ ట్యూబ్స్ వంటి పరికరాలనూ అందిస్తారు. పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకూ నెలవారీ రేషన్ పథకం కింద వంట సరకులు అందిస్తున్నారు. ‘ఆస్పత్రికి వచ్చే కొత్త పేషంట్లపై మేం ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే, వీరిలో చాలామంది ఇక్కడ ఖర్చులు భరించలేక వెనుదిరిగిపోయేవారే ఎక్కువ. అందువల్ల వారికి సహాయ సహకారాలు అందించడంపై శ్రద్ధ వహిస్తున్నాం’ అంటారు పూర్ణొతా. కడిల్స్ ఫౌండేషన్ సేవలు మొదలయ్యాక టాటా మెమోరియల్ ఆస్పత్రిలో ఇలా వెనుదిరిగి వెళ్లిపోయే రోగుల సంఖ్య 20నుంచి 3.7 శాతానికి తగ్గిందట.
ఇంతటి బృహత్తర సేవా పథకాన్ని భుజాలకెత్తుకున్న కడిల్స్ ఫౌండేషన్‌కు టాటా మెమోరియల్ ఆస్పత్రి (ముంబాయి), ఎయిమ్స్ (్ఢల్లీ), కిద్వాయ్ మెమోరియల్ ఆస్పత్రి (బెంగళూరు), ఎస్‌జిపిజిఐ (లక్నో), ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ (కోల్‌కతా) వంటి సంస్థలు సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. కడిల్స్ ఫౌండేషన్‌లో పనిచేసే ఉద్యోగులంతా మహిళలే కావడం విశేషం. పైగా వీరిలో బాగా చదువుకున్నవారూ, సేవాభావం గలవారూ ఉండటం మరో విశేషం. కడిల్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల అపర్ణా చంద్ మాట్లాడుతూ ‘ఎన్ని పెద్ద ఉద్యోగాలు చేసినా దొరకని సంతృప్తి ఇందులో దొరుకుతోంది’ అంటారు. కార్నెజీ మెలన్ యూనివర్శిటీలో చదువుకుని న్యూయార్క్‌లో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేసిన అపర్ణ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, కడిల్స్‌లో చేరారు. చిన్నారులను కబళించాలని చూసే కేన్సర్ మహమ్మారిని తరిమికొట్టి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం కృషి చేస్తున్న పూర్ణొతా, కడిల్స్ ఫౌండేషన్‌ల సేవలు అభినందనీయం.

చిత్రం.. పూర్ణొతా దత్తి బెహల్