యువ

బాప్‌రే ‘బాబ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఓ పరుగుపందెం...
పరుగుపెడుతున్నంత మాత్రాన గెలుపు లభిస్తుందని చెప్పలేం...
అలాగని పరిగెట్టకుండా ఉంటే గెలుపుఎలా సాధ్యమవుతుంది?
కాబట్టి...
పరుగెట్టాలి... పడినా లేస్తూ పరిగెట్టాలి..
అప్పుడే గెలుపు తలుపుతడుతుంది..
కనీసం గెలిచేందుకు చేసిన ప్రయత్నం సంతృప్తినిస్తుంది.
ఆ ప్రయత్నంలో ఏదో ఒకటి..
ఎవరో ఒకరు చేదోడైతే.. ఆ పరుగే..జీవితాన్నీ మార్చేస్తుంది.
..
ఔను..ఇది నిజమేనంటాడు జేమ్స్ బొవెన్.
ఓటమినుంచి గెలుపువైపుతను నెమ్మదిగా వేసిన అడుగు..పరుగులా మార్చేందుకు...విజయాన్ని సాధించేందుకు ఓ పిల్లి..స్ఫూర్తినిచ్చిందంటాడు.
తను మానసికంగా గాయపడితే...
అది శారీరకంగా గాయపడింది..
దాని గాయానికి తను మందువేసి, చేరదీస్తే..
తనకు మనశ్శాంతిని, సంపదను, కీర్తిని ఆ పిల్లి ఇచ్చిందంటాడు.
పార్కుల్లో జనం మధ్య పాటలు పాడి, సంగీతవాద్యాలు మోగించి దొరికిన చిల్లరతో రోజు గడిపే బొవెన్...జీవితాన్ని ఓ పిల్లి మార్చేసింది.
ఒక్కమాటలో చెప్పాలంటే...
మత్తుమందులకు బానిసైన బొవెన్ పిల్లి పరిచయంతో కొత్తవేకువను చూశాడు.
కాలికి గాయంతో తిరుగుతున్న ఆ పిల్లి
ఇప్పుడు ఓ సెలబ్రిటీగా మారిపోయింది.
వారిద్దరి విజయగాథలతో కూడిన పుస్తకాలు
హాట్‌కేకులయ్యాయి.
వారి ప్రస్థానం హాలీవుడ్‌లో
సినిమాగా వస్తోంది!
ఈనెల 4న యుకె అంతటా ఆ సినిమా విడుదలవుతోంది.

ఇంగ్లండ్‌లో 1975లో పుట్టిన జేమ్స్ బొవెన్ చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలసి పొట్టకూటికోసం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. 1997లో తల్లిదండ్రులు విడిపోయారు. జీవితం గాడి తప్పింది. చదువు మధ్యలో ఆగిపోయింది. రోజు గడవటం కష్టమైంది. హెరాయిన్‌కు బానిసయ్యాడు. తిరిగి ఇంగ్లండ్ వచ్చేశాడు. ఆ మత్తులోంచి అసలు జగత్తులోకి రావాలనుకున్నాడు. అలా చేయాలంటే ముందు బతకాలికదా. కనుక కాస్త సంపాదించాలి. గిటారును నమ్ముకున్నాడు. లండన్‌లోని కేవెంట్ గార్డెన్‌కు రోజూ రావడం, గిటారు వాయిస్తూ పాడటం దినచర్య. నచ్చినవారు వేసే చిల్లరే ఆదాయం. రోజూ 25 పౌండ్లు వచ్చేవి. ఊరి చివర రేకులషెడ్డులో అద్దెకు నివాసం. 2007లో ఓ సంఘటన అతడి జీవితాన్ని ఓ మలుపుతిప్పింది. ఓ రోజు ఇంటికి వస్తూంటే కుంటుతూ ఓ పిల్లి కనిపించింది. ఎవరిదో పెంపుడుపిల్లి అనుకున్నాడు. అది తనవెంటే వస్తూంటే విసుగేసింది. రెండుమూడు రోజులు అదే పరిస్థితి. హచ్ కుక్కలా తన వెంట పడుతున్న ఆ పిల్లి ఎవరిదంటూ అక్కడున్న అందరినీ అడిగాడు. ఎవరూ ఏం చెప్పలేదు. చివరకు కాలికి గాయమై కుంటుతున్న ఆ పిల్లిని తానే చేరదీశాడు. వీధిలోని వెటరినరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించి వదిలేశాడు. అయినా ఆ పిల్లి తన వెంటపడటం మానలేదు. తను రోజూ వెళ్లేదారిలో వెంటపడేది. బస్సెక్కితే, తనూ ఎక్కేసేది. పార్కుకూ వచ్చేసేది. ట్రాఫిక్‌లో ఏ వాహనం కిందైనా పడుతుందేమోనని భయపడ్డాడు. ఇక తప్పేట్టు లేదని మళ్లీ చేరదీశాడు. దానిపై శ్రద్ధ పెరిగేకొద్దీ హెరాయిన్ మత్తునుంచి బయట పడటం మొదలుపెట్టాడు. ఆ పిల్లిని తన భుజంపై కూర్చోపెట్టుకుని పార్కులో పాడేవాడు. తన పాటకు దాని చేష్టలు తోడయ్యాయి. ఇద్దరూ కలసి ప్రేక్షకులను అలరించేవారు. ఓ ఔత్సాహికుడు ఆ దృశ్యాన్ని చిత్రీకరించి యూట్యూబ్‌కు పంపాడు. లైక్స్‌మీద లైక్స్. అదో పెద్ద హిట్. ఈలోగా స్థానిక పత్రిక ‘ఇల్లింగ్టన్ ట్రిబ్యూన్’లో వీరిపై ఓ కథనం ప్రచురితమైంది. ఇది చదివిన కొందరు సాహిత్యకారులు ప్రఖ్యాత రచయిత గేరీ జెన్‌కింగ్‌కు పరిచయం చేశారు. జేమ్స్ బొవెన్, ఆ పిల్లి విజయగాథను ఆయన పుస్తకరూపంలోకి తెచ్చాడు. జేమ్స్ తన పిల్లికి పెట్టిన పేరు ‘బాబ్’. లండన్‌లో ప్రఖ్యాత టెలివిజన్ డ్రామా ‘ట్విన్‌పీక్స్’లోని ఓ కేరక్టర్ పేరు అది. 2010లో ‘ఎ స్ట్రీట్ క్యాట్, నేమ్‌డ్ బాబ్’ పేరిట విడుదలైన ఆ పుస్తకం ఓ సంచలనం. 30 భాషల్లోకి తర్జుమా అయింది. యుకెలో ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌టెన్ పుస్తకాల జాబితాలో ఇది ఒకటి. ఇప్పటికి అరడజను పుస్తకాలు విడుదలయ్యాయి. అన్నింటికీ అదే ఆదరణ. 2013లో ‘ఎ స్ట్రీట్‌క్యాట్ బాబ్, హౌ సేవ్‌డ్ మై లైఫ్’ యుఎస్‌లో విడుదలైంది. అక్కడా అంతే. మొదటి పుస్తకం ఒక్క బ్రిటన్‌లోనే పది లక్షల కాపీలు అమ్ముడైంది. హారీ పోటర్‌సహా పది ప్రముఖ రచనల సరసన నిలిచింది. కెనడియన్ దర్శకుడు రోజర్ స్పాట్టిస్‌వుడ్ దర్శకత్వంలో రూపొందిన ‘బాబ్’ సినిమా నవంబర్ 4న విడుదలవుతోంది. దీని ప్రీమియర్‌కు డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ హాజరవుతున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు ట్రెడ్స్‌వె అందులో జేమ్స్ బొవెన్‌గా నటిస్తున్నాడు. ఇక బాబ్ పాత్రలో అదే నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌కోసం జేమ్స్ అనేక దేశాల్లో పర్యటించనున్నాడు. రోజుకు పాతిక పౌండ్ల సంపాదనతో కొత్త జీవితంవైపు అడుగులు వేయడం మొదలుపెట్టిన జేమ్స్, బాబ్ పరిచయం తరువాత రోజుకు 60 పౌండ్లు, ఆ తరువాత లెక్కలేనంత సంపాదనతో లక్షాధికారి అయ్యాడు. గడచిన మూడేళ్లలో అతడి సంపాదన 5,00,000 పౌండ్లు. దాదాపు అంతా బాబ్ పేరనే డిపాజిట్ చేశాడు. ఇంకా సొంతిల్లు సమకూర్చుకోలేదు. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలన్నది అతడి ఆలోచన. తనకి మాత్రమేకాదు. ఇల్లులేని పేదలందరికీ. అందుకే ఇప్పటికీ ఆయన పార్కుల్లో పాటలు మానడు. నిర్ణీతవేళకి, నిర్ణీత బస్సులో అతడి ప్రయాణం సాగుతోంది. అతడి వెంట వచ్చే ‘బాబ్’కు, లండన్‌లో తిరిగే 73వ నెంబర్ బస్సులో ఓ కిటికీ పక్క సీటు ప్రత్యేకం. ఎందుకంటే అది అందరికీ కన్పించాలికదా...స్ఫూర్తిపొందేందుకు. బాబ్ స్పూర్తితో వెలుగుబాట పట్టిన జేమ్స్..తనలాంటి వారికి అసలు జీవితంలోని మజా చూపించడానికి బాబ్‌ను వెంటపెట్టుకునే వెళుతున్నాడు...ఇప్పటికీ!

ఎస్‌కె రామానుజం