యువ

పెరిగితే తగ్గాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్నా వ్యాస్ పటేల్
సోషల్ మీడియాలో మునిగి తేలేవారికి ఆమె పేరు చిరపరిచితమే.
బరువు ఎక్కువై బాధపడేవారికి ఆమె కేరాఫ్ అడ్రస్.
ఒకప్పుడు 86 కేజీల బరువుతో పంధొమ్మిదేళ్లకే ఆంటీ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ, తనంతట తానుగా కష్టపడి, బరువు తగ్గి, చక్కనమ్మ చిక్కినా అందమే అనిపించుకుంది.
అంతేకాదు...అధిక బరువు వల్ల కలిగే అనర్థాలు, బరువును ఎలా తగ్గించుకోవడం వంటి అంశాలపై ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పాఠాలు చెబుతూ రెండు లక్షలమందికి పైగానే ఫాలోవర్లను సంపాదించుకుంది. స్ఫూర్తిదాయకమైన సప్నా ప్రస్థానం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
***
అనగనగా ఇద్దరమ్మాయిలు..
ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
అందులో ఒకమ్మాయి వయసు 19 ఏళ్లు. మరో అమ్మాయి వయసు పదేళ్ళు. వరుసకు వాళ్లిద్దరూ అత్తా మేనకోడళ్లు. ఇంతలో మేనకోడలి స్నేహితురాలి తల్లి అక్కడకొచ్చింది. మేనకోడల్ని చూసి పలకరించి, పక్కనున్న ఆమె అత్తను చూపిస్తూ ‘ఈవిడెవరూ! మీ అమ్మగారా?’ అనడగడంతో ఆ 19 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా అవాక్కయింది. బిక్కమొహం పెట్టింది. ఏడుపొకటే తరువాయి. అయితే ఆవిడకు అలాంటి సందేహం రావడానికి కారణం లేకపోలేదు...అది..ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లే అయినా బరువు మాత్రం 86 కేజీలు మరి. తనను చూస్తే ఎవరైనా అలా పొరబడే అవకాశం ఉంది కదా! ఆ అమ్మాయి మరెవరో కాదు...సప్నా వ్యాస్ పటేల్!
ఈ సంఘటన సప్నాను కదిలించింది. పంధొమ్మిదేళ్లకో ఆంటీననిపించుకుంటున్నానన్న బాధ ఆమెను ఆలోచనలో పడేసింది. బరువు తగ్గాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదంతా జరిగింది 2011లో. వెంటనే తినడం తగ్గించేసింది. రోజుకి రెండు మూడు చపాతీలు మించి తినేది కాదు. కానీ నాలుగు నెలలు గడిచినా బరువు మాత్రం తగ్గలేదు. దాంతో తాను ఎంచుకున్న మార్గం తప్పని తెలుసుకుంది. ఇలా కాదనుకుని, పౌష్టికాహార నిపుణుల్ని సంప్రదించింది. పనిలోపనిగా పౌష్టికాహారం, డైట్ కంట్రోల్, వర్కవుట్ల గురించీ అధ్యయనం చేయడం మొదలుపెట్టింది.
బరువు తగ్గాలంటే తినడం మానేస్తే ఫలితం ఉండదని తెలుసుకుంది. ఆకలేస్తే, బాగా ఇష్టమైన పదార్ధాలు తినే బలహీనత అందరికీ ఉంటుంది. అవి తింటే మరింత లావు కావడం తథ్యం. ఈ నిజం తెలుసుకున్న సప్నా...తనంతట తానుగా ఓ కార్యాచరణను రూపొందించుకుంది. ఆ ప్రకారం ప్రతి రెండు గంటలకూ కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది.
నెమ్మదిగా వర్కవుట్లు కూడా చేయడం కూడా ఆరంభించింది. దాంతో నెమ్మదిగా బరువు తగ్గడం మొదలైంది. ఇలా 12 నెలల వ్యవధిలో 33 కేజీల బరువు తగ్గింది. అంటే 86 కేజీలనుంచి 53 కేజీలకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో తిండి వైపు ధ్యాస మళ్లకుండా, పార్టీలకూ, పబ్‌లకూ వెళ్లకుండా జాగ్రత్తపడింది. తన విజయాలను పేర్కొంటూ ‘లుక్ వోవ్’ (జ్య్యరీ జ్యీతీ) పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పేజీ తెరిచి, అడిగిన వారందరికీ ఉచితంగా సలహాలిస్తోంది. ఈ పేజీని ఇప్పటివరకూ ఐదు లక్షల మంది విజిట్ చేసినట్టు అంచనా. సప్నాకు ఫేస్‌బుక్‌లో 97వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో ‘దిస్ గర్ల్ విల్ షాక్ యూ’ పేరిట పోస్టయిన వీడియోకు 2లక్షల హిట్లు లభించాయి. సప్నా తాజాగా ఫిట్‌నెస్‌పై ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తనలాగ అధిక బరువుతో బాధపడే యువతీయువకులకోసం ఇటీవల స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. ఫిట్‌నెస్‌పై తాను ఇచ్చే సలహాలు, సూచనలకు సప్నా ఎలాంటి ఫీజూ వసూలు చేయదు.
కట్ చేస్తే...సప్నా ఇప్పుడు ప్రముఖ మోడల్. నిర్మా యూనివర్శిటీ నుంచి ఎంబిఎ పట్టా పొందిన సప్నా, ప్రస్తుతం న్యూట్రిషనల్ సైన్స్ అండ్ డైటరీలో పిహెచ్‌డి చేస్తోంది. ఆమె రీబాక్ సర్టిఫైడ్ ఫిట్‌నెస్ ప్రొఫెషనల్ కూడా. ‘బరువు పెరగడం సులువే. కానీ తగ్గడమే కష్టం. సరైన దిశానిర్దేశం లేకపోతే అది మరీ కష్టమనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నాలా ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా సలహాలూ సూచనలూ ఇస్తున్నా’నంటోంది సప్నా.

చిత్రం.. సప్నా వ్యాస్