యువ

పేపర్ పెన్.. ప్లాస్టిక్‌పై గన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్ అంటే కేవలం రాసేందుకు మాత్రమే పనికొచ్చే వస్తువు కాదు. అదొక ప్రియ నేస్తం. అదొక తోడూనీడా. ఎక్కడకు వెళ్లినా మనతోపాటే దాని ప్రయాణం.
పాత తరం మనుషులకు పెన్‌తో గాఢమైన అనుబంధం ఉండేది. కొంతమంది జీవితాంతం ఒకే పెన్‌ను వాడేవారు. మరో పెన్ చేతబట్టేందుకు వారి మనసు అంగీకరించేది కాదు. అనుకోకుండా ఆ పెన్ పోతే, వారికి నిద్రాహారాలు ఉండేవి కావు.
కానీ, ఇప్పుడు కాలం మారింది. కాలంతోపాటే పెన్‌లూ మారాయి. ఇంకు పెన్నులు మసకబారి, బాల్ పెన్నుల కాలం వచ్చింది. అవీ పోయి, యూజ్ అండ్ త్రో పెన్నులు వచ్చాయి. రాయడం, పారేయడం..దట్సాల్!

పెన్నులతో అనుబంధం పెంచుకోకపోతే పోయె, వాడి పారేసే పెన్నుల వల్ల పర్యావరణ కాలుష్యం ఎంత పెరుగుతోందో ఎవరూ ఆలోచించడం లేదు. వీటిలో ఇంకు అవక్షేపం ఉంటుంది. మెటల్ పదార్థాలూ ఉంటాయి. అందువల్ల డిస్పోజబుల్ ప్లాస్టిక్ పెన్నులను రీసైకిల్ చేయడం కష్టం. స్కూలుకెళ్లే ప్రతి విద్యార్థీ నెలకు మూడు పెన్నుల చొప్పున వాడి పారేస్తారనుకుంటే, దేశంలో నెలకు ఎన్ని లక్షల పెన్నులు మట్టిలో కలుస్తున్నాయో, వాటివల్ల పర్యావరణానికి ఎంతటి అనర్థం కలుగుతున్నదో అంచనా వేయొచ్చు. ఒక్క అమెరికాలోనే ఏటా 160 కోట్ల పెన్నులను పారేస్తున్నారట.
కేరళలోని ఎర్నాకులానికి చెందిన లక్ష్మీ మేనన్ అనే అమ్మాయికి ఇదే ఆలోచన వచ్చింది. వాడి పారేసే పెన్నుల వల్ల పర్యావరణానికి ఇంతగా హాని జరుగుతున్నా ఎవరూ గొంతెత్తి మాట్లాడకపోవడం ఆమెను కదిలించింది. ఆ పనేదో తానే ఎందుకు చేయకూడదనుకుంది. దాని ఫలితమే రోలాపెనా!
రోలాపెనా అనేది పేపర్ పెన్. కాగితంతో తయారు చేసిన పెన్. దీనిని వాడి పారేస్తే పర్యావరణానికి ఏం కాదు. అంతే కాదు, దీనిని వాడేసిన తర్వాత ఇదే పెన్‌ను నాటితే అది మొలకెత్తుతుంది. అదే ఇందులో విశేషం! హోమ్ సైన్స్‌లో డిగ్రీ తీసుకుని, ఉద్యోగార్థం అమెరికా వెళ్లినా లక్ష్మీ మేనన్‌ను ఈ ఆలోచన వెంటాడుతూనే ఉండేది. తిరిగి స్వరాష్ట్రం చేరుకున్నా ఇదే ఆలోచన. ఓసారి అనాథ బాలలకు బొమ్మలేయడం ఎలాగో నేర్పుతూ, అలవోకగా పేపర్‌తో ఓ పెన్ను తయారు చేసింది. దానిని చూసి పిల్లలంతా చప్పట్లు చరిచారు. వారి చప్పట్లలోంచే తన ఆలోచనకు ఓ ఆకారం ఏర్పడిందంటారు లక్ష్మి. యూజ్ అండ్ త్రో పెన్నులకు పరిష్కారం పేపర్ పెన్నులేనని కృత నిశ్చయానికి వచ్చిన లక్ష్మి, రోలాపెనాకు శ్రీకారం చుట్టింది. పేపర్‌తో తయారు చేసే ఈ పెన్‌కు చివరన మొలకెత్తే గింజలు వేసి, సీల్ చేస్తారు. పెన్ను వాడేసిన తర్వాత దానిని నాటితే మొలకెత్తుతుందన్నమాట. (ఇదే కానె్సప్ట్‌తో స్ప్రౌట్ పెన్సిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే). 2012లో తన తల్లినీ, నాయనమ్మనూ భాగస్వాముల్ని చేస్తూ పేపర్ పెన్నుల తయారీని ఓ కుటీర పరిశ్రమగా లక్ష్మి మొదలుపెట్టారు. ఈ పరిశ్రమకు ఆమె పెట్టిన పేరు ప్యూర్ లివింగ్ (Products Up-cycled Recycled and Economised). రోలాపెనా అమ్మకాలు ప్రస్తుతం కేరళకే పరిమితమయ్యాయి. మార్కెట్లో యూజ్ అండ్ త్రో పెన్నులు మూడు రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. కానీ, రొలాపెనా ధర పనె్నండు రూపాయలు. దీనిపై లక్ష్మీ మేనన్ మాట్లాడుతూ ధర విషయంలో వాటితో పోటీ పడలేమనీ, పర్యావరణ హితం గురించి ఆలోచించేవారు తమ ఉత్పత్తులనే కొంటారని ధీమా వ్యక్తం చేశారు. గడచిన మూడేళ్లలో ప్యూర్ లివింగ్ సంస్థ లక్షన్నర పెన్నుల్ని విక్రయించింది.
పెన్నుల తయారీతోపాటు విక్స్‌డామ్ అనే మరో ప్రాజెక్టునూ లక్ష్మి చేపట్టింది. వృద్ధాశ్రమాల్లో అనాథలుగా జీవనం గడుపుతున్న వృద్ధులతో దీపపు వత్తులు తయారుచేయించడమే ఈ ప్రాజెక్టు. ఇలా వచ్చిన ఆదాయం అదే వృద్ధులకోసం వెచ్చిస్తారు. విక్స్‌డామ్ ప్రాజెక్టు ద్వారా తాము ఎంతోమంది అనాథలకు, వృద్ధులకూ ఉపాధి కల్పించామని లక్ష్మి సగర్వంగా చెబుతారు. అలాగే ‘పెన్ డ్రైవ్’ అనే ప్రచార కార్యక్రమానికీ ఆమె తెరతీశారు. ప్లాస్టిక్ పెన్నుల వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్థాలను ప్రజలకు వివరించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. యువత పెడదారి పడుతోందనో, సమాజం చెడిపోతోందనో బాధపడుతూ, ఇతరులపై నిందలు వేస్తూ కూర్చునేవారికి లక్ష్మీమేనన్ ఓ కనువిప్పు. చిన్న వయసులోనే సమాజ హితంకోసం పాటు పడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన లక్ష్మికి ‘యువ’ హ్యాట్సాఫ్ చెబుతోంది!

చిత్రం.. లక్ష్మీ మేనన్, రోలాపెన్నులు