యువ

పీకే కదాని పారేస్తే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మొక్కే కదాని పీకేస్తే...పీక కోస్తా’ అంటాడు మెగాస్టార్ ఓ సినిమాలో!
నోయిడాకు చెందిన ఇద్దరు కుర్రాళ్లుకూడా అదే అంటున్నారు కాస్త అటూఇటూగా. ‘పీకే కదాని పారేస్తే మన పీకే తెగుతుంది’ అని.
పీకేమిటి..పారేయడమేంటి అనుకుంటున్నారు కదూ!
పీక అంటే..సిగరెట్ పీక! మన పీకే తెగుతుంది అంటే పర్యావరణానికి కలిగే హాని ద్వారా మనకే ప్రమాదమని.
మరి కాస్త క్లారిటీ కావాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
అనగనగా ఇద్దరు కుర్రాళ్లు. విశాల్ కనేత్, నామన్ గుప్తా. విశాల్ (25) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. నామన్ (22) ఢిల్లీ యూనివర్శిటీనుంచి డిగ్రీ పాసయ్యాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా మంచి ఫ్రెండ్స్. రెండేళ్ల కిందట ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ అందరూ తినడం..తాగడం..ఎంజాయ్ చేయడం చూశారు. పెళ్లంటే అలాగే ఉంటుంది కదాని సరిపెట్టుకున్నారు. అయితే వారిని ఆలోచనలో పడేసిన విషయం మరొకటుంది. అది... ఎవరు పడితే వారు సిగరెట్లు కాల్చేసి, పీకల్ని ఎక్కడ పడితే అక్కడ పారేయడం. ఇలా పారేస్తున్న సిగరెట్ పీకలు పర్యావరణానికి ఏ మేరకు హాని చేస్తున్నాయి? వాటిని రీసైకిల్ చేయలేమా?...ఇలా సాగింది వారి ఆలోచన.
ఫంక్షన్ పూర్తయింది. ఇంటికొచ్చారే కానీ..వారిని ఆలోచనలు ఓ పట్టాన వదలలేదు. ఇక లాభం లేదని సిగరెట్ పీకల గురించి పరిశోధన మొదలుపెట్టారు. వారి రీసెర్చిలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అంతా అనుకున్నట్టు సిగరెట్ పీకల్ని కాటన్‌తో కాదు...సెల్యులోజ్ ఎసిటేట్ అనే రసాయనిక పదార్థంతో, ప్లాస్టిక్ ఫిల్టర్‌తో తయారు చేస్తారు. ఇది ఓ పట్టాన మట్టిలో కలసిపోదు. కొనే్నళ్లపాటు పర్యావరణంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ కోట్లాదిమంది సిగరెట్లను తాగి, పీకల్ని పారేస్తున్నారు. ఇవి పర్యావరణానికి కలిగించే హాని అపారం. ఒక్క బెంగళూరు నగరంలోనే రోజుకూ 31 లక్షల సిగరెట్ పీకలు వాతావరణానికి పొగపెడుతున్నాయి. సిగరెట్ ఫిల్టర్‌లో ఉండే విషతుల్యమైన రసాయనాలు నీళ్లను కూడా కలుషితం చేస్తాయి. పశువుల ఆహారంలో ఇవి కలిస్తే వాటి ఆరోగ్యానికి ప్రమాదం కలగచేస్తాయి.
ఇప్పటివరకూ సిగరెట్ పీకల్ని రీసైకిల్ చేస్తున్న వారెవరూ లేరు.
అందరూ సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి కలుగుతున్న హాని గురించి చెప్పేవారే కానీ, సిగరెట్ పీకల వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు గురించి మాట్లాడేవారే లేరు.
- ఈ విషయాలు విశాల్, నామన్ ద్వయాన్ని కలవరపరచాయి. సిగరెట్ పీకల్ని తామే రీసైకిల్ ఎందుకు చేయకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడవు రంగంలోకి దిగారు. కార్యాచరణ రూపొందించుకుని, గత జూలైలో ‘కోడ్’ అనే కంపెనీని తెరిచారు. సిగరెట్‌లోని వ్యర్థ పదార్థాలన్నిటినీ ఇక్కడ రీసైకిల్ చేస్తారు.
ముందుగా స్నేహితులిద్దరూ కలసి ‘వి బిన్స్’ పేరిట చిన్నపాటి రేకు డబ్బాలను తయారు చేయించి, వాటిని పాన్ దుకాణాలకు అందజేశారు. కొన్ని కార్యాలయాలకూ ఇచ్చారు.
వినియోగదారులు సిగరెట్ పీకల్ని ఆ డబ్బాల్లో పారేసేలా ప్రోత్సహించమన్నారు.
ప్రతి పదిహేను రోజులకోసారి, కోడ్ కంపెనీకి చెందిన అటెండెంట్ ఒకరు స్వయంగా వచ్చి, డబ్బాల్లో పడిన పీకల్ని తీసుకుని వెడతారు.
తమ డబ్బాలను దుకాణదారులు షాపుల ముందు ఊరికే పెట్టుకోనవసరం లేదు. కిలో సిగరెట్ వేస్ట్‌కు 700 రూపాయల చొప్పున, వంద గ్రాములకు 80 రూపాయల చొప్పున చెల్లిస్తారు. గత మూడు నెలల్లో ‘కోడ్’ ఇలా పది కేజీల సిగరెట్ పీకల్ని సేకరించింది.

రీసైక్లింగ్ ఎలా చేస్తారంటే...
కోడ్ అనేది జీరో వేస్ట్ కంపెనీ. సిగరెట్ పీకలో ఉండే పేపర్, ప్లాస్టిక్, నుసి, పొగాకు..అన్నింటినీ రీసైకిల్ చేస్తుంది.
సిగరెట్ చుట్టూ ఉండే పేపర్‌ను, పీకలో మిగిలి ఉన్న పొగాకును వేరు చేసి, మొక్కలకు ఎరువు తయారీలో వినియోగిస్తారు.
సిగరెట్ పీకలో ఉండే కొద్దిపాటి నుసి (బూడిద)ని కూడా వేరు చేస్తారు. ఈ నుసి కాస్త పెద్ద మొత్తంలో చేరాక, దానిని ఫ్లై యాష్ ఇటుకల తయారీలో వాడతారు.
ఫిల్టర్‌ను వేరు చేసి, సాఫ్ట్ టాయ్స్, కుషన్లను నింపేందుకు వినియోగిస్తారు. భవిష్యత్తులో వీటిని ఎయిర్ ఫిల్టర్స్ తయారీలో వాడే ఆలోచన ఉందని విశాల్ చెప్పాడు.
నోయిడాలో ఏర్పాటు చేసిన ‘కోడ్’ ఆఫీసులో ప్రస్తుతం 70 మంది పనిచేస్తున్నారు. వీరిలో 50 మంది వెండర్లే. వీరు ‘వి బిన్స్’ను షాపుల ముందు పెట్టడం, నిండిన వాటిని తీసుకురావడం వంటి పనులు చేస్తుంటారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడిప్పుడే ‘కోడ్’ సేవలను వినియోగించుకోవడం మొదలెడుతున్నాయి.
కంపెనీ నిర్వహణకు కావలసిన డబ్బును విశాల్, నామన్ తమ చేతినుంచే భరిస్తున్నాయి. వారి కుటుంబాలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయి. ‘కోడ్’ గురించి నామన్ మాట్లాడుతూ ‘మాది ఇప్పుడే పుట్టిన సంస్థ. దాని వయసు నాలుగు నెలలే. అయితే భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మా వంతు కృషి చేస్తాం’ అన్నాడు.
వయసు చిన్నదైనా ఈ కుర్రాళ్ల ఆలోచన పెద్దది. సమాజహితం కోసం వారు వేసిన ఈ అడుగు ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి. పర్యావరణ పరిరక్షణ దిశగా యువత నడుం బిగించిందనడానికి విశాల్, నామన్‌ల ఉదంతమే ఓ ఉదాహరణ.