యువ

సక్సెస్‌కు కేరాఫ్ సోఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో వినికిడి శక్తి లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన మొట్టమొదటి యువతి సోఫియానే కావడం విశేషం. భవిష్యత్తులో రేసర్‌గా ఎదగాలన్న తన ఆకాంక్షకు తొలి అవరోధాన్ని అలా అధిగమించిందామె.

గాంధీ మహాత్ముడు ఉద్యమించినా సమాజంనుంచి అంటరానితనం తొలగిపోలేదు. కులాలు, మతాలు, తెగల పేరిట కొన్ని వర్గాల వారిని చిన్నచూపు చూస్తున్న ధోరణి ఇప్పటికీ పోనేలేదు.
దివ్యాంగుల్నే చూడండి. కావాలని అవయవ లోపంతో ఎవరూ పుట్టరు. కానీ చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న దివ్యాంగులు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆదరించి, అక్కున చేర్చుకుని చేయూతనివ్వడం మాట అటుంచి, అవహేళన చేస్తూ వారిని మానసికంగా మరింత కుంగదీసే ‘మహానుభావులు’ అడుగు అడుక్కీ ఉన్నారు.
ఇలాంటి సామాజిక రుగ్మతలు పోయేదెలా? వాటిని పొలిమేరలు దాటేలా తరిమికొట్టేదెలా?
అచంచలమైన ఆత్మవిశ్వాసం... మొక్కవోని పట్టుదల...అవిశ్రాంతమైన కృషి..ఈ మూడు శక్తులూ మీదగ్గర ఉంటే పరిహాసాలు విస్తుబోతాయి. అవమానాలు ఆమడదూరంలో నిలబడతాయి. అపజయాలు పలకరించే ధైర్యమే చేయవు. ఆవేదనలు, ఆత్మక్షోభలూ, ఆక్రందనలూ దరిదాపుల్లోకి కూడా రావు.
ఇవన్నీ పుణికి పుచ్చుకున్న ఒక అమ్మాయి ఉంది. అవమానాలను తట్టుకుంది. అపజయాలను ఢీకొంది. పరిహాసాలతో పోరాడింది. చివరకు అన్నిటినీ ఓడించి, గెలిచింది...గెలుస్తూనే ఉంది.
ఆమె పేరు సోఫియా జో. వయసు 24 ఏళ్లు. పట్టుమని పాతికేళ్లయినా లేని ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వింటే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవలసిందే. అంతకంటే ముందు...ఆమె అవకరం గురించి వింటే మరింత ఆశ్చర్యపోతారు.
ఆమె... పుట్టుకతో మూగ, చెవిటి.

కేరళలోని కోచికి చెందిన సోఫియా బాల్యమంతా దుర్భరంగానే గడిచింది. తల్లిదండ్రులు జో ఫ్రాన్సిస్, గోరియట్టీలకు సోఫియా, రిచర్డ్ సంతానం. ఇద్దరూ పుట్టుకతో మూగ, చెవిటివారే. స్కూల్లో చేర్పిస్తే సోఫియాను అంతా ఆటపట్టించేవారు. విచిత్రమేమంటే వారు తనపై వేసే జోకులు కూడా వినలేని దుస్థితి ఆమెది. అంతా అంటరానిదానిలా దూరం పెడితే తల్లిదండ్రులు మాత్రమే ఆమెలో ధైర్యం నింపేవారు. మానసిక వ్యాకులతతో దిగజారి పోకుండా స్థైర్యాన్ని నూరిపోసేవారు. అలా బిఎ వరకూ చదువుకుంది.
ఎదుటి వ్యక్తి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో గ్రహించడం సోఫియాకు దేవుడిచ్చిన వరం. మాటలతోపాటు వాళ్ల మాటలు, మాటల్లోని అంతరార్థాన్నీ గ్రహించడం ఆమెకు సమాజం నేర్పిన విద్య. అందుకే ఎవరూ అందనంత ఎత్తుకు ఎదగాలనుకుంది. ఎవరూ వేలెత్తి చూపలేనంత ఖ్యాతి గడించాలనుకుంది. ఆ దిశగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది. ఓవైపుచదువుకుంటూనే తన జీవితాన్ని బహుముఖంగా తీర్చిదిద్దుకుంది. పాతికేళ్లు రాకుండానే ఆమె పదిమందిలో తనకో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోఫియా... ఇప్పుడు ఓ బహుముఖ ప్రజ్ఞావంతురాలు.
అథ్లెటిక్స్‌లో చాంపియన్
చదువుకుంటూనే సోఫియా అథ్లెటిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. మూగ, చెవిటి వారికోసం నిర్వహించే పోటీల్లో ఆమె పలుమార్లు సత్తా చాటింది. షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో సోఫియా మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంది.
మోడలింగ్‌లో మేటి
తనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకునేందుకు స్వయంగా సోఫియా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రముఖ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ డాలు, డిజైనర్ ఆర్యల సహకారంతో ఆమె మోడల్‌గా ఎదిగింది. కొచ్చిలో జరిగిన మిస్ మలయాళీ వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆమె అనేక మిస్ బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంది. మోడల్‌గా సాధించిన విజయాలు ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలను తెచ్చిపెట్టాయి. అమృత టీవీ నిర్వహించిన సూపర్ మోడల్ రియాల్టీ షోలో సోఫియా పాల్గొంది. అలాగే ‘బెస్ట్ విషెస్’ అనే సినిమాలోనూ ఆమె నటించింది.
ఈ ఏడాది జూలై 17న ప్రేగ్‌లో జరిగిన మిస్ వరల్డ్ డెఫ్ అండ్ డంబ్ కాంటెస్ట్‌లో సోఫియా ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
ఇన్ని రంగాల్లో కాలుమోపి, విజయాలు చవిచూసినా, సోఫియా తృష్ణ చల్లారలేదు. రేసర్‌గా ఎదగాలనుకుని, కారు డ్రైవింగ్ నేర్చుకుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం మూగ, చెవిటివారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. దీనిపై సోఫియా పోరాడింది. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి మరీ లైసెన్స్ సాధించుకుందామె. కేరళలో వినికిడి శక్తి లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన మొట్టమొదటి యువతి సోఫియానే కావడం విశేషం. భవిష్యత్తులో రేసర్‌గా ఎదగాలన్న తన ఆకాంక్షకు తొలి అవరోధాన్ని అలా అధిగమించిందామె.
కుమార్తె సాధించిన విజయాలకు ఆమె తండ్రి జో ఫ్రాన్సిస్ పొంగిపోవడం లేదు. అవమానాలు, ఆక్రోశాలలోంచి తన కుమార్తె ఎదిగిందంటాడు. ఇప్పటికీ మన సమాజం దివ్యాంగుల్ని వేరుగానే చూస్తుండటం బాధ కలిగిస్తోందంటాడు. ‘నా పిల్లలు మూగ, చెవిటివారుగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. అలా పుట్టడం వారి తప్పూ కాదు. కానీ వారిని సమాజం అవహేళన చేసింది. అవమానాల పాల్జేసింది. ఆ కసితోనే నా బిడ్డ ఎదిగింది. గెలిచింది’ అంటారాయన.
పాతికేళ్ల వయసులో సకలాంగులు సైతం ఛేదించలేనన్ని లక్ష్యాలను ఇప్పటికే అధిగమించింది సోఫియా. అనితర సాధ్యమైన విజయాలను అవలీలగా అందుకుంది. అయినా ఆమెలో కసి చల్లారలేదు. ఎదగాలన్న ఆకాంక్ష అడుగంటలేదు. గెలవాలన్న తపన తగ్గిపోలేదు. ఆమె ఆశయాలకు ఆత్మవిశ్వాసమే అండ. ఆమె లక్ష్యాలకు మొక్కవోని పట్టుదలే శ్రీరామరక్ష.

చిత్రం..సోఫియా