యువ

మనసుతో చూస్తాడు.. మాటతో మారుస్తాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ బుజ్జిపిల్లాడు!
అందరిలాగే అమ్మ ఒళ్లో పడుకుని చందమామ కథలు వింటూ, నాన్న భుజాలెక్కి ఉప్పుమూటలాడుకుంటూ గడిపేవాడు. అయితే అతను ఎదుగుతున్న కొద్దీ ఓ దురదృష్టం అతణ్ని వెన్నాడుతూ వచ్చింది. ఆ దురదృష్టం పేరు- మాక్యులార్ డీజనరేషన్. అంటే...కంటిచూపు మందగించడం. ఆ కుర్రాడికి పదమూడేళ్లు వచ్చేసరికి కంటిచూపు బాగా తగ్గిపోయింది. అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న వయసు. అందరిలాగే తానూ ఉండలేకపోతున్నందుకు, అందరిలాగే తానూ ఆడుకోలేకపోతున్నందుకు, అందరిలాగే తానూ చదువుకోలేకపోతున్నందుకూ బాధపడేవాడు. ఓ రోజు దుఃఖం తన్నుకొచ్చి, భోరున ఏడ్చేశాడు. అక్కడే ఉన్న తండ్రి ఆ కుర్రాణ్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. అతనిలో బాధ సద్దుమణిగాక, దగ్గరకు తీసుకుని ఇలా చెప్పాడు...
‘కలల్ని నీ కళ్లలో పెట్టుకోకు.
ఎందుకంటే అవి కన్నీళ్లతో కరిగి బయటకు వెళ్లిపోతాయి.
వాటిని నీ గుండెలో పెట్టుకో.
నీ గుండె చప్పుడు ఎప్పుడూ నీ కలల్ని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది’

ఎందుకనో ఈ మాటలు ఆ కుర్రాడిలో బాగా నాటుకున్నాయి. శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఏదో ఓ అవయవానికి రోగమొస్తే, ఎందుకు బాధపడిపోవాలి? అనుకున్నాడు. అనుకున్నదే తడవు చదువుమీద దృష్టి పెట్టాడు. కంటి చూపు సహకరించకపోయినా, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా, చదువుకోవడం ఆపలేదు. ఎంకామ్, ఎంబిఎ, ఎంఫిల్ చదివాడు. ఎంకామ్‌లో ఏకంగా యూనివర్శిటీ టాపర్‌గా నిలిచాడు. ఎంఫిల్‌లో గోల్డ్‌మెడల్ చేజిక్కించుకున్నాడు. అయితే అతను ఈ విజయాలు సాధించడానికి ముందే అతని కంటిచూపు పోయింది. కట్‌చేస్తే... ఇప్పుడు అతనో లెక్చరర్.. మోటివేషనల్ స్పీకర్...కౌనె్సలర్! నేడు ఎన్నో కార్పొరేట్ సంస్థలు అతని క్లయింట్లు. వేలాదిమంది విద్యార్థుల్ని తీర్చి దిద్దిన శిల్పి అతను.
పేరు రాజ్‌దీప్ మన్వానీ!
వయసు 44 ఏళ్లు!
***
సమాజంలో ఇప్పుడో ఉన్నత స్థానంలో ఉన్నా, ఈ స్థాయికి ఎదగడం మాత్రం అంత సులభసాధ్యం కాలేదంటాడు రాజ్‌దీప్. ‘నాన్నగారు పోయాక కుటుంబ పోషణ భారం నామీద పడింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఓ ఎలక్ట్రానిక్ షాప్‌లో పనిచేసేవాణ్ని. అప్పట్లో ఓ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ టెక్స్ట్ పుస్తకాలను రికార్డు చేసేది. నేను ఓ వాక్‌మన్ పెట్టుకుని, వాటి ఆడియో కేసెట్లు విని, పాఠాల్ని మనసులో నిక్షిప్తం చేసుకునేవాణ్ని. పీజీ చేశాక, ఉద్యోగ వేటలో పడ్డాను. మొదటినుంచీ టీచింగ్ అంటే ఇష్టం. అయితే టీచర్‌గా ఉద్యోగం సంపాదించడం మాత్రం అంత ఈజీ కాలేదు. నా ప్రయత్నాలు 16సార్లు విఫలమయ్యాక బెంగళూరులోని జైన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే టీచర్‌గా నేను పిల్లల్ని ఇంప్రెస్ చేయలేకపోయాను. వాళ్లకు నచ్చేట్టు పాఠాలు ఎలా చెప్పాలో తెలీక మథనపడేవాణ్ని. ఓ రోజు రేడియోలో ప్రఖ్యాత రచయిత జాక్ కాన్‌ఫీల్డ్ (‘చికెన్ సూప్ ఫర్ ది సోల్’ పుస్తక రచయిత) గురించి విన్నా. ఆయన రాసిన పుస్తకం లక్షల్లో అమ్ముడుపోయిన విషయం తెలిసి, అది ఎలా సాధ్యమైందా అని ఆలోచించేవాణ్ని. ఓ రోజు బిబిసిలో జాక్ కాన్‌ఫీల్డ్ ఇంటర్వ్యూ వినే అవకాశం లభించింది. ఆయన ప్రసంగం ఇచ్చిన స్ఫూర్తితో నన్ను నేను మలచుకున్నా. బోధనలో కొత్త మెలకువలను అవపోసన పట్టా. విద్యార్థుల మనసుల్ని గెలుచుకున్నా’ అంటూ చెప్పాడు రాజ్‌దీప్.
అయితే క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే రాజ్‌దీప్ ఎదుగుదల ఆగిపోలేదు. మానసిక స్థైర్యం సంపాదించుకోవడం ఎలా? భయం పోగొట్టుకోవడం ఎలా? వంటి అంశాలపై విద్యార్థులకు కౌనె్సలింగ్ చేయడమూ మొదలుపెట్టాడు. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గానూ ఎదిగాడు. ఒకసారి వేదిక ఎక్కాడంటే అనర్గళమైన ప్రసంగంతో, మధ్య మధ్యలో తనదైన శైలిలో విసిరే చెణుకులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం రాజ్‌దీప్‌కు వెన్నతోపెట్టిన విద్య. పుస్తక పఠనమంటే చెవి కోసుకునే రాజ్‌దీప్, అపారమైన విషయ పరిజ్ఞానం సంపాదించాడు. తాను సముపార్జించిన జ్ఞానంతో అతను క్విజ్ మాస్టర్‌గానూ ఎంతో పేరుతెచ్చుకున్నాడు. నోకియా, డూషే బ్యాంక్ తదితర సంస్థల ఉద్యోగులకు ఎన్నోసార్లు క్విజ్ పోటీలు నిర్వహించాడతను. గత 18 ఏళ్ళ ప్రస్థానంలో రాజ్‌దీప్ 15వేల మంది విద్యార్థులను మోటివేట్ చేయగలిగాడు. వాళ్ళలో స్ఫూర్తిని నింపి, విజయపథంవైపు వారు అడుగులు వేసేలా పురిగొల్పాడు. బ్రిటానియా, ఎస్‌బిఐ, పాంటలూన్, విప్రో, కోటక్ లైఫ్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అతని కార్పొరేట్ క్లయింట్లు! దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం రాజ్‌దీప్‌లోని బహుముఖ ప్రజ్ఞాపాటవాలను నిదర్శనం.
‘నేను నమ్మే సూత్రం ఒకటే...ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలూ, కన్నీళ్లూ ఉంటాయి. నేర్చుకోగలిగితే అవి మనకెన్నో పాఠాలు నేర్పుతాయి. అలా నేర్చుకోగలిగిన నాడు ఓ ఉత్తమమైన పౌరుడిగా ఎదగడం కష్టమేమీ కాదు’- ఇదీ అతను నమ్మి, ఆచరించే ఏకైక సూత్రం.
ఓ విధంగా తన జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలే రాజ్‌దీప్‌ను ఈనాడు ఈ స్థాయిలో నిలబెట్టాయనడంలో సందేహం లేదు. తనను తాను మోటివేట్ చేసుకుని ఎదిగిన రాజ్‌దీప్, నేడు తనలాంటి వారెందరికో స్ఫూర్తిదాయకం నిలవడం ఎంతైనా ప్రశంసనీయం.

చిత్రం..రాష్టప్రతితో ప్రశంసాపత్రం అందుకుంటున్న రాజ్‌దీప్