యువ

అనాథలకు అన్నీ తామై..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా అనేవారు లేరు ఆ బాలికలకు...
నిలువ నీడ లేదు...
కడుపునిండా తిండి కరువే..
ఇక ఆటాపాటా ఊసెక్కడిది?
కానీ ఇప్పుడు అలాంటి అనాథల కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది.
వారి చేతుల్లో అందమైన బొమ్మలు కనిపించడమే ఆ మెరుపునకు కారణం. అవి మామూలు బొమ్మలు కాదు..
పైగా ఎవరో ఇచ్చినవీ కాదు...
వినూతనంగా, విస్పష్టమైన ప్రయోజనాలకోసం రూపొందించిన రోబోలకు వారే సృష్టికర్తలు. ఇంతలో అంత మార్పు ఎలా సాధ్యమైంది? కలలు కనడమే కష్టమైన జీవితంలో ఊహలకు రూపమిచ్చే శక్తి వారికి ఎలా వచ్చింది? వారిని అలా తీర్చిదిద్దిన దేవుళ్లు ఎవరు? అంటే అదో పెద్దకథే. ఇద్దరు అక్కచెల్లెళ్ల విభిన్నమైన ఆలోచనే ఇంత చక్కటి ఫలితాన్ని ఇచ్చింది.
దాదాపు నలభైమంది అనాథ బాలికలు ఇప్పుడు ‘రోబోటిక్స్’లో విద్య అభ్యసిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. మరెందరో ఇతర ప్రాజెక్టులలో తలమునకలయ్యారు. ఈ మార్పునకు అసలు కారకులు ఆ అక్కచెల్లెళ్లు.
**
అదితిప్రసాద్..లాలో మాస్టర్స్ డిగ్రీ చేసి మద్రాస్ ఐఐటీలో చైనా స్టడీ సెంటర్‌లో పనిచేసేది.
ఆమె సోదరి దీప్తిరావ్ సుచీంద్రన్ న్యూరోసైన్స్‌లో పిహెచ్‌డి చేసి ప్రొఫెసర్‌గా పనిచేసేది.
ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైనా వారిలో ఏదో వెలితి.. ఇంకేదో చేయాలన్న తపన. అదే సమయంలో భారత్‌లో మానవ వనరుల అభివృద్ధి సంస్థ నివేదిక ఒకటి వచ్చింది. సైన్స్, టెక్నాలజి, ఇంజినీరింగ్, మాథ్స్ (ఎస్‌టిఇఎమ్-స్టెమ్) విద్యలో మహిళలు బాగా వెనుకబడి ఉన్నారన్నది సారాంశం. 2012-13లో కేవలం 8.52 శాతం మంది బాలికలు మాత్రమే ఉన్నత విద్య అభ్యసించేందుకు దరఖాస్తు చేశారన్నది మరో పాయింటు. దీంతో ఆ ఇద్దరి మనస్సు చివుక్కుమంది. చిన్నతనంలో ప్రతి ఆదివారం తండ్రి తమను పిలిచి ‘టైమ్’ మ్యాగజైన్ చదివించి, శాస్తస్రాంకేతికవిద్యా రంగాలకు సంబంధించిన అంశాలను చదివించి, చర్చించి, సుద్దులు నేర్పిన విషయం వారికి గుర్తు వచ్చింది. ఇలాంటి మార్గదర్శనం అనాథ బాలికలకు ఎవరిస్తారన్నది వారి మనసులో రేగిన ప్రశ్న. ఎవరో ఇవ్వడం ఎందుకు ఆ పని మనమే చేస్తే పోలా అనుకున్నారు. అప్పటికే అమెరికాలో నల్లజాతి బాలికలకు అండగా నిలిచి... వారికి విద్యాబుద్ధులు, నైపుణ్యం, ఉపాధి అంశాల్లో చేదోడువాదోడుగా నిలిచిన ‘బ్లాక్ గర్ల్స్ కోడ్’, ఇతర బాలికల కోసం ఆవిర్భవించిన ‘గర్ల్స్ హు కోడ్’ వంటి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల గురించి తెలుసుకున్నారు. ఎంతో స్ఫూర్తి పొందారు. భారత్‌లో చేతనైనంతమంది బాలికలను సైన్స్, టెక్నాలజీ, రోబోటిక్స్ రంగాల్లో నిష్ణాతులను చేయడమే లక్ష్యంగా 2009లో ‘రోబోటిక్స్ ఎల్‌ఎస్’ అనే సంస్థను స్థాపించారు. ఒకరు సిఒఒగా మరొకరు సిఐఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రోబోటిక్స్ రంగంలో కొత్తతరం ఆవిష్కరణలకు ప్రాణం పోయాలన్నది వారి లక్ష్యం. ఈ అనాథ బాలికల మేథకు పదునుపెట్టి నవకల్పనలు సాధించాలన్నది వారి ఆరాటం. ‘21వ శతాబ్దానికి తగ్గ నైపుణ్యం, కంప్యూటర్, రోబోటిక్స్ రంగాలకు సంబంధించిన ఆలోచనలు, ఆవిష్కరణల దిశగా అనాథ బాలికలు అడుగువేసి ఆయా రంగాల్లో సాధికారత సాధించాలన్నది మా లక్ష్యం’ అంటారు అదితి. తిరుచ్చి ఆశ్రమంలో 40 మంది అనాథ బాలికలకు రోబోటిక్స్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. అదితి స్వయంగా వారికి పాఠాలు చెబుతుంది. తిరుచ్చిలోని అనాథ ఆశ్రమాలకు వెళ్లి 8 నుంచి 12 ఏళ్లలోపు 40 మంది బాలికలను ఈ అక్కచెల్లెళ్లు ఎంపిక చేశారు. వారికి అన్నయ్ ఆశ్రమంలో వారం వారం రోబోటిక్స్, కోడింగ్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏడాదంతా కొనసాగుతుంది. మరోవైపువేసవి శిబిరాలు, వివిధ పట్టణాల్లో ‘ఇండియన్ రోబోటిక్స్ లీగ్’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు ‘టీమ్ అవార్డు’ ఇచ్చి ప్రోత్సహిస్తారు. వివిధ కోడింగ్ లాంగ్వేజెస్‌లో తర్ఫీదు ఇచ్చేందుకు ఉపకరించే లెగో కంపేటబుల్ ఎడ్యుకేషనల్ రోబో కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణకోసం పిల్లల ఆలోచనలకు పదును పెట్టిస్తున్నారు. ‘స్టెమ్’ రంగాల్లో సవాళ్లను ఎదుర్కొని, ప్రావీణ్యం సాధించేందుకు ఇప్పుడిప్పుడే మహిళలు పోటీ పడుతున్నారని అంటారు అదితి. సరే ఇలాంటి కార్యక్రమాలు, వార్తలను చాలామంది విశ్వసించరు. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పాలి...
ఆ మధ్య తుపాను తాకిడికి చెన్నైలో అతలాకుతలమైపోయిందికదా..
అప్పుడు చెన్నైలో చాలామంది వరదలో చిక్కుకుపోయి విలవిలలాడిపోయారు కదా...వారిని ఎలా రక్షించాలో, ఎలా సహాయపడాలో సూచిస్తూ, అందుకు సహాయపడే రోబోలను, ఇతర పరికరాలను వీరి ఆశ్రమంలోని చిన్నారులు రూపొందించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ ఉదాహరణ చాలదా ఆ అక్కాచెల్లెళ్ల కల ఫలిస్తోందనడానికి.

చిత్రాలు.. దీప్తి, అదితి