యువ

వీధి బాలలకు అమ్మా నాన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి... తన పిల్లలకు రెక్కలొచ్చి, ఎగిరే శక్తి సమకూరేవరకూ ఆహారం ముక్కున కరచి తెచ్చి, నోటికి అందిస్తుంది.
కన్న బిడ్డ కాకపోయినా పాలకోసం ఏడ్చే పిల్లిపిల్లకు పాలిచ్చి ఆదరించే గ్రామసింహాలను చూసి ఉంటాం.
శత్రువైనా, తల్లి కనిపించక తల్లడిల్లిపోయే జింక కూనను పోనీలే పాపం అని వదిలిపెట్టే మృగరాజుల గురించీ విని ఉంటాం.
కానీ..చిన్నప్పుడే చెత్తకుప్పల పాలై, రోడ్లపై బతుకులీడ్చే అనాథ పిల్లలను అదుకుని పట్టెడన్నం పెట్టే పెద్ద మనసున్న మంచి మనుషులు ఈ సమాజంలో ఏరీ...ఎక్కడ? వారి చదువు సంధ్యల గురించి ఆలోచించేదెవరు? వారి ఆశలకూ, ఆశయాలకూ అండగా నిలబడి వెన్నుతట్టి ప్రోత్సాహమిచ్చి, దారి చూపి దరికి చేర్చే మార్గదర్శకులెవరు?
నూటికో కోటికో... ఒకరో ఇద్దరో కనిపిస్తున్న అలాంటివారు...ఒకే చోట ఇద్దరు కనిపిస్తే, అది ఆశ్చర్యమే!
ఆ ఇద్దరూ ఎవరో కాదు...
ఉమ, ముత్తురామ్!
వీధి బాలలకు వారు అండాదండ. అనాథలకు వారు అమ్మా నాన్న!
సమాజ సేవలో తరిస్తున్న ఈ దంపతుల చేతుల్లో ఒదిగి, వారి చేతుల మీదుగా ఎదిగి, సమాజంలో ఉన్నత స్థానాలను అందుకుంటున్న అనాథలెందరో!
**

ఇంతకీ ఎవరీ ఉమ? ఎవరీ ముత్తురామ్?
ఈ ఇద్దరి ప్రయాణం మొదలై చాలా ఏళ్లే అయింది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెడితే...ఇద్దరూ ఒకటో తరగతిలో మిత్రులయ్యారు. ఆ స్నేహబంధం ఆ తర్వాత వివాహబంధమై పెనవేసుకుంది.
సమాజ సేవలో ఉమ ప్రస్థానం ఆమె 12వ ఏటనే మొదలైంది. ఉమ తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. తల్లితోపాటు సరదాగా పాఠశాలకు వెళ్లే ఉమ, మురికివాడల్లో నివసించే పిల్లల గురించి తెలుసుకునేది. తల్లిని ఒప్పించి, మురికివాడలకు వెళ్లి, అక్కడ పిల్లలకు లెక్కలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ముత్తురామ్ కూడా చేయూతనందించేవాడు. పదహారేళ్లు వచ్చేసరికి ఉమ ఓ నిర్ణయానికి వచ్చింది. అసహాయులకు, అన్నార్తులకు సాయపడటంలోనే జీవితాంతం గడపాలనేదే ఆ నిర్ణయం. అయితే అందుకు డబ్బు చాలా అవసరం. ఈ సమస్య తీరేందుకు ఉమ, ముత్తురామ్ ఇతర స్నేహితులు రోజూ తమ పాకెట్ మనీలోంచి తలో పది రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ స్నేహితుల బృందం ఆశయం గమనించి మరికొంతమంది చేయి కలిపారు. దాంతో పది రూపాయల నోట్లు వెల్లువెత్తాయి. ఇలా వచ్చిన నిధికి ఉమ ‘అనామికా ఫండ్’ అనే పేరు పెట్టి, అనాథల సేవకు నడుం బిగించింది. ఇలా ఉండగా ఓ రోజు ఉమకు ఓ జర్నలిస్ట్ మిత్రుడినుంచి ఫోన్ వచ్చింది. తిరునల్వేలి సమీపంలోని అంబాసముద్రం అనే గ్రామానికి చెందిన మహాలింగమనే 16ఏళ్ల కుర్రాణ్ని ఆదుకోవాలన్నది ఆ ఫోన్‌కాల్ సారాంశం. మహాలింగం ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతనికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అంతా కలిపి 12మంది. కుటుంబం గడిచేందుకు అంతా తలో పనీ చేసేవారు. మహాలింగం పదో తరగతి చదువుతూనే మరోవైపు ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఓ రోజు కంప్రెషర్‌ను కడుగుతుండగా ఎవరో పొరబాటున స్విచ్ ఆన్ చేశారు. దాంతో కంప్రెషర్‌లో ఉన్న వేడి ద్రావకం అతని మొహంపై పడింది. బాధకు నోరు తెరవడంతో ద్రావకం అతని కడుపులోకి చేరింది. అన్నవాహిక మొత్తం కాలిపోయింది. శ్వాస వ్యవస్థ దెబ్బతింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి పంపించివేశారు. తినలేక, తాగలేక నరకయాతన పడుతున్న మహాలింగాన్ని ఉమ తన ఇంటికి తీసుకువెళ్లింది. అతనికి చికిత్స చేసేందుకు కనీసం ఓ వందమంది డాక్టర్లను సంప్రదించింది. అంతా చేతులెత్తేశారు. చివరకు కీల్పాక్ (చెన్నై)లోని ఓ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ జెఎస్ రాజ్‌కుమార్ ముందుకొచ్చారు. మహాలింగానికి 13 శస్తచ్రికిత్సలు చేశారు. ఆ తర్వాత మహాలింగం కోలుకున్నాడు. అయినా అతను ఉమ వద్దే ఉండి చదువుకున్నాడు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు అతనికి ఉమ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. కట్ చేస్తే...మహాలింగం ఇప్పుడు ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు కూడా ఉంది.
మహాలింగం సంఘటన తర్వాత తాను నిర్వహించే ఎన్‌జీఓను రిజిష్టర్ చేయాలన్న ఆలోచన వచ్చింది ఉమకి. అలా అయితే మహాలింగం లాంటి అనేకమంది బాలలకు చేయూతనివ్వవచ్చన్నది ఆమె ఆలోచన. అలా 1999లో ‘సుయమ్ చారిటబుల్ ట్రస్ట్’ ఆవిర్భవించింది. ఉమ చేపట్టే ప్రతి పని వెనుక స్నేహ హస్తం అందిస్తూ వచ్చిన ముత్తురామ్, ఆ తర్వాత ఆమెకు జీవిత భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత వారి సమాజ సేవ మరింత ఊపందుకుంది. తాము చేరదీసే పిల్లలను చదివించేందుకు స్వయంగా ఓ స్కూల్‌ను నడుపుతున్నారు. అనాథ బాలలను సంరక్షించి, వారికి చదువు చెప్పించి, ఉపాధి కల్పించేంతవరకూ ఈ దంపతులు విశ్రమించరు.
వారి చేతుల మీదుగా ఎదిగినవారిలో జయవేల్, దశరథన్, ధన్‌రాజ్..ఇలా ఎందరో..ఎందరెందరో!
ఉమ, ముత్తురామ్‌ల సమాజ సేవకు వయసు 35 ఏళ్లు. సమాజ సేవ చేస్తున్నా ఉమలో విద్యాతృష్ణ చల్లారలేదు. ఆమె డిగ్రీలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎమ్మెస్సీ, ఎమ్‌ఎస్‌ఇమ్, పిజిడిసిఎ, సాహిత్య రత్న (హిందీ), బిఇడి (హిందీ), పిహెచ్‌డి...ఇన్ని డిగ్రీలూ ఆమె సొంతమయ్యాయి. తనకు సమాజ సేవ ఎంత ఇష్టమో చదువన్నా అంతే ఇష్టమనే ఉమ, తనలో ఊపిరి ఉన్నంతవరకూ ఈ రెండింటినీ ఆపనంటుంది!