యువ

రెండు జెళ్ల సీతలు కన్నీళ్లు తుడిచే బొమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునామికా డాల్స్!
అనామిక అనే పేరు విన్నాం. కానీ... ఈ సునామికా ఏంటి?
కాస్త ఆలోచిస్తే అందులో ఉన్న అర్థం...అంతరార్థం బోధపడతాయి.
సునామీలోంచి వచ్చిందే ఈ సునామికా అనే పేరు.
ఒక్క మాటలో చెప్పాలంటే సునామీ బాధితులకు ఈ ప్రాణం లేని బొమ్మ చేయూతనిస్తోంది.
అదెలాగంటే...
ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పింక్‌థాన్ గుర్తుంది కదూ! జోరుగా హుషారుగా సాగిన పింక్‌థాన్‌లో పాల్గొన్నవారికి చివరలో నిర్వాహకులు పతకాలకు బదులు సునామికా డాల్స్ అందజేశారు. సాధారణంగా ఇలాంటి మారథాన్‌లో పాల్గొన్నవారికి మెడల్స్ ఇవ్వడం రివాజు. కానీ ముద్దులొలికే బొమ్మల్ని ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే బొద్దుగా, ముద్దుగా రెండు జెళ్ల సీతలాంటి ఈ రూపం ఉన్న సునామికా బొమ్మల వెనుక కన్నీరు పెట్టించే విషాద గాథ దాగి ఉంది. దాదాపు పుష్కరకాలం కిందట తమిళనాడు తీరప్రాంతాన్ని తుడిచిపెట్టేసిన సునామీ కారణంగా కొన్ని వేల కుటుంబాలు వీధిన పడ్డాయి. ముఖ్యంగా సునామీ మత్స్యకారుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. బాధితుల్ని ఆదుకునేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. మత్స్యకార కుటుంబాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు ఇప్పటికీ అవి అహరహం శ్రమిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి సునామికా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కు ఓ రూపమిచ్చిందీ, విజయవంతంగా నడుపుతున్నదీ ఉమా ప్రజాపతి.
సునామికా ప్రాజెక్ట్ లక్ష్యాన్ని ఆమె వివరిస్తూ ‘సునామీ సంభవించినప్పుడు అందరిలాగే నేనూ కలత చెందా. కేవలం శిథిలాలను తొలగించి, నా పని అయిపోయిందని చేతులు దులుపుకోకుండా, బాధితులకోసం ఏమైనా చేయాలనుకున్నా. కానీ ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో నా దృష్టి మత్స్యకార కుటుంబాల్లోని మహిళలపై పడింది. నిజం చెప్పాలంటే సునామీ మత్స్యకారుల జీవితాల్ని ఛిద్రం చేసింది. ఆ బాధ మరిచిపోయేందుకు మగవాళ్లు తాగుడులో మునిగి తేలుతున్నారు. జరిగిన నష్టాన్ని తలచుకుంటూ, పిల్లల్ని ఎలా పోషించుకోవాలా దేవుడా అని బెంగతో మహిళలు చిక్కి శల్యమవుతున్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు సునామికా డాల్స్ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశాను. అయితే బొమ్మల తయారీకి మత్స్యకార మహిళల్ని ఒప్పించే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. ఏడు గ్రామాల మహిళల్ని ఒకచోటకు చేర్చడం సునామికా ప్రాజెక్ట్‌లో నేను సాధించిన తొలి విజయం. కేవలం ఒక్క ఏడాదిలో 480 మహిళల్ని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాముల్ని చేయగలిగాను. ఇప్పుడు పెద్దయెత్తున బొమ్మలు తయారు చేస్తున్నాం. పింక్‌థాన్ వంటి సంస్థలు మా బొమ్మల్ని ఖరీదు చేస్తున్నాయి. బొమ్మలు ఎవరు కొన్నా కొనకపోయినా, ఈ బొమ్మలు తయారు చేసే మత్స్యకార మహిళలకు మాత్రం నెల నెలా జీతం ఠంచనుగా ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పండి...పింక్‌థాన్ వంటి పోటీల్లో గెలిచిన వారికి మెడల్స్ ఇస్తే అవి విజేతలకే ప్రయోజనం. కానీ, సునామికా డాల్స్ ఇస్తే ఉభయ తారకం. పోటీల్లో గెలిచినవారికీ, బొమ్మలు తయారు చేసిన వారికీ కూడా లాభసాటిగా ఉంటుంది. కాదంటారా?’ అంటూ ప్రశ్నించారు ఉమా ప్రజాపతి.
పింక్‌థాన్ నిర్వాహకుల్లో ఒకరు- నటుడు, మోడల్ మిలింద్ సోమన్. సునామికా బొమ్మల్ని కొనాలని ఎందుకనిపించిందని ప్రశ్నిస్తే ‘పింక్‌థాన్ మహిళల సాధికారతకు ఉద్దేశించింది. అలాంటప్పుడు మహిళలే తయారు చేసే బొమ్మల్ని బహుమానంగా ఇస్తే బాగుంటుంద’ని అనిపించిందన్నారాయన.