యువ

వైకల్యాన్ని అధిగమించి.. విజయ శిఖరాలు అందుకుని...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగవైకల్యం అనేది మన మానసికస్థితికి సంబంధించింది మాత్రమే. పట్టుదల,
పోరాడే తత్వం ఉంటే
దివ్యాంగులైనా అనుకున్నది సాధించగలుగుతారు
**
-ఈ మాటలు అన్నది ఏ వయోవృద్ధుడో, జీవితాన్ని కాచి వడపోసిన గొప్ప వ్యక్తో అనుకుంటే పొరబాటే. చిన్నతనంనుంచీ ఎదురైన అవమానాలను తట్టుకుని, ప్రతికూలతలతో పోరాడి జీవితంలో అనుకున్నది సాధించిన ఓ 36 ఏళ్ల యువకుడు అన్నమాటలివి.
అతని పేరు ఇఫ్తికార్ అలీ. ఢిల్లీలో అలీఖాన్ టెక్నాలజీస్‌కు అధిపతి. ఆగ్రాకు చెందిన ఇఫ్తికార్‌కు చిన్నతనంలోనే పోలియో సోకింది. నడవలేని స్థితిలో, తోటి పిల్లలు గేలి చేస్తున్నా పట్టుదలగా చదువుకున్నాడు. దాని వెనక అతని తల్లిదండ్రుల ప్రోత్సాహమూ ఎంతో ఉంది. వారే లేకపోతే తాను ఇంతగా ఎదిగే వాడిని కాదంటాడతను. ఇంటర్ చేశాక ఐఐఎంలో చేరి, ఎంబిఎ చదవాలనేది అతని అభిలాష. ‘క్యాట్’ పరీక్ష రాద్దామనుకున్నాడు. అందులో అనుభవం ఉన్న ఓ మిత్రుణ్ని కాస్త సాయం చేయమని అడిగితే..పెద్దగా ఓ నవ్వు నవ్వాడట. ‘ఎంబిఎతో ఉద్యోగాలు రావు...దివ్యాంగులకు రిజర్వేషన్ ఉండే ఏదైనా ప్రభుత్వ కాంపిటీటివ్ పరీక్ష రాసుకో. లేదా మెడికల్ షాప్ పెట్టుకో’ అని ఉచిత సలహా పారేశాడట. దాంతో ఇఫ్తికార్‌లో పట్టుదల పెరిగింది. బాగా చదివి, క్యాట్ రాసి, పాసయ్యాడు. ఒకేసారి ఆరు ఐఐఎంలలో సీటు వచ్చింది. కోల్‌కతా ఐఐఎంలో చేరి, డిగ్రీ తీసుకున్నాడు. ఆ తర్వాత హెచ్‌సిఎల్, టిసిఎస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కొన్నాళ్లపాటు బిజినెస్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేశాడు. ఐఎంఎస్ ఇండియాలో సెంటర్ ఆపరేషనల్ హెడ్‌గా సేవలందించాడు.
ఇలా కొన్నాళ్లపాటు పనిచేశాక, సొంతంగా సంస్థను నడపాలని నిర్ణయించుకుని, ఢిల్లీలో అలీఖాన్ టెక్నాలజీస్ పేరిట సాఫ్ట్‌వేర్ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిని విజయవంతంగా నడపడంలో ఇఫ్తికార్ విజయం సాధించాడు. హెచ్‌సిఎల్, విప్రో, శివ్ నాడార్ ఫౌండేషన్, అలీజ్‌హెల్త్, ది ఫుట్‌బాల్ లింక్, ఎయిర్‌విజ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వంటి సంస్థలు అలీఖాన్ టెక్నాలజీస్ క్లయింట్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్న ఇఫ్తికార్, తనను ఏనాడూ అంగవైకల్యం ఇబ్బంది పెట్టలేదన్నాడు. ‘అదొక మానసిక స్థితి అంతే. దివ్యాంగులు కూడా సకలాంగుల మాదిరే తలచుకుంటే ఏవైనా చేయగలరు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోవాలి’ అని చెప్పే ఇఫ్తికార్, దివ్యాంగుల సమస్యల పట్ల మన ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ చూపడం లేదంటాడు. దివ్యాంగులు సైతం దేశంలో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లేలా, వారికి సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం ఉందంటాడతను.