యువ

హిందీ పాఠాల పంతులమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిటెక్ చదివి, సెలబ్రిటీలకు చదువుచెబుతున్న పల్లవి విదేశీ విద్యార్థులకూ బోధన

ఒక్క ఐడియా జీవితానే్న మార్చేస్తుంది!
ఇది ఐడియా ఫోన్ స్లోగనే కావచ్చు.
కానీ, వాస్తవిక కోణంలోంచి చూస్తే ఇది నిజంగా నిజం.
ఓ చక్కని ఐడియా జీవితాల్ని ఇట్టే మార్చేస్తుంది.
దీనికి ఓ ఉదాహరణ...పల్లవి!
ఢిల్లీకి చెందిన పల్లవి సింగ్ బిటెక్ చదివింది. చదువుతున్నప్పుడే ఆమెకు అర్థమైపోయింది- ఇది తాను చదవాల్సిన కోర్సు కాదని. కానీ అప్పటికే రెండేళ్లు గడచిపోయాయి. కాబట్టి బిటెక్ పూర్తి చేయాలనే నిర్ణయించుకుంది. ఇంతలో ఖాళీ సమయాల్లో వృథాగా ఎందుకుండాలని భావించి, ఫ్రెంచ్ క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టింది. కానీ అక్కడ చెబుతున్నదేమీ ఆమెకు ఒంటబట్టలేదు. క్లాసులో కూర్చోబెట్టి, పుస్తకాలు ముందు పడేసి, గ్రామర్ చెబుతూ చదివించడంలో అర్థం లేదనీ, ఇలా చదివితే ఏళ్లూ పూళ్లూ గడిచినా ఫ్రెంచ్ రాదని చేరిన పది రోజుల్లోనే అర్థం చేసుకుంది. క్లాసులకు వెడితే గ్రామర్ వస్తుందేమో కానీ, ఓ ఫ్రెంచ్ జాతీయుడితో అతని భాషలో మాట్లాడటం మాత్రం కష్టసాధ్యమేనని భావించిందామె. అదే సమయంలో ఆమెకు మరో విషయం కూడా స్ఫురించింది. అదేవిటంటే...తాను పరభాష నేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో, ఇతర దేశాలనుంచి ఇక్కడకు వచ్చి చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు హిందీ నేర్చుకోవడానికి కూడా అంతే ఇబ్బందులు పడుతూ ఉంటారని. ఇది స్ఫురణకు రాగానే...అలాంటి విద్యార్థులకోసం హిందీ క్లాసులు తానే ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవు ‘హిందీ లెసన్స్’ పేరిట విదేశీ విద్యార్థులకు హిందీ బోధించడం మొదలుపెట్టింది.
అయితే ఇందుకు పల్లవి రొటీన్‌గా కాకుండా వినూత్న పద్ధతులను ఆచరించడం మొదలుపెట్టింది. పల్లవి దగ్గర హిందీ నేర్చుకునే వారికోసం ఎలాంటి తరగతులకూ రానక్కర్లేదు. హాయిగా ఏ రెస్టారెంట్‌లోనో కాఫీ తాగుతూ నేర్చుకోవచ్చు. లేదా బాడ్మింటన్ ఆడుతూ అయినా నేర్చుకోవచ్చు.
పుస్తకాలు ఉండవు. కేవలం ఇంటరాక్షన్ మాత్రమే. విద్యార్థులతో మాట్లాడుతూనే వారికి హిందీ బోధిస్తుందామె. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా హిందీకి ఇంగ్లీష్ పదాలు జోడించి మరీ చెబుతుందామె. ఉదాహరణకు..
శనివార్ కో ఐ వెంట్ టు ఎ రెస్టారెంట్
లేకిన్..రోడ్ పర్ ది ట్రాఫిక్ వాజ్ స్లో
మీటింగ్ వాజ్ ఛే బజే ఫ్యాన్సీ రెస్టారెంట్ మే
...ఇలా అన్నమాట.
దీని వల్ల నేర్చుకునేవారికి హిందీ సులువుగా అర్థమవుతుందని అంటుంది పల్లవి. మొదట్లో ఢిల్లీలో హిందీ క్లాసులు చెప్పిన పల్లవి, ఆ తర్వాత సైకాలజీలో పిజీ చేసేందుకు ముంబయికి మారింది. అక్కడా హిందీ లెసన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడామె వద్దకు వచ్చే విద్యార్థుల్లో ఎంతోమంది విదేశీయులు ఉన్నారు. అంతేకాదు...ఆమె దగ్గర హిందీ నేర్చుకున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు చరిత్రకారుడు విలియమ్ డాల్‌రింపుల్, నటాలీ డి లూచియో, లూసిండా నికోలస్ వంటి సెలబ్రిటీలు ఉన్నారు.
ఓసారి ఓ ఆఫ్రికన్ విద్యార్థికి పల్లవి హిందీ నేర్పుతోందట. ఓ రోజు రంగుల గురించి చెబుతూ ‘కాలా’ అంటే నలుపు అనిచెప్పగానే, ఆ విద్యార్థి ‘ఓహో అందుకేనా నన్ను కాలేజీలో అంతా ‘కాలూ’ అని ఆట పట్టిస్తూ ఉంటారు’ అన్నాడట. అది విని తాను ఎంతో బాధపడ్డాననీ, అదే సమయంలో తాను ఇలాంటి విద్యార్థులకు హిందీ నేర్పడం ఎంత అవసరమో కూడా తెలిసి వచ్చిందని చెప్పింది పల్లవి.
మరో సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఆటో ఆగినప్పుడు ఓ కుర్రాడు వచ్చి ఫలానా అడ్రస్ చెప్పమంటూ ఆటో డ్రైవర్‌ను అడిగాడట. దానికి ఆ ఆటో డ్రైవర్ తనకు తెలియదని చెబితే, ఆటోలో ఉన్న ఓ విదేశీ వ్యక్తి ఆ ఆడ్రస్ ఎక్కడో క్షుణ్నంగా హిందీలో విడమరచి చెప్పాడట. అతను పల్లవి వద్ద హిందీ నేర్చుకున్నవాడే కావడం విశేషం.
ఇప్పుడంతా యాప్‌ల యుగం కదా...హిందీ లెసన్స్‌కోసం యాప్స్ ఏమైనా రూపొందించారా అనడిగితే యాప్‌ల వల్ల, క్లాస్ రూముల వల్ల ఒరిగేదేం ఉండందంటుందామె. యువతకు మీరేం చెబుతారని అడిగితే మాత్రం ‘ఇష్టమైన పని చేసేందుకు రిస్క్ తీసుకోక తప్పదు. నేనూ ఎంతో కోల్పోయాను. కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది 26 ఏళ్ల పల్లవి.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పల్లవి