యువ

సేవకు దాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మవారంటే అతడికి ఆరాధన..
అమ్మ అన్నా అంతే...
అమ్మలాంటి అమాయకమైన
గిరిజనులన్నా అంతే ఇష్టం..
దసరాల్లో ఏటా ఇంటిలో నిర్వహించే దుర్గామాత పూజకు హాజరైన ఓ గిరిజన వృద్ధ మహిళపట్ల బంధువులు వ్యవహరించిన తీరు అతడిని కలచివేసింది. ఐబిఎం వంటి ఐటి దిగ్గజ సంస్థకు ఐటి సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పనిచేసే బాధ్యతను విడిచిపెట్టి మారుమూల అడవుల్లో ఉండే గిరిజన తండాకు చేరి అక్కడి మహిళల కోసం సేవామార్గం పట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 17వేల మంది గిరిజన మహిళలకు ఆరాధ్యుడయ్యాడు. అతడి పేరు వికాస్ దాస్. ఒడిశాలోని బాలాసోర్ దగ్గరి శివారు అతడి స్వస్థలం. అతడి కళ్లముందు అవమానంపాలైన ఆ వృద్ధ గిరిజన ఒకప్పుడు ఓ పూట తినడమే గగనమయ్యేది. ఇప్పుడు ఆమె మరో పాతిక మందికి పని ఇచ్చి ఆదుకుంటోంది. ఈ మార్పు వికాస్ ఆలోచనల ఫలితమే. ఇలాగే ఎందరికో అభివృద్ధి ఫలాలు రుచి చూపించాడు వికాస్ దాస్.
ఇదీ కారణం
ప్రతి దసరాలో వికాస్ దాస్ కుటుంబ సభ్యులు నవరాత్రులు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. గ్రామం యావత్తు వారి ఇంటికి వస్తారు. పూజల్లో పాల్గొంటారు. బాలాసోర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలోని గిరిజనులూ అలానే వస్తూంటారు. 2013 అక్టోబర్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా నిరుపేద అయిన సుకిమ మాఝి అనే ఓ వృద్ధ గిరిజన మహిళ వారి ఇంటికి వచ్చింది. నిమ్మవర్గానికి చెందిన ఆమె రాకను వికాస్ బంధువులు తప్పుబట్టారు. బయటకు ఈడ్చిపడేశారు. అతడి తల్లిదండ్రులు ఉదారవాదులే. ‘వసుధైక కుటుంబం’ అన్న జీవనవిధానాన్ని నూరిపోసిన తల్లిదండ్రులు వౌనం వహించడం అతడి మనసును కుదిపేసింది. సాటి మనిషిని ఎందుకు అలా అవమానించారో అర్థం కాలేదు. ఉద్యోగానికి ఓ రెండు నెలలు సెలవు పెట్టాడు. సమాజంలో వారి పరిస్థితులేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. పేదరికం, అవిద్య, పౌష్టికాహార లేమితో అస్వస్థతకు గురికావడం వల్ల గిరిజనులు వివక్షకు గురవుతున్నారని అతడికి అర్థమైంది. ఆలోచనల్లో, భవిష్యత్‌లో ఏం చేయాలన్నదానిపై స్పష్టత ఏర్పడింది. కొయ్‌బనియా అనే శివారు గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ రెండునెలలపాటు ఉన్నాడు. వారితో కలసి జీవించాడు. వారి స్థితిగతులు, జీవనవిధానం గమనించాడు. వారి జీవితాల్లో వెలుగునింపాలంటే ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. వారిలో సాధికారత సాధ్యమైతే అన్నీ చక్కదిద్దుకుంటాయని అర్థమైంది. మొదట గిరిజనులు అతడితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. గిరిజన మహిళలను బయటకు రానిచ్చేందుకే వారి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. కొత్తవారు పరిచయమైనప్పుడల్లా మోసపోతూండటమే అందుకు కారణం. చివరకు నమ్మకం ఏర్పడ్డాక వికాస్‌కు పని సులువైంది.
ఉద్యోగానికి రాజీనామా
ఐదునెలల తరువాత, అంటే 2014 ఏప్రిల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గిరిజన పల్లెకు తరలివచ్చాడు. వివిధ కార్పొరేట్ సంస్థలకు వెళ్లి తను చేయదలచుకున్న పనిని వివరిస్తూ తనలాగే ఆలోచించే మరో ఏడుగురు యువకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘వటవృక్ష’ అనే స్వచ్చంద సేవాసంస్థను ఏర్పాటు చేశాడు.
ఇదీ ప్రత్యేకత!
వటవృక్ష సంస్థ శిక్షణతో నాణ్యమైన వస్తువులు, పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్న గిరిజన మహిళలు ఎంతో ధీమాగా ఉంటారు. తాము తయారు చేస్తున్నవాటిలో ఎటువంట మోసం లేదన్నది వారి ధీమాకు కారణం. వారు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు ఎలా తయారైంది, దేనితో తయారు చేశారు, తయారు చేసిన విధానం వివరిస్తూ ప్రత్యేకంగా ఓ పాంప్లెట్‌ను అందజేయడం వికాస్ ప్రత్యేకత. విద్యావంతులైన గిరిజన యువకులకు తమ సంస్థలో సభ్యత్వం ఇస్తామంటున్నాడు వికాస్. మాఝీలాగే రాణి అనే గిరిజన యువతిని మొదట గ్రామంలో అందరూ మంత్రగత్తె అని అనుమానించేవారు. చెడుతిరుగుళ్లు తిరుగుతోందని దూరంగా ఉంచారు. ఆమె భిక్షమెత్తి రోజులు గడుపుకునేంది. వటవృక్ష నీడలో చేరిన తరువాత ఆమె జీవితం మారిపోయింది. అద్భుతమైన అల్లికల పనిలో ఆమె నైపుణ్యం గొప్పది. రుమాళ్లు, స్క్ఫ్స్రా వంటివి తయారు చేయడంలో ఆమె దిట్ట. ఆమెకు పని దొరకడం, ఆదాయం లభించడం, అందరితో కలసిపోవడం తన జీవితంలో మేలుమలుపుగా రాణి చెబుతుంది. వికాస్ చేపట్టిన సేవా ఉద్యమంలో ఇలాంటివారు చాలామందే ఉన్నారు. వారు చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమాలతో డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గాయి. గిరిజన మహిళలు గడించిన లాభాల్లో పదిశాతం వటవృక్ష మూలనిధిలో జమ చేస్తారు. ఇలా వికాస్ దాస్ సేవా కార్యక్రమాలతో అడవిలో వెలుగు చొచ్చుకుపోతోంది.

వటవృక్ష నీడలో హాయిగా..
రెండువందల మంది జనాభా ఉన్న ఆ పల్లెలో ఎవరు ఏ పనిచేస్తున్నారో గమనించారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులతో వారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులు, పంటలు, బుట్టలు, అల్లిక వస్తువులు అద్భుతంగా ఉండటాన్ని, నాణ్యంగా ఉండటాన్ని గమనించాడు. మధ్యవర్తులు, దళారుల వారిని మోసగిస్తున్న విషయాన్ని గుర్తించాడు. మొదటగా ఒక్కొక్కరికి 3వేల రూపాయల సీడ్‌కాపిటల్‌ను సహాయంగా అందించాడు. వ్యాపారంలో మెలకువలు, మధ్యవర్తులపై ఆధారపడకుండా, నేరుగా పట్టణాల్లో మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడు. కష్టం, స్వతంత్రంగా వ్యవహరించడంలో వారు దిట్టలను ఇట్టే గ్రహించిన వికాస్ వారికి చదువుచెప్పి నైపుణ్య శిక్షణ ఇప్పించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో వీరు తయారు చేసిన వస్తువులను ఇంటింటికి వెళ్లి విక్రయించడం మొదలుపెట్టారు. ఈ మార్పు ఆనోటాఈనోటా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి చేరింది. అలా ఒడిశా, వెస్ట్‌బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ‘వటవృక్ష’ సేవలు విస్తరించాయి. మొదట ఏడుగురితో మొదలైన వికాస్ సేవాకార్యక్రమాల్లో ఇప్పుడు 72 మంది పాలుపంచుకుంటున్నారు. మొత్తం 17000మంది గిరిజన మహిళలు లబ్దిపొందుతున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ రెండుపూటలా కడుపునిండా తినగలుగుతున్నారు. సుకిమ మాఝి జీవితమే మారిపోయింది. ఒకప్పుడు ఆమె వస్తే చీదరించే జనం ఇప్పుడు ఆమెవద్దకు వెళుతున్నారు. మాఝీ కొన్ని కుటుంబాలకు ఉపాధి చూపిస్తోంది. ఆమె వెదురుతో చేసే అద్భుతమైన వస్తువులకు యూరోపియన్ యూనియన్‌లోనూ మంచి గిరాకీ ఉందంటే ఆమె పనితనమేమిటో తెలుస్తుంది.

చిత్రాలు...మాంఘ్జితో , గిరిజనులతో ...వికాస్ దాస్