యువ

‘స్మార్ట్’ డేంజర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర ముంచుకొస్తున్నా స్మార్ట్ఫోన్‌ను వదలలేక పోవడం.. అవసరం ఉన్నా లేకున్నా ‘సోషల్ మీడియా’ వెబ్‌సైట్లలో గంటలకొద్దీ గడపడం.. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొని తెచ్చుకోవడం... ఈ ధోరణి నేటి నవ నాగరిక యువతలో పెచ్చుమీరుతోంది. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో హైస్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు వాట్సాప్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పగలూ రాత్రి అనే తేడా లేకుండా వీరవిహారం చేస్తున్నారు. ‘స్మార్ట్‌‘ ఫోన్లను మితిమీరి వాడడం వల్ల యువతను ఇప్పుడు నిద్రలేమి సమస్య వేధిస్తోందని ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్లాక్ డాగ్’ సంస్థ తాజా అధ్యయనంలో తేల్చిచెప్పింది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రించడం, కంటినిండా కునుకు లేకపోవడంతో మర్నాడు ఉదయం నిద్రలేచే సమయంలో చాలామందిని బద్ధకం ఆవహిస్తోందని నిపుణుల పరిశీలనలో తేలింది. విశ్వవ్యాప్తంగా సుమారు 30 శాతం యువత నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నట్లు, ఫలితంగా శారీరక, మానసిక అనారోగ్యాలు అనివార్యమవుతున్నట్లు అధ్యయన బృందం హెచ్చరిస్తోంది.
ఇళ్లలో తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచడంతో పిల్లలు వయసు పెరిగేకొద్దీ గేమ్స్, వీడియోలు, సెల్ఫీలు, పలురకాల సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. కాలేజీలో చేరే సమయానికి ఈ ధోరణి మరింతగా విజృంభిస్తోంది. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగాక ఒకే ఇంట్లో ఉంటున్నా- తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. సంపాదన, ఇంటి బాధ్యతల్లో పేరెంట్స్ తలమునకలు కావడంతో పిల్లలు స్మార్ట్ ఫోన్‌లో ఏం చూస్తున్నారో, ఎంతసేపు అలా కాలక్షేపం చేస్తున్నారో పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో కుర్రకారు చదువును నిర్లక్ష్యం చేయడంతో పాటు నిద్రకు దూరం అవుతున్నారు. రోజుకు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ నిద్ర అవసరమని వైద్యులు చేసే హెచ్చరికలను నేటి యువత బేఖాతరు చేస్తోంది. అంతర్జాలంలో వెచ్చించే సమయాన్ని కొంతైనా తగ్గించాలని, ఇందుకోసం స్మార్ట్ఫోన్‌ను అప్పుడప్పుడైనా పక్కన పడేయాలని చాలామంది అనుకుంటారు. కానీ, అది ఆచరణ సాధ్యం కావడం లేదు. సామాజిక మాధ్యమాలు, వార్తలు, సినిమాలు, క్రీడలు, స్టాక్ మార్కెట్, స్నేహితులతో పరిచయాలు... ఇలా ఏదోరకంగా ప్రతి ఐదు నిమిషాలకోసారైనా స్మార్ట్ఫోన్ చూడడం అలవాటుగా మారింది. ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోవడంతో స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తగ్గడం, వ్యక్తిగత సమస్యలు అధికం కావడం జరుగుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా స్మార్ట్ఫోన్‌కు బానిసలు కాకతప్పడం లేదు.
‘డిజిటల్ పొల్యూషన్’ వల్ల యువత కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఇతరులతో పరిచయాలు పెంచుకుంటూ లేనిపోని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇతరుల మాదిరి తాము కూడా గొప్పగా ఉండాలని విలాసాలకు, వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. చిన్న వయసులోనే ‘అంతర్జాలం’తో ఏర్పడే అనుబంధం యుక్తవయసు వచ్చే సరికి మరింత శ్రుతిమించుతోంది. విలువైన కాలం వృథా అవుతోంది. శారీరక, మానసిక సమస్యల వల్ల వైద్యం కోసం చేసే ఖర్చు కూడా పెరుగుతోందని అధ్యయనంలో వెల్లడైంది. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే యువత భవిత ఆశాజనకంగా ఉంటుందని, సోషల్ మీడియా విసిరే వలలో చిక్కుకుని బాధ్యతలను విస్మరిస్తే సమస్యలు తప్పవని నిపుణులు సర్వే సందర్భంగా హెచ్చరిక చేశారు.
కుంగుబాటు సమస్య
ట్విటర్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికలు యువతలో కుంగుబాటు సమస్యకు కారణమవుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘డిచ్ ది లేబుల్’ సంస్థ తాజా అధ్యయనంలో కనుగొంది. తమ ‘సెల్ఫీ’లకు ప్రశంసలు (లైకులు) రాకపోతే చాలామంది యువతీ యువకులు మానసికంగా కుంగిపోతున్నారని సర్వేలో తేలింది. అలాగే, సామాజిక వెబ్‌సైట్లలో వ్యక్తిగత దూషణలు, తప్పుడు వ్యాఖ్యలు, బెదిరింపులు, వంచనలు పెరిగిపోవడం కూడా యువతలో ఆందోళనను పెంచుతున్నాయట! 12 నుంచి 20 ఏళ్లలోపు వయసు కలిగిన సుమారు పదివేల మందిని సర్వే చేయగా పలు ఆసక్తికరమైన, ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి. తమ ‘సెల్ఫీ’లను ఎవరూ నచ్చకపోవడంతో సర్వేలో నలభై శాతం మంది యువకులు నైరాశ్యానికి గురైనట్లు వెల్లడైంది.
ఇలా చేసి చూడండి
స్మార్ట్ఫోన్‌లో ‘యాప్’ల సంఖ్యను వీలైనంత వరకూ తగ్గించుకోవాలని, అత్యవసరం అనుకున్నవే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయానే్న నిద్ర లేవడానికి గడియారంలో అలారం పెట్టుకోవడం ఉత్తమం. అలాకాకుండా స్మార్ట్ఫోన్‌లో అలారం పెట్టుకుని నిద్ర లేస్తే- ఇక అప్పటి నుంచే ‘నెట్’లో చిక్కుకోవడం ఖాయం! స్మార్ట్ఫోన్‌కు బదులు- ‘ఇంటర్నెట్’ సదుపాయం లేని మామూలు ఫోన్‌ను మన దగ్గర ఉంచుకుంటే ‘సర్ఫింగ్’, చాటింగ్‌ల నుంచి బయటపడే వీలుంది. నిర్ణీత వేళల్లో మాత్రమే స్మార్ట్ఫోన్ వాడాలన్న కఠిన నియమం పెట్టుకుంటే కొంత ఫలితం ఉంటుంది. నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందే స్మార్ట్ఫోన్‌ను వేరే గదిలో ఉంచేయాలి.
సాంకేతికత వల్ల మన దైనందిన జీవితం సాఫీగా సాగిపోవాలే తప్ప సమస్యలను స్వాగతించేలా ఉండకూడదని యువత తెలుసుకోవాలి. ఆరోగ్య సమస్యలు, మానసిక చికాకులు తెచ్చిపెట్టే పెడ ధోరణులకు స్వస్తి పలకాలి. స్మార్ట్ఫోన్ ‘ట్రాప్’ నుంచి బయటపడి, విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా? అన్న విషయంపై కుర్రకారు దృష్టి సారించడం అవసరం.
*