యువ

ఓ మై యాప్స్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారీ పనిగంటల్లో సగానికిపైగా కాలాన్ని భారతీయ యువత ‘యాప్స్’పైనే వెచ్చిస్తోంది! అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువగా మన దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరగడంతో యాప్స్ లేనిదే మన కుర్రకారుకు తోచడం లేదట! భారత్‌లో స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారిలో రోజుకు సగటున నాలుగు గంటల సేపు ‘యాప్స్’ లోకంలో మునిగితేలుతున్నారని ‘ఆప్ అనీ’ సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. ఈ ఏడాది మార్చి నాటికి చూస్తే- ప్రపంచం మొత్తం మీద ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌లో ముందు వరసలో ఉన్న అయిదు దేశాలలో భారత్ స్థానం సంపాదించింది. దక్షిణ కొరియా, మెక్సికో, బ్రెజిల్, జపాన్ దేశాల్లో స్మార్ట్ఫోన్లను వాడుతున్న వారిలో రోజుకు సగటున అయిదు గంటల సమయాన్ని ‘యాప్స్’పై వెచ్చిస్తున్నారు. దక్షిణ కొరియా, మెక్సికో దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు రోజుకు సగటున అయిదు గంటల చొప్పున, బ్రెజిల్‌లో నాలుగున్నర గంటలు, అమెరికా, భారత్‌లో నాలుగు గంటల చొప్పున యాప్స్‌తో బిజీగా గడుపుతున్నారని అధ్యయనంలో తేలింది. భారత్‌లో మధ్య తరగతి కేటగిరీలో రోజుకు రెండున్నర గంటలు, కింది స్థాయి వర్గాల్లో గంట ఏభై నిముషాల చొప్పున యాప్స్‌తో కాలక్షేపం చేస్తున్నారట! దేశం మొత్తమీద రోజుకు సగటున రెండున్నర గంటల సేపు యాప్స్‌తో కాలక్షేపం చేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి యాప్‌లను వినియోగించడం ఇపుడు సర్వసాధారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ సహా పది దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు మార్కెట్ అంచనాలకు మించి విస్తరించింది.
యువతతో పాటు వివిధ వర్గాల వారు సైతం స్మార్ట్ఫోన్లలో యాప్‌లను వినియోగిస్తున్నారు. షాపింగ్, పర్యాటకం, గేమ్స్‌కు సంబంధించిన యాప్స్‌ను వాడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీటిపైనే ఎక్కువమంది తమ కాలాన్ని వెచ్చిస్తున్నారు. మొబైల్ షాపింగ్ విషయంలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ఆర్థిక విషయాలకు సంబంధించిన యాప్‌ల వినియోగంలో దక్షిణ కొరియా, బ్రెజిల్ ముందువరసలో ఉండగా, ఆ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈ విషయంలో భారత్ కన్నా వెనుకంజలోనే ఉన్నాయి. భారత్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోదారుల్లో గేమింగ్ యాప్‌ల వినియోగం ఇటీవల అనూహ్యంగా వృద్ధి చెందింది. ప్రతిరోజూ కనీసం గంటసేపు గేమ్‌లతో కాలక్షేపం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. గేమింగ్ యాప్‌ల వినియోగంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్ తదితర దేశాలు సైతం ముందు వరసలో ఉన్నాయి. వివిధ రకాల యాప్‌ల వినియోగం నానాటికీ పెరుగుతున్నందున భారత్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్ మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు తాజా అధ్యయనంలో తేల్చారు.

మితిమీరి వాడితే..
ఏ విషయంలోనైనా శ్రుతి మించితే సమస్యలు తప్పవన్నదానికి ‘యాప్స్’ వినియోగం ఏ మాత్రం మినహాయింపు కాదు. సాంకేతికత పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్, టాబ్లెట్స్, గేమింగ్, ఇతర డిజిటల్ డివైజులను వాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మార్కెట్‌లో కొత్తగా ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వచ్చినా వాటిని సొంతం చేసుకునేందుకు యువత ఆరాటపడుతోంది. గాడ్డెట్స్‌ను మితిమీరి వాడడంతో దాదాపు 75 శాతం మంది యువత శారీరకంగా పలు రకాల నొప్పులను ఎదుర్కొనక తప్పడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. 60 శాతం మంది తీవ్ర నొప్పులతో బాధ పడుతున్నారట. వేళ్లు, చేతులు, మెడ, కళ్లు, మోచేతుల నొప్పులు చాలామందిలో కనిపిస్తున్నాయి. దీని వల్ల కొందరు ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్యాడ్జెట్స్‌ను మితిమీరి వాడేవారు కొన్ని జాగ్రత్త చర్యలను పాటిస్తే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు.
కళ్లకు మరీ దగ్గరగా పెట్టుకుని స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్ వంటి గాడ్జెట్‌లను వాడడం మంచిది కాదు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, నేత్ర సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనీసం అర నిమిషానికి ఒకసారైనా గాడ్జెట్‌పై నుంచి దృష్టి మరలిస్తే కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కింద గానీ, ఎత్తులో గానీ గాడ్జెట్స్‌ను పెట్టకుండా కళ్లకు సమస్థాయిలో ఉంచుకుని వాడడం ఉత్తమం. లేకుంటే కళ్లతో పాటు మెడ, వెన్ను నొప్పులు తప్పవంటున్నారు. కళ్లకు అలసట లేకుండా వీటిని వాడుతుండాలి. కాలక్షేపానికి గాక అవసరాల మేరకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను వాడడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోగాని, ఆఫీసులో గాని ఒకే చోట ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని గాడ్జెట్‌లలో మునిగిపోతే శారీరక నొప్పులు అనివార్యమవుతాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల వొంటి నొప్పులు తప్పవు. మార్నింగ్ వాక్ చేయడం లేదా ఇంట్లోనైనా అటూ ఇటూ తిరగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల కొంత శారీరక శ్రమ ఉంటుంది. జిమ్‌లలో ఆధునిక యంత్రాల సాయంతో వ్యాయామం చేసేవారు కండరాలను వార్మప్ చేస్తుండాలి. దీంతో గాయాలు కావడం, నొప్పులు రావడం తగ్గుతాయి. మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ శరీరానికి తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.