యువ

విద్యారంగంలో అమ్మాయిల హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్లల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్న మన దేశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. విద్యారంగంలో ఇపుడు అమ్మాయిల ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరుగుతోంది. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ఆడపిల్లల సంఖ్య పెరగడంతో- అబ్బాయిలు వెనుకపడుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం మొత్తమీద చూస్తే భారత్‌లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. మన దేశంలో విద్యార్థుల సంఖ్య మూడు వందల మిలియన్లు కాగా, అందులో బాలికల వాటా 48 శాతం అని తేలింది. 2015-16లో ఈ అనూహ్యమైన మార్పును విద్యారంగ నిపుణులు గమనించారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1950-51లో మొత్తం విద్యార్థుల్లో అమ్మాయిల సంఖ్య 25 శాతం కాగా, ఇటీవలి కాలంలో వారి ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరిగింది. 1990-91లో విద్యార్థినుల భాగస్వామ్యం 39 శాతంగా, 2000-01లో 42 శాతంగా నమోదైంది. రాబోయే దశాబ్దంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మధ్యలోనే బడిమానేసే విద్యార్థుల్లో అబ్బాయిల సంఖ్య అధికంగా ఉంటోందని తేలింది. ఒకసారి పాఠశాలలో చేరాక డిగ్రీ పూర్తి చేసేవారిలో అమ్మాయిల సంఖ్య ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో మొత్తం విద్యార్థులలో అమ్మాయిల సంఖ్య 54 శాతంగా, అమెరికాలో 55 శాతంగా, చైనాలో 54 శాతంగా ఉంది. ఈ దేశాల్లో మహిళల పట్ల సామాజికంగా ఎలాంటి వివక్ష లేదు. విద్య, రాజకీయ, ఉపాధి, వ్యాపార రంగాల్లో వీరు రాణిస్తున్నారు. కానీ, లింగవివక్షకు నిలయమైన భారత్‌లో విద్యారంగానికి సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగడం శుభ పరిణామంగానే చెప్పాలి. ఉపాధి రంగంలో 27 శాతం, పార్లమెంటులో 11 శాతం, అసెంబ్లీల్లో 8.8 శాతం, వాణిజ్య సంస్థల సిఇఓ పదవుల్లో 3.4 శాతం మాత్రమే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం కనిపిస్తోంది. అయితే, విద్యారంగంలో వీరి ప్రాతినిధ్యం 48 శాతానికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మిగతా రంగాల్లోనూ భవిష్యత్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ‘సర్వశిక్ష అభియాన్’ వంటి కార్యక్రమాలను ప్రారంభించడంతో విద్యాసంస్థల్లో చేరే ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పిజి కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల భాగస్వామాన్ని మించిపోయింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఇపుడు కనిపిస్తున్నాయి. ఆర్ట్సు సబ్జెక్టుల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం బాగా పెరిగింది. అయితే- వృత్తిపరమైన కోర్సుల్లో అబ్బాయిల ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కంటే వైద్యవిద్యలో యువతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నర్సింగ్, దంత వైద్యం, పిజియోథెరపీలోనూ అమ్మాయిల సంఖ్య ఎక్కువే. కనీసం డిగ్రీ చేతికిరానిదే వివాహం చేసుకోరాదన్న భావన ఇపుడు యువతుల్లో పెరిగింది. వివాహం తర్వాత కూడా మంచి ఉద్యోగంలో చేరాలన్న ఆకాంక్ష యువతుల్లో పెరుగుతోంది. ఈ కారణంగానే విద్యాసంస్థల్లో ఆడపిల్లల ప్రాతినిధ్యం అబ్బాయిలను వెనక్కి నెట్టేస్తున్నట్లు నిపుణులు విశే్లషిస్తున్నారు.