యువ

‘స్మార్ట్’ వ్యసనం వదలడం ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్ర లేవగానే- ఆ రోజంతా శుభం జరగాలని దేవుడి ఫొటో చూడడం ఒకప్పటి అలవాటేమో గానీ.. ఇప్పుడు చాలామంది నిద్ర లేస్తూనే చేతిలోకి స్మార్ట్ఫోన్ తీసుకుని తమదైన లోకంలో మునిగిపోతున్నారు. తమ పరిసరాలను గానీ, కుటుంబ సభ్యులను గానీ పట్టించుకోనంత వరకూ ‘స్మార్ట్ఫోన్’ వ్యసనం మితిమీరిపోతోంది. స్మార్ట్ఫోన్‌కు బానిసలైతే ఆరోగ్యపరంగా సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఎలాంటి ఫలితం ఉండడం లేదు. కునుకు తీసేముందు, నిద్రలేచిన తర్వాత స్మార్ట్ఫోన్‌తో మమేకం కావడం అధికమైందని ఇటీవల జరిగిన ‘గ్లోబల్ మొబైల్ కన్స్యూమర్ సర్వే’లో తేటతెల్లమైంది. ఈ కారణంగానే మన దేశంలో ల్యాప్‌టాప్‌ల కంటే స్మార్ట్ఫోన్లు ఎక్కువమందికి చేరువైనట్లు తేలింది.
దేశంలో ఇప్పటికే సుమారు ఎనభై శాతం మంది స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారూ వీటిలో మునిగితేలుతున్నారు. ఇంటర్నెట్ వినియోగించేవారంతా తప్పనిసరిగా స్మార్ట్ఫోన్‌ను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమాచారం, వినోదం, వార్తలను తెలుసుకునేందుకు ఇంటర్నెట్ వాడడం సర్వసాధారణమైంది. స్మార్ట్ఫోన్లు రంగ ప్రవేశం చేశాక ఈ అలవాటు క్రమంగా ఓ వ్యసనంలా మారుతోంది. అవసరం ఉన్నా లేకున్నా స్మార్ట్ఫోన్‌తో కాలక్షేపం చేయడం చాలామందికి హాబీగా మారింది. ఇది చివరికి బలహీనతగా మారడంతో నిద్ర మానుకుని అర్ధరాత్రి సమయంలోనూ స్మార్ట్ఫోన్‌తో గడుపుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ వ్యసనం చివరికి కుటుంబ సంబంధాలను సైతం బలహీన పరుస్తోంది. ఇంట్లో వారంతా ఎవరికివారు స్మార్ట్ఫోన్లు వాడుతున్నందున కుటుంబ సభ్యుల మధ్య మాటలు కరువైపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకాంతంగా గడపడం, ఆరోగ్యాన్ని సైతం ఖాతరు చేయకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నిద్ర లేచిన వెంటనే కనీసం అయిదు నిమిషాల సేపు స్మార్ట్ఫోన్ చూసేవారు 61 శాతం మంది ఉన్నారని, అరగంట సేపు ఫోన్‌తో గడిపేవారు 88 శాతం మంది ఉన్నారని సర్వేలో కనుగొన్నారు. గంటసేపు ఫోన్‌లో మమేకం అయ్యేవారి సంఖ్య 96 శాతం కావడం ఆందోళనకర పరిణామం. నిద్ర లేచిన వెంటనే ఫేస్‌బుక్, వాట్సాప్, మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు చూసుకోవడం చాలామందికి అలవాటైంది. కొందరైతే రోడ్డుపై నడుస్తున్నా, బస్సులో వెళుతున్నా ఈ పనే చేస్తున్నారు. నిద్రపోయే ముందు కనీసం అరగంట సేపు స్మార్ట్ఫోన్‌తో గడిపేవారు 74 శాతం మంది ఉన్నారు. స్మార్ట్ఫోన్ వ్యసనం రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాదు, కాలాన్ని వృథా చేయడానికి, ఆరోగ్యాన్ని పాడుచేయడానికి దారితీస్తోంది. ఇంట్లోనే అంతా ఉన్నా ఎవరికివారు చాటింగ్‌లోనో, సోషల్ మీడియాలోనో కాలక్షేపం చేయడంతో మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి. తాజా అధ్యయనం మేరకు స్మార్ట్ఫోన్ వినియోగదారుల్లో దాదాపు నలభై శాతం మంది ఆ వ్యసనానికి బానిసలయ్యారు. చేతిలో ఫోన్ లేనిదే బతకడం దుర్లభం అన్న భావన చాలామందిలో నెలకొంది.
ముప్పయి ఏళ్ల లోపు యువతలో సుమారు 90 శాతం మంది తాము ఎక్కడికి వెళ్లినా వారి వెంట స్మార్ట్ఫోన్ ఉండాల్సిందే. ఏం చేయాలో తోచక పదే పదే ఫోన్ చూసుకోవడం చాలామందికి వ్యసనంలా మారింది. గత రెండేళ్ల కాలంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల విక్రయాలు బాగా తగ్గుముఖం పట్టి, స్మార్ట్ఫోన్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. మరో పని లేనట్టు రోజంతా స్మార్ట్ఫోన్‌తో గడిపేయడం వల్ల ముఖ్యంగా యువత పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. చదువు, కెరీర్‌లో వెనుకబడడం, ఒత్తిడి, మానసిక రుగ్మతలు, దృష్టిలోపం, మధుమేహం, నిద్రలేమి, మానవ సంబంధాలు క్షీణించడం వంటి విపరిణామాలు అనివార్యమవుతున్నాయని సర్వేలో తేలింది. స్మార్ట్ఫోన్లను మితిమీరి వాడడం వల్ల మానసిక ఇబ్బందులు, కోపం, అసహనం, విచక్షణ కోల్పోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. అన్నింటికీ మించి కుటుంబ బంధాలు, మానవ సంబంధాలపై ఈ వ్యసనం ఎనలేని ప్రభావం చూపిస్తోంది. స్మార్ట్ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌లో నోటిఫికేషన్లు రాకుండా కట్టడి చేయడం, అనవసరమైన యాప్‌లను తొలగించడం, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను పరిమితంగా వాడడం అలవాటు చేసుకోవాలి.
వీలైనంత వరకూ గ్రూప్ చాటింగ్‌లకు దూరంగా ఉండాలి. పనివేళల్లో, నిద్రపోయే ముందు స్మార్ట్ఫోన్‌ను వేరే గదిలో ఉంచాలి. అవసరం లేదని అనిపించినపుడు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుండాలి. సమయం తెలుసుకునేందుకు ఫోన్‌ను కాకుండా గడియారాన్ని చూడడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో గడిపేందుకు సమయం కేటాయించడం అలవాటు చేసుకుంటే ‘స్మార్ట్’ వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే, పుస్తక పఠనం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రయాణాల్లో, కార్యాలయాల్లో, కళాశాలల్లో వీటిని వినియోగించక పోవడం మంచిది.
సాంకేతికతను వాడుకోవడంలో తప్పు లేదు గానీ, దానికి బానిసలైపోయి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం వాంఛనీయం కాదని తెలుసుకోవాలి. మద్యం, డ్రగ్స్, ధూమపానం వంటి చెడు వ్యసనాల నుంచి రక్షించేందుకు ఉన్నట్లే స్మార్ట్ఫోన్ బారి నుంచి కాపాడేందుకు ‘ఇంటర్నెట్ డి అడిక్షన్’ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.