యువ

సోషల్ మీడియాతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞాన దీపకాంతుల కింద అకృత్యాల చీకట్లు తాండవిస్తున్నట్లు’ అంతర్జాలంలో శ్రుతిమించుతున్న సైబర్ నేరాల తీవ్రత నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కంప్యూటర్ మీటలు, స్మార్ట్ఫోన్ల మీదే కాలక్షేపం చేస్తున్న ఆధునిక యువత తెలిసో, తెలియకో కష్టాలపాలవుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరగడంతో అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెచ్చుమీరుతోంది. సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవరికివారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సాంకేతికతతో పాటు ఆన్‌లైన్ మోసాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నందున సైబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టింగులు చేశారంటూ పోలీసు కేసులు.. ఈ-మెయిల్ డేటా తస్కరించి విలువైన సమాచారం హ్యాక్ చేయడం.. ఇతరులకు ఫోన్లు చేసి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని లక్షలకు లక్షలు చోరీ చేయడం.. ఇలా ఆన్‌లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అదే రీతిలో సామాజిక మాధ్యమాల్లో విహరించేవారు కూడా వ్యక్తిగతంగా అప్రమతం కావడం నేడు అనివార్యం అని చెప్పకతప్పదు.
ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని లేకుంటే కష్టాల బారిన పడడం ఖాయమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా! అని ఆన్‌లైన్‌లో హద్దులు దాటితే చిక్కుల్లో పడక తప్పదు. ఫేస్‌బుక్‌లో అనుచితమైన పోస్టు చేసినందుకు సైబర్ చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన సంఘటనలు ఎన్నింటినో మనం చూశాం. అనుచిత వ్యాఖ్యలతో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు ఓ యువకుడికి 42 రోజుల జైలుశిక్ష విధించడం తాజా ఉదంతం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన జకీర్ అలీ త్యాగి అనే పద్దెనిమిదేళ్ల కుర్రాడు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా నది, అయోధ్య రామమందిరం, ముస్లింల హజ్ యాత్రకు సంబంధించి ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన రాతలు రాశాడు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద అలీపై కేసులు నమోదు చేయడంతో న్యాయస్థానం అతనికి 42 రోజుల జైలుశిక్ష విధించింది. ముజఫర్‌నగర్ జైలు నుంచి ఈ యువకుడు బెయిల్‌పై విడుదల కావడంతో ఈ ఉదంతం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘గంగానదికి ప్రాణం ఉంద’న్న ప్రభుత్వ ప్రకటనను అపహాస్యం చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందన్న బిజెపి హామీపై నిప్పులు చెరగడం, ముస్లింల హజ్ యాత్రకు సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థకు ఇచ్చిన రాయితీని ఎందుకు వెనక్కి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అలీపై ఐపిసి కింద, ఐటి చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో మతాలకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టు పెట్టినందుకు అలీకి జైలుశిక్ష విధించడం సమంజసమేనని కొందరు సమర్ధిస్తుండగా, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తోందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సైబర్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
గతంలో ముంబయిలో శివసేన పార్టీ అధినేత బాల్ థాకరే మరణించినపుడు కూడా ఓ అమ్మాయి సోషల్ మీడియాలో వెటకారంగా ‘పోస్టు’ పెట్టడం వివాదాస్పదమై పోలీసులు కేసు పెట్టేవరకూ దారితీసింది. ఆ అమ్మాయి చేసిన పోస్టుకు ‘లైక్’ చేసినందుకు మరో యువతిపైనా సైబర్ చట్టం కింద పోలీసులు కేసులు పెట్టారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం సృష్టించడంతో ఆ ఇద్దరు యువతులపై కేసులు నమొదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ‘మార్ఫింగ్’ చేసి స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేసినందుకు గతంలో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిపై అభ్యంతరకరమైన ఫొటోను ‘షేర్’ చేసినందుకు, తాజాగా వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టును ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు ఓ ఆర్టీసీ కండక్టర్ ఇబ్బందుల పాలు కావడం గమనార్హం. తాను పనిచేస్తున్న సంస్థపైన, ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు నిజామాబాద్ ఆర్టీసీ-1 డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌పై అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో దోషిగా తేలితే కండక్టర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ‘నెట్టింట్లో’ హద్దులు దాటితే జైలులోకి నెట్టేసే పరిస్థితి తప్పదని గ్రహించి సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఆన్‌లైన్‌లో అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం, ఇతరులను ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత ముఖ్యమని భావించేవారు... ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించరాదన్న విషయాన్ని కూడా గుర్తించి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం ఉత్తమం.