యువ

‘సన్‌బర్న్’ సరదాలు దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతను పెడదోవ పట్టిస్తున్న నేటి సభ్యసమాజం పోకడలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? భావితరాలకు ఉన్నత విలువలు నేర్పాల్సిన పెద్దవాళ్లే కుర్రకారు చేతికి బ్యాంకు కార్డులు, కారు తాళాలిచ్చి నీ ఇష్టానికి నువ్వు జల్సా చేసుకో! అంటూ విచ్చలవిడిగా గాలికి వదిలేస్తే... వారు ఎటు పోతున్నారో కనిపెట్టి నియంత్రించే పరిస్థితి కానరావడం లేదు. ఇందుకు కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపమా? లేక పాశ్చాత్య పోకడలా? రేపటి పౌరులుగా దేశాన్ని ముందుకు నడిపించే వారిగా చూడాల్సిన యువత మత్తులో జోగుతూ జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. మందలించాల్సిన పెద్దలే మిన్నకుంటే రేపటి తరం పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం సహించదగినదేనా? అని ప్రతిఒక్కరూ ప్రశ్నించుకోవాలి.
ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపే కనె్నత్తి ఎందుకు చూస్తున్నాయో తెలియనిది కాదు. జనాభాలో 37 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం భారతదేశం. అలాంటి దేశంలోని యువత బలహీనతలకు లోనయ్యేలా చేస్తోంది నేటి పబ్ కల్చర్. మన సంస్కృతి, సంప్రదాయాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాల్సిన బాధ్యత ప్రతివారికీ ఉంది. పబ్ కల్చర్ అన్నది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. కేవలం కాసులకు కక్కుర్తిపడి వీటిని నడుపుతుంటే వారికి లైసెన్స్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మన ప్రభుత్వాలది కూడా తప్పిదమే. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే బంగారు బాతులా లిక్కర్‌ని ప్రోత్సహిస్తుంటే నేటి యువతలో దాని పట్ల వ్యామోహం ఏర్పడటంలో తప్పేముంది? ఒక్క పెగ్గే కదా.. అని మొదలుపెట్టి చివరకు దానికి బానిసలైపోతున్న ఉదంతాలు ఎనె్నన్నో! ఈ పబ్‌లకి, క్లబ్‌లకి వెళ్ళడానికి పెద్ద, చిన్న అనే తారతమ్యం లేకుండా పోతోంది. ఇలాంటి విలాసాలకు బడాబాబుల పిల్లలే వెళతారని అనుకుంటే అది అపోహే అవుతుంది. డబ్బున్న గొప్పోడితో పాటు మధ్య, ఎగువ మధ్యతరగతి వారు కూడా ఈ వ్యసనాలకు అలవాటుపడిపోతున్నారు.
ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అక్కడ డీజె మ్యూజిక్‌లో తాగి తందనాలాడటం ఎంతవరకు సమంజసం. దాన్ని నియంత్రించాల్సిన పెద్దలు డబ్బు సంపాదనలో బిజీ అయిపోయి పట్టించుకునే పాపాన పోవడం లేదు. పబ్‌లకు వెళ్లేవారికి వయసు పరిమితి ఉన్నప్పటికీ ఆ నిబంధనలను కాసులతో కప్పేసి, తుంగలోతొక్కి ఆడ, మగ అనే భేదం లేకుండా వీకెండ్ పార్టీలంటూ అక్కడికి వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి చెందిన తరువాత ఈ రకమైన వీకెండ్, రేవ్ పేరిట రిసార్టుల్లో పార్టీలు జరుపుకుంటూ రాత్రంతా వావివరసలు మరిచి, తాగి తందనాలాడటం, వాటికి బానిసలవ్వడమే కాకుండా ఆఖరికి జీవితాలను నాశనం చేసుకోవడమో, సర్వం కోల్పోవడమో జరుగుతోంది. అక్కడ అన్నిరకాల ఆల్కాహాల్ బ్రాండ్స్ దొరకడమే కాకుండా డీజే మ్యూజిక్‌లో ఎవరు ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో చిత్తుగా తాగుతూ, మత్తులో చిందులు వేస్తూ ఎంజాయ్ చేయడం! బలుపెక్కిన కుర్రకారు తెల్లార్లూ వేసే ఈ చిందులకు ఎంజాయ్‌మెంట్ అని, పార్టీ అని పేర్లు పెట్టడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా పబ్ కల్చర్ కాస్మొపాలిటిన్, మెట్రో నగరాల్లో ఎక్కువగా ప్రబలింది. తల్లిదండ్రులు సంపాదనలో బిజీ అయితే, వారి పిల్లలు స్నేహితులతో కలిసి ఎంజాయ్‌మెంట్ల పేరుతో వారిచ్చిన డబ్బుతో వెర్రితలలు వేస్తున్న పాశ్చాత్య పోకడలకు తగలెయ్యడం ఎంతవరకూ కరెక్టో అందరూ ఆలోచించాలి. ఇక జీవితం చాలా విలువైనదనే విషయాన్ని నేటి యువత మర్చిపోతోంది.
పొంగే ఏరులాంటి ఉడుకు రక్తంతో ఎటువైపు అడుగెయ్యాలో దిశా నిర్దేశం చేసేవారు లేక తెలిసీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నవారిని తల్లిదండ్రులే పట్టించుకోకపోతే ఆనక వారికే కాకుండా పోతున్న ఉదంతాలు మనం ఎన్నో చూశాం. తాజాగా విశ్వనగరం అని ఎలుగెత్తి చాటుతున్న మన హైదరాబాద్‌లో పక్క రాష్ట్రాల వారు కాదన్నా వారికి ఎదురెళ్లి మరీ ఆహ్వానించి జరిపిన ‘సన్‌బర్న్’ అనే మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంలో మద్యం ఏరులై పారిందని టీవీ ఛానెల్స్‌లో, పేపర్లలో మోత మోగిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడికి మైనర్లకు అనుమతి లేదని కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తుంగలో తొక్కేసి వేల రూపాయల ఎంట్రీ ఫీజులు వసూలు చేసి మరీ ఆ ఈవెంట్‌ను నిర్వహించారు. అక్కడికి వచ్చినవారంతా 18 సంవత్సరాల వయస్సులోపు వారే! ఇది గమనించాల్సిన విషయం. అందునా ఎక్కువగా ఆడపిల్లలు వచ్చారంటే ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ అంటూ మైకు దొరికినప్పుడల్లా మాట్లాడే మన నేతలు కళ్లు తెరిచి చూసి మరోసారి ఆ పద ప్రయోగాలను చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకప్పుడు కేవలం రహస్యంగా పబ్‌లో జరిగే విచ్చలవిడితనానికి ఇప్పుడు ‘సన్‌బర్న్’ వంటి ప్రోగ్రాంల వల్ల బహిరంగ లైసెన్స్ ఇచ్చేసినట్లు అయిందన్నది మన పెద్దలు తెలుసుకోవాలి. అసలు అలాంటి ఈవెంట్ ఒకటి ఉందని పిల్లలు వచ్చి చెప్పినప్పుడు అదుపులో పెట్టాల్సిన పెద్దలే వేల రూపాయల టిక్కెట్లు కొనిపెట్టి మరీ ప్రోత్సహిస్తుంటే వారిని ఏమనాలి? వయస్సు తెచ్చే ఉత్సాహాన్ని అణచుకోలేక కొందరు గంగవెర్రిలెత్తుతున్నారు. అక్కడ కేవలం లిక్కర్ ఒకటే కాదు గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను కూడా టీనేజీ పిల్లలకు అలవాటు చేసి, వారిని మత్తుకు బానిసలు చేయడం ఎంతవరకూ సబబో ప్రతిఒక్కరూ ఆలోచించాలి.ఇలాంటి వికృత, వింత పోకడలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినతరంగా ఉండాలి.
తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమ సహజమే కానీ, అది వారిని పెడదోవ పట్టించేంతగా ఉంటే చివరకు మిగిలేది కన్నీరే! ఆ విషయాన్ని గ్రహించుకుంటే నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు వీలవుతుంది. పిల్లలు పువ్వుల్లాంటి వారు. సువాసనలు వెదజల్లే ప్రతీ పువ్వూ సిగలోకి రాదు. సువాసన లేదు కదా.. అని పూజకు పనికిరాకుండా పోదు! కనుక వాటిని ఉపయోగించుకునే రీతిలోనే సామర్థ్యం తేటతెల్లమవుతుంది. నేటి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కాకుండా సమాజంలో ఉన్న ప్రతిఒక్క పౌరుడిదీ అయినప్పుడు ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పటంలో సందేహం అక్కర్లేదు.

- వసుంధర