యువ

మీ భవితకు మీరే విధాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే సామర్థ్యం యువశక్తికే ఉందని, ఈ దేశాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపే బాధ్యత యువతదేనని ప్రగాఢంగా విశ్వసించిన వివేకానందుడు కేవలం ఉపదేశాలకే పరిమితం కాలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అందరికీ స్ఫూర్తిదాతగా నిలిచారు. సంస్కృతి, సాంస్కృతిక వారసత్వమే భారతదేశానికి ఘనమైన ఆస్తులని భావించిన ఆయన ఎక్కడికి వెళ్లినా యువత బాధ్యతను గుర్తుచేసేవారు. దేశాన్ని ప్రగతిదారిలో నడిపించడం యువత వల్లే సాధ్యపడుతుందని ఆయన తన ఉపన్యాసాల్లో ప్రముఖంగా పేర్కొనేవారు. స్వశక్తితో, సొంత ఆలోచనలతో ముందుకు సాగితే యువతకు అసాధ్యమంటూ ఏదీ ఉండదని ఆయన హితబోధ చేసేవారు. యువశక్తికి ఉన్న ప్రాముఖ్యతను భారత్ మాత్రమే కాదు, ప్రపంచం యావత్తూ గుర్తించాలని వివేకానంద ఎలుగెత్తి చాటేవారు. తరాలు గడిచినా ఆయన మాటలు అనుసరణీయం, ఆచరణీయం గనుకనే యువశక్తి ప్రాధాన్యతను గుర్తిస్తూ మన దేశంలో ఏటా వివేకానందుడి జయంతిని ( జనవరి 12) ‘జాతీయ యువజన దినం’గా పాటిస్తున్నారు. యువత కోసం ఆయన ప్రవచించిన సూక్తులు, చేసిన బోధలు వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. ‘ఆధునిక భారత్’ను ఆకాంక్షించిన వివేకానందుడు చూపిన మార్గంలో యువత పయనించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘జాతీయ యువజన దినం’ సందర్భంగా అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ‘స్వామి వివేకానంద’గా ప్రఖ్యాతి పొందిన నరేంద్రనాథ్ దత్తా 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడైనప్పటికీ ఆయన సనాతనుడు కాదు, ఆధునిక భావాలనూ తనలో రంగరించుకున్నారు. మతం కంటే మానవత్వం గొప్పదని నమ్మారు. ఆయనను కేవలం ‘హిందూ సన్యాసి’గానే చూడనక్కర్లేదు.. ఏ జాతి అయినా సంస్కృతి, సాంస్కృతిక పునాదులపైనే నిలుస్తుందని, ఆధునికతను సంతరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని వివేకానందుడు చెప్పేవారు. భవిష్యత్ నిర్దేశకులైన యువత సన్మార్గంలో పయనించాలని పరితపించేవాడు. అందుకే వివేకానందుడి జయంతిని ‘జాతీయ యువజన దినం’గా నిర్వహించాలని 1984లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 1985 నుంచి ఏటా జనవరి 12న ‘జాతీయ యువజన దినం’ పాటిస్తున్నారు. వివేకానందుడి జీవితం, ఆయన ఆలోచనలు యువతకు స్ఫూర్తి కావాలన్న లక్ష్యంతోనే యువజన దినోత్సవాన్ని దేశం నలుచెరగులా నిర్వహిస్తున్నారు. యువత తమ శక్తిసామర్థ్యాలపై అవగాహన పెంచుకోవడం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దేశాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వామ్యం కావడం యువజన దినోత్సవం లక్ష్యం. దేశవ్యాప్తంగా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో జాతీయ యువజన దినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలాపనలు, వ్యాసరచన, వ్యక్తృత్వ, సంగీతం పోటీలు, క్రీడలు, సదస్సులు, చర్చాగోష్టులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. మన సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞలు చేయిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈ ఏడాది ‘మిషన్ భారతీయం’ పేరుతో వివిధ వర్గాల వారికోసం రెండు రోజుల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ‘బస్తీ యువ మహోత్సవ్’ పేరిట వాడవాడలా జరిగే వేడుకల్లో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలను జరుపుతున్నాయి. కోల్‌కతలోని రామకృష్ణ మఠంలో శారదాదేవి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామకృష్ణానంద విగ్రహాల వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగే పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వివేకానంద విగ్రహం వద్ద ప్రముఖులు పుష్పాంజలి సమర్పిస్తారు. యువత సన్మార్గంలో నడుస్తూ, తమ నైపుణ్యాలను గుర్తిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేందుకు సన్నద్ధం కావాలని గుర్తుచేయడమే ‘జాతీయ యువజన దినం’ లక్ష్యం.