యువ

సైనికుల కోసం సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఇంటి ముంగిట ఓ ‘విశిష్ఠ అతిథి’కి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా సుమారు 17వేల కిలోమీటర్ల మేర ఒంటరిగా ‘బైక్‌యాత్ర’ చేస్తున్న ఆమె సాహసాన్ని ఆయన మనసారా అభినందించారు. అంగవైకల్యం పొందిన సైనికుల పట్ల సమాజంలో అవగాహన పెరగాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్న ఆమెకు మద్దతు పలికారు. ఒంటరిగా బైక్‌యాత్ర చేస్తున్న ఆమె యావత్ మహిళాలోకానికి స్ఫూర్తిదాతగా నిలిచిందని హోం మంత్రి అభివర్ణించారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 23 ఏళ్ల మిత్సు చావ్దా ‘సైనికుల కోసం సాహసయాత్ర’కు గత ఏడాది నవంబర్ 26న శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 102 నగరాలను చుట్టుముడుతూ 17వేల కిలోమీటర్ల మేరకు ‘బైక్‌యాత్ర’ చేయాలని ఆమె సంకల్పించింది. తనకు పరిచయస్థులైన ఇద్దరు సైనికులు యుద్ధరంగంలో అంగవైకల్యం చెందడంతో మిత్సు ఎంతో మనస్తాపానికి గురైంది. ఇలాంటి సైనికుల పట్ల సమాజంలో ఆదరణ పెరగాలని ఆమె తన బైక్‌యాత్రను ప్రారంభించింది. ఇప్పటివరకూ తాను 11వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి సైనికుల పట్ల సమాజం వైఖరిలో మార్పు తెచ్చేందుకు కృషి చేశానని ఆమె అంటోంది. మహిళా బైక్‌రైడర్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని, యాత్ర సందర్భంగా తనకు ఎక్కడా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని మిత్సు సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. మాతృభూమి కోసం శత్రువులతో పోరాడిన సమయంలో కొంతమంది సైనికులు దురదృష్టవశాత్తూ అంగవైకల్యం పొందుతున్నారని, వీరి త్యాగాలకు గుర్తింపు రాకపోవడం బాధాకరమని మిత్సు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. ఇలాంటి సైనికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, వీరి పట్ల సమాజంలో ఆదరణ పెరగాలని ఆమె అంటోంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తాను బైక్‌యాత్ర చేశానని వివరిస్తోంది. తన యాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యువజన క్లబ్‌లను ఆమె సందర్శిస్తూ, సైనికుల త్యాగాల పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. తన 25వ జన్మదినం నాటికి కనీసం 25వేల మందిలోనైనా చైతన్యం తేగలనని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. ఓ యువతి ఇలా సాహసయాత్ర చేస్తోందని తెలుసుకుని అందరూ తనకు సహకరిస్తున్నారని ఆమె తన అనుభవాలను వివరిస్తోంది. మిత్సు ఒంటరిగా బైక్‌యాత్రకు సిద్ధమైనపుడు ఆమె తల్లిదండ్రులు ఒకింత అభ్యంతరం చెప్పారు. ఓ మంచి పని చేసేందుకు వెళుతున్నానని తెలుసుకుని వారు అంగీకరించారని ఆమె గుర్తుచేస్తోంది. నేటి యువత చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరాదని, కొంతమంది యువతీ యువకులు మొబైల్ ఫోన్ కోసమో, ప్రేమ వ్యవహారం వల్లనో ఆత్మహత్యలు చేసుకోవడం తగదని మిత్సు అంటోంది. ‘జీవితం ఎంతో విలువైనది.. మనం ఉన్నతంగా ఎదగడానికే కాదు, ఇతరుల్లో చైతన్యం తెచ్చేందుకు కూడా ఎంతోకొంత సమయం కేటాయించాలి.. అపుడే జీవితానికి సార్థకత..’ అని ఆమె తన మనోభావాలను వ్యక్తం చేస్తోంది.