యువ

వెలుగులీనే గొడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా అస్సాంలో ఓ గ్రామం. వర్షాలెక్కువ. కరెంటు తక్కువ. ఎక్కడైనా పొద్దు గూకితే లైట్లు వెలుగుతాయి. కానీ, ఆ గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధం. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. గ్రామంలో సైకిళ్ల వాడకం ఎక్కువ. ప్రతి ఒక్కరూ గొడుగు వాడుతూంటారు. అయితే సైకిళ్లపై వెళ్లేవారికి అదో నరకం. ఎందుకంటే ఓ చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో బ్యాటరీ లైట్ పట్టుకుంటే ఇక సైకిల్ ఎలా నడపడం? అదే ఊళ్లో నివసించే ధ్రువజ్యోతి కాకతి అనే 21 ఏళ్ల కుర్రాడు ఈ అవస్థలనుంచి గ్రామస్థుల్ని బయటపడేయాలనుకున్నాడు. గొడుగు ఆధారంగా రకరకాల ప్రయోగాలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. ఇంతకీ అతను చేసిన ప్రయోగమేమిటి?
గొడుగుకు నాలుగు అంగుళాల సోలార్ ప్లేట్‌ను బిగించాడు. ఇది సౌరశక్తిని గ్రహించి ఆరు వోల్టుల బ్యాటరీని చార్జి చేస్తుంది. బ్యాటరీని, టార్చినీ గొడుగు కర్రకే అమర్చాడు. దీని బరువు 300 గ్రాములు ఉంటుంది. బ్యాటరీ సాయంతో టార్చి లైట్ లేదా ఎల్‌ఇడి బల్బు వెలుగులీనుతుంది. ఈ గొడుగుకు ధ్రువజ్యోతి పెట్టిన పేరు అంబ్రెల్లా హెల్పర్ బాక్స్. అసలు గొడుగుకే సోలార్ ప్లేట్ అమర్చాలన్న ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే తన గ్రామస్థులు పడుతున్న అవస్థలే తనను ఈ ఆవిష్కరణకు పురిగొల్పాయని చెబుతాడు. ‘వర్షాకాలంలో మావాళ్లు సైకిల్ మీద గొడుగు వేసుకుని, మరో చేతిలో టార్చి లైటు పట్టుకుని వెడుతుంటే వారి అవస్థ మాటల్లో చెప్పలేం. అసలే మట్టిరోడ్లు. వానొస్తే టైర్లు జారిపోయి, ఎంతోమంది గాయాలపాలయ్యేవారు. దీనినుంచి విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతోనే అంబ్రెల్లా హెల్పర్ బాక్స్‌ను కనుగొన్నా’ అంటాడు. గొడగుకు అమర్చిన బ్యాటరీని సౌరశక్తితోనే కాక మామూలు పవర్ సాకెట్‌తో కూడా చార్జి చేసుకోవచ్చు. ఈ గొడుగును మార్కెట్ చేయొచ్చు కదా అని అడిగితే ప్రస్తుతం పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేశానని, అదొస్తే మార్కెట్ చేయాలన్న ఆలోచన ఉందని ధ్రువజ్యోతి చెబుతున్నాడు.
కేవలం అంబ్రెల్లా హెల్పర్ బాక్సే కాదు...ధ్రువజ్యోతి గతంలోనూ చాలా పరిశోధనలు చేశాడు. రకరకాల పరికరాలను సృష్టించాడు. దివ్యాంగులకు వివిధ రకాలుగా ఉపయోగపడే క్రచెస్, పెడల్‌తో నడిచే గ్రైండర్, కాంక్రీట్ మిక్సర్ వంటివి వాటిలో కొన్ని. అస్సాంలోని సోనిత్‌పూర్‌లో బిశ్వజిత్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌లో డిగ్రీ చేస్తున్న ధ్రువజ్యోతి ‘హరిత్‌కోన’ అనే ద్వైమాసిక సైన్సు పత్రికను నడుపుతున్నాడు. అలాగే రైతులకు, సాంకేతికతకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ‘క్రిగ్జోమ్‌నెట్’ పేరిట ఓ స్టార్టప్ మొదలుపెట్టాడు.